నరకాసుర సంహారము - దీపావళి కథ!
తేటగీతులు:
అల హిరణ్యాక్ష సంహార కలన వసుధ
నోమిన హరిసాంగత్యాన భూమి కపుడు
కడుపు పండఁగ నరకునిఁ గనియు నతని
కిడెను ప్రాగ్జ్యోతిషపురము నుడుగరగను!
బాణు స్నేహాన నతఁడు దుర్వర్తనుఁడయి
దుష్కృతమ్ములఁ జేయుచు దుండగమున
మునుల బాధించుచుండెను ఘనుఁడ నంచుఁ
దనను మ్రొక్కంగఁ గోరుచుఁ దఱుముచుండు!
ఒక్కనాఁడు వసిష్ఠుండు మ్రొక్కుటకయి
యరిగెఁ బ్రాగ్జ్యోతిషంపుఁ గామాఖ్య దేవి
మందిరమునకు; నంత భూమాత సూనుఁ
డాలయమ్మును మూసినయంత మౌని;
"ఓరి మదగర్వమున రేఁగి యుర్వియందు
సజ్జనుల పరిభవమున సంతసమునుఁ
బొందుచుంటివి కావునఁ బొందెదవుర
మృతిని త్వజ్జన్మ కర్తయౌ పితరువలన!"
శాపమును విని నరకుండు జడిసి నలువ
కయి తపమ్మొనరించి యా కమలజుని ప్ర
సన్నుఁ గావించి దేవ రాక్షసుల చేత
మరణ మందకుండఁగ ఘన వరముఁ బొందె!
తద్వర జనిత గర్వ విస్తారుఁడయ్యు
దేవతల జయించియును, యతీశ్వరులకు
బాధ లిడి, షోడశ సహస్ర భామినులను
బంధితులఁ జేసి, చెలరేఁగె భయము లేక!
మునులు దేవతల్ హరికిని మొఱలు వెట్టి
నరకుఁ జంపి, బాధలఁ దీర్ప వర మడిగిరి!
సత్వరముగ శ్రీకృష్ణుండు సమరమందు
నరకుఁ జంపంగఁ బూని తా నరుగుచుండ;
అపుడు సాత్రాజితియె తోడ నరుగుఁదెంతు
ననుచు వేడి శ్రీకృష్ణుని ననుసరించి
వెడలె యుద్ధమ్మునకుఁ దాను వీరవనిత
పగిది వీరత్వ మెల్లెడఁ బల్లవింప!
అపుడు వెన్నుండు గరుడుని నాత్మఁ దలఁప,
నెదుట నిలఁబడ, సతితోడ నెక్కి తాను
వెడలి ప్రాగ్జ్యోతిషమునకు వీఁకతోడ,
నరకు రావించె ననిసేయ నచటి కపుడు!
ఆగ్రహోదగ్రుఁడై వాఁ డహంకరించి,
యగ్గిపైగుగ్గిలము వేయ భగ్గుమనెడి
రీతి నేతెంచి మార్కొని కృష్ణునపుడు,
పలువిధమ్ముల బాణాలు వదలి యెగసె!
కృష్ణుఁ డంతట నస్త్రశస్త్రోష్ణ సహిత
యుద్ధవిక్రమోర్జిత సుబలోన్నతుఁడయి
నరకుఁ దాఁకెను సత్య తననుఁ గనంగ
విశ్వమోహన రూపాన విహసితుఁడయి!
కాల్బలములు కరులు తురగములు తేరు
లన్ని ఖండతుండమ్ములు నయ్యె నంత
నరకుఁ డొక సాయకము వేయ నందసుతుని
తలకుఁ దాఁకియు మూర్ఛిల్లె దానవారి!
సత్యభామయె పృథ్వ్యంశ జనిత యగుట
కతనఁ జక్రియే మాయా ప్రకాశకుఁ డయి
మూర్ఛ నటియించె! భర్త సమ్మూర్ఛితుఁడయి
నంత సేదఁదేఱిచి సత్య యనికిఁ బూని!
ఒక్క కంటను హరిని నింకొక్క కంట
వైరిఁ జూచుచు శృంగార వీరములును
స్నేహ రోషాలు ముఖమునఁ జిందులాడ
ధనువు నంది విజృంభించెఁ ద్వరఁగ సత్య!
రోష రోహిత సందీప్త లోచనయయి,
నరకు సరకు సేయక, వేసి శరములెన్నొ,
కలఁత వడఁజేయఁగాఁ బ్రతీకార ముడిగి,
వాఁడె యప్రతిభుండయి వఱలె శిలగ!
అంతఁ జక్రియుఁ జక్రమ్ము హస్తమునను
గొనియు భూసుతుఁ దలఁ దెగఁ గొని నిలువఁగఁ,
గనిన సత్య మూర్ఛిల్ల, భూకాంత పొడమి,
కొమరుఁ జంపిన పతిఁగని, నుడివె నిట్లు;
"స్వజుని దుష్కృతాల్ సైరించి, వాని చరిత
జనులు చెప్పుకొనఁగఁ జిరస్థాయిగాను
నిల్పు మో దేవ!" యన, హరి "నేఁటి నుండి
జనులు "నరక చతుర్దశి" జరుపుకొండ్రు!
వాఁడు ప్రాచీదిశోదయ ప్రభల నాపి,
లోకులను జీఁకటినిఁ ద్రోచి, శోకమిడెను;
గాన, నేఁడు దీపమ్ముల ఘనముగాను
పూన్చి "దీపావళీ పర్వము" జరిపెదరు!
ఇట్లె ప్రతియేఁట లోకులు హితకరముగ
నాశ్వయుజ కృష్ణపక్షంపు టమవస తిథి
దీపము ల్వెలిఁగించి యీ దిశలు వెలుఁగఁ
గాను దీపావళియె వెల్గుఁ గరువుదీఱ!"
అనఁగఁ బృథ్వి యంతర్హిత యగుడు, సత్య
మూర్ఛఁ దేఱియు మగని నెమ్మోముఁ గనుచు,
విజయ కాంతులు ముఖమున వెల్లివిఱియ,
స్వీయ నగరికిఁ జనెఁ గుజద్విషునితోడ!
ఫలశ్రుతి:
"నరక సంహార కథ" వినినం జదివిన
జనుల కెపు డాయురారోగ్య సంపదలును
కీర్తి సౌఖ్యము లొనఁగూడి, క్షేమముగను
జీవితము వెల్గుఁ గావుత శ్రీధరు కృప!
ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
రచన:
"మధురకవి"
గుండు మధుసూదన్
వరంగల్లు