Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఏప్రిల్ 30, 2015

సమస్య: శంకరుఁ డనఁ బార్థసారథి కద

తేది: డిసెంబర్ 24, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


image of krishna and arjuna in kurukShetra కోసం చిత్ర ఫలితం


వాసుదేవుఁడు హరి బకవైరి మురవైరి
కంసఘస్మరుండు కైటభారి
శ్యామసుందరుండు శకటారి దైత్య నా
శంకరుఁ డనఁ బార్థసారథి కద!


మంగళవారం, ఏప్రిల్ 28, 2015

నిషిద్ధాక్షరి: ద్విత్వ సంయుక్తాక్షరముల నిషేధం...సూర్యోదయ వర్ణనము...కందపద్యంలో...

తేది: డిసెంబర్ 07, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- సూర్యోదయ వర్ణనము
నిషిద్ధాక్షరములు - ద్విత్వ సంయుక్తాక్షరములు
ఛందస్సు - కందము
దీనికి నేను వ్రాసిన పద్యము


image of rising sun with lotus in a lake కోసం చిత్ర ఫలితం



తూరుపు దెస నరుణ కిరణ
ధారణుఁడై చిఱునగవుల తపనుఁ డడుగిడన్;
ధారుణి పొంగుచు ఘన కా
సార కమల వికచ హాస సౌరభము లిడెన్!




ఆదివారం, ఏప్రిల్ 26, 2015

సమస్య: సాని పొందు మోక్ష సాధకమ్ము

తేది: డిసెంబర్ 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



భోగములను విడచి, యోగసాధనమున
నిత్యసక్తుఁడైన నిర్మలునకు
నశ్వర రహి తాపునర్భవ’ మను దొర
సాని పొందు, మోక్ష సాధకమ్ము!


శనివారం, ఏప్రిల్ 25, 2015

దత్తపది:జలుబు-దగ్గు-నొప్పి-నలత (అన్యార్థంలో)...రామాయణార్థంలో...నచ్చిన ఛందంలో,,,

తేది: ఏప్రిల్ 24, 2015 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
జలుబు-దగ్గు-నొప్పి-నలత పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ
రామాయణార్థంలో
నచ్చిన ఛందంలో
పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన ఉత్పలమాలా వృత్తము:

image of ravana with vibhishana కోసం చిత్ర ఫలితం



(విభీషణుఁడు రావణునకు హితము బోధించి, బోధించి, వినకపోవుటచేఁ జివఱకు నిటుల భాషించిన సందర్భము)

ఉత్పలమాల:

"పూజలు బుగ్గికాఁగఁ బరపూరుషు భార్యఁ జెఱన్ గదింతువే?
నీ జపహోమముల్ దొలఁగె నీ విధిఁ, దగ్గుము, గర్వమేల? నేఁ
డా జనకాత్మజాపతియె యంబుజగర్భుని మాడ్కి నొప్పి, వి
భ్రాజిత దేహియైన లతవంటి యయోనిజఁ గొంచుఁబోయెడిన్!"

-గుండు మధుసూదన్




బుధవారం, ఏప్రిల్ 22, 2015

దత్తపది: చీమ-దోమ-నల్లి-పేను...గోపికావస్త్రాపహరణం...నచ్చిన ఛందం...

తేది: డిసెంబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
చీమ - దోమ - నల్లి - పేను
పదాలను ఉపయోగిస్తూ
గోపికావస్త్రాపహరం గురించి
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన తేటగీతిపద్యం




తచ్ఛచీమనోహరునకుఁ దమ్ముఁడైన
యా యుపేంద్రుఁడౌ కృష్ణుండు నపుడెదో మ
హాద్భుతమగు నుపాయమ్మునల్లి గోపి
కాంశుకాల్గొని యొప్పేనుఁ గాంచితనియె!




సోమవారం, ఏప్రిల్ 20, 2015

సమస్య: భీముని భార్య యూర్వశి విభీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే

తేది: డిసెంబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:



(ఒక సంపన్న గృహస్థుఁడు తమ నమ్మిన బంటు భీమునిం బరిచయము సేయుచుఁ దన బంధువర్గముతోఁ బలికిన సందర్భము)

నేమముతోడ మా గృహము ♦ నెప్పుడుఁ గాఁచుచు, మమ్ముఁ గొల్చుచున్,
క్షేమముగా వసించుచు, వి ♦ శేష విధిన్ సహకారి యౌచునున్,
భీముఁడు కాఁపురస్థుఁడయె! ♦ వీరలు భీముని బంధు! లీమెయే
భీముని భార్య యూర్వశి! వి ♦ భీషణుఁ డాత్మజుఁ! డన్న శౌరియే!



శనివారం, ఏప్రిల్ 18, 2015

సమస్య: పాదమ్ములు లేని తరులు పరుగిడఁ జొచ్చెన్

తేది: నవంబర్ 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు:



నా మొదటి పూరణము:
మోదముతోడుత నరులటఁ
బాదపముల మొదలు నఱకి  వాహనమం దా
ఛేదిత తరులనిడి నడుపఁ
బాదమ్ములు లేని తరులు 
 పరుగిడఁ జొచ్చెన్!
(పాదములు=వ్రేళ్ళు)


***               ***              ***


నా రెండవ పూరణము:
మోదిత మతులై నఱకిన
పాదపములఁ బల్లమునకుఁ ♦ బడఁద్రోయంగన్
రోదించుచు దొరలుచు నా
పాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!



***               ***              ***


నా మూఁడవ పూరణము:
(సత్యభామా సమేతుఁడై శ్రీకృష్ణుఁడు నందవవనమందలి పారిజాతవృక్షమునుం గొని, గరుడునిపైనిడుకొని పైకెగురఁగా, గరుడుని ఱెక్కల గాడ్పుల తాఁకిడికి పెల్లగిలిన యితర దేవతరువులు కూడ నా గాలితోపాటు పైఁకిలేచి వెంటఁదవిలిన సందర్భము నిట ననుసంధానించుకొనునది)

మోదము సతికిడ దివిఁ జని,
పాదపముం గొనియు గరుడ ♦ వాహనము పయిన్
బోఁదలఁచి యెగుర, గాలినిఁ
బాదమ్ములు లేని తరులు ♦ పరుగిడఁ జొచ్చెన్!




శుక్రవారం, ఏప్రిల్ 17, 2015

సమస్య: దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా

తేది: నవంబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:





(హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)
"తిరమగు తపమును మెచ్చియు
దురితములనుఁ గనకయే చతుర్ముఖుఁ డటులన్
వరమిడఁ గశిపుఁడుఁ జెలఁగెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"





నా  పై పూరణమునుం గొంచెము మార్చి వ్రాసి, య్తీ దిగువఁ బ్రకటించితిని. గమనింపఁగలరు.

"తిరమగు తపమును మెచ్చియు
హిరణ్య కశిపునకు బ్రహ్మ హితమౌనటులన్
వరమిడ, మన నిటుఁ జెఱచెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"