Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఏప్రిల్ 30, 2021

హరిస్తుతి! (గర్భకవిత్వము)

మిత్రులందఱకు నమస్సులు!


హరిస్తుతి!
(గర్భకవిత్వము)

[చంపకమాలా, కంద, గీత గర్భ సీసము మఱియు ప్రమాణి వృత్త గ ర్భ ఆటవెలది]

సీసము:
నరవర! కేశవా! వరగుణాభ! రమాప
        తి! స్వప్రభావిభా! హే స్వధీతి!
కరివరదా! హరీ! స్థిరద! కైటభవిద్వి
        ష! శ్రీనివాస! శ్రీ శార్ఙ్గి! శౌరి!
ధర దురితక్షయా! స్మరపితా! కరుణాక
        ర! శ్రావకేంద్ర! కార్యార్థ దాయి!
వర! మము ’జే’ యనం స్థిరశుభాంచిత! భూధ
        ర! శ్రేష్ఠ బంధు! రా! రమ్ము వేగ!

ఆటవెలది:
శ్రీ యజుష్పతీ! శుచిశ్రవా! మురహరా!
కపి! వ్రజేశ్వరా! ప్రకాశకాఢ్య!
భువిఁ బ్రజాలికిం, బ్రభూ! హరీ! కరుణించి,
నిను భజింప, ముక్తి నీయుమయ్య!

పై పద్యంలో ఇమిడివున్న ఇతర పద్యాలు:

గర్భిత చంపకమాల:
నరవర! కేశవా! వరగుణాభ! రమాపతి! స్వప్రభావిభా!
కరివరదా! హరీ! స్థిరద! కైటభవిద్విష! శ్రీనివాస! శ్రీ
ధర! దురితక్షయా! స్మరపితా! కరుణాకర! శ్రావకేంద్ర! కా
వర! మము ’జే’ యనన్, స్థిరశుభాంచిత! భూధర! శ్రేష్ఠ బంధు! రా!

గర్భిత కందము:
వర! కేశవా! వరగుణా
భ! రమాపతి! స్వప్రభావిభా! కరివరదా!
దురితక్షయా! స్మరపితా!
కరుణాకర! శ్రావకేంద్ర! కావర, మము! జే!

గర్భిత తేటగీతి:
వరగుణాభ! రమాపతి! స్వప్రకాశ!
స్థిరద! కైటభవిద్విష! శ్రీనివాస!
స్మరపితా! కరుణాకర! శ్రావకేంద్ర!
స్థిరశుభాంచిత! భూధర! శ్రేష్ఠ బంధు!


గర్భిత ప్రమాణి వృత్తము:
యజుష్పతీ! శుచిశ్రవా!
వ్రజేశ్వరా! ప్రకాశకా!
ప్రజాలికిం, బ్రభూ! హరీ!
భజింప ముక్తి నీయుమా!
[ఇందులో... జ ర లగ - గణాలుంటాయి. ప్రాస వుంటుంది. యతి ఉండదు.]

స్వస్తి

మధురకవి గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు