మిత్రులందఱకు
వినాయక చవితి పర్వదిన
శుభాకాంక్షలు!
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
వినాయక జననము:
అల గజాసురు కోరిక ♦ నాదరించి,
యతని గర్భాన వసియించు ♦ హరుని, హరియ
తెచ్చుచున్నట్టివార్తయే ♦ తెలిసి, గౌరి
యమిత సంతోషమునుఁ బొందె ♦ నాత్మలోన!
ఆ మహాదేవుఁడును వచ్చు♦నంతలోనఁ
దాను సర్వాంగ సుందర ♦ దర్శితయయి
యామతింపఁగవలెనని ♦ యాత్మఁ దలఁచి,
స్నానమునకునుఁ జనఁగ నా♦శంసఁగొనెను!
ద్వారపాలన కొఱకయి ♦ తగ నలుఁగును
నలిపి బాలరూపము నిచ్చి, ♦ పులకితయయి,
ప్రాణమునుఁ బోసి, మ్రోల ని♦ల్పంగ, మిగుల
మాతృభావన కలిగియు ♦ మాత మురిసె!
బాలునకు వినాయక సమా♦హ్వయము నిడియు,
ద్వారమున నిలిపియుఁ జనెఁ ♦ దాను స్నాన
మాచరింపఁగ లోనికి; ♦ నంతలోన
శివుఁడు కైలాసమునకు వ♦చ్చెను బిరాన!
పార్వతియ బొమ్మఁ జేసియుఁ ♦ బ్రాణ మిడిన
బాలకుం డడ్డె! క్రోధాన ♦ వానిఁ దలను
ఖండనము సేసె శివుఁడు! దా♦క్షాయణీప్సి
తమ్ము నెఱవేర్ప నేనుఁగు ♦ తల నిడెనఁట!
అతఁడె విఘ్నేశ్వరుండయి ♦ హర్షమునను
బ్రజల పూజలఁ గొనియును ♦ వరములిడుచుఁ
దల్లిదండ్రుల దీవెనల్ ♦ దగఁగొనంగ
దండ నతులిడ నుదరమ్ము ♦ ధరణినంటి
యాడుచుండఁగఁ జంద్రుఁడే ♦ యపహసించె!
చవితి దినమున నవ్వంగఁ ♦ జందమామ,
కొడుకు గణనాథు నుదరమ్ము ♦ క్రుమ్మరించె
లోని కుడుముల, నుండ్రాళ్ళ; ♦ వానిఁ జూచి,
క్రోధమున శపించెను గౌరి ♦ బాధతోడ!
"చవితి దినమున నేవారు ♦ చంద్రుని ముఖ
దర్శనము సేతురో వారు ♦ తత్క్షణమ్మె
తగని నీలాపనిందల ♦ నెగడుదు"రని
యనఁగ, దేవతల్ ప్రార్థింప ♦ వినిచె నిట్లు;
"నాదు తనయునిఁ బూజించి, ♦ నాఁడు నక్ష
తలఁ దలపయిఁ జల్లుకొన నిం♦దలు తొలఁగి, శు
భమ్ము లొనఁగూడు" ననుచు శా♦పావధి నిడ,
నంద ఱానందమందిరి, ♦ వందనమిడి!
శ్రీకృష్ణుని చంద్రదర్శనము - నీలాపనిందలు:
అల వినాయక చవితి సా♦యంత్రమందుఁ
గృష్ణుఁ డొంటిగఁ దోఁట కేఁ♦గియు నచటనె
కూర్చొనఁగ రుక్మిణీసతి ♦ కూర్మిమీఱ
దుగ్ధ పాత్ర నొసఁగఁగ నం♦దునను నతఁడు
చంద్రుఁ బొడఁగాంచినంత ♦ సాక్షాత్కరించె
నింద; సత్రాజితుని దమ్ము♦నిం దునిమి, య
తని శమంతకమణిఁ గొనె ♦ ననుచు వేగ!
దైవమైననుఁ దలవ్రాఁతఁ ♦ దాఁటఁ గలఁడె?
(అది, ప్రసేనుండు ధరియించి ♦ యడవి కేఁగ,
సింగ మొక్కం డతనిఁ జంపి, ♦ చెలఁగి కొనఁగ,
జాంబవంతుండు సింహముం ♦ జంపి, దానిఁ
దనదు కొమరిత మెడలోనఁ ♦ దనర వైచె! )
దానఁ గృష్ణుండు వనికేఁగి, ♦ తఱచి వెదుక,
నొక్కచో జాంబవంతుని♦యొక్క తనయ
జాంబవతి కంఠమందున ♦ సౌరుల నిడు
నా శమంతకమణిఁ జూచి, ♦ యతనితోడ
యుద్ధముం జేసి, యోడించి, ♦ యుక్తముగను
జాంబవతితోడి మణిఁగొని, ♦ సరగునఁ జని,
యచట సాత్రాజితిం బొంది, ♦ యందగించె
విఘ్నపతి చల్లఁగాఁ జూడ ♦ వెన్నుఁడంత!
ఇట్టి కథవిన్నఁ జదివిన ♦ నెవరికైన
విఘ్ననాథుండు నిరతమ్ముఁ ♦ బ్రేమమీఱ
నాయురారోగ్య భోగభా♦గ్యైహికముల
నొసఁగి, ముక్తిని నిడుఁగాత ♦ యున్నతముగ!
స్వస్తి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః