Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, జూన్ 30, 2019

చంద్రుఁడు కోపమున సూర్యుని మ్రింగినాఁడు...

చిత్రంలోని అంశాలు: 1 వ్యక్తి, నృత్యం


శంకరాభరణంలో నేఁటి (29-06-2019) సమస్య:

కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై



నా పూరణము(అౘ్చతెనుఁగున):



[సముద్రమును దాఁటి లంకఁ బ్రవేశించి, యా రావణుఁ జంపెద ననెడి యుత్సాహమున నెదుటఁ గాంచఁగా, నా సముద్ర మువ్వెత్తున నెగసి పడుచుండెను. దానినిఁ గనిన శ్రీరాముఁ డమితోగ్రుఁ డయ్యెను! అప్పు డా రామచంద్రునిఁ జూడఁగాఁ జల్లనివాఁడైన చంద్రుఁడు కోపమున వేవెలుఁగైన సూర్యుని మ్రింగినాఁడా యనునట్లుండెను...అనుట]



చెలఁగియు నీటికుప్ప నిఁకఁ జెంగున దాఁటి, బిరాన బంతిమో
ములదొరఁ ౙంపె దంౘుఁ దన మోమున సంతసమొల్కఁ గాంౘ, నా
తలికె యదొక్కమా ఱొదరి దబ్బున లేవఁగ, వేగ దానిపైఁ
ౙలమునుఁ బూనె నత్తఱిని ౙన్నపుఁగాపరి! యెంచి ౘూడఁ, నా
కలువల సంగడీఁ డెసఁగి కాఁకవెలుంగును మ్రింగె నల్కమై!!



(నీటికుప్ప=సముద్రము; బంతిమోములదొర=రావణుఁడు; ఆతలికె=అప్పటికే; ఒదరి=విజృంభించి; ౙన్నపుఁగాపరి=శ్రీరాముఁడు; కలువల సంగడీఁడు=చంద్రుఁడు; కాఁకవెలుంగు=సూర్యుఁడు; అల్కమై=కోపముతో)



స్వస్తి




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి