Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks
దత్త పద్యారంభము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
దత్త పద్యారంభము లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

శనివారం, జనవరి 09, 2016

దత్తపద్యారంభము: కవివర నీ కవిత్వమునఁ గాంతుము...

తేది: సెప్టెంబర్ 28, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తవాక్యమునకు నా పద్యము


కవివర నీ కవిత్వమునఁ గాంతుము స్వచ్ఛ వియన్నదీ ప్రవా
హ వర మనోజ్ఞ తైర్థ్యము! విహాయస వీథ్యుపవిష్ట వాత్యమున్!
నవక వచోఽమృతార్థక నినాహ్యము! శబ్ద విశేష భూషితో
ద్భవ యమకాది వేష్యము! సువాక్య రసార్ణవ నవ్య కావ్యమున్!


శుక్రవారం, జనవరి 01, 2016

దత్త పద్యారంభము: ఎక్కడి కేఁగువాఁడ? నిపు డెవ్వని వేడుదు?



తేది: సెప్టెంబర్ 26, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తవాక్యమునకు నేను రాసిన పద్యము


(హరిభక్తుఁడగు నంబరీషునిపైఁ గినిసిన దుర్వాసమహర్షి కృత్యనుం బ్రయోగింపఁగఁ, గోపించిన శ్రీహరి, దుర్వాసునిపైఁ జక్రాయుధమునుం బ్రయోగింపఁగ, దానినుండి తప్పించుకొను నుపాయ మెఱుంగక తనలోఁ దా నిట్లనుకొని చింతించిన వైనము నిట ననుసంధానించుకొనునది)



ఎక్కడి కేఁగువాఁడ? నిపు డెవ్వని వేడుదుఁ? జక్ర మీ విధిన్
జక్కఁగ నాదు వెంటఁబడె! శంభుఁ డజుండును బ్రోవ మందురే!
నిక్కపు విష్ణుభక్తునకు నేనిటు చేసితిఁ గీడు! పక్కి రా
జక్కిదొరా! బిరాన ననుఁ జక్రము బారిని నుండి కావరా!!



బుధవారం, డిసెంబర్ 02, 2015

దత్తపద్యారంభము: "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..."

తేది: సెప్టెంబర్ 21, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన దత్తపద్యారంభము "మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ..." నను వాక్యమునకు నేను చేసిన పూరణము





మనసిజ పుష్పబాణములు మాటికిఁ గ్రుచ్చఁగ మన్మథార్తయై
తనువు ప్రతాపనమ్ముఁగొనఁ దద్దయుఁ దాళఁగలేక తారయే
చని తుహినాంశు మ్రోలఁ దన స్వాంత గతస్థ మనోరథమ్ముఁ దీ
ర్పను బిడియమ్మువీడి వెస రమ్మనెఁ దేల్పఁగ రాసకేళికిన్!



ఆదివారం, నవంబర్ 15, 2015

దత్త పద్యారంభము: కురునృప! పాండునందను లకుంఠిత...

తేది: సెప్టెంబర్ 18, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన "కురునృప పాండునందను లకుంఠిత..." అను పోతన భాగవతం లోని (3-98) పద్య ప్రారంభమును కొనసాగిస్తూ నచ్చిన అంశముతో పద్యమును వ్రాయుమనగా నేను వ్రాసిన రెండు పద్యములు



(1)
కురునృప! పాండునందను లకుంఠిత శౌర్య సుధీ బలాఢ్యులై
నిరుపమ యుద్ధనైపుణిని నీదు సుత ప్రకరమ్ములన్ వడిన్
గరము దురంత దుఃఖ మిడు కయ్యము నందునఁ గూల్చుచుండఁగన్
ద్వరితగతిన్ యమున్ దమకు దాఁపునఁ గాంతు రధర్మవర్తనుల్ !!


(2)
కురునృప! పాండునందను లకుంఠిత సత్యపరాక్ర మోన్నతుల్
దురమునఁ గృష్ణు సాయమున దుర్జనులౌ భవదీయ సూనులన్
వరుసగఁ జంపఁ బూని యమ బాధలఁ ద్రోయుచుఁ గాలు పాలికిన్
దరుమగ, నీకుఁ దోడెవఁ? డధర్మ నిఘృష్వము వీడు మిమ్మెయిన్ !



.

సోమవారం, నవంబర్ 09, 2015

దత్త పద్యారంభము: "ఎందుల కిన్ని బాధల సహింతువు..."

తేది: సెప్టెంబర్ 11, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన పద్య ప్రారంభము "ఎందుల కిన్ని బాధల సహింతువు..." అను వాక్యమునకు కొనసాగింపుగా నేను పూరించిన పద్యము...


(సత్యవంతుని ప్రాణములఁ గొనిపోవుచుండఁగాఁ దన్ను వెంబడించిన సావిత్రితో యముఁడు పలికిన మాటలు)




"ఎందుల కిన్ని బాధల సహింతువుమద్రసుతా! యముండ నే!
నిందునిభాస్య! నీ మగని నిట్టుల నేఁ గొనిపోవ, నీ విటుల్
సందడిఁ జేయుచున్ వెత వసమ్మున వెంటఁ బడంగ రాదు! కొ,
మ్మింద, వరమ్ము నిత్తు, నిఁక, నీశుని ప్రాణముఁ దక్కఁ గోరి, యే
కొందలపాటు లేక యిఁకఁ గూర్చుమ నాకుఁ బ్రమోద మి" ప్డనన్,
ముందుగఁ గోరె స్వశ్వశురు పూర్వపు వైర్యపహార్య రాజ్యమున్,
సందియ మింక లేక వరుసన్ గనె మామను లబ్ధచక్షుగన్!
గుందుచు వెన్కఁ బోవ, హరి గొబ్బున నింకొక కోర్కెఁ దీర్పఁ, దం
డ్రిం దగఁ బుత్ర సచ్ఛతునినింగ నొనర్పఁగ, నట్లె రాఁగఁ దాఁ
జిందులు ద్రొక్కుచున్ "ముదిత! శ్రేష్ఠతమాంచిత సద్వరమ్మునున్
బొందియు వత్తువేల? యిఁకఁ బోఁగదె!" యంచు ననంగ, నామెయున్
"ముందుగ రెండు కోర్కెలిడి ముద్దునుఁ గూర్చితి విప్డు! నీ విఁకన్
వందన మంది, మూఁడవది వద్దనకుండ మహాత్మ, యీయు!" మం
చుం దన కోర్కి నీయుమన, సూర్యజుఁ డప్పుడు "సాధ్వి! నేఁడు నా
డెందము సంతసించె! నిదె డిగ్గన నిచ్చెద! నాథు ప్రాణముల్
వొందఁగఁ గోరఁబోక మఱి వొందుమ వేఱొక కోర్కి" నన్న నా
ముందఱ భర్తఁ గాంచియు, యమున్ దగఁ గోరెను "దండపాణి! నా
కుం దగు తోడుఁ గొంటి! మది కుందె! సుపుత్రుని నా కొసంగియున్
విందునుఁ గూర్చుమయ్య!" యన, వెంటనె దండి "తథాఽ"స్తనంగ, నా
నందముతోడ, "సౌరి! యెటు నందెద సంతతి? మానవాంగనల్
వొందెద రెట్లు సంతతిని వోఢను వీడియు లోకమం?"దనన్,
దొందరపాటుఁ గన్గొనియు దున్నవయాళికుఁ డంత "సాధ్వి! నీ
సుందర సూక్ష్మ వాక్ప్రతతిఁ జూడ మహాద్భుతమయ్యె! సంతసం
బందితిఁ! బుత్రపౌత్రయుతవై సుఖియింపుము భర్తతోడ! నే
నుం దగఁ బోయి నా విధులనుం దగఁ దీర్తు! శుభమ్ము నీ విలన్
బొందు!"మటంచు దీవెనలు పొందుగ నిచ్చి యగోచరుండయెన్!
జెందొవ చూపు లందముగఁ జిత్రపు నాట్యములాడఁ దాను స్వా
మిం దమితోడఁ జూచుచు గమించిన తత్కథనంత భర్తకున్
సుందరమైన రీతి వినసొంపగునట్లు వచించె! నిర్వురున్
మందగమమ్ములేక కర మందిరి భోగము పూర్వ రీతిగన్!!


-:శుభం భూయాత్:-