మహమ్మదీయ సోదరులందఱికీ
బక్రీదు పర్వదిన
శుభాకాంక్షలు
ఇబ్రహీమలైహిసలాము హితముఁగోరి,
యిస్మయిలు త్యాగచరిత వెల్గింపఁదలఁచి,
యల్లయే పూన, "బక్రీదు" త్యాగగాథ
మహ్మదీయుల పర్వమై మాన్యతఁగనె!
తండ్రికొడుకుల వర్తనఁ దఱచిచూడ,
వారి మనమందు త్యాగమ్ము వఱలునదియుఁ
గనఁగ సుపరీక్ష నొనరింపఁగాను నల్ల
పూని, కలలోన నిబ్రహీము నిటు కోరె!
"వినుమ యిబ్రహీం! ప్రజలకుఁ బ్రియము లొసఁగ,
నెల్ల వేళల సుఖములు, హితములొప్ప,
జీవనము సేయవలెనన్నఁ జిత్తమలర
నీదు కొమరుని బలిగాను నీయవలెను!"
అనుచుఁ గోరిన యల్ల మాటనుఁ, గొమరుని
కెఱుకపఱుపంగ, నిస్మాయి లిమ్ముగాను
తండ్రిమాటల నాలించి, "తండ్రి! యల్ల
యాన నెరవేర్ప వెనుకాడనయ్య! నన్ను
నేను ముదమున నర్పింతు నిప్పు" డనెను!
మనము నందునఁ గుములుచుఁ దనను దాను
సమ్మతిలఁజేసి, యల్ల యాజ్ఞానుసార
మిబ్రహీమప్డు తన సుతు నిస్మయిలును
వెంటఁ గొని కొండమీఁదకు వెడలినాఁడు!
ముఖమునకుఁ దెల్ల వస్త్రమ్ము ముసుఁగు వెట్టి,
యల్లపై భారమును వైచి, యా జనకుఁడు
తనదు కొమరుని శిరమునుఁ దునుమ నెంచి,
కత్తి నెత్తంగ, నల్లాయె కఱఁగిపోయె!
తండ్రి కొడుకుల భక్తికిఁ ద్యాగనిరతి
కల్లయే యబ్రపడుచును నత్తఱి నట
నిస్మయిలును మాయము సేసి, యెదుట నొక్క
గొఱ్ఱియను నుంచె దయఁబూని గొనము మెఱయ!
కనులు మూసియుఁ దనయుని కంఠము నిఁక
ఖండనముసేయ నిబ్రహీం కత్తి వ్రేటు
వేయ, మేషకంఠము తెగె! విలపితుఁడయి
యిబ్రహీము గంతలు విప్పి, యెదుట నున్న
మేషముం గని, మిగుల విస్మితుఁడు నయ్యె!
అతఁడు చూచుచుండఁగ మేష మపుడు మాయ
మయ్యు, నిస్మయిల్ కనఁబడినంత, నచ్చె
రువున మునిఁగియు, 'నిదియ కరుణను నల్ల
యొనరఁ జేసిన మహిమయే' యని తలంచె!
అంత నల్లాయె త్యాగమ్ము నపుడు వొగడ
"నిబ్రహీ మిస్మయిలులార! యిట్టిది యగు
త్యాగచరితఁ బరీక్షింపఁదలఁచి, నేన
యిట్లు సేసితి! ధన్యుల రీర లయ్య!
మీ సుచరితమ్ము లోకాన మెప్పువడసి,
యెల్ల కాలమ్ము నిలిచియు, నెల్ల జనులఁ
ద్యాగులనుఁజేయుచుండు! సతమ్ము మీరు
దేవునకు మాఱురూపులై దీప్తిఁ గనుఁడు!"
అనుచు దీవించి, వరమిచ్చి యల్లయె సనె!
నాఁటి నుండియు ముస్లిముల్ నడచుచుండ్రి
త్యాగవర్తనమునుఁబూని, తనరఁగాను
నాఁటి "బక్రీదు" పర్వమ్ము నడపుచుండ్రి!!
ఇబ్రహీ మిస్మయీలుల యివ్విధమగు
త్యాగగాథయే ముస్లిముల్ తలనుఁదాల్చి,
భక్తి శ్రద్ధలన్ బక్రీదు వర చరితను
ప్రచుర పఱచిరి ముందుతరమ్ములకును!
స్వస్తి
మేలు మాటలు
రిప్లయితొలగించండిhttps://www.newsgita.com/2020/03/manapaimanakunammakameppudupostundi.html