Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 31, 2020

సర్వదేవకృత లక్ష్మీస్తోత్రము

మిత్రులందఱకు శ్రీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!

సంబంధిత చిత్రం


తేటగీతులు:
"క్షమ నొసంగుము భగవతీ! కమల! లక్ష్మి!
శుద్ధ సత్త్వస్వరూపిణీ శోభితాంఘ్రి
కోపపరివర్జితా సృత్వరీ పరాత్ప
రీ క్షమాశీలి తాపహంత్రీ నమోఽస్తు!

సర్వ సాధ్వులలో సాధ్వి, సర్వ రూప
వతులలో రూపవతివి నీవమ్మ! నీవు
లేనిచో జగమంతయుఁ బ్రేత సమమ
గుచును నిష్ఫలమ్మగునమ్మ! కూర్మినిమ్మ!

సకల సంపత్స్వరూపవు, సర్వరూప
వీవె! రాసేశ్వరుల యధిదేవి వీవె!
సకల సతులందు నీ కళ సంక్రమించు!
లేరు నిను మించు దేవత లిజ్జగమున!

నీవె కైలాసమున శివానివిగఁ, బాల
కడలిలో సింధుసుతగ, స్వర్గమ్మునందు
స్వర్గ లక్ష్మిగా, భూతలోపరిని మర్త్య
లక్ష్మిగా వెలుఁగుదువమ్మ! రాఁగదమ్మ!

నీవె వైకుంఠమున లక్ష్మి! వీవె దేవ
దేవి, తులసి, సరస్వతీదేవి, గంగ;
వీవు సావిత్రివే గద విశ్వసృజుని
లోకమునఁ గన, నో తల్లి, నీకు నతులు!

నీవె కృష్ణుని ప్రాణాధిదేవతగను,
ప్రధిత గోలోకమున స్వయం రాధికగను
ధన్యత నిడియు, వెలయ బృందావనమున
బృంద; రాసాన రాసేశ్వరివయితీవె!

నవ్య భాండీరముననుఁ గృష్ణప్రియవయి,
చందన వనానఁ జంద్రవై, చంపకవన
మందు విరజవై, శతశృంగమందు నీవె
సుందరివయి వెల్గితివమ్మ సుకరముగను!

పద్మవనమున నవ పద్మవయ్యు, మాల
తీ వనమ్మున నవ మాలతివయి, కుంద
వనమునం గుందదంతివై తనరి, మిగుల
స్థిరతఁ గేతకీ వనిని సుశీలవైతి!

తగఁ గదంబ వనమునఁ గదంబమాల,
రాజగృహమున ఘన రాజలక్ష్మి, వటులె
ప్రతి గృహమ్మున గృహలక్ష్మి వలెను నిలిచి
పూజలను గొనుచుందువు పుడమిపయిని!

అంబుజాసనాతిచరాబ్ధిజామలేంది
రేశ్వరీ కమలాలయా శ్రీద విష్ణు
వల్లభా రమా మాధవీ వాహినీశ
నందినీ మారజననీ! వినమ్ర నతులు!"

అనుచు దేవతల్, మునులును, మనుజులంత
నమ్రవదనులై భక్తితో నతులు సేసి,
శుభ్రకంఠోష్ఠతాలువుల్ శోభిలంగఁ
బ్రార్థనము సేసి తరియించ్రి రమణమీఱ!

ఇట్టి లక్ష్మీస్తవమ్మును నెవ్వఁ డుదయ
మునను భక్తిఁ బఠించు, నతనికి నెపుడు
ధ్రువముగాఁ బుణ్యములు శుభా లొదవునట్లు
తల్లి లక్ష్మియే కరుణించుఁ దనివితీఱ!

స్వస్తి


ఆదివారం, మే 10, 2020

జగద్గురు శంకరాచార్యులు


Sri Adi Shankara | Discography | Discogs

చం.
మునుకొని యాదిశంకరులు ముప్పదిరెండగు వత్సరాలు భూ
మిని మనియుండి, జీవుఁ డిల మెచ్చెడి జ్ఞానము నాత్మబోధ రూ
పున నొసఁగెన్, బ్రపంచమున మోహముఁ ద్రుంచెడి శ్లోక రూప లో
చనము సహస్ర వత్సర ప్రశస్తతఁ గూర్చుచు నిల్చియుండఁగన్! 1

సీ.
ఒకవైపు బౌద్ధ, మింకొకవైపు శైవ వై
        ష్ణవములు తమ గొప్పఁ జాటుచుండఁ;
గులమత సహనమ్ముఁ గూర్పంగ జనియించె
        నాదిశంకరుఁడు జనాళి కొఱకు;
ఘన కేరళములోని కాలడి గ్రామానఁ
        గడపె బాల్యమ్ము విజ్ఞాన ఖనిగ;
నాసేతు శీతాచలాంతమ్మువెలుఁగొంద,
        ముమ్మారు నడయాడి, బోధల నిడె;
గీ.
శైవ వైష్ణవ శాక్తేయ భావజాల
మంత మొందించి, మతముల కన్నిటికినిఁ
బఱఁగ నేకత్వ మందించి, ప్రాంత దూష
ణలనుఁ జేయుట వృథయని నచ్చఁజెప్పె! 2

కం.
దుష్టాచారముఁ బోవిడి,
శిష్టాచారమ్ముఁ గొనియుఁ, జిత్కైవల్య
మ్మిష్టమ్మునఁ దఱిఁ జేర్చియుఁ,
గష్టమ్ములఁ దాల్చె శివునిగా శంకరుఁడే! 3

తే.గీ.
స్మార్త, శ్రౌత క్రియలకుఁ బ్రశస్తత నిడ,
వైదికాధ్వసక్రమవైభవమును నిలుప,
నీలలోహితుఁడే యిలన్ నెగడె నిటుల
శంకరుని రూపమునఁ బ్రజల్ సన్నుతింప! 4

కం.
సుజ్ఞానయోగతత్త్వవి
ధిజ్ఞుఁడు శంకరుఁడు శాస్త్ర ధీయుతుఁడై సం
ప్రజ్ఞానవిదితుఁడై త
త్ప్రజ్ఞ విభాసిలఁగఁ దిరిగె భరతోర్వరపై! 5

శా.
మత్యాశ్రిత్యుఁడు శంకరుం డిల "నహం బ్రహ్మాఽస్మి" సిద్ధాంతమున్,
సత్యమ్మై పచరించు "తత్త్వమసి" ప్రజ్ఞానంపు సిద్ధాంతమున్
నిత్యమ్మున్ నిలువంగ నుర్విపయి, మన్నింపంగ సద్విద్యలన్
స్తుత్యమ్మౌ స్థిర చిత్త విత్త మొసఁగెన్ సూక్ష్మంపు సద్జ్ఞానియై! 6

తే.గీ.
"తనదు హృదినున్న దైవంపు దర్శనమునఁ
దగఁ దరించి, యెదిరిలోని దైవదర్శ
నానఁ దాఁ దరియించుటే జ్ఞాన"
మనియుఁ
దెలిపి, జనములఁ దనవైపుఁ ద్రిప్పికొనెను! 7

తే.గీ.
"శివుఁడె విష్ణువు, విష్ణువే శివుఁ" డటంచు,
సకల దేవత లొకటను జ్ఞానసహిత
సత్ప్రబోధాన, దైవత్వ సత్త్వమెఱుఁగఁ
జేసి, యజ్ఞానమునుఁ ద్రోలి, చేతనమును
మనుజులందునఁ గలిగించి, మనసు గెలిచె! 8

ఆ.వె.
"పూజకన్న భక్తి పొసఁగఁ బ్రధాన"మ్మ
టంచుఁ జెప్పి, "యిష్టమైన దైవ
పూజ సేయ, మిగులఁ బొలిచి యనుగ్రహ
మిచ్చు దైవ"
మనుచు హితముఁ దెలిపె! 9

మ.
వడిగా శంకరుఁడంతఁ దా నుపనిషద్భాష్యమ్ము లందించె; సం
దడిగాఁ బ్రార్థనఁ జేయ వ్రాసెఁ బ్రజకై తా దేవతాస్తోత్రముల్;
పడ నోడించె విమూఢ పండితులఁ దా వాదించి వాక్చాతురిన్;
దడవెం బ్రస్ఫుట ధర్మమార్గ హిత మద్వైతమ్ము హిందుత్వమున్! 10

తే.గీ.
చూడఁగాఁ బండితులను శిష్యులుగఁ జేసి,
పొసఁగ నిలను హిందూధర్మములను నిలిపి,
యొనర దేవళములఁ బునరుద్ధరించి,
పరఁగఁ బూజాదికముల నేర్పఱుపఁజేసె! 11

తే.గీ.
బ్రహ్మసూత్ర, విష్ణుసహస్ర భాష్యములఁ, గొ
ఱలి శివానంద, సౌందర్యలహరి వఱల,
వర వివేక చూడామణి, వాక్యసుధయు,
సాధనా పంచకమునుఁ, బ్రస్థాన త్రయము; 12

తే.గీ.
కనఁగ ఘన మనీషాపంచకమ్ము, గాంగ
స్తోత్రము, భజగోవిందము, సుజను లెపుడు
ముఱియ నుపదేశ సాహస్రి మొదలగునవి
శంకరాచార్య కృతులు నెసంగె భువిని! 13

ఉ.
చిన్నతనానఁ దండ్రి మృతిఁ జెందఁగఁ దల్లియ యార్యమాంబ తా
సన్నయమార్గగామిగనుఁ జక్క నొనర్చియు, వేదవిద్యలన్
గ్రన్నన నేర్వఁజేసి, యొనరంగను నిత్యము బ్రహ్మచారినిన్
మన్ననతోడ భిక్షకయి మాన్య గృహమ్ముల కంపెఁ బ్రేమతో! 14

మ.
అనయమ్ముం దిరిపెమ్ము నెత్తు, చొక యిల్లాలింట భిక్షింపఁ, దా
ననుకంపన్ దగ ముష్టిగా నుసిరికాయన్ దాన మీ నా యుదా
రను దారిద్ర్యకృతార్తి పోన్ గనకధారాస్తోత్రముం జెప్పఁగా,
విని యా స్తోత్రముఁ, బుల్కరించి రమయే, భృంగారు మాకందులన్
గొన వర్షించెను సంతసిల్లఁ గొమకుం గోర్కెల్ దగం దీరఁగన్! 15

తే.గీ.
ఒక్క నాఁడార్యమాంబయె యొక్క నదిని
నీరు తేఁబోయి, స్పృహఁదప్పి నేలఁబడఁగ,
శంకరుఁడు నదిం బ్రార్థించి, జలము లిడఁగ,
నదినె రప్పించి, జనుల కానందము నిడె! 16

మత్తకోకిల:
సన్యసింపఁగఁ బోవునప్పుడు సమ్మతింపక శంకరున్
మాన్య యాపెను; స్నాని కాన్ నదిమధ్య మున్గఁగ నక్రమే
ధన్యు శంకరుఁ బట్టఁ, జచ్చెడి తన్ను సన్యసమందఁగన్
మాన్యఁ గోరఁగ, సమ్మతించెను; మంత్రముం బఠియింపఁ గా
ఠిన్య నక్రము వీడెఁ, దల్లికి డెందమందు ముదమ్ము కాన్! 17

చం.
ఒక దినమందునం బవలు నొంటిగ మజ్జనమాడఁబోవఁగా
నొక శ్వపచుండు వచ్చె సదయుం డొక నాలుఁగు జాగిలాలతోఁ,
బ్రకటముగాఁగ నడ్డుపడు వానినిఁ దప్పుకొనంగఁ గోరఁగా,
నిఁక ననె నా శ్వపాకుఁడు సుదృంహితమైన స్వరమ్ము పెంపునన్! 18

చం.
"సకలపు మూల మన్నమున సంభవ మందిన మేను విప్రునం
దొకటె, కటోలునం దొకటె! యొక్కటఁ దప్పుకొనంగ నెద్ది? యీ
ప్రకటితమౌ శరీరమె? సురక్షణ మందెడి యాత్మయే? సఖా!
యిఁక వచియింపుమయ్య! యిది యెట్టిదొ? ద్వంద్వమొ, కాదొ? వేగమే!" 19

తే.గీ.
ఆతఁ డాడిన వచనమ్ము లాలకించి,
శంకరుం డంతరార్థమ్ము సకలము నిఁక
చక్క నెఱిఁగియు ’నీతండు శంకరుండె!
నన్ బరీక్షింప నేతెంచె!’ ననుచు నెఱఁగె! 20

ఆ.వె
ఇంక, శంకరుఁడు "మనీష పంచక"మను
నైదు స్తోత్రములను నపుడు సెప్పి,
"భాష్యకారవృత్తి బ్రహ్మసూత్రమ్ముల
కెనయఁ జేయుమ!
" యని, యెగసె దివికి! 21

కం.
విద్వత్సంస్థితుఁడయ్యును,
నద్వైతమతమ్మె బహువిహారము సేయన్,
సద్వైభవ మిల నిలుపన్,
సద్విద్యాధ్యాత్మబోధ శంకరుఁ డిడియెన్! 22

తే.గీ.
ఆ జగద్గురువునకు నే నంజలించి,
యాతఁ డందించినట్టి శాస్త్రార్థములను
లోకులందఱుఁ దెలిసి, సుశ్లోకులగుచు,
వెలిఁగిపోవఁగఁ గోరెదఁ బ్రీతితోడ! 23

స్వస్తి
శనివారం, మే 09, 2020

ప్రబంధ పరమేశ్వరుఁడు ఎఱ్ఱన

57 [FREE] QUOTES INSPIRATIONAL IN TELUGU WALLPAPER HD DOWNLOAD JPG ...

మ.
నవనీతాంచిత మానసుండు, సుజనుం డౌ శంభుదాసుండు, శ్రీ
శివపాదాంబుజసక్తచిత్తయుతసంసేవాప్రశస్త్యభ్యసో
ద్భవ కైవారవిశేష పాఠనుఁడు, శుంభద్గ్రంథ సల్లేఖనా
సువిచారుం డయెఁ దాఁ బ్రబంధ పరమేశుం డెఱ్ఱనార్యుండిలన్!

ఆ.వె.
శివుని భక్తుఁడయ్యుఁ, జిత్తమ్మునందున
రామవిభుని గాథ వ్రాయఁ దలఁచి,
ప్రథమ కృతిగఁ దాను రామాయణమ్మును
బ్రచురపఱచె భువిని రమ్యముగను!

ఉ.
భాగవతప్రశస్తిఁ బ్రజఁ బావన మానస వీథులన్ బ్రశం
సాగత రీతి నిల్పఁగను, స్వాగతముం దెలుపంగఁ బూనియున్,
వాగధిదేవతాప్తి హరివంశ సుకావ్య సయుగ్మ భాగ స
ర్వాగమ దీప్తులుం గుఱియ వ్రాసెను సత్కవిలోక మెన్నఁగన్!

తే.గీ.
హరిహరాద్వైత భావ సంయమివరుండు,
పండితుఁడు, గురుభక్తితత్పరుఁడు, వినయ
సంభరితుఁడు, సద్ధృదయుండు, సంతరించెఁ
బఱఁగ భారతారణ్యపర్వావశిష్ట
మెలమి నన్నయ్య తిక్కన్న నిల నుతించి!

తే.గీ.
నన్నయ కృతినిఁ జదివి, యెఱ్ఱన్నఁ జదువ,
నదియ నన్నయ వ్రాఁతయౌ ననియ తోఁచుఁ;
దిక్కన కృతిఁ బఠించి, యిద్దియ పఠింప,
నదియుఁ దిక్కన వ్రాఁతయౌ ననియుఁ దోఁచు!

కం.
గంగా యమునా సములె య
నంగను నన్నయయుఁ దిక్కనార్యుల నడుమన్
సంగమ రూపము నెఱ్ఱన
యుం గొనెను సరస్వతీ ప్రయుక్త నదమ్మై!

ఉ.
స్థిత్యునిఁ దా నహోబిలనృసింహునిఁ గొల్చుచు, నిష్టదైవమౌ
సత్యుఁడు సుందరుండు శివసన్నిభుఁడైన నృసింహ రూపునిన్,
బ్రత్యహపాఠనమ్మునకు బాటలు వేయఁగ, భక్తితోడ, నౌ
చిత్యముతోడ వ్రాసెను నృసింహపురాణ విశిష్టకావ్యమున్!

తే.గీ.
ఎఱ్ఱనార్యుఁ డెంతయు సౌమ్య హితవరుండొ,
యెఱ్ఱనార్యు కవిత సౌమ్య హితవరియయి,
విశ్వవిఖ్యాత మాధుర్య వీక్షితయయి,
హృద్యసుమనోహరమ్మయి ప్రీతినిడును!

తే.గీ.
ధన్య పుణ్యకథాప్రబంధంపు రీతి
మనుచు, పౌరాణికపు దివ్యమార్గమునను
నడచి, కావ్యంపు యశమంది, నవ్యమైన
భావనలనందఁజేయు సవ్యమ్ముగాను!

కం.
ఓ యెఱ్ఱన! నిను మదినిడి
ధీయుతులై మనిరి కావ్యధీమంతు లిలన్!
మాయురె! కవితావైభవ
మే యిల నిలిచెనుర! నీ కమిత వందనముల్!

స్వస్తి

గురువారం, ఏప్రిల్ 02, 2020

శ్రీ సీతారామ కళ్యాణము

మిత్రులందఱకు

jai sri ram navami images | Ram navami images, Jai sri ram, Image


తే.గీ.
పారికాంక్షి వేదవిదుని వాగ్విదవరు
నా మునీంద్రుఁడౌ నారదు నా మహర్షి
వామలూరు తనయుఁడు సంప్రశ్నమడిగెఁ
దనదు జిజ్ఞాస బలిమి సంతప్తుఁడగుచు!

తే.గీ.
"ఓ మహర్షి! సర్వజ్ఞ నే నొక్క గొప్ప
పురుషు నెఱుఁగంగఁ దలఁచితి; నరుఁడెవఁడన,
సుగుణుఁడును, వీర్యవంతుండు, సుదృఢ కాంక్షి,
సత్యవాది, ధర్మాత్ముండు, సచ్చరితుఁడు;

తే.గీ.
సర్వ భూత హితుఁడు, కృతజ్ఞత గలాఁడు,
ధీరుఁడు, ప్రియదర్శనుఁడును, దీర్ఘదర్శి,
క్రోధ జేత, తేజుఁడు, సమర్థుఁ, డనసూయుఁ,
డాగ్రహ కృత దివిజ భయుం డనినిఁ గనఁగ!

తే.గీ.
ఆ మహాపురుషుండెవండయ్య? యతనిఁ
దెలిసికొనఁగాఁ గుతూహల మ్మొలసె నా" క
టంచుఁ బలుకఁగ, నారదుం డాత్మలోన
సంతసించుచు నిట్లనె సాదరమున!

తే.గీ.
"ఓ మునీ! నీవు స్తుతియించు నున్నత గుణ
ములు సకలము లొకనికుంట పలు దెఱఁగుల
దుర్లభ; మ్మైన యెంచి తదుత్తమ పురు
షునిఁ దెలిపెదను వినుము శ్రద్ధను గొనియును!

తే.గీ.
ప్రథిత యిక్ష్వాకు వంశానఁ బ్రభవమంది
యఖిల సల్లక్షణములతో నున్నతుఁడయి
షోడశ గుణాత్మకుఁడగు విష్ణుండునయ్యుఁ
గేవలము మానవునిగానె కీర్తి కెక్కె!

తే.గీ.
ఘనుని శ్రీరామచంద్రుని వినుత గుణునిఁ
గౌశికుఁడు వెంటఁ గొంపోవఁగాను వచ్చి,
దశరథుని యాజ్ఞఁ బడసియు, దాశరథిని,
లక్ష్మణుఁ గొనిపోయెను కానలకు వడిగను!

తే.గీ.
యాగమునుఁ గావఁ దాటక నడఁచి, తపసి
వెంటఁ జని, ఱాతి నాతిగ వెలుఁగఁజేసి,
వెడలి మిథిలకుఁ, దా హరువిల్లు విఱువఁ,
గౌశికుని యానతినిఁగొని ఘనముగాను;

కం.
బిట్టుగఁ జేతను విలుఁ జే
పట్టియుఁ గొప్పునకు గొనము వాటముగఁ గొనన్
దట్టించి తిగువ గొనమును
బెట్టును వీడియును విల్లు పెళపెళ విఱిగెన్!

తే.గీ.
దాశరథిచేత శివుని కోదండము విఱు
గుటయు, భూనభోఽంతరములు పటుతరముగఁ
గంపిలఁగ జన ధాత్రీశ గణము భువిని
మూర్ఛిలిరి; సీత జనకుండు మురిసి రపుడు!

ఆ.వె.
విల్లు విఱిగినంత విరు లాకసమునుండి
కుఱియఁ జేసి రపు డమరులు భువిని!
దేవదుందుభులును దిశలు మార్మ్రోగంగ
వ్యాప్తి చెందె రాఘవ విజయమ్ము!

కం.
దిగిభము లా నినదమ్మును
దగురీతిగ స్వాగతించె, ధార్మిక సమితుల్
జగముల కిఁక శుభదినములు
నెగడం గల వంచు హర్ష నీరధిఁ దేలన్!

తే.గీ.
జనకజాత్మజ హృదయమ్ము సంతసమునఁ
బొంగిపోవంగఁ గరములఁ బూలమాలఁ
బూని శ్రీరాము కంఠానఁ బొసఁగ వేసి,
తనదు హృదయేశునిగఁ జేసికొనియె వేగ!

తే.గీ.
జనకుఁ డది గని హర్షించి సాదరమున
దశరథుని సతీ పరివార తండయుతుని
గాను రప్పించి, నగరమ్ము ఘనముగా న
లంకృతము సేసియు వెలుఁగు లందఁజేసె!

తే.గీ.
తమ్ముఁడైన కుశధ్వజు తనయలకును
సీతతోఁ బాటు పెండ్లిండ్లు సేయనెంచి,
నాఁడె జనకుండు వర్తమానమ్ము నంపె
లగనములఁ జూచి, సాంకాస్య నగరమునకు!

కం.
దశరథుఁడు సతుల తోడను
యశమందఁగఁ దనయుల నట హర్షమెసంగన్
దిశలు వెలుఁగ జనక సుతలఁ
గుశలముగా నిడఁగఁ బెండ్లి కొమరులఁ జేసెన్!

తే.గీ.
రామచంద్రుండు దశరథ ప్రభుని యాన
సర్వలక్షణ సముపేత జానకమ్మ
కరము గ్రహియించె మేనఁ బుల్కలు జనింప,
గేస్తునుండి హవిస్సును గీలివోలె!

తే.గీ.
లక్ష్మణుండూర్మిళా కరగ్రహణమంద;
మాండవీశ్రుత కీర్తుల మంత్రవిధిని
భరతశత్రుఘ్ను లపుడు వివాహమైరి
పుడమి నమరులు గురియింపఁ బూలవాన!

తే.గీ.
పంక్తిరథుఁ డంతఁ బెండ్లి సంబరము కడపి,
బంధుమిత్రులు సేవకుల్ పరిజనులును
గొమరులును గ్రొత్త కోడండ్రు కూడిరాఁగఁ
జేరినాఁ డయోధ్యకుఁ దాను క్షేమమెసఁగ!

స్వస్తి

ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః

గురువారం, మార్చి 26, 2020

ఉగ్రవాదము - మానవత్వము

anti terrorism hd images కోసం చిత్ర ఫలితం

తే.గీ.
బాధలకు మూలమౌ యుగ్రవాదముఁ గొని,
పంతమున మిత్రతను వీడి, శాంత్యహింస
లనిటు బుగ్గిపాల్జేసి, తలంకకుండ,
యిద్దె ధర్మంబటంచును నెంచ నగునె?

తే.గీ.
భూమిలోపలి పిడుగు లుప్పొంగి నటులు;
దిక్కటాహము లక్కట పిక్కటిల్ల;
బాంబు విస్ఫోటనముఁ జెందఁ, బ్రజలఁ జంపు
నుగ్రవాదమ్ము మెప్పును నొందదెపుడు!

ఉ.
కోరి యమాయక ప్రజల కొంపల గోడులఁ గూల్చి, పేల్చి, హిం
సా రణ నీతిఁ దాల్చి, మనసా వచసా గరళమ్ముఁ జిమ్మి, హుం
కారము సేయు త్రాఁచుల వికార పిశాచులఁ బట్టి శీఘ్రమే
కోఱలఁ బీఁకివేయవలెఁ; గూర్మినిఁ బెంచవలెన్ ధరిత్రిలోన్!

ఉ.
జానెడు పొట్టకోసమయి సాటిజనాళిని మట్టువెట్టు నా
మానవ మాంసభక్షకుఁడు మైత్రికి దూరుఁడు; ముందు ముందు త
న్మ్లానిత హీన కృత్యమున మ్రగ్గుచుఁ దానె, తదీయ చేతనో
ద్యానపుఁ గాఱుచిచ్చునకు నాహుతి యౌనయ దగ్ధజీవియై!

ఉ.
నా యను దిక్కులేని మరణమ్మునుఁ బొందిన మానవాళి న
న్యాయపు మృత్యువాత కెరయౌనటుఁ జేసిన మానవాధముం
డాయువుపోయు శక్తి కసహాయుఁడునయ్యు స్వకీయ చేష్టచే
నాయువు తీయుహక్కు నెటు లందును? నద్దియె పాపకృత్యమౌ!

సీ.
బుద్ధదేవుఁడు సదా బోధించెఁ బ్రేమతో
        శాంతిఁ గరుణ నహింసా ప్రవృత్తి;
నొక చెంపఁ గొట్ట, వేఱొక చెంపఁ జూపఁగాఁ
        దగునని క్రీస్తు సత్యమ్ము నుడివె;
సత్యాగ్రహమ్ముతో సాధింపవచ్చుఁ గో
        ర్కెలనని బాపూజి ప్రీతిఁ బల్కెఁ;
జీఁదరించుటకన్న నాదరించుట మిన్న
        యనుచు థెరిసమాత నెనరుఁ జూపెఁ;
గీ.
బరమ హంస పుట్టిన నేలఁ బరమ హింస
కెటులఁ జేతులు వచ్చునో హింసకులకు?
మానవుఁడె మాధవుండను మాటఁ దలఁచి,
కూర్మిఁ జరియించుచో భువి ధర్మమెసఁగు!

తే.గీ.
మంచిఁ బెంచిన, మంచినిఁ బంచిపెట్టుఁ;
జెడునుఁ బోషింప, వానికే చెఱుపొనరును!
మానవత్వమున్ మించిన మతము లేదు;
మమత యేనాఁటికైనను మాసిపోదు!!

స్వస్తి


బుధవారం, మార్చి 25, 2020

ఓ శార్వరీ! కరోన కృమిఁ గాల్చి, బూడిద సేయుమమ్మా!

శార్వరి ఉగాది శుభాకాంక్షలు hd images 2020 కోసం చిత్ర ఫలితంశ్రీకరి! శార్వరీ! వినుతి సేయుదు మో కమలాలయా! భువిన్
సోఁకి కరోనసూక్ష్మకృమి, సొచ్చియు మానవ దేహమందునన్,
భీకరరుగ్మతార్తతలఁ బెంపొనరించి గ్రసించి చంపుచు
న్మాకిట రౌరవాది యమ నారక లోకముఁ జూపుచుండె! నీ
వే కరుణాప్తదృక్ప్రకరవీక్షణచే మముఁ జూచి, కావ, న
స్తోకపరాక్రమాంచిత త్రిశూలముచేఁ గృమిఁ జీల్చి, కాల్చి, భ
స్మీకృతఁ జేసి, మమ్ముఁ దగఁ జేసి యరోగ విశిష్ట యుక్తుల,
న్మా కిల క్షేమ సౌఖ్య శుభ నవ్యగుణాది వివేక మిచ్చి, సు
శ్లోకులుగా నొనర్చియు, సుశోభిత ధాన్యధనాదిసంపదల్
సేకొన నిచ్చి, హర్షమును జేర్చుచు మా యెదలందు నెప్పుడున్,
మా కిల శాంతిఁ బెంచుచును, మౌఢ్య విదూరులఁ జేసి, మా కృతుల్
మేకొని తాల్చి, చల్లఁగను మేదినిఁ గాంచుము మమ్ము శార్వరీ!

స్వస్తిశార్వరి రావె...కరోనఁ గూల్పవే!

మిత్రులందఱకు
శార్వరీ నామ సంవత్సర యుగాది పర్వదిన
శుభాకాంక్షలు!

యుగాది శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం


చనెను వికారి వత్సరము, "చైన కరోన" కృతార్తతాగమం
బున జనులెల్ల భీతులయి భోరున దుఃఖిలి మృత్యుహేలిఁ గూ
ర్చిన వ్యథ లిచ్చి! నీ వయినఁ బ్రీతినిఁ గావఁ, గరోనఁ జీల్ప, మా
మనుజులకున్ శుభంబు లిడ, మాతరొ వేగమె రావె శార్వరీ!


స్వస్తిగురువారం, ఫిబ్రవరి 20, 2020

ఛత్రపతి శివాజీ మహారాజ్

hd image of shivaji కోసం చిత్ర ఫలితం


అల శివాయిమాత వరమ్ము లమర, జిజియ
శాహజీదంపతులకుఁ, బూణాహలోని
జునరు పట్టణానఁ గల శివనెరికోట
యందు జన్మించెను శివాజి హర్షమెసఁగ!

మొఘలు రాజుల పనుపునఁ బోవుచుండి,
కొమరునకు విద్య, బుద్ధియుఁ గొమరు మీఱ
నేర్ప నియమించి, భార్య సాన్నిధ్యమందు
విడచి వెడలెను శాహజీ బెంగుళూరు!

తల్లి ప్రేమ మీఱంగ బోధనలు సలుప,
బుద్ధిమంతుఁడై పెరుఁగుచుఁ బొలుపు నెఱపి,
భరత రామాయణపుఁ గథ లరసి, వీర
లక్షణమ్మొలుకఁగ మనోల్లాసమందె!

పరమత సహన, స్త్రీగౌరవములఁ దల్లి
చెంతనే నేర్చి, తండ్రి విజేతయగుట
కతఁ డతని పరాజయ కారక మగు కథలఁ
దెలిసికొని, వేగ యుద్ధవిద్యలను నేర్చె!

సకల విద్యల నేర్చియు సాహసమునఁ
దండ్రి విడచిన రాజ్యమ్ముఁ దనరఁ బొంది
యును, మరాఠ రాజ్యమ్మును నొనరఁ బూన్పఁ,
దగిన వ్యూహమ్ములనుఁ గూర్ప నొగి రహించె!

బిజయపురరాజ్య తోరణన్ స్వీయహస్త
గతముగాఁ జేసి, కొండన గఢము రాజ
గఢములనుఁ గూడ చేకొని, ఘనత గలుగు
పుణహ ప్రాంతమ్మునంతయుఁ బొందెఁ బిదప!

తండ్రినిన్ బంధితునిఁ జేసి, తనను, సోద
రుఁడగు శంభాజినిం బట్టఁ దొడరునట్టి
శత్రువైన యాదిల్ షాయె సైన్యమంప,
వారలం గూల్చి, జనకు వీడ్వడఁగఁజేసె!

ఎన్నియో యుద్ధములయందు నెంతయొ నిపు
ణత్వమునుఁ జూపి, మించి, శూరత్వమెగయఁ
దాను నౌరంగజేబుకు దడ కలుగఁగఁ
జేసి, స్వీయరాజ్యమ్ముఁ దాఁ జేకొనెనయ!

రాయఘడ కోట వేదమంత్రాల నడుమ
"ఛత్రపతి" బిరుదము స్వహస్తమునఁ గొనియుఁ
బ్రజలఁ గన్నబిడ్డలుగ భావనము సేసి,
రాజ్యపాలన చేసె మరాఠమందు!

ఇరువదేడేండ్లపాటు సంగరములందుఁ
గడపి, హైందవ రాజుల కతఁడు గొప్ప
నైన యాదర్శముం జూపి, హర్షమొదవఁ
బాలనముసేసి, మరణించె జ్వరితుఁడయ్యు!

ఇట్టి ఘనుఁడౌ శివాజీకి హితకరునకు,
హైందవప్రభు తార్కాణమైన వీరు
నకు, సమర్థగురు సుబోధనా ధనునకు,
ధీరునకు నంజలింతును దీక్ష మెఱయ!

స్వస్తి