Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, మార్చి 26, 2020

ఉగ్రవాదము - మానవత్వము

anti terrorism hd images కోసం చిత్ర ఫలితం

తే.గీ.
బాధలకు మూలమౌ యుగ్రవాదముఁ గొని,
పంతమున మిత్రతను వీడి, శాంత్యహింస
లనిటు బుగ్గిపాల్జేసి, తలంకకుండ,
యిద్దె ధర్మంబటంచును నెంచ నగునె?

తే.గీ.
భూమిలోపలి పిడుగు లుప్పొంగి నటులు;
దిక్కటాహము లక్కట పిక్కటిల్ల;
బాంబు విస్ఫోటనముఁ జెందఁ, బ్రజలఁ జంపు
నుగ్రవాదమ్ము మెప్పును నొందదెపుడు!

ఉ.
కోరి యమాయక ప్రజల కొంపల గోడులఁ గూల్చి, పేల్చి, హిం
సా రణ నీతిఁ దాల్చి, మనసా వచసా గరళమ్ముఁ జిమ్మి, హుం
కారము సేయు త్రాఁచుల వికార పిశాచులఁ బట్టి శీఘ్రమే
కోఱలఁ బీఁకివేయవలెఁ; గూర్మినిఁ బెంచవలెన్ ధరిత్రిలోన్!

ఉ.
జానెడు పొట్టకోసమయి సాటిజనాళిని మట్టువెట్టు నా
మానవ మాంసభక్షకుఁడు మైత్రికి దూరుఁడు; ముందు ముందు త
న్మ్లానిత హీన కృత్యమున మ్రగ్గుచుఁ దానె, తదీయ చేతనో
ద్యానపుఁ గాఱుచిచ్చునకు నాహుతి యౌనయ దగ్ధజీవియై!

ఉ.
నా యను దిక్కులేని మరణమ్మునుఁ బొందిన మానవాళి న
న్యాయపు మృత్యువాత కెరయౌనటుఁ జేసిన మానవాధముం
డాయువుపోయు శక్తి కసహాయుఁడునయ్యు స్వకీయ చేష్టచే
నాయువు తీయుహక్కు నెటు లందును? నద్దియె పాపకృత్యమౌ!

సీ.
బుద్ధదేవుఁడు సదా బోధించెఁ బ్రేమతో
        శాంతిఁ గరుణ నహింసా ప్రవృత్తి;
నొక చెంపఁ గొట్ట, వేఱొక చెంపఁ జూపఁగాఁ
        దగునని క్రీస్తు సత్యమ్ము నుడివె;
సత్యాగ్రహమ్ముతో సాధింపవచ్చుఁ గో
        ర్కెలనని బాపూజి ప్రీతిఁ బల్కెఁ;
జీఁదరించుటకన్న నాదరించుట మిన్న
        యనుచు థెరిసమాత నెనరుఁ జూపెఁ;
గీ.
బరమ హంస పుట్టిన నేలఁ బరమ హింస
కెటులఁ జేతులు వచ్చునో హింసకులకు?
మానవుఁడె మాధవుండను మాటఁ దలఁచి,
కూర్మిఁ జరియించుచో భువి ధర్మమెసఁగు!

తే.గీ.
మంచిఁ బెంచిన, మంచినిఁ బంచిపెట్టుఁ;
జెడునుఁ బోషింప, వానికే చెఱుపొనరును!
మానవత్వమున్ మించిన మతము లేదు;
మమత యేనాఁటికైనను మాసిపోదు!!

స్వస్తి


4 కామెంట్‌లు:

  1. మీ కవితోపాసన గంభీరంగా వుంది... ప్రామాణ్యమైన ఖండికను వెలువరించండి..

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా రాసారు.. ధన్యవాదాలు.
    అలాగే ఒక సారి నా బ్లాగును కూడా చూసి మీ ప్రేక్షకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
    నా బ్లాగును చూడటానికి ఇక్కడ నొక్కండి

    రిప్లయితొలగించండి