మిత్రులందఱకు
తే.గీ.
పారికాంక్షి వేదవిదుని వాగ్విదవరు
నా మునీంద్రుఁడౌ నారదు నా మహర్షి
వామలూరు తనయుఁడు సంప్రశ్నమడిగెఁ
దనదు జిజ్ఞాస బలిమి సంతప్తుఁడగుచు!
తే.గీ.
"ఓ మహర్షి! సర్వజ్ఞ నే నొక్క గొప్ప
పురుషు నెఱుఁగంగఁ దలఁచితి; నరుఁడెవఁడన,
సుగుణుఁడును, వీర్యవంతుండు, సుదృఢ కాంక్షి,
సత్యవాది, ధర్మాత్ముండు, సచ్చరితుఁడు;
తే.గీ.
సర్వ భూత హితుఁడు, కృతజ్ఞత గలాఁడు,
ధీరుఁడు, ప్రియదర్శనుఁడును, దీర్ఘదర్శి,
క్రోధ జేత, తేజుఁడు, సమర్థుఁ, డనసూయుఁ,
డాగ్రహ కృత దివిజ భయుం డనినిఁ గనఁగ!
తే.గీ.
ఆ మహాపురుషుండెవండయ్య? యతనిఁ
దెలిసికొనఁగాఁ గుతూహల మ్మొలసె నా" క
టంచుఁ బలుకఁగ, నారదుం డాత్మలోన
సంతసించుచు నిట్లనె సాదరమున!
తే.గీ.
"ఓ మునీ! నీవు స్తుతియించు నున్నత గుణ
ములు సకలము లొకనికుంట పలు దెఱఁగుల
దుర్లభ; మ్మైన యెంచి తదుత్తమ పురు
షునిఁ దెలిపెదను వినుము శ్రద్ధను గొనియును!
తే.గీ.
ప్రథిత యిక్ష్వాకు వంశానఁ బ్రభవమంది
యఖిల సల్లక్షణములతో నున్నతుఁడయి
షోడశ గుణాత్మకుఁడగు విష్ణుండునయ్యుఁ
గేవలము మానవునిగానె కీర్తి కెక్కె!
తే.గీ.
ఘనుని శ్రీరామచంద్రుని వినుత గుణునిఁ
గౌశికుఁడు వెంటఁ గొంపోవఁగాను వచ్చి,
దశరథుని యాజ్ఞఁ బడసియు, దాశరథిని,
లక్ష్మణుఁ గొనిపోయెను కానలకు వడిగను!
తే.గీ.
యాగమునుఁ గావఁ దాటక నడఁచి, తపసి
వెంటఁ జని, ఱాతి నాతిగ వెలుఁగఁజేసి,
వెడలి మిథిలకుఁ, దా హరువిల్లు విఱువఁ,
గౌశికుని యానతినిఁగొని ఘనముగాను;
కం.
బిట్టుగఁ జేతను విలుఁ జే
పట్టియుఁ గొప్పునకు గొనము వాటముగఁ గొనన్
దట్టించి తిగువ గొనమును
బెట్టును వీడియును విల్లు పెళపెళ విఱిగెన్!
తే.గీ.
దాశరథిచేత శివుని కోదండము విఱు
గుటయు, భూనభోఽంతరములు పటుతరముగఁ
గంపిలఁగ జన ధాత్రీశ గణము భువిని
మూర్ఛిలిరి; సీత జనకుండు మురిసి రపుడు!
ఆ.వె.
విల్లు విఱిగినంత విరు లాకసమునుండి
కుఱియఁ జేసి రపు డమరులు భువిని!
దేవదుందుభులును దిశలు మార్మ్రోగంగ
వ్యాప్తి చెందె రాఘవ విజయమ్ము!
కం.
దిగిభము లా నినదమ్మును
దగురీతిగ స్వాగతించె, ధార్మిక సమితుల్
జగముల కిఁక శుభదినములు
నెగడం గల వంచు హర్ష నీరధిఁ దేలన్!
తే.గీ.
జనకజాత్మజ హృదయమ్ము సంతసమునఁ
బొంగిపోవంగఁ గరములఁ బూలమాలఁ
బూని శ్రీరాము కంఠానఁ బొసఁగ వేసి,
తనదు హృదయేశునిగఁ జేసికొనియె వేగ!
తే.గీ.
జనకుఁ డది గని హర్షించి సాదరమున
దశరథుని సతీ పరివార తండయుతుని
గాను రప్పించి, నగరమ్ము ఘనముగా న
లంకృతము సేసియు వెలుఁగు లందఁజేసె!
తే.గీ.
తమ్ముఁడైన కుశధ్వజు తనయలకును
సీతతోఁ బాటు పెండ్లిండ్లు సేయనెంచి,
నాఁడె జనకుండు వర్తమానమ్ము నంపె
లగనములఁ జూచి, సాంకాస్య నగరమునకు!
కం.
దశరథుఁడు సతుల తోడను
యశమందఁగఁ దనయుల నట హర్షమెసంగన్
దిశలు వెలుఁగ జనక సుతలఁ
గుశలముగా నిడఁగఁ బెండ్లి కొమరులఁ జేసెన్!
తే.గీ.
రామచంద్రుండు దశరథ ప్రభుని యాన
సర్వలక్షణ సముపేత జానకమ్మ
కరము గ్రహియించె మేనఁ బుల్కలు జనింప,
గేస్తునుండి హవిస్సును గీలివోలె!
తే.గీ.
లక్ష్మణుండూర్మిళా కరగ్రహణమంద;
మాండవీశ్రుత కీర్తుల మంత్రవిధిని
భరతశత్రుఘ్ను లపుడు వివాహమైరి
పుడమి నమరులు గురియింపఁ బూలవాన!
తే.గీ.
పంక్తిరథుఁ డంతఁ బెండ్లి సంబరము కడపి,
బంధుమిత్రులు సేవకుల్ పరిజనులును
గొమరులును గ్రొత్త కోడండ్రు కూడిరాఁగఁ
జేరినాఁ డయోధ్యకుఁ దాను క్షేమమెసఁగ!
స్వస్తి
ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి