Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, ఏప్రిల్ 30, 2014

సమస్య: శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

తేది: సెప్టెంబర్ 11, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా మూడు పూరణములు






(1)
ఎవరని నిను నేఁ గొల్తును?
వివరింపఁగలేను తండ్రి! వేడెదఁ దెలుపన్
నవరూపుఁడ వీ వెవఁడవు?
శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

(2)
భవ! సృష్టి స్థితి లయముల
కెవరై చేసెదవు? నన్నుఁ గృపఁ జూడఁగ నీ
వెవరవొ? తండ్రీ తెలుపుము!
శివుఁడవొ? మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

(3)భవ మిడియు, జీవనమ్మిడి,
భవబంధమ్ములనుఁ ద్రెంచు పరమాత్మా! నీ
వివరములఁ దెలుపు తండ్రీ!
శివుఁడవొ?మాధవుఁడవొ? సరసిజ జన్ముఁడవో?

మంగళవారం, ఏప్రిల్ 29, 2014

పద్య రచన: మాతా..త్రిదేవీ...త్రిమూర్త్యాత్మికా!

తేది: సెప్టెంబర్ 10,2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు




శా.
చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్ శ్రీ వాణివై నిల్చి, స
చ్చేతోమోద విశేష సంపద లిడన్ శ్రీ లక్ష్మివై నిల్చి, యా
చేతోఽoశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్ శ్రీ గౌరివై నిల్చి, స
చ్చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!


కం.
వాణీ! వీణా పాణీ!
పాణి స్థిత సకల విభవ భాస్వ ల్లక్ష్మీ!
ప్రాణేశార్ధాజిర శ
ర్వాణీ! ధీ బల ధనాఢ్య! వరదాయి! భజే!!


సోమవారం, ఏప్రిల్ 28, 2014

సమస్య: ఇద్దఱు సతులున్నవాఁడె యిల ధన్యుఁ డగున్

తేది: సెప్టెంబర్ 09, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



ముద్దుగ సంపద లిడి తా
నెద్దడిఁ దొలఁగించు తల్లి; యెంతయుఁ గోర్కిన్
విద్దెల నొసఁగెడి తల్లియు
నిద్దఱు సతులున్న వాఁడె యిల ధన్యుఁ డగున్!


ఆదివారం, ఏప్రిల్ 27, 2014

సమస్య: మమ్మీ డాడీలు తెలుఁగు మాటలె తాతా

తేదీ: సెప్టెంబర్ 08, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



డమ్మీ యాంగ్లపు మాటలు
మమ్మీ డాడీలు! తెలుఁగు మాటలె తాతా,
అమ్మా, నాన్నయె! కనఁగను
మమ్మీ 'శవ'; మమ్మ 'యమృత మయ'మే తమ్మీ!


శనివారం, ఏప్రిల్ 26, 2014

పద్య రచన: చుక్కల్లో చంద్రుఁడు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య!

తేది: సెప్టెంబర్ 08, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్యగారి చిత్రమునకు నేను రాసిన పద్యములు


కం.
రేలంగి హాస్య నటునిగఁ
బాలించెను జలనచిత్ర వనిలోనను! దా
నేలిన పాత్రలు పద్మ
శ్రీ లభియింపంగఁ జేసెఁ జిత్రములందున్!(1)

సీ.
బాల్యమ్ములోఁ దండ్రి పలికించె 'హరికథల్'
        'సంగీత' మింపారె సరస భంగి!
మొదట 'నాటక రంగ'మునను 'బృహన్నల'
        లోన స్త్రీ పాత్రలోఁ దా నటించె!
'కృష్ణ తులాభార'కీర్తితుఁడై తాను
        'జలన చిత్రాల'లో నెల కొనియెను!
'గుణ సుందరి కథ'లో గుణము హెచ్చఁగఁ బ్రజల్
        'హాస్య నటుని'గా సమాదరింప;

గీ.
స్థిరత నందియు రేలంగి తీరు మాఱె!
నాయకుని సరసను దా సహాయ నటుని
పాత్ర లెన్నియొ పోషించి, ప్రజల మెప్పు
వడసి, తానెంతొ వెలిఁగి పోవఁగ మొదలిడె!(2)

సీ.
విప్ర నారాయణ, వెలుఁగు నీడలు, దొంగ
        రాముఁడు, మిస్సమ్మ, లవకుశలను;
సత్య హరిశ్చంద్ర, జగదేక వీరుఁడు,
        మాయా బజారులన్ మంచి హాస్య
నటనను బోషించినట్టి రేలంగి తా
        నెంతయో యెదిగెను వింతగాను!
ప్రేక్షకాళిని హాస్యరీతుల మెప్పించి,
        చిత్ర పరిశ్రమన్ జిర యశుఁడయి,

గీ.
నిలిచి, వెలిఁగెను నాతండు! నేఁటి కింక
నతని చిత్రాలు చూచెద ననెడి వార
లెందఱో కలరన వింత యేమి కాదు!
తర తరమ్ము లప్రతిముఁడై తనరె నతఁడు!!
(3)

ఆ.వె.
ప్రియ తముండునైన 'రేలంగి' మాటాడ
నవ్వు పువ్వు ఱువ్వు, ఱివ్వుమనఁగ!
విరియు నెడఁద మనకు 'వేంకట రామయ్య'
పలుకు వినఁగ! నతఁడు వర యుతుండు!!
(4)

కం.
నవ్వుల ఱేఁ డతఁ డెప్పుడు
ఱువ్వు ఛలోక్తులును హాస్య రుచు లందించున్!
దివ్వియ వలె వెలుఁగు నతం
డివ్విధి జన హృదయ వీథిఁ దిరమై భువిలోన్!!
(5)


-:శుభం భూయాత్:-

శుక్రవారం, ఏప్రిల్ 25, 2014

సమస్య: కోడలున్న చోటు వీడు నత్త


తేది: సెప్టెంబర్ 07, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



(సరస్వతీ కటాక్షమున్నచో, లక్ష్మీ కటాక్షమును; లక్ష్మీ కటాక్షమున్నచో, సరస్వతీ కటాక్షమును నుండ వనుట ప్రత్యక్ష సిద్ధమని పెద్దల నానుడి!)



చదువులున్నచోట సంపదలుండవు;
సంపదలును నున్నఁ జదువుఁ జొరదు!
లోక వృత్త మిట్లు లోతుగా వీక్షింపఁ
గోడలున్నచోటు వీడు నత్త!!

గురువారం, ఏప్రిల్ 24, 2014

పద్యరచన: కర్ణుని చావుకు కారణాలు...

తేది: సెప్టెంబర్ 01, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నా పద్యము



తేటగీతి(షట్పాది):
భార్గవ ద్విజ పృథ్వి శాపాల కతన;
సహజ కవచ కుండలములు శక్రుఁడుఁ గొన;
శల్య సారథ్య మతని యుత్సాహ ముడుపఁ
గర్ణుఁ జావుక వెన్నియో కారణములు!
కాని, పార్థుఁడే సంపెను గర్ణు నంచు
నప్రతిష్ఠను మోసె నా యర్జునుండు!

బుధవారం, ఏప్రిల్ 23, 2014

సమస్య: నిద్ర చేకూర్చు సంపదల్ భద్రముగను

తేది: ఆగస్టు 30, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము
 
ధనముఁ దొలఁగించుఁ గుంభకర్ణు నటువంటి
నిద్ర! చేకూర్చు సంపదల్ భద్రముగను,
బరిమితముగాను నిద్రించవలసినంత
నిద్రపోవ! నిదియ మంచి నియమ మిలను!!


మంగళవారం, ఏప్రిల్ 22, 2014

సమస్య: తెలుఁగు భాషాభిమానము తొలఁగ వలయు

తేది: ఆగస్టు 29, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


మాతృ భాషయు, జనయిత్రి మనకు నెపుడు
స్వర్గమునకన్న మిన్నయ! వదల వలదు
తెలుఁగు భాషాభిమానము! తొలఁగ వలయు
నాంగ్ల భాషపై మోజంత, యాంధ్రులార!


సోమవారం, ఏప్రిల్ 21, 2014

సమస్య: కమలములకు చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్

తేది: ఆగస్టు 28, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము




కమలాప్తుండు సుఖమ్మిడు
కమలమునకు! చంద్రుఁడే సుఖమ్మును గూర్చున్
విమల సుశోభిత కల్హా
రమునకు! హితులౌట కతన రాగిలఁ జేయున్!!

ఆదివారం, ఏప్రిల్ 20, 2014

పద్యరచన: భానుఁడు...భామినీ శ్వేతపద్మము

తేది: ఆగస్టు 28, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


ఆ.వె.
భానుఁ డుదయ మందె! భామినీ శ్వేత ప
ద్మమ్ము వికసనమునఁ దగ హసించె!
రమ్యమైన యట్టి రంగస్థలమ్మదె;
భాను భామినులకుఁ బ్రణయ కేళి!(1)

తే.గీ.
పత్ర రచిత వలయ శుభ ప్రాంగణమున
సూత్రధారుండు సూర్యుండు సుప్రభాత
గీతములు పాడ నేతెంచె కేళి కొఱకు!
రమణి ముఖపద్మము విరిసె రమణుఁ జూచి!!(2)

కం.
రమణి యఁట పుండరీకము;
సుమనోహర సూత్రధారి సూర్యుం డటకున్
రమణీయముగా ప్రణిధా
నము సేయఁగ బిడియమందె నళినమ్మపుడున్!(3)


తే.గీ.
రమణుఁ డంతట నునుముద్దు రమణి కిడఁగ,
ముఖము విప్పారె; సొబగులు మురిపెము లిడె!
ప్రకృతి కాంతాస్య మోహన రాగ యతికిఁ
జూపఱ సరసిక హృదయ సుమము విరిసె!!(4)

కం.
రమణీయ దృశ్యకావ్యము
కమనీయముగానుఁ దోచుఁ గవి మిత్రులకున్!
సమయమ్మిదె వర్ణనమున
సుమనోహర ధవళవర్ణ సుమ సరసి కడన్!!

శనివారం, ఏప్రిల్ 19, 2014

పద్యరచన: సాయం సంధ్యా వర్ణన

తేది: ఆగస్టు 27, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన తేటగీతి


[సాయం సంధ్యా వర్ణన] 
తే.గీ.
చెలఁగె యుద్ధమ్ము లా కురు క్షేత్ర మందుఁ
బాండవులు కౌరవుల్ పరస్పరము రోష
భీష ణాస్త్ర శస్త్ర తతులఁ బెనఁగి, చంప,
రుధిర ధార లట్లుండె నా రుధిర సంధ్య!

శుక్రవారం, ఏప్రిల్ 18, 2014

సమస్య: దశావతారముల్ ధరించెఁ ద్ర్యంబకుండుదారుఁడై

తేది: ఆగస్టు 26, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



అశేష భూ జనాళికిన్ సహాయ మందఁ జేయ, శ
త్రు శేష ముండకుండ, శౌరి, తోయజాక్షుఁడే వెసన్
దశావతారముల్ ధరించెఁ! ద్ర్యంబకుం డుదారుఁడై
విశిష్టమౌ వరమ్ము లిచ్చెఁ బ్రీతి రాక్షసాళికిన్!

గురువారం, ఏప్రిల్ 17, 2014

పద్యరచన: దశావతార స్తుతి


తేది: ఆగస్టు 26, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన సీసపద్యము




సీ.
వేదమ్ములనుఁ గాచి; మేదినీధర మోసి;
        కాశ్యపిన్ ధరియించి; కశిపుఁ జీల్చి;
బలిని ముప్పాదానఁ బాతాళమున కంపి;
        రాజన్యులనుఁ జంపి; రావణుఁ దన
యాశుగమ్మునఁ గూల్చి; యమునను వణికించి;
        కారుణ్యమును నేర్పి; మ్లేచ్ఛుఁ ద్రుంచి;
దుష్టులఁ దునుమాడి; శిష్టులఁ జేకొని;
        పాపులఁ బరిమార్చి; వసుధ నోమి;
గీ.
జన్మ నిచ్చియుఁ, బ్రతికించి, సమయఁ జేయు
మత్స్య, కూర్మ, కిటి, నరసింహ, వటు, పరశు
రామ, రఘురామ,బలరామ, శ్రాంత బుద్ధ,
కల్కి రూపుండునౌ హరిన్, ఘనునిఁ గొలుతు!


మంగళవారం, ఏప్రిల్ 15, 2014

పద్యరచన: కల్క్యవతారము

తేది: ఆగస్టు 25, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన సీసపద్యము


సీ.
కలియుగాంతమ్మునఁ గల రాజు లందఱుఁ
        జోర సములు గాను; క్రూరులుగను
వర్తించుచుండఁగాఁ బ్రబల యశస్కుఁడు
        విష్ణుయశుండను విప్రు నింటఁ
గల్కి నామమ్మున ఘను విష్ణు నంశాన
        జనన మందియుఁ దాను జగమునందు
దుష్ట శిక్షణమును; శిష్ట రక్షణమును
        జేసియు మనకిడుఁ జిర యశమ్మ

టంచును బురాణములు వచియించుచుండె!
నేఁడు నెటఁ జూడఁ బాపులై నెగడు వారె;
చెడుగు పనులెన్నొ పూనియుఁ జేయువారె!
వెంటనే రాఁ గదే కల్కి వేగిరముగ!

సోమవారం, ఏప్రిల్ 14, 2014

పద్యరచన: చంద్రశేఖరాష్టకము

తేది: సెప్టెంబర్ 15, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన చంద్రశేఖరాష్టక పద్యములు


తన్మృకండ సుపుత్ర రక్షక! దండధారి భయంకృతా!
శిష్టపాలక! దుష్టశిక్షక! చిత్తజాంతక! శంకరా!
దక్షజా పతి! శైలకార్ముక! దక్షయజ్ఞ వినాశకా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

అంధకాంతక! తాండవప్రియ! హాటకేశ్వర! ధూర్జటీ!
విష్ణుమిత్ర! కృశానురేతస! పింగళాక్ష! వృషాం చరా!
శూలపాణి! మహేశ! భార్గవ! సూర్య! శంభు! సదాశివా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

అస్థిమాలి! గిరీశ! రుద్ర! మహానట! ధ్రువ! భీషణా!
విశ్వనాథ! పినాకపాణి! వృషధ్వజ! త్రిపురాంతకా!
మృత్యుజేత! ఫణీంద్ర భూషణ! కృత్తివాస! జటాధరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

అంబరాంబర! భానుతేజ! విషాంతకా! ద్రుహి! ణాక్షరా!
నీలలోహిత! పార్వతీపతి! నీలకంఠ! నిరంజనా!
వ్యోమకేశ! భవ! క్రతుక్షయ! భూతనాథ! నదీ ధరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

నాగకంకణ! సర్వతోముఖ! నందివర్ధన! పింగళా!
శర్వ! పంచముఖ! త్రిలోచన! శాశ్వత! స్మర శాసకా!
పాంశుచందన! నీలకంధర! ఫాలలోచన! భాస్కరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

అష్టమూర్తి! విశాఖ! సాంబ! సహస్ర బాహు! భవాంతకా!
శ్వేత పింగళ! సాంఖ్య ముఖ్య! వశీకృతాంగ! సునిశ్చలా!
స్థాణు! హింస్ర! హిరణ్యబాహు! విశాలనేత్ర! దిగంబరా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

అంబికేశ! సుమేరు! సిద్ధిద! త్ర్యంబ! కాజిత! సంగ్రహా!
రాజశీర్షక! లింగమూర్తి! విరాగి! భైరవ! త్ర్యంగటా!
హైమవత్యుపయంత! వామ! విషాంతక! ప్రమథాధిపా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

మార! దానఘ! భస్మగాత్ర! కుమార హేరుక జన్మదా!
సర్వకామద! వామదేవ! విశాల మానస! పాలకా!
విశ్వసాక్షి! సమస్త కుక్షి! కవీశ సంస్తుత! రక్షకా!
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహిమామ్!

శుభం భూయాత్

సమస్య: శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్

తేది: ఆగస్టు 23, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


నిసుగైన వయసు నుండియు
సిసలౌ శ్రీకృష్ణు వైరి శిశుపాలుఁడు; ప్రా
ణ సఖుఁడు శ్రీకృష్ణునకున్

బిసరుహ నేత్రుఁడు కిరీటి బీభత్సుఁడిలన్!

శనివారం, ఏప్రిల్ 12, 2014

సమస్య: బలరాముని ధర్మపత్ని వైదర్భి కదా

తేది: ఆగస్టు 23, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



పొలతి సుగుణవతి రేవతి
బలరాముని ధర్మపత్ని! వైదర్భి కదా
యల రుక్మిణి నామక సతి
నలమేన్ దొర పట్టమహిషి; నారాయణియే!

బుధవారం, ఏప్రిల్ 09, 2014

పద్య రచన: బలరామావతారము

తేది: ఆగస్టు 23, 2012 నాటి శంకరాభరణంలొని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన సీసపద్యము


సీ.
భూమి భారముఁ దీర్ప భువిలోన జన్మించి,
      రౌహిణేయునిగాను రహిని వెలిఁగె;
దేవకీ గర్భస్థుఁడే మాత రోహిణీ
      గర్భానఁ బుట్టి సంకర్షణుఁ డయె;
నల ప్రలంబునిఁ జంపి,యధివహించె నతండు
      వర బిరుదము ప్రలంబఘ్నుఁ డనఁగ;
నీలాంబరము నెప్డు నెఱి ధరియించి వె
      లసియుఁ దా నిలను నీలాంబరుఁ డయె;

గీ.
నతఁడె శ్రీకృష్ణు నగ్రజుం; డతఁడె సీర
పాణి; తాళాంక; బలభద్ర వర బిరుదుఁడు;
నట్టి రేవతీ రమణుఁడు నతని నెపుడు
సంస్తుతింతును నిత్యమ్ము స్వాంతమందు!

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

సమస్య: నాకు నీకు మాకు మీకు మనకు

తేది: ఆగస్టు 13, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


వెంగళప్ప కొకట వెండియుఁ బైఁడియు
ధనము ఘనముగాను దారసిలఁగ
'నెవరి కివి?' యటన్న నిట్లు గొణిగె,
"నాకు..నీకు..మాకు..మీకు..మనకు!"

ఆదివారం, ఏప్రిల్ 06, 2014

పద్య రచన: టంగుటూరి ప్రకాశం పంతులు

తేది: ఆగస్టు 14, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము



గుండున కెదురుగా గుండెను నిలిపిన
      గుండె నిబ్బరమున్న దండివ్యక్తి!
సైమన్ కమిషను రా సాఁగ, నాపియు, వెన్క
      కును వెళ్ళఁగొట్టిన గొప్పవ్యక్తి!
దొరల చేష్టఁ బ్రజల దరికిఁ జేర్ప స్వరాజ్య
      పత్రిక నడిపిన ప్రజలవ్యక్తి!
దేశ స్వరాజ్యమే దేశ సౌభాగ్యమ్మ
      టంచుఁ జాటియు నిల్చు మంచివ్యక్తి!

భరతదేశమున్ స్వాతంత్ర్య పథమునందు
నడిపి, యందఱ మేల్కొల్పు నాయకుండ!
'యాంధ్రకేసరి'యన్ బిరుదాంచితుండ!
టంగుటూరి ప్రకాశ! దండములు నీకు!!

శనివారం, ఏప్రిల్ 05, 2014

సమస్య: లే లే నారాజ యనిన లేవఁడు రాణీ

తేది: ఆగస్టు 12, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము



(ప్రణయకలహాన నలిఁగి, దొంగనిద్రనటించు రాజును లేప యత్నించు రాణితో, గడుసరియౌఁ బరిచారిక పలికిన సందర్భము)


"కైలాటకాఁడు రాజును,
'లే లే, నా రాజ!' యనిన, లేవఁడు రాణీ!
కాలి పయి వాఁతఁ బెట్టిన
మేలౌఁ; గపటంపు నిదుర మేల్కొనుఁ ద్వరఁగన్!"


శుక్రవారం, ఏప్రిల్ 04, 2014

పద్య రచన: సత్య హరిశ్చంద్రుఁడు

తేది: ఆగస్టు 12,2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


ఇంద్ర సత్సభా ప్రకటిత హేతు బలిమి
గాధి నందనుఁ డే రాజు గతిని మార్చె?
నా హరిశ్చంద్రుఁ డిడుముల నైన వలచి,
సత్యవా క్పాలనమ్మును సడల నీఁడు!

ఋణమునుఁ దీర్పఁగ నిజసతి
గుణమతి యా చంద్రమతినిఁ గోరియు నమ్మన్ ;
బ్రణతు లిడి, సుత సహిత విత
రణకై బలియయ్యె సాధ్వి, రమణుని యానన్!

సుతుఁడు లోహితుండు సుగుణవంతుఁ డెదలో
హితుఁడు, జనకు నాజ్ఞ నేమరకయె,
జనని ననుసరించె, జనలోక వంద్యుండు,
భావి యౌవ రాజ్య భారకుండు!

***     ***     ***     ***     ***     ***


గురువారం, ఏప్రిల్ 03, 2014

సమస్య: వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె

తేది: ఆగస్టు 10, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము


(నిండు చూలాలైన తన మనుమరాలిని గని, వృద్ధురాలైన తాతమ్మ మురిసిపోతున్న సందర్భము)

'ముని మనుమఁడో, మనుమరాలొ?',మనుమరాలు
కనినఁ జాలుఁ, గనులఁ జూచి, చనెడు నాశ
వృద్ధురాలికి! నేఁడు వేవిళ్ళు గలిగె
మనుమరాలికి! తాతమ్మ మనసు మురిసె!!

బుధవారం, ఏప్రిల్ 02, 2014

పద్య రచన: స్వప్న గోవిందం

తేది: ఆగస్టు 10, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు


(ఒకనాఁటి శ్రీకృష్ణజన్మాష్టమి వేకువ జామున నా హృదయ దర్పణమున నేనొక కలఁ గాంచితిని)

తే.గీ.
అదియ వేణుగోపాలుని యాలయమ్ము;
గోపురము పైన శంఖచక్రోదయమయె!
గాలిగోపురమునఁ జేరఁ గళలఁ దేల్చి,
సకల దేవతలును గొల్వ స్వాగతింతు! (1)

శా.
సర్వైశ్వర్య వదాన్యుఁ డీతఁడు; సహస్రాక్షాదు లీ కృష్ణునిన్
సర్వేశుండని గొల్తు రీ దినము; సత్సంగీత హర్షాన, దుః
ఖోర్వీభార విదూరుఁ డంచును సదా కుడ్యమ్ములన్ నిల్చియున్,
గర్వమ్మింతయు లేకఁ గీర్తనలచేఁ గంసారిఁ గీర్తింపఁగన్ (2)

కం.
నాదు మనోనేత్రమ్మున
నీ దినమీ యాలయమ్ము నిక్కువముగ, స
మ్మోద మ్మొనఁ గూర్చుచు, దా
మోదరు లీలల వెలార్చి ముగ్ధునిఁ జేసెన్! (3)

సీ.
ఒకచోట శ్రీకృష్ణుఁ బ్రకటాపగా యము
     నను దాఁటు వసుదేవు నాప్త కృత్య;
మొక్కచోఁ బూతన మక్కువ నిడు స్తన్య
     మునుఁ ద్రావి, ప్రాణాలఁ గొను విధమ్ము;
నొకచోన శాకటు న్నుగ్గుసేయఁగ నాక
     సమ్మున కెగయు నసంపు వితము;
నొక్కెడఁ గాళియు నుక్కడఁగించియు
     ఫణముల నర్తించు భంగిమమ్ము;
గీ.
ఒక దెసను వెన్న మీఁగడ లోలిఁ ద్రాగు;
నొక యెడను గోపికల నృత్య వికసనమ్ము;
నొకటఁ జాణూర ముష్టికుల కపజయము;
నొక్క దిక్కునఁ గంసుని నుఱుము సేఁత! (4)

ఆ.వె.
ఎంత సుదిన మిద్ది! వింతలఁ జూపించి,
నన్నుఁ బ్రోచునట్టి వెన్నదొంగ!
మాయఁ బన్ని నన్ను మన్నింప, ధన్యుండ!
పరమపురుష, మోక్ష వరము నిడుము!! (5)

(అనుచుఁ బ్రార్థించుచుండ, పక్షుల కిలకిలారావాలచే మెలకువ రాఁగ, నది కలయని తెలిసి, యా దేవదేవునకు మనస్సున మ్రొక్కి,లేచితిని.)

మంగళవారం, ఏప్రిల్ 01, 2014

దత్తపది: చంద్ర-నాగ-గంగ-భస్మ...నచ్చిన ఛందస్సు...శ్రీకృష్ణ స్తుతి

తేది: ఆగస్టు 09, 2012 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన...
శివునకు అలంకారాలైన
చంద్ర - నాగ - గంగ - భస్మ
పదాలను ఉపయోగిస్తూ
నచ్చిన ఛందస్సులో
శ్రీకృష్ణుని స్తుతిస్తూ
పద్యం వ్రాయమనగా
నేను రాసిన ఆటవెలది పద్యము



యదు కులాబ్ధి చంద్ర! యవనారి! గోపాల!
పాద జనిత గంగ! వాసుదేవ!
నగధర! వ్రజ మోహనా! గరుడ గమన!
శౌరి! పద్మనాభ! స్మర జనయిత!