Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, అక్టోబర్ 08, 2019

మాతా త్రిదేవీ నమో నమః

మిత్రులందఱకు
విజయ దశమి పర్వదిన
శుభాకాంక్షలు!



సురనర్తకీ/తరంగక వృత్తము(షట్పాది):
ఇందిరా రమణ సోదరీహిమజ! ♦ హిండిచండిఖల శోషిణీ!
నందయంతిగిరిజామదోత్కటనస్వినీదనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్యకరుణాంతరంగవరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కర ♦ ఖండితోగ్రమృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నత ♦ భక్తిమస్తనగనందినీ!
మందయానపరమార్థ దాయినిమః సతీమహిష మర్దినీ!

సీ.      ఓంకార రూపిణీ! ♦ యోగీశ తోషిణీ! - దివిజ సంస్తుత గాత్రి! ♦ త్రిపుర హంత్రి!
ఐంకార రూపిణీ! ♦ ఆనంద పోషణీ! - షడ్భుజాయుధ ధాత్రి! ♦ శైల పుత్రి!
హ్రీంకార రూపిణీ! ♦ త్రిపథ సంచారిణీ! - సర్వార్థ దాత్రిప్రశస్త గాత్రి!
శ్రీంకార రూపిణీ! ♦ శ్రితజన కళ్యాణి! - దనుజ నాశన కర్త్రి! ♦ తరళ నేత్రి!
గీ.      సర్వ మంత్రాత్మికాకృపా ♦ శరధిమాత! - సర్వ యంత్రాత్మికాసర్వ ♦ శక్తిదాత!
సర్వ తంత్రాత్మికామహైశ్వర్య మహిత! - సర్వ లోకేశ్వరీతల్లి! ♦ సన్నుతు లివె!!

లక్ష్మీస్తుతి
మేఘవిస్ఫూర్జిత వృత్తము:
రమాలక్ష్మీక్షీరాబ్ధ్యధిపతిసుతా! ♦ రమ్యసంస్తుత్య వంద్యా!
నమో దేవీసంపత్ప్రదసుచరితా! ♦ నన్ గటాక్షించు మాతా!
సమీక్షింతున్ పద్మాసనసువదనా! ♦ సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివి యవుటన్ ♦ గాంక్షితమ్మీవె తల్లీ!!

సరస్వతీ స్తుతి
కం.     విద్యాధినేత్రిమాతా! - సద్యః స్ఫురణ ప్రదాత్రి! ♦ శారదవాణీ!
మద్యోగ్య పద్య ధాత్రీ! - మాద్య న్మంగళ సుగాత్రి! ♦ మాన్య!నమస్తే!

తే.గీ.   సకల విద్యాప్రదాత్రివిశాలనేత్రి! - భ్రమరనీలవేణి స్వచ్ఛవర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! ♦ స్వర సుగాత్రి! - బ్రాహ్మిభగవతివరదభారతి నమోఽస్తు!


త్రిమాతృ స్తుతి
శా.      చేతన్ వీణ ధరించివిద్యలొసఁగన్ ♦ శ్రీ వాణివై నిల్చి
చ్చేతోమోద విశేష సంపద లిడన్ ♦ శ్రీ లక్ష్మివై నిల్చియా
చేతోఽoశుల్ మొఱ వెట్టశక్తి నిడఁగన్ ♦ శ్రీ గౌరివై నిల్చి
చ్చైతన్య మ్మిడియో త్రిదేవియిట విశ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!

కం.     వాణీవీణా పాణీ! - పాణి స్థిత సకల విభవ ♦ భాస్వ ల్లక్ష్మీ
ప్రాణేశార్ధాజిర శ-ర్వాణీధీ బల ధనాఢ్య! ♦ వరదాయిభజే!!

.      అమ్మమనమ్మునందు నిను ♦ నండగ నమ్మితినమ్ము మమ్మమో
హమ్ముఁ బెకల్చిసన్మనము ♦ నందఁగ నిచ్చిహృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చిసతతమ్ము దయారస మిమ్ముఁ గూర్చినా
కిమ్మహి జన్మ దున్మియిఁకఁ ♦ గేవల సద్గతి నిమ్మయమ్మరో!!


స్వస్తి

      సంబంధిత చిత్రం


నా యితర బ్లాగులను వీక్షించడానికి క్లిక్ చేయండి:

బుధవారం, అక్టోబర్ 02, 2019

మరుగునపడిన మహావీరుడు - లాల్ బహాదూర్ శాస్త్రి

మిత్రులందఱకు
స్వర్గీయ లాల్ బహాదూర్ శాస్త్రి జయంతి
శుభాకాంక్షలు!
hd image of lal bahadur shastri కోసం చిత్ర ఫలితం

భరత చరితమ్మునందున వరయుతమగు
వీరతను పతాకస్థాయిఁ జేరనిడిన
వీరవరుఁడైన లాల్ బహాదూరు శాస్త్రి
మఱుఁగుపడినట్టి యొకగొప్ప మానిక మయ!

ఉత్తరప్రదేశమ్మున నుదయమంది
చిన్ననాఁటఁ దండ్రియె కీర్తిశేషుఁడగుడు
మేనమామల యింటను బానిస వలె
నొక యనాథ పగిదిని జీవికఁ గొనెనయ!

చదువుకొనుటకై తాను దినదిన మొక్క
నదిని రెండుమాఱులు నీఁది మదినిఁ గుంది
చదువు సాఁగించి విద్యలో నెదుగఁగాను
మక్కువనుఁ జూపినట్టి సామాన్యుఁడతఁడు!

గాంధిమార్గమ్మునకును నాకర్షితుఁడయి,
తనదు సిద్ధాంతములనెప్డు తప్పకుండ,
కులమతాతీతుఁడుగఁ దనకున్న యింటి
పేరుఁ బేర్కొనకున్నట్టి విజ్ఞుఁడతఁడు!

నిజమునకు శాస్త్రి యనునది నిరుడు చదువు
కొన్న కాశి విద్యాపీఠ గురుతరమగు
పట్టయే గాని, యది కులవాచి గాదు!
పిదప గృహనామముగ నది యొదవెనయ్య!

తాను స్వాతంత్ర్యసమరానఁ బూని పాలుఁ
గొనియుఁ జెఱనుండియునుఁ జదువును విడచిన
యట్టి త్యాగియుఁ దానయ్యు నా పిదపను
దనదు చదువును సాఁగించి ఘన యశుఁడయె!

ఎఱ్ఱకోటపై మన జెండ నెగురవేయఁ
జనఁగను బ్రిటిషువార లాపినతఱి తను
వారి కాళ్ళసందున నుండి దూరి యేఁగి
భరత కేతనోన్నయ దేశభక్తిఁ జాటె!

భరత దేశమ్మునకు స్వేచ్ఛదొఱకిన తఱి
యెన్నియో పదవులనుఁ జేకొన్నఁ గాని,
గర్వముం జూపఁ బోక నిగర్వియయ్యు
నెహ్రు పిదపఁ బ్రధానిగా నెఱపెఁ బదవి!

రైల్వె మంత్రిగా నుండ వఱలిన గొప్ప
దగు ప్రమాదమ్మునకును బాధ్యత వహించి
పదవికిని రాజినామాయె పఱఁగఁజేసి,
యదియ తనదు వైఫల్యమటంచు నుడివె!

కార్యదక్షత, ధైర్యమ్ము, ఘనగుణయుత
నైతికత, సత్యపాలన, నవ్య గరిమ,
జై జవాన్ జై కిసాన్ సుఘోషణము లతని
మాన్యునిం జేసి దివ్య సన్మాన మిడెను!

ఉన్నతమ్మైన పదవినిం గొన్నయతఁడు
చిన్న యింటినిఁ గూడ నార్జింపకునికి,
తన నిరాడంబరత్వమ్ము జనమునకునుఁ
జాటి నిలిపెను నేతగ సాదరమున!

నీతియును నిజాయితి గల నియమయుతుఁడు
సోవియట్ భూమి దౌత్య సంస్తుతుల నొంది
నట్టి సమయాన హృచ్ఛూల నంది, పిదప
స్వర్గతుండయ్యు సుజన హృచ్ఛయుఁడునయ్యె!

ఇట్టి మహనీయుఁడైనట్టి హితవరుండు
జనమనమ్ముల వెలుఁగుచు సతత మిలను
బాగుపఱుపంగఁ దలఁచెనో పఱఁగ నతని
నాదు మనమునఁ దలఁతు వినమ్రుఁడనయి!

స్వస్తి


జోహార్లు బాపూజీ...

మిత్రులందఱకు
గాంధీ జయంతి పర్వదిన
శుభాకాంక్షలు!

సంబంధిత చిత్రం


మత్తకోకిల:
హే మహాత్మ! మహోన్నతా! ఘన ♦ హేమ భూమి ఫలప్రదా!
రామభక్త! స్వరాజ్య కాముక! ♦ గ్రామ వృద్ధి కృతేప్సితా!
ధీమతా! లవణోద్యమ వ్రత! ♦ దేశభక్తి వికాసకా!
క్షేమ దాయక! నీచ హేయక!! ♦ శిష్ట కీర్తిత నాయకా!!


సీ.
తెల్లవారల మత్తు  దించంగ సమకట్టి
        సత్యాగ్రహముఁ జేయు  సాధుమూర్తి!
వర్ణభేదము లింక  వలదంచు దళితుల
        హరిజనులని పిల్చు  హవనమూర్తి!
పేదలకే వస్త్ర  మేది? నా కేలంచు
        నంగీల విడిచిన  త్యాగమూర్తి!
దేశమంతయుఁ గోరు  దివ్యనాయకుఁ డయ్యుఁ
        బదవిఁ గోరనియట్టి  భవ్యమూర్తి!
గీ.
జాతిపితయై చెలంగిన  సత్యమూర్తి!
బాలలకు గాంధితాతయౌ  భద్రమూర్తి!
స్వార్థ మించుకయును లేని  నఘమూర్తి!
యంజలింతు మహాత్ముఁడా!  యమరమూర్తి!

తేటగీతి:
శ్వేతముఖులను ద్రోలంగఁ ♦ జేసితయ్య
యెన్నియో యుద్యమమ్ముల ♦ నిచట నీవు!
పేదలకు లేని వస్త్రాలు ♦ వీడి నీవు
ముతుక దోవతి కండువల్ ♦ ముఱిసినావు!!

ఆటవెలది:
కరమునందుఁ గఱ్ఱ; ♦ కాళ్ళకుఁ జెప్పులు;
పుట్ట గోచి; యొల్లె ♦ భుజము పైని;
రొండిని గడియార♦ముండ శోభిల్లుచు,
దేశభక్తి నిడిన ♦ దేశికుఁడవు!

చంపకమాల(పంచపాది):

“కుల మత వర్గ జాతి మన♦కున్న తిరోగమనంపు గోడలే;
యిల నివి యున్న, యున్నతియె ♦ యెందును నుండక, భ్రష్టమౌదు; మే
విలువలు లేక, యొండొరు ల♦భీప్సితముల్ దెగటార్చి, శత్రులై
నిలుతురు; కొట్టుకొందు; రివి ♦ నీచములయ్య; త్యజింప మేలొగిన్
గలుగు” నటంచు బోధనలఁ ♦ గాచితివే మన భారతీయులన్!

కందము:
దండమయా గాంధీజీ!
దండమయా బాపు! నీకు ♦ దండము నేతా!
దండము మోహనదాసా!
దండమయా కర్మచంద్ర! ♦ దండములయ్యా!!


-:శుభం భూయాత్:-



బుధవారం, సెప్టెంబర్ 18, 2019

మౌనులకు మత్స్యాహారమే మేలు!

images of men eating fish curry hd కోసం చిత్ర ఫలితం

శంకరాభరణంలో నేటి [18-09-2019] సమస్య:
మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే

నా పూరణము:
మృత్స్యందోద్భవ వాపి జీవభృతమై మేల్ముల్ సదా యొప్పఁ ద
న్మత్స్యంబుల్ దిరుగాడ ఖాదకుల కా మత్స్యంబులం బట్టియు
న్మత్స్యందీ నిభ రౌచ్య పచ్య కబళం బందింప నోర్మూసి రీ
మత్స్యాహారమె మేలు మౌనులకు ధర్మజ్ఞోక్తియౌ నిద్దియే!

[మృత్-స్యంద+ఉద్భవ వాపి=భూమినుండి పుట్టిన నీటిబుగ్గచే నేర్పడిన బావి; మత్స్యందీ నిభ=కలకండతో సమానమైన; మౌనులు=చేపల రుచికి నోరు మూసిన ఖాదకులు]



స్వస్తి


శుక్రవారం, ఆగస్టు 16, 2019

విశ్వామిత్రుని తల్లి మేనక!

శంకరాభరణంలో నేఁటి (16-08-2019) సమస్య:
మేలుగ గాధిసూనునకు మేనక తల్లి యగున్ నిజంబుగన్

నా పూరణము:

hd image of viswamitra and menaka కోసం చిత్ర ఫలితం


[వనదేవతలు మేనక చేష్టలను చూచి, తమలో తాము అనుకొను సందర్భము]

"వేలుపు ఱేని యానఁ గొని, వేగమె మేనక కౌశికున్ గనెన్!
లీలఁ దపస్సు భగ్నమగు రీతిని సౌఖ్యము నిచ్చెఁ గాంక్షమై
మేలుగ గాధిసూనునకు మేనక! తల్లి యగున్ నిజంబుగన్
బాల శకుంతలా మణికి, భావినృపాంబకు జన్మ నిచ్చియున్!"

స్వస్తి


సోమవారం, ఆగస్టు 12, 2019

పవిత్ర బక్రీదు పర్వదిన త్యాగ కథ! (పద్యకథ )


మహమ్మదీయ సోదరులందఱికీ 
బక్రీదు పర్వదిన 
శుభాకాంక్షలు

hd images of happy bakrid కోసం చిత్ర ఫలితం


ఇబ్రహీమలైహిసలాము హితముఁగోరి,
యిస్మయిలు త్యాగచరిత వెల్గింపఁదలఁచి,
యల్లయే పూన, "బక్రీదు" త్యాగగాథ
మహ్మదీయుల పర్వమై మాన్యతఁగనె!

తండ్రికొడుకుల వర్తనఁ దఱచిచూడ,
వారి మనమందు త్యాగమ్ము వఱలునదియుఁ
గనఁగ సుపరీక్ష నొనరింపఁగాను నల్ల
పూని, కలలోన నిబ్రహీము నిటు కోరె!

"వినుమ యిబ్రహీం! ప్రజలకుఁ బ్రియము లొసఁగ,
నెల్ల వేళల సుఖములు, హితములొప్ప,
జీవనము సేయవలెనన్నఁ జిత్తమలర
నీదు కొమరుని బలిగాను నీయవలెను!"

అనుచుఁ గోరిన యల్ల మాటనుఁ, గొమరుని
కెఱుకపఱుపంగ, నిస్మాయి లిమ్ముగాను
తండ్రిమాటల నాలించి, "తండ్రి! యల్ల
యాన నెరవేర్ప వెనుకాడనయ్య! నన్ను
నేను ముదమున నర్పింతు నిప్పు" డనెను!

మనము నందునఁ గుములుచుఁ దనను దాను
సమ్మతిలఁజేసి, యల్ల యాజ్ఞానుసార
మిబ్రహీమప్డు తన సుతు నిస్మయిలును
వెంటఁ గొని కొండమీఁదకు వెడలినాఁడు!

ముఖమునకుఁ దెల్ల వస్త్రమ్ము ముసుఁగు వెట్టి,
యల్లపై భారమును వైచి, యా జనకుఁడు
తనదు కొమరుని శిరమునుఁ దునుమ నెంచి,
కత్తి నెత్తంగ, నల్లాయె కఱఁగిపోయె!

తండ్రి కొడుకుల భక్తికిఁ ద్యాగనిరతి
కల్లయే యబ్రపడుచును నత్తఱి నట
నిస్మయిలును మాయము సేసి, యెదుట నొక్క
గొఱ్ఱియను నుంచె దయఁబూని గొనము మెఱయ!
 
కనులు మూసియుఁ దనయుని కంఠము నిఁక
ఖండనముసేయ నిబ్రహీం కత్తి వ్రేటు
వేయ, మేషకంఠము తెగె! విలపితుఁడయి
యిబ్రహీము గంతలు విప్పి, యెదుట నున్న
మేషముం గని, మిగుల విస్మితుఁడు నయ్యె!

అతఁడు చూచుచుండఁగ మేష మపుడు మాయ
మయ్యు, నిస్మయిల్ కనఁబడినంత, నచ్చె
రువున మునిఁగియు, 'నిదియ కరుణను నల్ల
యొనరఁ జేసిన మహిమయే' యని తలంచె!

అంత నల్లాయె త్యాగమ్ము నపుడు వొగడ
"నిబ్రహీ మిస్మయిలులార! యిట్టిది యగు
త్యాగచరితఁ బరీక్షింపఁదలఁచి, నేన
యిట్లు సేసితి! ధన్యుల రీర లయ్య!

మీ సుచరితమ్ము లోకాన మెప్పువడసి,
యెల్ల కాలమ్ము నిలిచియు, నెల్ల జనులఁ
ద్యాగులనుఁజేయుచుండు! సతమ్ము మీరు
దేవునకు మాఱురూపులై దీప్తిఁ గనుఁడు!"

అనుచు దీవించి, వరమిచ్చి యల్లయె సనె!
నాఁటి నుండియు ముస్లిముల్ నడచుచుండ్రి
త్యాగవర్తనమునుఁబూని, తనరఁగాను
నాఁటి "బక్రీదు" పర్వమ్ము నడపుచుండ్రి!!

ఇబ్రహీ మిస్మయీలుల యివ్విధమగు
త్యాగగాథయే ముస్లిముల్ తలనుఁదాల్చి,
భక్తి శ్రద్ధలన్ బక్రీదు వర చరితను
ప్రచుర పఱచిరి ముందుతరమ్ములకును!

స్వస్తి


శుక్రవారం, జులై 19, 2019

చెలివా? చెల్లివా? తల్లివా? వరుసకు నీవు నా కేమవుతావు?

సంబంధిత చిత్రం

శంకరాభరణంలో నేఁటి (19-07-2019) సమస్య:
చెలివో చెల్లివొ తల్లివో వదినవో జేజమ్మవో యత్తవో?"

నా పూరణము:

[నా కలలో వాణీ దేవిని స్తుతిస్తూ నేను ఆ తల్లిని కోరిన విధము]

"తొలుత న్నే నిఁక దేహ బంధనములే తొల్గంగ నీ చెంతకున్
వెలుఁగుల్వొందఁగ వత్తునమ్మ జననీ! వేదాగ్రణీ! వాఙ్మణీ!
యిల బంధుత్వము లేని నాకు నగుదో హే వాణి! యమ్మమ్మవో?
చెలివో? చెల్లివొ? తల్లివో? వదినవో? జేజమ్మవో? యత్తవో?"

స్వస్తి


శనివారం, జులై 06, 2019

పాపియే సన్మానమును బొందినాఁడు...


శంకరాభరణంలో నేఁటి (06-07-2019) సమస్య:
నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్

నా పూరణము:

[కౌశికుఁడను బ్రాహ్మణుఁడు దుర్వ్యసనుఁడై, పాపియై, వేశ్యాలోలతచేఁ బొందిన గుష్ఠురోగముచేఁ గుములుచుండియు, మఱొక వేశ్యాగృహమునకుం గొంపొమ్మని యాజ్ఞనిడి, పతివ్రతా మతల్లియైన యాతని భార్యచే నటులనే కొనిపోఁబడుచు, నటవీమార్గమునఁ గల యొక చెట్టుపైఁ దలక్రిందులుగాఁ దపస్సుచేసికొనుచున్న మాండవ్యునకుఁ గాలు తగిలి, సూర్యోదయకాంతి సోఁకి మరణించునటుల శాపముం బొందెను. అపు డా పతివ్రతా శిరోమణి పతిప్రాణములు పోకుండుటకై సూర్యోదయము నాఁపఁగా, తల్లడిల్లిన దేవతలు నలువ సూచనచే ననసూయాదేవిని శరణువేడఁగా, నామె కౌశికునిఁ బునర్జీవితునిఁ జేయునట్లు వరము నిడఁగా, నా పతివ్రత సూర్యోదయముం గావించెను. సూర్యకిరణములు సోఁకి కౌశికుఁడు మరణింపఁగా, ననసూయాదేవి తన పాతివ్రత్య మహిమచే నాతనిం బునర్జీవితుఁ జేయఁగా, నతఁడు భార్యాయుతుఁడై చని, సద్వ్రతుఁడై సర్వుల మెప్పులను వడసిన కథ నిట ననుసంధానించుకొనునది]


భయమున్ భక్తియు లేని కౌశికుఁడు స్త్రీ వ్యామోహియై, కుష్ఠురో
గియునయ్యున్, ఘనమౌనిశాపతపుఁడై, ఖేదార్తుఁడైయుండ; భా
ర్యయె భర్తృవ్రతదీక్షఁ గొన్న మహిమన్ రక్షించియుం దేల్చ; నా
నయదూరుండగు పాపి యొక్కరుఁడు సన్మానంబుఁ బొందెన్ సభన్!


స్వస్తి