Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, నవంబర్ 07, 2018

నరకాసుర సంహారము - దీపావళి పర్వదిన పద్యకథ

దీపావళి శుభాకాంక్షలు కోసం చిత్ర ఫలితం


అల హిరణ్యాక్ష సంహార కలన వసుధ
నోమిన హరిసాంగత్యాన భూమి కపుడు
కడుపు పండఁగ నరకునిఁ గనియు నతని
కిడెను ప్రాగ్జ్యోతిషపురము నుడుగరగను!

బాణు స్నేహాన నతఁడు దుర్వర్తనుఁడయి
దుష్కృతమ్ములఁ జేయుచు దుండగమున
మునుల బాధించుచుండెను ఘనుఁడ నంచుఁ
దనను మ్రొక్కంగఁ గోరుచుఁ దఱుముచుండి!

ఒక్కనాఁడు వసిష్ఠుండు మ్రొక్కుటకయి
యరిగెఁ బ్రాగ్జ్యోతిషంపుఁ గామాఖ్య దేవి
మందిరమునకు; నంత భూమాత సూనుఁ
డాలయమ్మును మూసినయంత మౌని;

"ఓరి మదగర్వమున రేఁగి యుర్వియందు
సజ్జనుల పరిభవమున సంతసమునుఁ
బొందుచుంటివి కావునఁ బొందెదవుర
మృతిని త్వజ్జన్మ కర్తయౌ పితరువలన!"

శాపమును విని నరకుండు జడిసి నలువ
కయి తపమ్మొనరించి యా కమలజుని ప్ర
సన్నుఁ గావించి దేవ రాక్షసుల చేత
మరణ మందకుండఁగ ఘన వరముఁ బొందె!

తద్వర జనిత గర్వ విస్తారుఁడయ్యు
దేవతల జయించియును, యతీశ్వరులకు
బాధ లిడి, షోడశ సహస్ర భామినులను
బంధితులఁ జేసి, చెలరేఁగె భయము లేక!

మునులు దేవతల్ హరికిని మొఱలు వెట్టి
నరకుఁ జంపి, బాధలఁ దీర్ప వర మడిగిరి!
సత్వరముగ శ్రీకృష్ణుండు సమరమందు
నరకుఁ జంపంగఁ బూని తా నరుగుచుండ;

అపుడు సాత్రాజితియె తోడ నరుగుఁదెంతు
ననుచు వేడి శ్రీకృష్ణుని ననుసరించి
వెడలె యుద్ధమ్మునకుఁ దాను వీరవనిత
పగిది వీరత్వ మెల్లెడఁ బల్లవింప!

అపుడు వెన్నుండు గరుడుని నాత్మఁ దలఁప,
నెదుట నిలఁబడ, సతితోడ నెక్కి తాను
వెడలి ప్రాగ్జ్యోతిషమునకు వీఁకతోడ,
నరకు రావించె ననిసేయ నచటి కపుడు!

ఆగ్రహోదగ్రుఁడై వాఁ డహంకరించి,
యగ్గిపైగుగ్గిలము వేయ భగ్గుమనెడి
రీతి నేతెంచి మార్కొని కృష్ణునపుడు,
పలువిధమ్ముల బాణాలు వదలి యెగసె !

కృష్ణుఁ డంతట నస్త్రశస్త్రోష్ణ సహిత
యుద్ధవిక్రమోర్జిత సుబలోన్నతుఁడయి
నరకుఁ దాఁకెను సత్య తననుఁ గనంగ
విశ్వమోహన రూపాన విహసితుఁడయి!

కాల్బలములు కరులు తురగములు తేరు
లన్ని ఖండతుండమ్ములు నయ్యె నంత
నరకుఁ డొక సాయకము వేయ నందసుతుని
తలకుఁ దాఁకియు మూర్ఛిల్లె దానవారి!

సత్యభామయె పృథ్వ్యంశ జనిత యగుట
కతనఁ జక్రియే మాయా ప్రకాశకుఁ డయి
మూర్ఛ నటియించె! భర్త సమ్మూర్ఛితుఁడయి
నంత సేదఁదేఱిచి సత్య యనికిఁ బూని!

ఒక్క కంటను హరిని నింకొక్క కంట
వైరిఁ జూచుచు శృంగార వీరములును
స్నేహ రోషాలు ముఖమునఁ జిందులాడ
ధనువు నంది విజృంభించెఁ ద్వరఁగ సత్య!

రోష రోహిత సందీప్త లోచనయయి,
నరకు సరకు సేయక, వేసి శరములెన్నొ,
కలఁత వడఁజేయఁగాఁ బ్రతీకార ముడిగి,
వాఁడె యప్రతిభుండయి వఱలె శిలగ!

అంతఁ జక్రియుఁ జక్రమ్ము హస్తమునను
గొనియు భూసుతుఁ దలఁ దెగఁ గొని నిలువఁగఁ,
గనిన సత్య మూర్ఛిల్ల, భూకాంత పొడమి,
కొమరుఁ జంపిన పతిఁగని, నుడివె నిట్లు;

"స్వజుని దుష్కృతాల్ సైరించి, వాని చరిత
జనులు చెప్పుకొనఁగఁ జిరస్థాయిగాను
నిల్పు మో దేవ!" యన, హరి "నేఁటి నుండి
జనులు "నరక చతుర్దశి" జరుపుకొండ్రు!

వాఁడు ప్రాచీదిశోదయ ప్రభల నాపి,
లోకులను జీఁకటినిఁ ద్రోచి, శోకమిడెను;
గాన, నేఁడు దీపమ్ముల ఘనముగాను
పూన్చి "దీపావళీ పర్వము" జరిపెదరు!

ఇట్లె ప్రతియేఁట లోకులు హితకరముగ
నాశ్వయుజ కృష్ణపక్షంపు టమవస తిథి
దీపము ల్వెలిఁగించి యీ దిశలు వెలుఁగఁ
గాను దీపావళియె వెల్గుఁ గరువుదీఱ!"

అనఁగఁ బృథ్వి యంతర్హిత యగుడు, సత్య
మూర్ఛఁ దేఱియు మగని నెమ్మోముఁ గనుచు,
విజయ కాంతులు ముఖమున వెల్లివిఱియ,
స్వీయ నగరికిఁ జనెఁ గుజద్విషునితోడ!

ఫలశ్రుతి:
"నరక సంహార కథ" వినినం జదివిన
జనుల కెపు డాయురారోగ్య సంపదలును
కీర్తి సౌఖ్యము లొనఁగూడి, క్షేమముగను
జీవితము వెల్గుఁ గావుత శ్రీధరు కృప!

ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!


శుక్రవారం, ఆగస్టు 24, 2018

సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రము

మిత్రులందఱకు శ్రీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!

సంబంధిత చిత్రం


*తేటగీతులు:*
"క్షమ నొసంగుము భగవతీ! కమల! లక్ష్మి!
శుద్ధ సత్త్వస్వరూపిణీ శోభితాంఘ్రి
కోపపరివర్జితా సృత్వరీ పరాత్ప
రీ క్షమాశీలి తాపహంత్రీ నమోఽస్తు!

సర్వ సాధ్వులలో సాధ్వి, సర్వ రూప
వతులలో రూపవతివి నీవమ్మ! నీవు
లేనిచో జగమంతయుఁ బ్రేత సమమ
గుచును నిష్ఫలమ్మగునమ్మ! కూర్మినిమ్మ!

సకల సంపత్స్వరూపవు, సర్వరూప
వీవె! రాసేశ్వరుల యధిదేవి వీవె!
సకల సతులందు నీ కళ సంక్రమించు!
లేరు నిను మించు దేవత లిజ్జగమున!

నీవె కైలాసమున శివానివిగఁ, బాల
కడలిలో సింధుసుతగ, స్వర్గమ్మునందు
స్వర్గ లక్ష్మిగా, భూతలోపరిని మర్త్య
లక్ష్మిగా వెలుఁగుదువమ్మ! రాఁగదమ్మ!

నీవె వైకుంఠమున లక్ష్మి! వీవె దేవ
దేవి, తులసి, సరస్వతీదేవి, గంగ;
వీవు సావిత్రివే గద విశ్వసృజుని
లోకమునఁ గన, నో తల్లి, నీకు నతులు!

నీవె కృష్ణుని ప్రాణాధిదేవతగను,
ప్రధిత గోలోకమున స్వయం రాధికగను
ధన్యత నిడియు, వెలయ బృందావనమున
బృంద; రాసాన రాసేశ్వరివయితీవె!

నవ్య భాండీరముననుఁ గృష్ణప్రియవయి,
చందన వనానఁ జంద్రవై, చంపకవన
మందు విరజవై, శతశృంగమందు నీవె
సుందరివయి వెల్గితివమ్మ సుకరముగను!

పద్మవనమున నవ పద్మవయ్యు, మాల
తీ వనమ్మున నవ మాలతివయి, కుంద
వనమునం గుందదంతివై తనరి, మిగుల
స్థిరతఁ గేతకీ వనిని సుశీలవైతి!

తగఁ గదంబ వనమునఁ గదంబమాల,
రాజగృహమున ఘన రాజలక్ష్మి, వటులె
ప్రతి గృహమ్మున గృహలక్ష్మి వలెను నిలిచి
పూజలను గొనుచుందువు పుడమిపయిని!

అంబుజాసనాతిచరాబ్ధిజామలేంది
రేశ్వరీ కమలాలయా శ్రీద విష్ణు
వల్లభా రమా మాధవీ వాహినీశ
నందినీ మారజననీ! వినమ్ర నతులు!"

అనుచు దేవతల్, మునులును, మనుజులంత
నమ్రవదనులై భక్తితో నతులు సేసి,
శుభ్రకంఠోష్ఠతాలువుల్ శోభిలంగఁ
బ్రార్థనము సేసి తరియించ్రి రమణమీఱ!

ఇట్టి లక్ష్మీస్తవమ్మును నెవ్వఁ డుదయ
మునను భక్తిఁ బఠించు, నతనికి నెపుడు
ధ్రువముగాఁ బుణ్యములు శుభా లొదవునట్లు
తల్లి లక్ష్మియే కరుణించుఁ దనివితీఱ!

స్వస్తిశనివారం, ఏప్రిల్ 14, 2018

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్
తేటగీతులు:
భరత రాజ్యాంగ నిర్మాత, పండితుండు,
న్యాయవాది, ముఖ్య దళిత నాయకుండు,
బౌద్ధధర్మోద్ధరణకర్త, బౌద్ధుఁడు, తొలి
న్యాయశాఖాసచివుఁడు, మహామనీషి,
వినుత భీమరావ్ రాంజి యంబేడ్కరుండు!

తండ్రి క్రమశిక్షణము నిడ, ధర్మములను,
భరత రామాయణమ్ముల బాల్యమందె
చదివి, జ్ఞానసంపాదనఁ జాలఁగఁ గొని,
తాను విద్వాంసులందు విద్వాంసుఁడాయె!

బాల్యమున, నంటరానట్టివాఁడని తన
తోడి విద్యార్థు లందఱు కోడిగించి,
నీరు త్రాగకుండఁగ వేగ నెట్టివేయ,
నెంతయో పరాభవమంది చింతఁబూనె!

దళితుఁ డన్నట్టివారల దర్పమణచ,
నున్నతపువిద్య నేర్చియు నున్నతుఁడయి,
వారి చేతనే గౌరవింపంగఁబడియు,
మన్ననల నందవలెనని మదినిఁ దలఁచె!

కృషి వహించి యున్నతవిద్యఁ బ్రియముతోడ
నేరిచియు బరోడారాజ నియమితమగు
వేతనముతోడఁ బట్టమ్ము నాతఁడు గొని,
యా బరోడా స్థితాప్త నియామమందె!

నాఁటి కులతత్త్వవాదులందంగఁజేయు
బాధలను గని, తప్తుఁడై, బ్రాహ్మణాది
యగ్రకులజులకన్నను నధికమైన
ధర్మశాస్త్రోక్త సంభూతిఁ దనిసె నతఁడు!

భరత జాతీయ కాంగ్రెసుఁ బఱఁగఁ జేరి,
గాంధి సరసనఁ జేరియు, ఘనతనంద
నా సమాజ సముద్ధరణమ్ముఁ జేయ
నడుము కట్టి ముందుకు సాగె నప్పుడతఁడు!

భరత రాజ్యాంగ నిర్మాతృ వాహకుఁడయి
గొప్ప రాజ్యాంగ మిచ్చియు, గురుతరమగు
స్థానమంది వెలింగెను సన్నుతుఁడయి;
యతని కంజలింతును నేఁడు హర్షమునను!

స్వస్తి


బుధవారం, ఏప్రిల్ 11, 2018

మహాత్మా జ్యోతిరావు పూలే

సంబంధిత చిత్రం

తేటగీతులు:
కులము పేరిట తరతరమ్ములుగ నన్ని
రకములైన యణచివేతలకు గురైన
బడుగు బలహీన వర్గాల ప్రజల కాత్మ
సుస్థిరత్వమ్ము నొసఁగిన సుజనుఁడతఁడు!

వారి హక్కుల కొఱకును పోరు సలిపి,
సాధికారత్వ కల్పన సాధనకయి
కృషి యొనర్చిన మాన్యుండు శ్రీ మహాత్మ
జ్యోతిరావ్ పూలె మహనీయ సుచరితుండు!

విధిగ సామాజికపుఁ దత్త్వవేత్తయయ్యు,
సంఘసేవకుం, డుద్యమచాలకుఁడయి,
తన్మహారాష్ట్ర వాసియై తపనతోడ
కుల వివక్ష నెదిర్చిన గుణయుతుండు!

మనుజులందఱును సమాన మానవులయి,
కులవివక్షనుఁ జూపుట ఘోరమైన
తప్పిదమ్ముగాఁ దలఁచియు, ధర్మముగను
బ్రాహ్మణాధిపత్యమ్మిట వలదనియనె!

"సంఘమం దర్ధ సద్భాగ సహితులైన
మహిళ లభివృద్ధిఁ గొనక, సమాజవృద్ధి
యెటుల జరుగు?" నటంచును నందఱనటఁ
బృచ్ఛసేసియుఁ, బూనె స్త్రీవిద్యకొఱకు!

తనదు పదమూఁడవదగు నేఁట నతనికిని
మాన్య సావిత్రిబాయితో మనువు కాఁగ,
భార్య చదువుతో మొదలిడెఁ బఱఁగఁ దనదు
పరమ సంస్కరణోద్యమ బాధ్యతలను!

బాలికాపాఠశాలను పాదుకొలిపి,
భార్య సావిత్రి సాయాన బాగుగాను
పాఠముల బోధనమ్మునుఁ బఱఁగఁజేసె
నన్నికులముల మతముల యతివలకును!

బాలికల వృద్ధుల కిడి వివాహములను
జేయఁ జిన్నతనమ్మున జీవితమున
భర్త మరణమునను విధవలుగ మాఱు
శప్తలకుఁ బునరుద్వాహ జన్మమిడెను!

శూద్రులకు బ్రాహ్మణులకు విశుద్ధమైన
సమసమాజమ్ము స్థాపింపఁజాలినట్టి
యాశయముతోడ నిరతమ్ము నర్థితోడ
కృషిని సలిపియు విజయుఁడై కీర్తినందె!

గాంధి కన్ననుఁ దా మున్నుగా "మహాత్మ"
బిరుదమునుఁ గొని, వెలుఁగుచుఁ బేదల మఱి
ధనికులనుఁ గులమతముల తారతమ్య
మెద్ది లేకుండ సమముగా నుద్ధరించె!


స్వస్తిఆదివారం, మార్చి 18, 2018

శ్రీ కంది శంకరయ్య గారి సన్మానముసుకవులు, గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి జాతీయ విశిష్ట సాహిత్య పురస్కార గ్రహీత, సమస్యాపృచ్ఛక చక్రవర్తి, శంకరాభరణం బ్లాగు నిర్వాహకులు,
మాన్యులు శ్రీ కంది శంకరయ్య గారికి
గౌరవ పురస్సరముగా సమర్పించుకొను

-:సాదర పద్య సుమార్చన:-

ఉ.
శ్రీయుత కంది వంశ వర! శ్రేష్ఠ గుణాన్విత! సత్ప్రకీర్తితా!
శ్రేయద! శిష్ట మండిత! విశేష మహోదయ! శంకరాఖ్య! ప
ద్యాయత శంకరాభరణ యాజ్ఞిక! సత్కవిజాత మార్గద
ర్శీ! యువ ధీ బలా! ప్రకట శిష్య సమర్చిత! పద్య పోషకా! 1

మ.
మహిమోపేతసుశబ్దయుక్తకవితామార్గప్రదౌత్సుక్యతన్,
సహసాశూక్తిఁ గవీంద్ర సంహతి మనశ్శబ్దార్థసంశీతిఁ బ్ర
త్యహముం దీర్చుచు, "శంకరాభరణ" విద్యాహృద్యపద్యాల్ ముహు
ర్ముహురావృత్తిగ వ్యాప్తిఁ జేతు; విదె కొమ్మో శంకరా సత్కృతుల్! 2


సీ.(మాలిక)
శైశవమ్ముననుండి సాహిత్య విద్యలో రాణించి యెదిగిన రత్న మీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి, తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక హితముఁ గల్గించు సౌహృదుఁడ వీవు;
కోప మింతయు లేక, కోమలమ్మగు వాక్కు, చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్ రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
శ్రీశుని, వరదుని, శ్రీ వేల్పుఁగొండ నృసింహు శతకము లర్చించి తీవు;
షిరిడీశు, నయ్యపన్ స్థిరమైన భక్తితోఁ గరముఁ గొల్చిన గేయకర్త వీవు;
దేశవిదేశ సుస్థిరతరాంతర్జాల పద్య ప్రచారక ప్రముఖుఁ డీవు;
సహనానఁ గవుల సత్సందేహములఁ దీర్చి, పద్యవిద్యనుఁ బెంచు వరదుఁ డీవు;
ప్రముఖావధాన సంభావ్య సత్సభలందు, వరపృచ్ఛకాళిలోఁ బ్రథముఁ డీవు;
సాహితీ సంస్థల సత్కృతు లనిశమ్ముఁ గొని, వెల్గుచున్న సద్గురుఁడ వీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు! బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు! కవుల కందఱ కాదర్శ కవివి నీవు!! 3

కం.
హృద్యములగు పద్యమ్ముల నాద్యంత సువేద్యముగ, నిరాటంకముగా,
శ్రీద్యుతి చెన్నలరారఁగ, సద్యః ప్రభలొలుక రచన సాఁగింతువయా! 4

తే.గీ.(మాలిక)
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి, పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన ధర్మ సద్గుణ శౌచ సత్యములు గలిగి,
యొజ్జబంతివై, కవులకే యొజ్జవైన నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక! 5

శుభం భూయాత్

 పత్ర రచన:                                                        పత్ర సమర్పణ:
మధురకవి                             శ్రీ రాజరాజ నరేంద్రాంధ్రభాషా నిలయం
గుండు మధుసూదన్                            హన్మకొండ, వరంగల్లు    
వరంగల్లు                        


సోమవారం, మార్చి 12, 2018

వరంగల్ అష్టావధానం (పోతన ఆడిటోరియంలో)

అవధాని శ్రీ ముత్యంపేఁట గౌరీశంకర శర్మ గారు

అవధాని శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

 
అవధానులు, సమన్వయకర్త, పృచ్ఛకులు అవధాన సభలో ఉన్నప్పటి ఛాయాచిత్రం

సమన్వయకర్త శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు అవధానసభను ప్రారంభించినప్పటి ఛాయాచిత్రం

అవధానులను సన్మాన పత్ర పఠనచే సన్మానించినప్పటి ఛాయాచిత్రం


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వరంగల్ (పట్టణ) జిల్లాలోని 
పోతన విజ్ఞాన పీఠము యొక్క 
31వ వార్షికోత్సవాల సందర్భంగా, 
దివి: 11-03-2018 ఆదివారం సాయంత్రం గం.06-00 లకు 
పోతన ఆడిటోరియంలో జరిగిన 
జంటకవుల అష్టావధానం 
విశేషాలు...

అవధానులు: 
శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు
మఱియు
శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

సంచాలకులు:
శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరబాబు గారు

అవధానుల దేవతాప్రార్థనాదికాలు పూర్తయిన తర్వాత జరిగిన అవధాన కార్యక్రమం:

1. నిషిద్ధాక్షరి:
శ్రీ కంది శంకరయ్య గారు...
వరంగల్ పట్టణానికే తలమానికమైనవాఁడు, సంస్కృతాంధ్ర పండితుఁడు, సభాసమ్రాట్టు, విశిష్ట అష్టావధాని,  స్వర్గీయ డా. ఇందారపు కిషన్ రావు గారి అవధాన వైభవాన్ని వర్ణించమనగా....

శ్రీ (య) మ (త) య (ను)వే (ద) షా | భూ (ష) తిన్
(మ) కామ | న (వ) ర (హ) ంజి (ల్ల) ంప (న) జే (య)సి క (వ) ల్గి (ప) ంచ (మ) య్యా

గమనిక:-  (...) = నిషేధితాక్షరం, (|) = నిషేధించకుండా వదలడం

రెండు పాదాల వఱకు నిషిద్ధం జరిగినది. దీనికి మరి రెండు పాదాలు చేర్చి...

కం.
శ్రీ మయ వేషా భూతిన్
కామన రంజింపఁ జేసి కల్గించయ్యా
ప్రేమన్ గవితల నిచ్చుచు
మా మనములు నిండ కిషను మాన్యా గోష్ఠిన్!

అని పూర్తి చేశారు.

2. సమస్యాపూరణం:
శ్రీ గుండు మధుసూదన్ గారు...

"శీతమయూఖుఁడే సెగలఁ జిమ్మెను లోకము తల్లడిల్లఁగన్" అనే సమస్యను ఈయగా....

పూరణ:
ఉ.
పూత చరిత్రముం గలిగి, పూర్ణయశస్సునుఁ గాంచినట్టి వి
ద్యాతత సాధుమూర్తి; సుగుణాన్విత దివ్య దిగంత కీర్తి, వి
ఖ్యాతుఁడు రామచంద్రు ప్రియకాంత వియోగ విదగ్ధ వేళలో
శీతమయూఖుఁడే సెగలఁ జిమ్మెను లోకము తల్లడిల్లఁగన్!

అని పూరించారు.

3. వర్ణన (సంస్కృతం):
శ్రీ గోగికార్ ప్రకాశ్ గారు కాకతీయ యుగ ప్రసిద్ధ గ్రంథ/కవి విశేషాలను వర్ణించుమని సంస్కృతంలో అడుగగా...

వసంతతిలకావృత్తం:
శ్రీకాకతీయ వర దివ్య విశేష దేశే
విద్యాధినాథ బహు గ్రంథ విశిష్ట సేవాం|
ప్రాతాపరుద్ర వర కావ్య ప్రశస్త శైలీం
వందామహే ప్రతిదినం చ మహత్త్వయోగాత్||

అని వర్ణించారు.

4. దత్తపది:
శ్రీ చేపూరి శ్రీరామారావు గారు...
చెప్పు - చీపురు - చేట - పేడ ....అనే పదాలనిచ్చి,
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనకు చేసిన సన్మానాన్ని
ఇష్టమైన వృత్తంలో వర్ణించమనగా....

చం.
"సిరులనుఁ గూర్చు కావ్యమును చెప్పుమ పెద్దన! గొప్పగా, శుచీ
పురులకు వందనం బిడుచు, బుద్ధికిఁ దోచిన యూహఁ జేయుచున్,
స్థిరతనుఁ గూర్చు శబ్దముల చేటవకుండఁగ, శాశ్వతమ్ము శ్రీ
కరముగ!" నంచు రాయలు సుఖంబుగఁ బేడలఁ జేసె సత్కృతిన్!

[పేడ = మంజూష, పెద్దపెట్టె] [పేడలన్=పెద్ద పెద్ద పెట్టెల నిండుగా గల రత్న రాశులతో]
అని వర్ణించారు.

5. తెలుగు పద్యానికి సంస్కృత శ్లోకం:
శ్రీ వజ్ఝల రంగాచార్య గారు...

(౧) ఆ.వె.
వ్రేళ్ళు మడచి యొక్క వేలెత్తి చూపఁగా
వేంకటేశ విభుఁడె వేలుపనుచు,
కలియుగమ్మునందు కామందు గోవిందు
చరణ రజముఁ గొలుతు శిరమునందు!

....అనే పద్యాన్ని ఈయగా...

అనుష్టుప్ ఛందము:
బద్ధ్వాఙ్గుళీం ప్రవక్ష్యామి - వేఙ్కటేశస్య వైభవమ్ |
కలౌ యుగేశ గోవిన్దమ్ - వ్రజామి చరణౌ తవ ||

అనీ.....

(౨) ఆ.వె.
ఱెప్పల వల వేసి రేయంత వెదకితి
చిక్కదౌర మీన మొక్కసారి!
అంతరంగ జలధి యందెక్కడో యుండె
మిణుకు మిణుకు మనెడి మీను రూపు!!

....అనే పద్యాన్ని ఈయగా...

అనుష్టుప్ ఛందము:
పక్ష్మజాలం సమాచ్ఛాద్యా - రాత్రౌ సంశోధనం కృతమ్ |
తథాఽపి లభతే నైవ - మీన మేకం తు మానసే ||

అనీ చెప్పారు.

6. ఆశువు:
శ్రీ ఎన్.వీ.ఎన్. చారి గారు...
త్రేతాయుగంలో వానర భోజనంలాగా, ఈనాటి భోజన సమయాల్లో ఏర్పాటు చేసే "బఫే భోజనాన్ని" వర్ణించమనగా....

(౧) ఆ.వె.
ఒకఁడు సెల్లుఁ జూచు నుత్సాహ మొప్పఁగ;
నొకఁడు సొల్లు వాగు నోర్వలేక;
యొకఁడు తినుచు వాని నూరక చూచును;
బహుళ చేష్ట లివియె బఫెల యందు!

అని వర్ణించారు.

మఱల వారే...
అవధాన సభలో స్త్రీలు పురుషులుగానూ, పురుషులు స్త్రీలుగానూ మారఁగా నీ యవధాన సభ యెటులుండునో వర్ణించఁగలరు....అనగా...

(౨) కం.
వీరయినను, వారయినను
వే ఱేమియు లేక కైత పేర్మిన్ గ్రోలన్
చీరలు ఱవికలె యైనను
సార మదొక్కటియె కాదె సాహిత్యరుచిన్!

...అని చెప్పారు.

7. అంత్యాక్షరి:
శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి గారు...

(౧)
"అగసుత భావనాబల సమంచితమై, మృదు వాగ్విలాసమై,
నిగమపికాంగనారవవినిర్గత తాళలయావధానమై,
సుగమ ముదాత్త భావనల శోభనమై, రస మండితమ్ముగన్
సొగసుల ’పద్యమై’ త్రిపురసుందరి మాకుఁ బ్రసన్నమయ్యెడిన్"

అనే పద్యాన్ని పఠింపగా, అంత్యాక్షరమైన "నకారం"తో మొదలుపెట్టి...

అనుష్టుప్ ఛందస్సు:
నానా కవి సమాకీర్ణాం - సభాం దృష్ట్వా చ నిత్యశః |
నౌమి సారస్వతాకారాం - కాకతీయపురే శుభే ||

అని చెప్పారు.

(౨)
"అవలీలన్ రసభావముల్ పలుక పద్యమ్మై, మహాకావ్యమై,
వివిధాలంకృత శిల్పశక్తి చయమై, విద్యా ప్రధానంబునై,
చవులూరించు ధ్వనిప్రచోదక మహాశాస్త్రమ్మునై, స్ఫూర్తియై,
కవితారూపిణివౌచు నిల్చితె! వరంగల్ పాలికా! కాళికా!"

అనే పద్యాన్ని పఠింపగా, అంత్యాక్షరమైన "క కారం" తో మొదలుపెట్టి...

అనుష్టుప్ ఛందస్సు:
కార్యార్థదాయినీం వన్దే - కాళికాం పుర పాలికాం |
శత్రు సంహారిణీం నిత్యం - రససిద్ధి ప్రదాయినీమ్ ||

అని చెప్పారు.

8. అప్రస్తుత ప్రసంగం:
శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గారు వివిధములైన అప్రస్తుత ప్రసంగములు చేయగా, అవధానులు చమత్కారంగా సమాధానాలిచ్చి సభను రంజింపజేశారు.

చివరకు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ నమిలికొండ బాలకిషన్ రావు గారు జంట అవధానులను సన్మానించడంతో ఈ నాటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

స్వస్తి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

గురువారం, మార్చి 01, 2018

హోళీ పర్వదిన విశిష్టత - 2

సంబంధిత చిత్రం

తేటగీతులు:
ఫాల్గునపు మాసమున వచ్చు పౌర్ణమి తిథి
నాఁడు కాముని పున్నమి నామకమున
జరుపు రంగుల పండుగ సకల జనుల
కైకమత్యమ్ము నేర్పుచు ఘనతఁ గనును!

ఇట్టి పండుగ జరుపుట కెన్నొ కథలు
గలవు! వానిలో నొక్కటిఁ గనఁగ నిదియ!
మునుపు శివుఁడు, సతి యెడబాటును సహింప
లేక, హిమవన్నగమ్మున నేకతముగఁ
దపము సేయంగఁ దొడఁగెఁ జిత్తమును నిలిపి!

అదియ కని, హిమవంతుఁడే యా శివునకు
సేవ లొనరింపఁ గూఁతు నుంచినఁ గనుఁగొని,
యింద్రు నాజ్ఞచే మన్మథుం డేయు పూల
బాణములకు హరుండు సంజ్వరమునంది;

తీక్ష్ణముగఁ ద్రినేత్రమ్మునుం దెఱచి చూడ;
భగ్గుమని మండి కాముండు భస్మమాయె!
రతియె ప్రార్థింప, శాంతించి, ప్రాణమునిడి,
"యతనుఁడై వెలుఁగొందు" నం చనిపె నపుడు!

అట్టి కామ దహనము నేఁ డగుట కతన,
జనులు ప్రతివత్సర మ్మిట్టి సంఘటనము
మఱచిపోకుంటకై నేఁడు మన్మథ దహ
నమ్ము సేయుచునుండి రంతటను విధిగ!

కామ దహ నోత్తర దినాన ఘనముగాను
ప్రజలు వివిధ వర్ణమ్ములఁ బఱఁగఁ జల్లు
కొనుచు సంతసమ్మునఁ బండుగును జరుపుచు
సంప్రదాయమ్ము నిలుప నెసంగుచుండ్రి!

ఈ వసంత కాలమ్మున నెట్టి విషపు
జ్వరములును రాక యుంటకై వనమునఁ గల
సహజ వర్ణాల సేకరించంగఁబూని,
యట్టి యౌషధ గుణముచే హాయి నుండ్రు!

నిమ్మ, కుంకుమ, బిల్వ, దానిమ్మ, పసుపు,
కింశుకపుఁ బుష్ప సంచయాంకితులునయ్యు,
సహజ వర్ణాలఁ బ్రకృతిచే జగము మెఱయ
రంగులనుఁ జల్లుకొందురు రమణమీఱ!

ఇట్టి ప్రాకృతికపు రంగు లెన్నియేని
వాడుచో నెట్టి హానియుఁ బడయకుండ,
నౌషధ గుణమ్ముచేత జాడ్యములు తొలఁగి,
ప్రజలు నారోగ్యముగ నుందురయ నిరతము!

అధిక సముపార్జనాపేక్షనంది కొంద
ఱిట రసాయన మిళిత సంస్కృతినిఁ బూని,
వర్ణములఁ గృత్రిమ రసాయ నార్ణవమ్ముఁ
జేసి, ప్రజ రుజగ్రస్థులఁ జేయుచుంట,
మనకు దురదృష్టముగ మారెఁ గనఁగ నిపుడు!

స్వస్తి


హోళీ పర్వదిన విశిష్టత - 1

సంబంధిత చిత్రం


తేటగీతులు:
ప్రకృతి శోభనుఁ బెంచెడి వర్ణ మిళిత
కుసుమముల వికసనములు కొమ రెసంగ
ఫాల్గునమ్మున దరిఁజేరు పౌర్ణమికిని
వచ్చె వాసంతుఁ డిలకు సద్వర్ణయుతుఁడు!

అట్టి దినమునే హోళిగా నభినుతించి
ప్రజలు నలరంగ నొనరింత్రు! వర్ణములనుఁ
జల్లుకొంద్రు వెదకి వరుసలనుఁ గనియుఁ
బిన్నలునుఁ బెద్దలందఱు వేడ్కమీఱ!!

వైష్ణవము ప్రకారమ్ముగఁ బఱఁగ నిదియ
లచ్చిమగని "రిపు"వని హిరణ్యకశిపుఁ
డనుచు, హరినిఁ దలంచు ప్రహ్లాదు నెన్నొ
వెరవులుగఁ జంపఁగాఁ బూన, హరియె కాచె!!

ఎన్ని విధములఁ జంపఁ బూనినను, కొడుకు
చావకుంటకు విష్ణునే సాకుగఁగొని,
తనదు చెల్లి హోళికఁ దన దహన రహిత
వస్త్ర సహితగ రప్పించె వహ్నిదూఁక!

హోళికయె వచ్చి ప్రహ్లాదు నొడిని నుంచి,
యగ్నిమధ్యమ్మునందున నాస్థఁ గూరు
చుండ, విష్ణుండును మహాప్రచండవాయు
వీచికం బంప, వస్త్రమ్ము వెడలెఁ బైఁకి!

అట్టి వస్త్రమ్మె యెగసి ప్రహ్లాదు నొడలుఁ
గ్రమ్మ, నగ్నిలో హోళిక కాలిపోయెఁ!
బిదప నరసింహుఁడై హరి, ద్విషునిఁ జంపి,
బాల ప్రహ్లాదునిం గాఁచి, వరము లొసఁగె!

నాఁటి దినము రాక్షసబాధ నణఁచినట్టి
దినము కావున దాని ప్రతిష్ఠ నెఱిఁగి,
హోళి పండుగ జరుపుచునుండి కాష్ఠ
ములనుఁ బేర్చియు ధహియింత్రు మోదమునను!

దహన కాండకుఁ బిదప సంతసముతోడ
వర్ణములఁ జల్లుకొనుచును వరుస నెఱిఁగి,
హర్షవాక్కుల, క్రీడల నలసి సొలసి
పోవు దనుక నాడుచునుండ్రి భువిని జనులు!

రంగులనుఁ జల్లుకొనఁగఁ బేరందినట్టి
మఱొక కథయుఁ గలదు చూడ! మధురలోనఁ
గృష్ణు వర్ణమ్ము నీలమై కెఱలుచుండఁ
దల్లియౌ యశోదమ్మ తాఁ దలఁచె నిట్లు;

"తెలుపు రాధ, శ్రీకృష్ణుండు నలుపు; వారి
రంగులను భేదముండంగ రా" దటంచు,
సరిగ నీ దినమ్ముననె సంతసమునఁ దల్లి
కృష్ణునిన్ రాధను వసంతకేళి కనిపె!

తేలి రిద్దఱును వసంతకేళియందు,
వర్ణములనొక్క రొకరిపై పఱుప, నప్పు
డిద్దఱకు రూపభేదమ్ము డిందఁ, దల్లి
మురిసె నానందమున, వారు ముద్దులొలుక!

నాఁటి నుండియు రంగులంటంగ జనులు
వర్ణభేదాలు లేకుండ పఱఁగ నిట్లు
హోళి పండుగలో వర్ణ మొలుక, చిలుక,
రూప భేదాలు సమసె స్వరూపమందు!

ప్రజలు నందఱుం బర్వంపు భావనమునఁ
గులమతమ్ముల మఱచుటం గోరుకొనఁగ,
మానవులు సర్వులొక్కటే! మనెడు నపుడు
వేఱు వేఱంచుఁ దలఁతురు భిన్నమతులు!!

స్వస్తి


మంగళవారం, ఫిబ్రవరి 13, 2018

పాహి మాం పరమేశ్వరా పాహి పాహి!

మిత్రులందఱకు
మహా శివరాత్రి పర్వదిన
శుభాకాంక్షలు!


సంబంధిత చిత్రంశితిగళా! పరమేశ్వరా! శివ! మహేశ!
హ్నిలోచన! కరిచర్మ
స్త్రధారి!
రాజశేఖర! రాజేశ్వరా! కపర్ది!
త్రిపురవైరి! ధూర్జటి! హరా! త్రిణయన నతి!
స్వస్తి


శుక్రవారం, జనవరి 26, 2018

భారత స్వాతంత్ర్య కేతనౌన్నత్యము

కవి పండితులకు, మిత్రులకు, వీక్షకులకు అందరికీ
 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!!

సంబంధిత చిత్రం

ఉ.
ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్మునే;
యెత్తఁగదోయి స్వీయగళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా;
నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్యమే;
యెత్తఁగదోయి నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!(1)

శా.
కేలున్ శీర్శములుం గదల్చుచును సుక్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట నీన్ మన జయంతిశ్రేష్ఠమే రోదసిన్
లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిం దగ న్నిండఁగన్,
వ్రాలంజేసి విరోధులన్, గొనుఁడు తద్భ్రాజత్పతాకమ్మునే!(2)

మత్త.
అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులును న్నియంతలు భారతమ్మున లేనిచో,
స్వార్థ బుద్ధికి స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్ష మ
న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!(3)

మ.
కులముం దాటి, మతమ్ము దాటి,కొలఁదుల్ గొప్పల్ విచారింపకే,
కల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములు న్నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపింపంగ, నీ భారతిన్
విలువల్ వెంచఁగ నెత్తు మన్న భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!(4)


*శుభం భూయాత్*


శుక్రవారం, జనవరి 12, 2018

ఆకాశంలో ధ్రువతార - అలిశెట్టి ప్రభాకర్!

తే.గీ.
కరినగరిని జగిత్యాల పురవరమున
జనన మందియుఁ దన చిన్నతనమునందె
తండ్రి మరణించఁ దానె పెద్దయయి యింటి
బరువుఁ గొనె నలిశెట్టి ప్రభాకరుండు!


శార్దూలము
ఆదర్శమ్మును వెల్గఁజేయుకొఱకై యాదర్శ కళ్యాణమున్
మోదానన్ గని, భాగ్యమన్ దనదు సమ్మోదమ్మునన్ భార్యగన్,
బేదింటన్ జనియించినట్టి పడుచున్ విత్తమ్మునుం గోరకే
తా దారగ్రహణమ్మునం గొనెను నౌదార్యమ్మునన్ ధీరుఁడై!


తే.గీ.
జీవికకయి సంపాదించు భావముఁ దన
మనమునందున నిల్పి, సంపదలఁ గనక,
తాను ధనికుఁడౌ కొఱకయి తపనపడని
భాస్కరోన్నతుఁడయ్య ప్రభాకరుండు!


ఆ.వె.
తనదు కళయె ప్రజల ఘనతరాంచితమైన
జీవనమును వెల్గఁ జేయుకొఱకె
యున్నదంచుఁ దలఁచి, యున్నతిం గొనఁగాను
చిత్రకారునిగనుఁ జెలఁగి వఱలె!


తే.గీ.
చిత్రకారునిగా నుండి చిత్రములకుఁ
బ్రాణమందించి ప్రజల జీవనముఁ దనదు
కుంచెతోడుతఁ జిత్రించి, కోరి కోరి
ప్రజల హృదయాల వెలుఁగొంద శ్రమనుఁ బంచె!


తే.గీ.
కుదురుగాను ఛాయాగ్రాహకునిగ నెదిగి
ముద్దుఁగొల్పు ఛాయాచిత్రములవి యెన్నొ
జీవకళ యుట్టిపడఁగఁ దీర్చియును దిద్ది,
మెల్లమెల్లగఁ గవియయ్యె సల్లలితుఁడు!


కం.

జనమనములఁ వెలిఁగింపఁగఁ
దన హృదయమునందు వఱలు తఱచగు భావాల్
వినయాంచిత గుణ మయుఁడై
ఘనతరముగఁ గవితలందుఁ గనఁబఱచి యిడెన్!


తే.గీ.
హైదరాబాదు నగరమ్ము సాదరమున
స్వాగతము వల్కఁ దఱలియు వచ్చి, దాని
స్థిరనివాసమ్ముగాఁ గొని, జీవితమ్ముఁ
గడుప మొదలిడి, జనులందు ఘనుఁడునయ్యె!


తే.గీ.
క్రమముగాను నాంధ్రజ్యోతి గారవింప,
వారి దినపత్రికను నొక్క ప్రక్క నున్న
కాలమందు సిటీలైఫ్ వికాసమందఁ
దనదు చిన్న కైతలు వెల్గె దినదినమ్ము!


ఆ.వె.
తనదు కైత చేతఁ దనదైన ముద్రచేఁ
బాఠకుల యెదలును పల్లవింప,
సమసమాజ చేతనమును, నాలోచనా
దృక్పథమునుఁ బెంచి, స్థిరత వెల్గె!


తే.గీ.
ఇట్లొనరఁగఁజేసినయట్టి హితవరులగు
కొద్దిమందిలో నితఁడు నొక్కొండు నయ్యు
వఱలుచునె క్షయ బారినిఁ బడియుఁ దాను
దిరిగిరాని లోకాలకు నరిగెఁ దుదకు!


తే.గీ.
న్యాయవర్తన తోడ ధనార్జనమ్ము
వలయు నంచును దొరికిన వానితోనె
బ్రతుకు సాఁగించి, కైతకై పాటుపడియుఁ,
దనదు కళలనుఁ బ్రజలకై ధారపోసి,
యాకసపు ధ్రువతారయై యడరె నతఁడు!స్వస్తి


మహామహోపాధ్యాయుఁడు - కోలాచల మల్లినాథ సూరి!


image of kolachala mallinatha suri కోసం చిత్ర ఫలితం

కం.

ఘన కాళిదాస కవి మన
సును నెఱిఁగియు వ్యాఖ్య వ్రాసి సుకవి బిరుదుచే
ఘనుఁడౌ కోలాచల మ
ల్లినాథ సూరిన్ నుతింతుఁ బ్రీతిఁ గవితలన్!


తే.గీ.
కాళిదాస భారవి మాఘ కవుల ఘనత
కుద్దియైన శ్రీహర్షునిఁ గూడ తనదు
వ్యాఖ్యచేతను దెలుఁగుల హర్షితులుగఁ
జేసి మల్లినాథుఁడు వెల్గె స్థిరముగాను!


కం.

సఖ్యతఁ దెలుంగు సంస్కృత
ప్రఖ్యాత కవీంద్ర శాస్త్ర పండితుఁడయ్యున్
వ్యాఖ్యాతృ శిరోమణిగా
విఖ్యాతిం గొని వెలింగె విశ్వమునందున్!


తే.గీ.
మహామహోపాధ్యాయ ధీమతుఁ డిలఁ
గాళిదాసాది సుకవుల గరిమఁ దెలుప
మున్ను పంచమహాకావ్యములకుఁ దాను
వ్యాఖ్యలను వ్రాసి ప్రాచుర్యపఱచె భువిని!


తే.గీ.
మెతుకు సీమను వెలసియు బ్రతుకునకును
సార్థకతఁ బెంచు సాహిత్య సంస్కృతు లిడి
పఱఁగ విద్యార్థి లోకమ్ము పఠన సేయ,
వ్యాఖ్య లందించి, చిరజీవియై నిలిచెను!


తే.గీ.
కావ్యసౌందర్యమునకు వికసనము నిడి,
రసము చిప్పిల్ల, శయ్యయు రమ్యతఁ గొన,
శ్లోక పద వాక్య సుగతార్థ లోకనుఁడయి
వ్యాఖ్య విరచించె ధీశక్తి పరిఢవిలఁగ!


కం.

మును పెందఱు వ్యాఖ్యాతలు
ఘనముగ వ్యాఖ్యానములనుఁ గావించిననున్
దన వ్యాఖ్యానముచేతను
జన మన మలరార నిల్చె సంస్కృత జగతిన్!


ఆ.వె.
ప్రాఁత పద్ధతులను వదలి, కొంగ్రొత్తవౌ
పద్ధతులను గొనియు వ్రాసె వ్యాఖ్య!
కావ్య సంస్థిత వరకవి హృదయావిష్కృ
తంపు వ్యాఖ్య నిడియు ధన్యుఁ డాయె!


ఆ.వె.
అన్వయమ్ము తోడ, ననపేక్షిత మమూల
విషయ మిడక, తనదు విద్య వెలుఁగ,
సంస్కృతజ్ఞులంత సంతృప్తి పడునట్లు
వ్యాఖ్య వ్రాసి, తాను వఱలె భువిని!


తే.గీ.
పూర్వ వ్యాఖ్యాతృ పాండితీ పూర్ణములగు
వ్యాఖ్యలను వీడి, తనదైన వ్యాఖ్యఁ గొనియు,
బాలకులు సులభమ్ముగఁ బఠన సేయఁ
గలుగు రీతిని విరచించె ఘనతరముగ!


ఆ.వె.
కాకతీయ రాజ్య ఘనవైభవోపేత
భూషితుఁడయి, రాజ పోషణమునఁ
దళుకు లీనఁగా, శతావధానియు నయ్యు,
తనదు ప్రతిభఁ జాటె ధరణిలోన!


తే.గీ.
మందబుద్ధులకును వ్యాఖ్య మహితముగను
నర్థమగు రీతి వ్రాసియు, నవని కెపుడు
శ్రేయమునుఁ గూర్పఁగాను సంజీవనిగను;
సహృదయోల్లాస మిడఁగ రచనము సేసె!


కం.

ఈ రీతిని వ్యాఖ్యానము
సారించియు బాలకులను సంస్కృతమునఁ దాఁ
గోరియుఁ జదువఁగఁ జేసియు
మీఱిన యా మల్లినాథు మెత్తు మనమునన్!
స్వస్తి