Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

బుధవారం, సెప్టెంబర్ 30, 2015

పద్య రచన: అభినవ గిరిధారి!

తేది: ఆగస్టు 16, 2015 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రానికి నా పద్య రచనము
గోగణమ్ముఁ గాఁచె గోవర్ధన మ్మెత్తి
ద్వాపరమ్మునందు వ్రజవిభుండు!
వర్షమందు తననె పర్వత ప్రతిమతోఁ
గాఁచెఁ గలియుగానఁ గన నటుండు!!
సోమవారం, సెప్టెంబర్ 28, 2015

సమస్య: రాముఁ డుండు చోటఁ గాముఁ డుండు!

తేది: ఆగస్టు 14, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

మనసు మనసు కలిసె! మనువాడ మనసయ్యెఁ!
బెద్ద లనుమతింపఁ బ్రేమ యనెడి
విరులుఁ గురిసె! నట్టి ప్రేయసీ హృదయాభి
రాముఁ డుండు చోటఁ గాముఁ డుండు!
ఆదివారం, సెప్టెంబర్ 27, 2015

సమస్య: పసిబాలుఁడు పెండ్లియాడి పడసెఁ గుమారున్!

తేది: ఆగస్టు 12, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము("సిబాల్" అను ఇంటిపేరు గల "శంకర్ సిబాల్" అను యువకుఁడు తాను మెచ్చిన యువతిని వివాహమాడి, కుమారునిం బడసిన వృత్తాంతము)


హసిత వదనుఁడు, వినయుఁడు, వి
కసిత హృదబ్జుండు, ప్రణయ కాంక్షిత వర మా
నసి, వలచిన యువతియె తను
ప, "సిబాలుఁడు" పెండ్లియాడి, పడసెఁ గుమారున్!
శనివారం, సెప్టెంబర్ 26, 2015

సమస్య: శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె శంభుఁడే!

తేది: ఆగస్టు 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


 
నా మొదటి పూరణము:
మార రిపుండు గోవుగను మారియు, దుగ్ధము నీయకున్నఁ, దా
దారగ చోళభూపతి సుతన్ దగ నెట్టుల పొందునో? కనన్
శౌరికి శ్రీనివాసునకు సాధు జనార్చన వందనాలికై
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండు శంభుఁడే!!!


***          ***          ***          ***నా రెండవ పూరణం:

కూరిమి నా గజాసురుఁడు కోరియు దేవతలన్ మహాపదన్
గూరఁగఁ జేయ, వారు హరు గొబ్బునఁ జేరియు, రక్ష వేడ, నా
గౌరు శిరమ్ముఁ ద్రుంచియుఁ, ద్వగంబరముం గొని, వేగ నిర్వృతి
శ్రీ రమణీ లలామ నెదఁ జేర్చినవాఁడు శివుండె, శంభుఁడే!శుక్రవారం, సెప్టెంబర్ 25, 2015

సమస్య: బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!

తేది: ఆగస్టు 09, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముమట్టిపనిఁ గట్టిపెట్టియు
నట్టులె బట్టలనుఁ గట్టి యట్టిట్టులఁ దా
గట్టులఁ బట్టఁగ మాసిన
బట్టలు లేకుండఁ దిరుగు వాఁడె సుజనుఁడౌ!
గురువారం, సెప్టెంబర్ 24, 2015

సమస్య: పండితుఁ డన నెవఁడు పరమ పామరుఁడు గదా!

తేది: ఆగస్టు 08, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము(పండిత వేషమున నున్న యొక పామరుని మాటల నొక కవి విశ్లేషించుచున్న సందర్భము)


"పాండవు లనఁగాఁ దెలియదె?
దండిగ మంచంపుఁ గోళ్ళ దత్తున మువురం
చుండి"రని, రెండుఁ జూపెడు
పండితుఁ డన నెవఁడు? పరమ పామరుఁడు గదా!
బుధవారం, సెప్టెంబర్ 23, 2015

సమస్య: సంజీవని నంగదుండు సరగునఁ దెచ్చెన్!

తేది: ఆగస్టు 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(పింగళి సూరన విరచితమైన ప్రభావతీ ప్రద్యుమ్న కావ్యనాయిక ప్రభావతి. ఆమె తండ్రి వజ్రనాభుఁడు. అతని తమ్ముఁడు సునాభుఁడు. ఆ సునాభుని కూఁతురగు చంద్రవతితో, నామె పెంపుడు చిలుక, యామె ప్రియుఁడగు గదుని వెదుకం బోయి, చిక్కులం దెచ్చుకొనిన విషయమునుం దెలుపుచు, గదుఁడే తన్ను విడిపించినాఁడని నుడివిన సందర్భము)"మంజువచన! చంద్రవతి! ని
రంజనసఖభటులు పంజరమ్మున నిడ, నా
బంజరమందుం గని, శుక
సంజీవని! నన్ గదుండు సరగునఁ దెచ్చెన్!!"

(...నంగదుండు...> నన్ గదుండు...)మంగళవారం, సెప్టెంబర్ 22, 2015

సమస్య: భార్య మరణించినంత సంబరము గలిగె!

తేది: ఆగస్టు 05, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

పరమ గయ్యాళి యైనట్టి పడుచు భార్య
యొక్క సారిగ సౌమ్యయై, నిక్కముగను,
మంచి గుణములతో వెల్గె! మగనికి, "గత
భార్య" మరణించినంత, సంబరము గలిగె!!సోమవారం, సెప్టెంబర్ 21, 2015

సమస్య: పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్!

తేది: ఆగస్టు 03, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము 


(పింగళి సూరన కళాపూర్ణోదయమందుఁ గాళికామాత మహిమ[బ్రహ్మవాక్కు, సరస్వతీవరము]చే సుముఖాసత్తిగ మాఱిన మణిస్తంభుఁడు...మణిస్తంభునిగ మాఱిన సుముఖాసత్తి వలన...గర్భముం దాల్చి, కళాపూర్ణునిం బ్రసవించిన ఘట్టము నిట ననుసంధానించుకొనునది)తరుణిగ మాఱిన పురుషుఁడు,
పురుషునిగను మాఱినట్టి ముదిత సురతినిన్
మురియఁగఁ; దరుణిగ మాఱిన
పురుషుఁడు గర్భమ్ముఁ దాల్చి పుత్రునిఁ గనియెన్!ఆదివారం, సెప్టెంబర్ 20, 2015

సమస్య: ఈఁగ పడిన పాలు హిత మొసంగు!

తేది: ఆగస్టు 02, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

రోగముక్తుఁడైన భోగికి నీయంగఁ
బుష్టికరమునయ్యు, నిష్టపడెడు,
కమ్మనయ్యు, నొక్క కలశాన, నొక్క గో
వీఁగ, పడిన పాలు, హిత మొసంగు!
(గోవు+ఈఁగ [=గోవు ఈయఁగా], కలశాన-పడిన-పాలు, హిత మొసంగు...నని అన్వయము)

శనివారం, సెప్టెంబర్ 19, 2015

సమస్య: జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!

తేది: ఆగస్టు 01, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(లంఘనమన్న పదమునకున్న నానార్థముల నెఱుఁగమి నేర్పడిన యనర్థము)జ్వరమునకు లంఘనమ్మే
పరమౌషధ మనఁగ వినియు వైళమ చనియున్
సరసత నెఱుఁగక మూర్ఖుఁడు
జ్వరపీడితుఁ డొకఁడు గోడఁ జయ్యన దూఁకెన్!శుక్రవారం, సెప్టెంబర్ 18, 2015

సమస్య: హరి కరుణా కటాక్షములకై తపియింతురు క్రైస్తవుల్ సదా!

తేది: జులై 31, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణముదరిసెన మందఁ గోరి నిరతమ్మును హిందువు లంద ఱెప్డు శ్రీ
హరి కరుణా కటాక్షములకై తపియింతురు! క్రైస్తవుల్ సదా
యిరవుగ సిల్వఁ దాల్చి ప్రభు యేసునుఁ గొల్తురు! మహ్మదీయులున్
స్థిరత నమాౙుఁ జేసెదరు దీనులఁ బ్రోవ మసీదు లోపలన్!

గురువారం, సెప్టెంబర్ 17, 2015

ఓం శ్రీ మహా గణాధిపతయే నమః !

సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!స్వాగత వృత్తము:
శ్రీ గణేశ! ఘన చిత్సుఖ దాతా!
శ్రీ గిరీశ సుత! శ్రేష్ఠ! వరిష్ఠా!
యోగి రాడ్వరద! యోగ విశేషా!
స్వాగత ప్రమథ వర్గ! నమో ఽహమ్! (1)


ప్రమాణి వృత్తము:
గజాననా! ఘనాకృతీ!
ప్రజావళి ప్రమోద! స
ద్ద్విజ స్తుత! స్థిరా! చతు
ర్భుజా! నమో ఽస్తు తే ఽనిశమ్! (2)


ప్రణవ వృత్తము:
హేరంబా! మిత హిత సంతోషా!
గౌరీ నందన! కరి మూర్ధన్యా!
సూరి ప్రాకట శుభ సంశ్లోకా!
భూరి క్షత్ర! విముఖ! వందే ఽహమ్! (3)


శాలినీ వృత్తము:
సారాచారా! నీత సత్పుణ్య దాతా!
పారాశర్యామోద బాష్పోత్సుకా! క్రౌం
చారి భ్రాతా! భూరి సమ్మోద పాత్రా!
ధీర స్తుత్యా! హే ద్విదేహ ప్రభాసా! (4)


వంశస్థము:
నమో నమో విఘ్న వినాశకాయ తే!
నమో విచిత్రాయ! వినాయకాయ తే!
నమః పవిత్రాంచిత నామకాయ తే!
నమో సదాదాన! ఘనాయ తే నమః! (5)


వన మయూరము:
హేరుక! భవాత్మజ! మహేంద్ర నుత గాత్రా!
ధీర! సుముఖ! ప్రముఖ! దివ్య దరహాసా!
ఘోర తర సంసృతి వికూప తరణాప్తా!
చారు రుచి దంత కులిశ ప్రహరణాఢ్యా! (6)


స్రగ్విణీ వృత్తము:
పార్వతీ నందనా! భారతోల్లేఖనా!
సర్వ గర్వాపహా! ఛాత్ర విద్యోదయా!
ఖర్వ విఘ్నోన్నతా! కార్య సిద్ధిప్రదా!
శర్వ పుత్రాగ్రజా! శాంత మూర్తీ! నమః! (7)


ఇంద్ర వంశము:
జీవేశ! సర్వోత్తమ! చేతన ప్రదా!
దేవ స్తుతా! శాంకరి! ధీ విశేష! ది
వ్యా! విశ్వ సంపూజిత! వక్రతుండ! ఢుం
ఠీ! వేద వేద్యా! ఘన తేజ! తే నమః! (8)


భుజంగ ప్రయాతము:
ద్విపాస్య! త్రి ధామ! త్రిధాతు! ప్రసిద్ధా!
సుపర్వ ప్రమోదా! శుభాంగా! వృషాంకా!
కపి త్థాత్త సంపృక్త భుక్త ప్రహృష్టా!
కృపాంభోధి! కుబ్జాకృతీశా! నమస్తే! (9)


(శుభం భూయాత్)
బుధవారం, సెప్టెంబర్ 16, 2015

సమస్య: సతి చావునకునుఁ గతమయె శంకరుఁడు గదా!

తేది: జులై 30, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(ఆర్యసమాజావిష్కృతిచే...సత్యార్థప్రకాశ రచనముచే...దయానంద సరస్వతిగా పేరుగడించిన మూలశంకరుని వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)యతియయె! సత్యార్థము స
మ్మతితోఁ జెప్పె! ఘన వటుఁడు!మతిమంతుండై
సతత మతి చలిత మోహపు
సతి చావునకునుఁ గతమయె శంకరుఁడు గదా!ఆదివారం, సెప్టెంబర్ 13, 2015

సమస్య: పాయసమున నుప్పు కలుపఁబడఁ దీయనయౌ!

తేది: జులై 28, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

తీయని చక్కెర నిడకయె,
పాయసమున నుప్పు కలుపఁబడఁ, దీయన యౌ
నా?
యశముం గాకయె, యెటు
ధ్యేయమ్మగు నపయశమ్ము, ధీరుల కెపుడున్??
శనివారం, సెప్టెంబర్ 12, 2015

సమస్య: తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!

తేది: జులై 27, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు
నా మొదటి పూరణము:
కన్నవాఁ, డుపనేత, శిక్షకుఁడు, నన్న
దాతయుం, భయత్రాతయుఁ దఱచి చూడఁ
దండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!
శంకరాభరణోత్కృష్ట! శంకరార్య!!
పై పూరణమునందు నాకు ఆధారమైన  శ్లోకమిది:
జనితా చోపనేతా చ, యశ్చ విద్యాం ప్రయచ్ఛతి, |
అన్నదాతా భయత్రాతా, పంచైతే పితరః స్మృతాః ||

***        ***        ***        ***
నా రెండవ పూరణము:
కన్నవాఁడును, నిల్లాలి కన్నతండ్రి,
వడుగుచేసినవాఁడు, గురుఁడును, నన్న
యంచు గణనసేయఁగఁ గొనియాడఁబడెడి
తండ్రు లేవురు గల రండ్రు ధరను బుధులు!


శుక్రవారం, సెప్టెంబర్ 11, 2015

సమస్య: బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!

తేది: జులై 26, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు (ప్రహేళికా రూపమున) నా పూరణము
విరామచిహ్నముల నుంచకముందు:
కొమ్మనుండుఁ గ్రోఁతి కోరిన సిరులిచ్చు
లచ్చి యేడ్చు శిశువు మెచ్చు మధువు
తేఁటి మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు కాకి పలలముఁ దిను!ఈ దిగువ నున్నది చదవండి:విరామచిహ్నముల నుంచిన పిదప:
కొమ్మనుండుఁ గ్రోఁతి; కోరిన సిరులిచ్చు
లచ్చి; యేడ్చు శిశువు; మెచ్చు మధువు
తేఁటి; మంత్రములును దీపింపఁ బఠియించు
బ్రాహ్మణుండు; కాకి పలలముఁ దిను!


బుధవారం, సెప్టెంబర్ 09, 2015

సమస్య: రక్తదానమ్ముఁ జేయుట రాక్షసమ్ము!

తేది: జులై 22, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
ఒకఁ డెయిడ్స్ వ్యాధి పీడిత ప్రకటుఁ డయ్యుఁ
దక్కు వారినిం దనవలెఁ దల్లడిల్లఁ
జేయఁగా నెంచి వైద్యులఁ జీరి తనదు
రక్తదానమ్ముఁ జేయుట రాక్షసమ్ము!సమస్య: మాధవుఁడు సారథియయె సుయోధనునకు!

తేది: జులై 20, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ముందుగనుఁ జూచితంచు గోవిందుఁ డపుడు
కోర్కిఁ దీర్పంగఁ జనె! గొంతి కొమరునకును
మాధవుఁడు సారథియయె! సుయోధనునకు
యాదవుల సైన్య మొసఁగియు హర్షమందె!!
శనివారం, సెప్టెంబర్ 05, 2015

సమస్య: పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్!

ఉపాధ్యాయ మిత్రులకు, సుకవి మిత్రులకు, బ్లాగు వీక్షకులకు
ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!

దీనికి నా పూరణము:

కోపించుచు శిక్షించెడి
పాపాత్ములె పూజ్యులగు నుపాధ్యాయు లిలన్?
దీపించెడి జ్ఞానమ్మును
రూపింపఁగ శాంతి నెంతురు గదా వారల్!


గురువారం, సెప్టెంబర్ 03, 2015

సమస్య: రహమాన్ జేసెనఁట పుష్కర స్నానమ్మున్!

తేది: జులై 19, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
మహి హిందువైనఁ గృష్ణయ
మహితుం డల్లాకుఁ జేసె మాన్య నమాౙున్!
సహనము మతమునఁ ౙూపుౘు
రహమాన్ జేసెనఁట పుష్కర స్నానమ్మున్!!బుధవారం, సెప్టెంబర్ 02, 2015

సమస్య: గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!

తేది: జులై 18, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
హరి నరునిగ బెరయంగను
హరి హితవరి కరము దనరి హరి హరి యనుచున్
గరువలి వరమున హరుఁ డా
గిరిజాపతి వానరుఁడయి కిచకిచలాడెన్!

మంగళవారం, సెప్టెంబర్ 01, 2015

సమస్య: అరకులోయలోఁ గలదు భద్రాచలమ్ము!

తేది: జులై 17, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ధింస నృత్యమ్ముఁ జేయు నాదిమతెగ యట
నరకులోయలోఁ గలదు! భద్రాచలమ్ము
లోన నాదివాసుల నృత్యమే నవకము!
మేడవరపుఁ గోయల నాట్య మెంత ఘనము!!