Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, అక్టోబర్ 31, 2014

సమస్య: వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్

తేది: అక్టోబర్ 07, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు:

నా ప్రథమ పూరణము:

(వేదము వేంకటరాయశాస్త్రిగారిని "వ్యావహారికభాషావాది"యనిన నొకనితో నొక విజ్ఞుఁడు వాదించిన సందర్భము)
"వేదము గ్రాంథిక భాషా
వాదియె! వ్యవహారభాష వలయునటంచున్
వాదించెడి వ్యవహర్తల
వేదము లేఁ" డని గణించె విజ్ఞుండు సభన్! (1)
(వేదము లేఁడని=వేదము(=వేంకటరాయశాస్త్రి)..లేఁడు+అని)
***          ***           ***          ***          ***          ***          ***        ***

నా ద్వితీయ పూరణము:
వేదనలఁ బాపు నాయు
ర్వేద ధనుర్వేద భరతవేదమ్ములతో
వేదములు నాల్గుఁ గలిపియు
వేదము లేడని గణించె విజ్ఞుండు సభన్! (2)


గురువారం, అక్టోబర్ 30, 2014

దత్తపది: గోలి - గుండు - మంద - మల్లెల...రామాయణార్థంలో...నచ్చిన ఛందస్సులో...

తేది: అక్టోబర్ 06, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
గోలి - గుండు - మంద - మల్లెల
(ఇవి శంకరాభరణం బ్లాగులో తఱచుగా పూరణలు రాసే కవుల యింటిపేర్లు)
పదాలను ఉపయోగిస్తూ రామాయణార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి మఱియు మత్తేభవిక్రీడితము

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

(మహర్షి విశ్వామిత్రుఁడు శ్రీరామునిం దాటకనుఁ బరిమార్చుటకై పురికొల్పుచుఁ బలికిన సందర్భము)

తే.గీ. (పంచపాది):
"తాటకి యదిగో! లిప్తయందది కనఁబడి,
మదినిఁ గలగుండు వడఁగాను మాయమగుచు,
మునులు భయమందనఱచుచుఁ గనలుచుండె!
క్షిప్రమే కాండ మల్లె లక్షించి దానిఁ
గూల్చు మోరామచంద్ర! సంకోచ మేల?" (1)

***          ***          ***          ***          ***

(సీతాదేవియొద్ద గోలచేయుచున్న రాక్షస వనితల నుద్దేశించి త్రిజట హనుమంతునిం బొగడుచుఁ బలికిన సందర్భము)

మత్తేభము:
"మన గోలిట్టుల నుండనిండు! మనమా మాన్యం బ్రతారించినన్,
హనుమంతుం డట రామనామజపితోద్యన్మంగళాంగుండునై,
జనకాత్మోద్భవ హర్షమంద నపుడా చందాన రామోర్మికన్
వినుతుల్ సేయుచు వేగ నీన్, గురిసె తీవెల్ మల్లె లవ్వీరుపైన్!!" (2)

మంగళవారం, అక్టోబర్ 28, 2014

సమస్య: తామరతూఁటి దారమున దంతినిఁ గట్టఁగవచ్చు సత్కవీ

తేది: అక్టోబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:



చీమలు నైక్యయత్నమున జిహ్మగముం దెగటార్చునట్లుగన్
వేమఱు వర్షముల్ గుఱిసి బిందువు బిందువు సంద్రమైనటుల్
లేమినిఁ గుందు దీనుఁడు సిరిన్ శ్రమఁ జేసియుఁ బొందినట్టులన్
దామరతూఁటి దారమున దంతినిఁ గట్టఁగవచ్చు సత్కవీ!


ఆదివారం, అక్టోబర్ 26, 2014

నిషిద్ధాక్షరి: సరళాక్షర నిషేధం...గాంధీజీ స్తుతి...నచ్చిన ఛందస్సులో...



తేది: అక్టోబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన
సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా

గాంధీజీని స్తుతిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా

నేను రాసిన
సీసపద్యము మఱియు తేటగీతి




మదీయ ప్రథమ పూరణము::
సీ.
నెత్తిపై పిలకతో, నిర్మలమ్మౌ ముఖ
      మ్మున ధీరశాంతముల్ మొనయ నిచట
నల తెల్లవారి కార్యావర్త పరిహార్య
      మౌటకై నీ వహింసాస్త్రము ధరి
యించియు నని సేసి, యేకమౌనటు సేయ
      ప్రాంతీయులను భవ్యవాక్ప్రతతుల
నాసేతుశీతాచలాంతర సంచారి
      వైతి మేల్కొలుప నీ వనవరతము

గీ.
తెల్లవారల పాలన తెల్లవాఱ
నీ వహింసాయుత సమర నేతవయ్యు
భారతీయ స్వతంత్రతా వర్తనకయి
హే భరతమాత సత్పుత్ర, హితవర, పిత,
తెల్లవారి నంపితివి మా యుల్ల మలర!!



మదీయ ద్వితీయ పూరణము:
తే.గీ.
శాంత్యహింసాయుధధుర్య! సత్యకోప!
శ్వేతముఖపలాయిత! చిత్రవేషధారి!
భరతమాత సత్పుత్రక! భరతవర్ష
పిత! మహాత్మ! నమో
స్తుతే విమల చరిత!!


శుక్రవారం, అక్టోబర్ 24, 2014

న్యస్తాక్షరి: ప్రతి పాద ప్రథమాక్షరాలు వరుసగా స-రి-గ-మ...సంగీత వర్ణన...ఆటవెలది పద్యంలో...


తేది: అక్టోబర్ 04, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన
అంశం- సంగీతము.
ఛందస్సు- ఆటవెలది.
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా స, రి, గ, మ ఉండాలనగా
నేను రాసిన రెండు పద్యములు:


ప్రథమ పద్యము:

రిగమపదనియను సప్తస్వరాలు స
రిత్సమప్రవాహ రీతి రాగ
మక తాళ మిళిత గాత్రసంగీతమై
ధువులూరుచు మన మనసు దోచు!


ద్వితీయ పద్యము:


ర్వకాలములను సంగీత సమ్రాట్టు
రిత్తఁబుచ్చకయె తరింపఁజేయు
గనగంగఁ బోలు గాత్రసంగీతమున్
నుజజాతి కొసఁగి మాన్యుఁ డాయె!



గురువారం, అక్టోబర్ 23, 2014

సమస్య: పదవీ విరమణయె గొప్ప వరమగును గదా


సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు

దీపావళి పండుగ శుభాకాంక్షలు!!

తేది: అక్టోబర్ 01, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నేను రాసిన మూడు పూరణములు



నా ప్రథమ పూరణము:
పదవీకాలమున ధనము
ముదముగఁ గూర్చంగ నదియె ముదిమినిఁ దోడై
హృదయమునఁ జింతఁ బాపఁగఁ
బదవీ విరమణయె గొప్ప వరమగును గదా!
(పదవి లేకున్నను పదవీకాలమున సమకూర్చుకొన్న ధనముండుట గొప్పవరమే గదా!)

***        ***        ***        ***

నా ద్వితీయ పూరణము:
మదయుతుఁడగు నధికారియె
పదస్థుఁడయి యున్న తఱిని బాధల నిడి యా
పదవి ముగిపి చనినంతన, త
త్పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!
(అతఁడు పదవిలోనున్నంతకాలము బాధల ననుభవించిన యుద్యోగుల కది గొప్పవరమే గదా!)

***       ***       ***       ***

నా తృతీయ పూరణము:
మదమునఁ గశిపుఁడు బలరిపుఁ
బదవీచ్యుతుఁ జేసి గద్దెపై నెక్కఁగ శ్రీ
హృదయేశుఁడుఁ జంప నతని
పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!
(హిరణ్యకశిపుఁడు శ్రీహరిచే హతుఁడై యా హరినే పొందుట గొప్పవరమే గదా! అటులనే యతఁడు హతుఁడగుటచే నింద్రపదము మఱల దేవేంద్రుని వశమగుట దేవతలకు గొప్పవరమే గదా!)

***       ***       ***       ***




సోమవారం, అక్టోబర్ 20, 2014

సమస్య: బ్రహ్మ కడిగిన పాదముం బట్ట రాదు

తేది: సెప్టెంబర్ 29, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:



సకల పాపమ్ములనుఁ జేసి, స్రష్టయైన
బ్రహ్మ కడిగిన పాదముం బట్ట, రాదు
పుణ్య మిసుమంతయును, నితఃపూర్వజనిత
పాపకర్మఫలానుభవమ్ములేక!


ఆదివారం, అక్టోబర్ 19, 2014

దత్తపది: కాకి - కోయిల - బాతు - నెమలి...భారతార్థంలో...నచ్చిన ఛందం...

తేది: సెప్టెంబర్ 30, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన
కాకి - కోయిల - బాతు - నెమలి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి:

(తననుఁ బట్ట నుంకించుచున్న కీచకుని ద్రౌపది వారించు సందర్భము)

"వలదు కీచకా, కిన్క! నన్ బట్టుకొనియు
మత్పతుల ప్రతిక్రియ నంది మ్రందకోయి!
లిని స్త్రీ షాడ బాతురుం డెలమిఁ గనఁగ
బుద్ధియుతుఁడౌనె, మలిన కర్ముఁ డగుఁగాని?!"

శుక్రవారం, అక్టోబర్ 17, 2014

న్యస్తాక్షరి: దుర్గాదేవీస్తుతి...తేటగీతిలో...1పాదం2వ గణం మొదటి అక్షరం ’దు’/ 2పా.3గ.’ర్గ’/ 3పా.4గ.’దే’/ 4పా.5గ.’వి’...

తేది: సెప్టెంబర్ 28, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- దుర్గాదేవీస్తుతి.
ఛందస్సు- తేటగీతి.
ప్రథమపాదం ద్వితీయగణాద్యక్షరం ‘దు’, 
ద్వితీయపాదం తృతీయగణాద్యక్షరం ‘ర్గ’,
తృతీయపాదం చతుర్థగణాద్యక్షరం ‘దే’, 
చతుర్థపాదం పంచమగణాద్యక్షరం ‘వి’


దీనికి నేను రాసిన పద్యము:

మాత! దుర్గ! దాక్షాయణి! మంగళ! శివ!
పార్వతి! సతి! భార్గవి! శక్తి! భద్రకాళి!
దేవసంస్తుత! ప్రవిచలదేణనేత్రి!
షష్ఠి! హిండి! నమోఽస్తుతే సమరవిజయ!


గురువారం, అక్టోబర్ 16, 2014

నిషిద్ధాక్షరి: నిండుసున్నా నిషేధం...పెండ్లివిందు వర్ణన...నచ్చిన ఛందస్సు...

తేది: సెప్టెంబర్ 26, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
అనుస్వారాన్ని(నిండుసున్నను) ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి 
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన తేటగీతి:


కనఁగ నేఁటి వివాహ భోజన నియమము
లన్ని గతకాల వైరుద్ధ్య మాయె నయ్య!
యేవియో "బఫే సిస్టమ్ము" లెన్నికఁ గొని,
శానిగాఁ దినుచున్నారు జనులు మిగుల!!

(కంది శంకరయ్యగా రొక వ్యాఖ్యలో ననుస్వారమనఁగానేమిటో తెలుపుచు బూర్ణ బిందువు{సున్న}నే తెలిపినారు. అర్ధ బిందువునుఁ బ్రస్తావింపకపోవుటచే నే నర్ధానుస్వారము(అరసున్నా)లను వాడితినని గ్రహింపఁగలరు)

మంగళవారం, అక్టోబర్ 14, 2014

సమస్య: ఈఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్

తేది: సెప్టెంబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:
(౧)
ఆతఁడుఁ బేదయు రైతౌఁ
బోతన! భాగవత రచన పూజితమాయెన్!!
హేతువెది యౌనొ? యేమో?
యీఁతాకుల గుడిసెలోన నినుఁ డుదయించెన్!!!

(౨)
ఆ తఱి నిననిభ తనుఁడై
సీతాలక్ష్మణులతోడ శ్రీరాముఁడు నా
రాతి రట విడిది సేయఁగ
నీఁతాకుల గుడిసెలోన, నినుఁ డుదయించెన్!

శుక్రవారం, అక్టోబర్ 10, 2014

దత్తపది: "తల"నాలుగు పాదములలో ఉంచి...నచ్చిన ఛందంలో...పూలతోట వర్ణన...

తేది: సెప్టెంబర్ 24, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
‘తల’ను నాలుగుపాదాలలో ఉపయోగిస్తూ
పూలతోటను వర్ణిస్తూ
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన కందపద్యము

వనితల తలఁపులఁ బొదలుచు
ననల సువాసనలె తలల నర్తిత లతలై
తనరు వనధృత లలితలనుఁ
గనఁగా వెతలన్ని సమయు క్ష్మాతలమందున్!!

గురువారం, అక్టోబర్ 09, 2014

సమస్య: అన్నము సున్నంబయె వదినమ్మలు వండన్


తేది: సెప్టెంబర్ 23, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

వెన్నను నిడుమను మఱఁదికి
సున్నము నిడఁగాను మగలుఁ జూచి కనలుచున్
వెన్నంత సాఫు చేయఁగ
నన్నము సున్నంబయె వదినమ్మలు వండన్!!


మంగళవారం, అక్టోబర్ 07, 2014

న్యస్తాక్షరి: కా-కీ-కే-కైలను వరుసగా...కందంలో...ప్రతి పాదాంతాక్షరాలుగా ఉంచి..కాకిగోలను వర్ణించాలి...

తేది: సెప్టెంబర్ 23, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన

అంశం- కాకిగోల
ఛందస్సు- కందము
నాలుగు పాదాల చివరి అక్షరాలుగా వరుసగా కా - కీ - కే - కైలు ఉండాలనగా

నేను రాసిన రెండు కందపద్యాలు



(౧)
అల కాకి చావఁ గని, కా
కులమందయె చుట్టుఁ జేరి కూఁతలనిడు! కీ
సల పరధనము నిడుటకే
వలతురు గని, రారు నరులు పరజన మృతికై!!


(౨)
ప్రకటించు నైక్యతయె, "కా
వుకావు"మని యఱచి కాకి పొగులుచుఁ దన కీ
రకమగు దుఃఖపు రాకే
లకొ దెలుపును సాటి పక్షు లందిన మృతికై!!


సోమవారం, అక్టోబర్ 06, 2014

సమస్య: తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కర పెట్ట మేలగున్

తేది: సెప్టెంబర్ 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము:


ఉల్లమెలర్పఁగాఁ బరుల కోపిక నన్ని యమర్చి, యింటిలోఁ
దల్లికి బువ్వఁ బెట్టకయ తప్పుడు కూఁతలు కూసి నిర్దయన్
ద్రెళ్ళుచు విఱ్ఱవీఁగు కుమతిన్ దగఁ బెద్దలుఁ దిట్ట, నెట్టు లా
తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కర పెట్ట మేలగున్?

శనివారం, అక్టోబర్ 04, 2014

నిషిద్ధాక్షరి: శ, ష, స, హ-ల నిషేధం...సతీసావిత్రి పాతివ్రత్యవర్ణన...స్వేచ్ఛాచ్ఛందం...

తేది: సెప్టెంబర్ 20, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
శ, ష, స, హ-అక్షరాలను ఉపయోగించకుండా

సతీసావిత్రి పాతివ్రత్యాన్ని గురించి 
నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన (1) సీస (2) కంద పద్యములు




ప్రథమ పద్యము:
||సీ||
మద్రభూపతిపుత్రి ♦ మగని ప్రాణమ్ములఁ
    దిరిగి కొంటకు వెంట ♦ నరుగఁగాను,
యమధర్మరా జప్పు ♦ డామె నాపఁగ నామె
    తల్లిదండ్రులకుఁ బు ♦ త్రవరమిడెను;
మఱల వెన్నాడంగ ♦ మఱియొక్క వరముతో
    మామకు దృ గ్రాజ్య ♦ మందఁగ నిడె;
పిమ్మట వెన్నాడఁ ♦ బెనిమిటి ప్రాణమ్ముఁ
    దక్క నడుగుమనఁ ♦ దనకుఁ బుత్రు

||గీ||
నిడు మటంచునుఁ గోర య ♦ ముఁ డటులె యిడఁ
బతియు లేకుండఁ బడతులుఁ ♦ బడతు రెట్లు
తనయులం? గాన, దయతోడఁ ♦ దనదు మగని
ప్రాణ మిడుఁడని మెప్పించి ♦ పతినిఁ గొనెను!!


ద్వితీయ పద్యము:
||కం||
యము వెన్నాడి, పిత కప
త్యము; మామకు నయన రాజ్య ♦ ధనముల్; తనకున్
దమిని నిడఁ బుత్రుఁ; "బతిని ని
డమి నెట్లగు" నని, పతిఁ గొని ♦ ధన్యగ వెలిఁగెన్!!

శుక్రవారం, అక్టోబర్ 03, 2014

సమస్య: దసరా పండుగ దివ్యకాంతులను సంధానించె దీపావళిన్

సాహితీ మిత్ర కవి పండిత వీక్షకాళికి
విజయదశమి పర్వదిన శుభాకాంక్షలు!


తేది: అక్టోబర్ 13, 2013 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నేను రాసిన పూరణము:

అసమానోజ్జ్వల దివ్య శక్తి యుతయై, హర్యక్ష సంయానయై,
యసురానీక వినాశకాయుధకర ప్రాంచన్మహోద్వేగయై,
యసురుం ద్రుంచ భవాని, భూజనులు "నాహా" యంచు వెల్గించ "నా
దసరా పండుగ" దివ్యకాంతులను సంధానించె దీపావళిన్!

గురువారం, అక్టోబర్ 02, 2014

పద్య రచన: సద్దుల బతుకమ్మ...

కవి పండిత మిత్రులకు, వీక్షకపాఠకులకు
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!!

తేది: అక్టోబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు:



||సీ||
తంగేడు పూవులఁ  దాంబాలమునఁ గుండ్ర
    ముగ నందముగఁ బేర్చి, 
 మురువు సూపు
వివిధమ్ములగు రంగు 
♦ లవి గునుగులఁ జేర్చి,
    మందార, కట్ల, చే 
♦ మంతుల నిడి,
బంతిపూవులు పోక 
♦ బంతిపూవులు వింత
    సొబగుల నీనఁగాఁ 
 జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ 
 బండువు సేయంగ
    బ్రతుకమ్మ నడుమ గౌ 
♦ రమ్మనుంచి,

||గీ||
ధగధగలతోడి పట్టుపీ ♦ తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు 
 ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ 
 గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు 
 పడతులంత!

||కం||
బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరిచివర  నిక్కపు భక్త్యు
న్నతిఁ బాడి పాట, లాడియు,
నతులయి నీటను నిమజ్జ 
♦ నము సేతురయా!

||ఆ.వె.||
ముత్తయిదువు లపుడు  పూతురు పసుపును
పుస్తెలకును గౌరి 
 పూజసేసి!
సన్నిహితులు హితులు 
 సఖులంత కష్టసు
ఖములఁ జెప్పికొనఁగఁ 
 గలిసెద రట!

||తే.గీ.||
ఇంటినుండియుఁ దెచ్చిన  హితకరమగు
తీపివస్తువులనుఁ బంచి, 
 తినియు, మఱల
సద్దులను మూటగట్టియు 
 సంబరమున
నిండ్లకుం జేరఁ బోదురా 
 యింతులంత!