Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 23, 2014

సమస్య: పదవీ విరమణయె గొప్ప వరమగును గదా


సుకవి పండిత మిత్రులకు, బ్లాగు వీక్షకులకు

దీపావళి పండుగ శుభాకాంక్షలు!!

తేది: అక్టోబర్ 01, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నేను రాసిన మూడు పూరణములు



నా ప్రథమ పూరణము:
పదవీకాలమున ధనము
ముదముగఁ గూర్చంగ నదియె ముదిమినిఁ దోడై
హృదయమునఁ జింతఁ బాపఁగఁ
బదవీ విరమణయె గొప్ప వరమగును గదా!
(పదవి లేకున్నను పదవీకాలమున సమకూర్చుకొన్న ధనముండుట గొప్పవరమే గదా!)

***        ***        ***        ***

నా ద్వితీయ పూరణము:
మదయుతుఁడగు నధికారియె
పదస్థుఁడయి యున్న తఱిని బాధల నిడి యా
పదవి ముగిపి చనినంతన, త
త్పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!
(అతఁడు పదవిలోనున్నంతకాలము బాధల ననుభవించిన యుద్యోగుల కది గొప్పవరమే గదా!)

***       ***       ***       ***

నా తృతీయ పూరణము:
మదమునఁ గశిపుఁడు బలరిపుఁ
బదవీచ్యుతుఁ జేసి గద్దెపై నెక్కఁగ శ్రీ
హృదయేశుఁడుఁ జంప నతని
పదవీ విరమణయె గొప్ప వరమగును గదా!
(హిరణ్యకశిపుఁడు శ్రీహరిచే హతుఁడై యా హరినే పొందుట గొప్పవరమే గదా! అటులనే యతఁడు హతుఁడగుటచే నింద్రపదము మఱల దేవేంద్రుని వశమగుట దేవతలకు గొప్పవరమే గదా!)

***       ***       ***       ***




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి