కవి పండిత మిత్రులకు, వీక్షకపాఠకులకు
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!!
తేది: అక్టోబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు:
||సీ||
తంగేడు పూవులఁ ♦ దాంబాలమునఁ గుండ్ర
ముగ నందముగఁ బేర్చి, ♦ మురువు సూపు
వివిధమ్ములగు రంగు ♦ లవి గునుగులఁ జేర్చి,
మందార, కట్ల, చే ♦ మంతుల నిడి,
బంతిపూవులు పోక ♦ బంతిపూవులు వింత
సొబగుల నీనఁగాఁ ♦ జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ ♦ బండువు సేయంగ
బ్రతుకమ్మ నడుమ గౌ ♦ రమ్మనుంచి,
||గీ||
ధగధగలతోడి పట్టుపీ ♦ తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు ♦ ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ ♦ గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు ♦ పడతులంత!
||కం||
బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరిచివర ♦ నిక్కపు భక్త్యు
న్నతిఁ బాడి పాట, లాడియు,
నతులయి నీటను నిమజ్జ ♦ నము సేతురయా!
||ఆ.వె.||
ముత్తయిదువు లపుడు ♦ పూతురు పసుపును
పుస్తెలకును గౌరి ♦ పూజసేసి!
సన్నిహితులు హితులు ♦ సఖులంత కష్టసు
ఖములఁ జెప్పికొనఁగఁ ♦ గలిసెద రట!
||తే.గీ.||
ఇంటినుండియుఁ దెచ్చిన ♦ హితకరమగు
తీపివస్తువులనుఁ బంచి, ♦ తినియు, మఱల
సద్దులను మూటగట్టియు ♦ సంబరమున
నిండ్లకుం జేరఁ బోదురా ♦ యింతులంత!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి