Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 31, 2021

ఇరువదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఇరువదిరెండవ పద్యము:

చంపకమాల:
మని, చని, కోరి నిన్, స్మరణ మంచిన నీకుఁ బ్రసన్నలైరి, చి
ద్ఘన! వనితల్! హరీ! కనులఁ గాంచిరి నిండుగఁ గాంక్షతీర! గో
మునఁ జను రాధకున్ మదిని మ్రోఁగెను వేణు సమర్థ గీతి, కే
కి నటనయే! వెసన్ రతులు క్రీడన లిత్తె! పరాత్మ! కేశవా! 22

గర్భిత కందము:
చని, కోరి నిన్, స్మరణ మం
చిన నీకుఁ బ్రసన్నలైరి; చిద్ఘన! వనితల్!
చను రాధకున్ మదిని మ్రోఁ
గెను వేణు సమర్థ గీతి, కేకి నటనయే! 22

గర్భిత తేటగీతి:
స్మరణ మంచిన నీకుఁ బ్రసన్నలైరి!
కనులఁ గాంచిరి నిండుగఁ గాంక్షతీర!
మదిని మ్రోఁగెను వేణు సమర్థ గీతి!
రతులు క్రీడన లిత్తె! పరాత్మ! కేశ! 22



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


ఆదివారం, మే 30, 2021

ఇరువదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఇరువదియొకటవ పద్యము:

చంపకమాల:
అనుదిన, మో హరీ! మహిని నల్లిన సుందర మాల్యమందు లీ
లను నినుఁ దా వెసన్ గనును లాలన నిన్నటఁ గైటభారి! నం
దన ఘన! నాంతరా! కృప, సుదాముని మ్రొక్కు గ్రహించి, యిత్తె, పూ
జనము మెయిన్! నతుల్ వరద! చక్రధరా! ద్విజవాహ! కేశవా! 21

గర్భిత కందము:
దిన, మో హరీ! మహిని న
ల్లిన సుందర మాల్యమందు లీలను నినుఁ దా
ఘన! నాంతరా! కృప, సుదా
ముని మ్రొక్కు గ్రహించి, యిత్తె, పూజనము మెయిన్! 21

గర్భిత తేటగీతి:
మహిని నల్లిన సుందర మాల్యమందుఁ
గనును లాలన నిన్నటఁ గైటభారి!
కృప, సుదాముని మ్రొక్కు గ్రహించి, యిత్తె
వరద! చక్రధరా! ద్విజవాహ! కేశ! 21



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఇరువదియవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]



ఇరువదియవ పద్యము:

ఉత్పలమాల:
శ్రీ రవినేత్ర! వే దయను సేయవె రమ్మన దాసుఁడయ్యు న
క్రూరుఁడు రాన్, హరీ! యెడఁదఁ గూరిమితోఁ గరుణించి, యేఁగ, నీ
వై రవళించు నా సరసి, నన్నువు నిన్ గని, సంతసించె నో
ధీరవరా! నతుల్ బగుతుఁ దేర్చితె యంది సపర్యఁ గేశవా! 20

గర్భిత కందము:
రవినేత్ర! వే దయను సే
యవె రమ్మన దాసుఁడయ్యు నక్రూరుఁడు రాన్,
రవళించు నా సరసి, న
న్నువు నిన్ గని, సంతసించె నో ధీరవరా! 20

గర్భిత తేటగీతి:
దయను సేయవె రమ్మన దాసుఁడయ్యు!
నెడఁదఁ గూరిమితోఁ గరుణించి, యేఁగ,
సరసి, నన్నువు నిన్ గని, సంతసించె!
బగుతుఁ దేర్చితె యంది సపర్యఁ గేశ! 20




స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



పందొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పందొమ్మిదవ పద్యము:

చంపకమాల:
తత గుణశోభితా! హరి పదార్హణ సేసిన యంబరీషు, నా
యతి కినుకన్ వెసన్ జిదుము నాశను కృత్యను శిష్టి సేయ, స
మ్మతి ఘన కృత్య నీ బగుతు మారణకై చన, వజ్రనాభ ప్ర
స్థితి నిడవే! వర మ్మిడవె శ్రీహరి! మ్రొక్కెద నీశ! కేశవా! 19

గర్భిత కందము:
గుణశోభితా! హరి పదా
ర్హణ సేసిన యంబరీషు, నా యతి కినుకన్
ఘన కృత్య నీ బగుతు మా
రణకై చన, వజ్రనాభ ప్రస్థితి నిడవే! 19

గర్భిత తేటగీతి:
హరి పదార్హణ సేసిన యంబరీషుఁ,
జిదుము నాశను కృత్యను శిష్టి సేయ,
బగుతు మారణకై చన, వజ్రనాభ
మిడవె శ్రీహరి! మ్రొక్కెద నీశ! కేశ! 19



స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


పదునెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పదునెనిమిదవ పద్యము:

చంపకమాల:
శ్రిత జన రక్షకా! యల కుచేలుని నీ పద మంద నిత్తె! లో
లత నడఁతే! హరీ! కృశుఁడు బ్రాహ్మణుఁ డెక్కడ? కృష్ణుఁ డేడ? కా
మిత ధన మిచ్చియున్ సఖుని మేదినిలో, ఘన సౌఖ్యుఁ జేసి, దీ
క్షిత మిడితే! నతుల్ మిగుల క్షేమ మొసంగెడు మిత్ర! కేశవా! 18

గర్భిత కందము:
జన రక్షకా! యల కుచే
లుని నీ పద మంద నిత్తె! లోలత నడఁతే!
ధన మిచ్చియున్ సఖుని మే
దినిలో, ఘన సౌఖ్యుఁ జేసి, దీక్షిత మిడితే! 18

గర్భిత తేటగీతి:
అల కుచేలుని నీ పద మంద నిత్తె!
కృశుఁడు బ్రాహ్మణుఁ డెక్కడ? కృష్ణుఁడేడ?
సఖుని మేదినిలో, ఘన సౌఖ్యుఁ జేసి,
మిగుల క్షేమ మొసంగెడు మిత్ర! కేశ! 18



స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



శుక్రవారం, మే 28, 2021

పదునేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పదునేడవ పద్యము:

చంపకమాల:
అల హరి సత్కథల్ శ్రవణమంది, రహించెను సత్యపూర్ణ ధీ
బల పర నిన్ గనన్, విశద భావన సేసె; తపించె; నెంచె; తా
నిల వర మందియున్! శ్రిత పరేశ! రమేశ! పరీక్షితుండు సం
ధిలఁ గొనియున్! నతుల్ ఘన! సుధీవర! చిద్గుణ గణ్య! కేశవా! 17

గర్భిత కందము:
హరి సత్కథల్ శ్రవణమం
ది, రహించెను సత్యపూర్ణ ధీబల పర నిన్
వర మందియున్! శ్రిత పరే
శ! రమేశ! పరీక్షితుండు సంధిలఁ గొనియున్! 17

గర్భిత తేటగీతి:
శ్రవణమంది, రహించెను; సత్యపూర్ణ!
విశద భావన సేసె; తపించె; నెంచె;
శ్రిత పరేశ! రమేశ! పరీక్షితుండు!
ఘన! సుధీవర! చిద్గుణ గణ్య! కేశ! 17



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


గురువారం, మే 27, 2021

పదునాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పదునాఱవ పద్యము:

చంపకమాల:
విన, రయ రాహుతా! పృథివి విష్ణుయశుండను విప్రుపుత్ర! శూ
ర! నుతులివే! వెసన్, బుధుల రక్షగఁ, గష్టముఁ బోనడంచియున్,
జన జయముల్ గనన్, ఖలుల సంఖ్య యజమ్మునఁ గాల్చె దీవె కా
మన లమరన్! నతుల్ ఘన! రమావర! నందక! కల్కి! కేశవా! 16

గర్భిత కందము:
రయ రాహుతా! పృథివి వి
ష్ణుయశుండను విప్రుపుత్ర! శూర! నుతులివే!
జయముల్ గనన్, ఖలుల సం
ఖ్య యజమ్మునఁ గాల్చె దీవె కామన లమరన్! 16

గర్భిత తేటగీతి:
పృథివి విష్ణుయశుండను విప్రుపుత్ర!
బుధుల రక్షగఁ, గష్టముఁ బోనడంచి,
ఖలుల సంఖ్య యజమ్మునఁ గాల్చె దీవె!
ఘన! రమావర! నందక! కల్కి! కేశ! 16


స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


బుధవారం, మే 26, 2021

పదునైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పదునైదవ పద్యము:

చంపకమాల:
వర ఘన! మారజిత్! కపిలవస్తునఁ బుట్టిన గౌతమాఖ్య! సూ
ర్వరతపసీ! జినా! ప్రజల వ్యాకులముల్ గని, బౌద్ధుఁడైతివే!
త్వర మనమందు నే యహము వద్దని చెప్పితి వంతరంగమం
దరితతి వోన్! నతుల్ బుధ! తథాగత! లౌకిక బుద్ధ! కేశవా! 15

గర్భిత కందము:
ఘన! మారజిత్! కపిలవ
స్తునఁ బుట్టిన గౌతమాఖ్య! సూర్వరతపసీ!
మనమందు నే యహము వ
ద్దని చెప్పితి వంతరంగమం దరితతి వోన్! 15

గర్భిత తేటగీతి:
కపిలవస్తునఁ బుట్టిన గౌతమాఖ్య!
ప్రజల వ్యాకులముల్ గని, బౌద్ధుఁడైతి!
వహము వద్దని చెప్పితి వంతరంగ
బుధ! తథాగత! లౌకిక బుద్ధ! కేశ! 15


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


మంగళవారం, మే 25, 2021

పదునాల్గవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


పదునాల్గవ పద్యము:

చంపకమాల:
అల త్రిపురాసురుల్ చెలఁగ, నా రిపుభార్యల శీలజాల శ్రీ
లిలఁ దనరన్, బ్రభూ! యపహరింపఁగ, బుద్ధుఁడవయ్యు, నీవు,  భా
మలఁ దపులన్, రతిం గొని, యుమాధిపు నప్పురిఁ గూల్పఁజేతె, తే
జిలఁగ హరీ! నతుల్ పురుష సింహ! పురాణపు బుద్ధ! కేశవా! 14

గర్భిత కందము:
త్రిపురాసురుల్ చెలఁగ, నా
రిపుభార్యల శీలజాల శ్రీ లిలఁ దనరన్,
దపులన్, రతిం గొని, యుమా
ధిపు నప్పురిఁ గూల్పఁజేతె, తేజిలఁగ హరీ! 14

గర్భిత తేటగీతి:
ప్రబల, నా రిపుభార్యల శీలజాల
మపహరింపఁగ, బుద్ధుఁడవయ్యు, నీవు
గొని, యుమాధిపు నప్పురిఁ గూల్పఁజేతె!
పురుష సింహ! పురాణపు బుద్ధ! కేశ! 14



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


సోమవారం, మే 24, 2021

పదమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

పదమూఁడవ పద్యము:

చంపకమాల:
స్థిర! బలభద్ర! హే ప్రకట ధీబల! సద్గుణ! రౌహిణేయ! భా
స్వర సునృపా! హలీ! ధవళ! శైలధరాగ్రజ! తాళకేతు! సు
స్థిర ఖలహంతకా! నిఖిల చిద్బల! ఫాల! వినీలవస్త్ర! ప్రా
గ్వర ప్రతిభా! నతుల్, ప్రబల! కామప! శ్రీ బలరామ! కేశవా! 13

గర్భిత కందము:
బలభద్ర! హే ప్రకట ధీ
బల! సద్గుణ! రౌహిణేయ! భాస్వర సునృపా!
ఖలహంతకా! నిఖిల చి
ద్బల! ఫాల! వినీలవస్త్ర! ప్రాగ్వర ప్రతిభా! 13

గర్భిత తేటగీతి:
ప్రకట ధీబల! సద్గుణ! రౌహిణేయ!
ధవళ! శైలధరాగ్రజ! తాళకేతు!
నిఖిల చిద్బల! ఫాల! వినీలవస్త్ర!
ప్రబల! కామప! శ్రీ బలరామ! కేశ! 13



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


ఆదివారం, మే 23, 2021

పండ్రెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

పండ్రెండవ పద్యము:

చంపకమాల:
ఘన వ్రత! దేవకీ తరుణి గర్భిత మౌక్తిక! దైత్యనాశ! వృ
ష్ణి! నరవరా! హరీ! మురళి శ్రేష్ఠ కరాంచిత! పూత చిత్త! చి
ద్ఘన! జిత కామ! హే మధుర కంసతృణ స్థిరమారణాస్త్ర! శ
క్తి నిబిడకా! నతుల్! క్షితి సుగీత ప్రవాచక! కృష్ణ! కేశవా! 12

గర్భిత కందము:
వ్రత! దేవకీ తరుణి గ
ర్భిత మౌక్తిక! దైత్యనాశ! వృష్ణి! నరవరా!
జిత కామ! హే మధుర కం
సతృణ స్థిరమారణాస్త్ర! శక్తి నిబిడకా! 12

గర్భిత తేటగీతి:
తరుణి గర్భిత మౌక్తిక! దైత్యనాశ!
మురళి శ్రేష్ఠ కరాంచిత! పూత చిత్త!
మధుర కంసతృణ స్థిరమారణాస్త్ర!
క్షితి సుగీత ప్రవాచక! కృష్ణ! కేశ! 12



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


శనివారం, మే 22, 2021

పదునొకండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

పదునొకండవ పద్యము:

చంపకమాల:
ఘన వర! పావనా! తులువ కర్వరిఁ దాటకఁ ద్రుంచి, కూర్చి ఱా
తిని సతిగా; హరత్రిణతఁ ద్రెంచియు, సీతఁ బ్రతిగ్రహించియున్
వని దరిఁ జేరియున్, దనుజ భాస్కరు రావణుఁ దాల్మి నొంతె! కాం
తిని నిడితే! నతుల్ వర సుధీగుణ! రామ! సువర్ణ! కేశవా! 11

గర్భిత కందము:
వర పావనా! తులువ క
ర్వరిఁ దాటకఁ ద్రుంచి, కూర్చి ఱాతిని సతిగా;
దరిఁ జేరియున్, దనుజ భా
స్కరు రావణుఁ దాల్మి నొంతె! కాంతిని నిడితే! 11

గర్భిత తేటగీతి:
తులువ కర్వరిఁ దాటకఁ ద్రుంచి, కూర్చి
త్రిణతఁ ద్రెంచియు, సీతఁ బ్రతిగ్రహించి,
దనుజ భాస్కరు రావణుఁ దాల్మి నొంతె!
వర సుధీగుణ! రామ! సువర్ణ! కేశ! 11



స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


శుక్రవారం, మే 21, 2021

పదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

పదవ పద్యము:

చంపకమాల:
రసఁ గన, భార్గవా! పరశురామునివై, క్షితిపాలుఁ ద్రుంచిపో
వొ, సురనుతా! హరీ! యిరువదొక్కటి మార్లు దునీండ్రఁగూల్చి, తా
పసి మనముం గొనం బరఁగఁ బంక్తినిఁ గశ్యపవర్యు కిత్తె! ధీన్
రస కిడితే! ప్రభూ! నతులు! ప్రార్థనఁ జేసెద! నంద! కేశవా! 10

గర్భిత కందము:
కన, భార్గవా! పరశురా
మునివై క్షితిపాలుఁ ద్రుంచిపోవొ! సురనుతా!
మనముం గొనం బరఁగఁ బం
క్తినిఁ గశ్యపవర్యుకిత్తె! ధీన్ రస కిడితే! 10

గర్భిత తేటగీతి:
పరశురామునివై క్షితిపాలుఁ ద్రుంచి,
యిరువదొక్క దఫాలు దునీండ్రఁగూల్చి,
బరఁగఁ బంక్తినిఁ గశ్యపవర్యుకిత్తె!
నతులు! ప్రార్థనఁ జేసెద! నంద! కేశ! 10



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, మే 20, 2021

తొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము

[గర్భకవిత్వము]


తొమ్మిదవ పద్యము:

చంపకమాల:
వరజవమొప్పఁగా బలియె వాసవు స్వర్గముఁ బాప, నీవ స
త్వరితముగా నటన్, నిలిచి వామనమూర్తిగ, నేలఁ గోరి, యీ
వరి భువిఁ ద్ర్యంఘ్రినే యిడఁగ, స్వర్భువనాక్రమి! యీవు, మోపవో
శిరముపయిన్! గడున్ నతులు! శ్రీశ! త్రివిక్రమ! నంద! కేశవా! 9

గర్భిత కందము:
జవమొప్పఁగా బలియె వా
సవు స్వర్గముఁ బాప, నీవ సత్వరితముగా
భువిఁ ద్ర్యంఘ్రినే యిడఁగ, స్వ
ర్భువనాక్రమి! యీవు, మోపవో శిరముపయిన్! 9

గర్భిత తేటగీతి:
బలియె వాసవు స్వర్గముఁ బాప, నీవ
నిలిచి వామనమూర్తిగ, నేలఁ గోరి,
యిడఁగ, స్వర్భువనాక్రమి! యీవు, మోప!
నతులు! శ్రీశ! త్రివిక్రమ! నంద! కేశ! 9



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


బుధవారం, మే 19, 2021

ఎనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఎనిమిదవ పద్యము:

ఉత్పలమాల:
నీ, దరిలేనిదౌ దయను, నీ వర రూపముఁ దా భజింపఁ, బ్ర
హ్లాదుఁ డటన్; గటా! కృప సెడం గశిపుం డెదఁ గిన్కఁబూని, చ
క్రీ! ధరఁ దండ్రియే, వెతలుఁ గీ ళ్ళిరవం దిడ, వే నృసింహ! త్రెం
తే, దనుజున్! సుతున్, నతి హృదిం గొని, కాచితె; నంద! కేశవా! 8

గర్భిత కందము:
దరిలేనిదౌ దయను, నీ
వర రూపముఁ దా భజింపఁ, బ్రహ్లాదుఁ డటన్!
ధరఁ దండ్రియే, వెతలుఁ గీ
ళ్ళిరవం దిడ, వే నృసింహ! త్రెంతే, దనుజున్! 8

గర్భిత తేటగీతి:
దయను నీ వర రూపముఁ దా భజింపఁ;
గృప సెడం గశిపుం డెదఁ గిన్కఁబూని,
వెతలుఁ గీ ళ్ళిరవం దిడ, వే నృసింహ!
నతి హృదిం గొని, కాచితె; నంద! కేశ! 8



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


సోమవారం, మే 17, 2021

ఏడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఏడవ పద్యము:

చంపకమాల:
కన ఘన దైత్యుఁడౌ పసిఁడికంటి, నివేశిని వార్ధి ముంప, నీ
వును కిటివై ప్రభూ! యసురుఁ బోటునఁ గూలిచి, హర్షమంద భూ
మినిఁ గొని, తాల్చియున్, భువిని మిత్తినిఁ బాపియుఁ బ్రోచినావె! ధీ
ఘన! ప్రణతుల్ హరీ! త్వరనుఁ గావుమ నన్నును తార్క్ష్య! కేశవా! 7

గర్భిత కందము:
ఘన దైత్యుఁడౌ పసిఁడికం
టి, నివేశిని వార్ధి ముంప, నీవును కిటివై,
కొని, తాల్చియున్ భువిని మి
త్తినిఁ బాపియుఁ బ్రోచినావె! ధీ ఘన! ప్రణతుల్! 7

గర్భిత తేటగీతి:
పసిఁడికంటి, నివేశిని వార్ధి ముంప,
నసురుఁ బోటునఁ గూలిచి, హర్షమంద
భువిని మిత్తినిఁ బాపియుఁ బ్రోచినావె!
త్వరనుఁ గావుమ నన్నును తార్క్ష్య! కేశ! 7


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


ఆదివారం, మే 16, 2021

ఆఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీతి గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీతి గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఆఱవ పద్యము:

చంపకమాల:
రవమెసలారఁగా సురలు రాక్షసు లా యహిఁ జుట్టి యద్రి, క
ర్మువు వనధిన్ వెసన్ దరుచ; మోయక, క్రుంగఁగ ధాతుభృత్తు; చే
యవె ససిఁ గావ, మేల్; వర జయమ్మెసఁగన్ ఢులివై వహించి, యీ
యవె సుధనే! నతుల్, జనుల నారసి, ప్రోచిన శౌరి! కేశవా! 6

గర్భిత కందము:
ఎసలారఁగా సురలు రా
క్షసు లా యహిఁ జుట్టి యద్రి, కర్మువు వనధిన్
ససిఁ గావ, మేల్; వర జయ
మ్మెసఁగన్ ఢులివై వహించి, యీయవె సుధనే! 6

గర్భిత తేటగీతి:
సురలు రాక్షసు లా యహిఁ జుట్టి యద్రి,
తరుచ; మోయక, క్రుంగఁగ ధాతుభృత్తు;
వర జయమ్మెసఁగన్ ఢులివై వహించి,
జనుల నారసి, ప్రోచిన శౌరి! కేశ! 6




స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



శనివారం, మే 15, 2021

ఐదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

  ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఐదవ పద్యము:

చంపకమాల:
నిలుపరి సోమకుం, డజుఁడు నిద్దుర నుండఁగ, నాగమాల దొం
గిల, ఝషమై, శ్రుతుల్ గొనిన క్రించునుఁ జంపియుఁ, గోరి, ప్రాఁతమి
న్కుల నిరవందఁగాఁ జదువు నొజ్జ రహింప నొసంగి, కొంటి సా
ధుల ప్రణతుల్, హరీ! జనుల స్తోత్రము లచ్యుత! చక్రి! కేశవా! 5

గర్భిత కందము:
పరి సోమకుం, డజుఁడు ని
ద్దుర నుండఁగ, నాగమాల దొంగిల, ఝషమై,
యిరవందఁగాఁ జదువు నొ
జ్జ రహింప నొసంగి, కొంటి సాధుల ప్రణతుల్! 5

గర్భిత తేటగీతి:
అజుఁడు నిద్దుర నుండఁగ, నాగమాల
గొనిన క్రించునుఁ జంపియుఁ, గోరి, ప్రాఁత
జదువు నొజ్జ రహింప నొసంగి, కొంటి
జనుల స్తోత్రము లచ్యుత! చక్రి! కేశ! 5



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


శుక్రవారం, మే 14, 2021

నాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నాలుఁగవ పద్యము:

చంపకమాల:
విను, కమలాక్ష! నా శతక భేదము; నుత్పల చంపకాల క
డ్పునఁ దెలియన్ గడున్ సులువు; పొల్పగు పద్యముఁ సొచ్చియుండుఁ జ
క్కన; నమృతేశయా! యవియ, కందము గీతము; లందుకొమ్మ; దా
సునిఁ గనుమా! వెసన్ దయనుఁ జూపుమ వ్రాయఁగఁ! దార్క్ష్య! కేశవా! 4

గర్భిత కందము:
కమలాక్ష! నా శతక భే
దము నుత్పల చంపకాల కడ్పునఁ దెలియ,
న్నమృతేశయా! యవియ, కం
దము గీతము; లందుకొమ్మ! దాసునిఁ గనుమా! 4

గర్భిత తేటగీతి:
శతక భేదము నుత్పల చంపకాల,
సులువు పొల్పగు పద్యముఁ సొచ్చియుండు!
నవియ, కందము గీతము; లందుకొమ్మ!
దయనుఁ జూపుమ వ్రాయఁగఁ! దార్క్ష్య! కేశ! 4


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


మూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము! [గర్భకవిత్వము]

  ఓం నమో భగవతే వాసుదేవాయ

దస్త్రం:Portrait of Tikkana.JPG - వికీపీడియా


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము!
[గర్భకవిత్వము]


మూఁడవ పద్యము:

చంపకమాల:
కనఁ దెలుఁగుం గవుల్ దిరముగా నిల నన్నయ తిక్కయజ్వ యె
ఱ్ఱనలు గడున్ వెసన్ వెలుఁగులన్ విరఁజిమ్మిరి వేనవేలు! గ్ర
న్నన వెలుఁ గిచ్చియున్, జనిరి; నవ్యుల కైతకుఁ జక్కిఁ జూపి, ప్రొ
ద్దను త్రయమై! సదా, నతి శతమ్ములు వారికి! నంద! కేశవా! 3

గర్భిత కందము:
దెలుఁగుం గవుల్ దిరముగా
నిల నన్నయ తిక్కయజ్వ యెఱ్ఱనలు గడున్
వెలుఁ గిచ్చియున్, జనిరి, న|
వ్యుల కైతకుఁ జక్కిఁ జూపి, ప్రొ ద్దను త్రయమై! 3

గర్భిత తేటగీతి:
తిరముగా నిల నన్నయ తిక్కయజ్వ
వెలుఁగులన్ విరఁజిమ్మిరి వేనవేలు!
చనిరి నవ్యుల కైతకుఁ జక్కిఁ జూపి!
నతి శతమ్ములు వారికి! నంద! కేశ! 3



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



బుధవారం, మే 12, 2021

రెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

 ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


రెండవ పద్యము:
చంపకమాల:
ధర సుకృతిన్, హరిన్, మిగుల ధార్మికు, శౌరిని మిన్నఁ జేసి, మే
దుర యశులై, కడున్ జన హృదుల్ వెలయంగఁ బ్రశస్తిఁ గన్న, స
ద్వర సుకవీశులౌ, గురులు వాల్మికి వ్యాసులకున్ నమింతు, శ్రీ
శ్వర కరుణన్, మహిన్ శతక సత్వరతన్ గనఁ, జక్రి! కేశవా! 2

గర్భిత కందము:
సుకృతిన్ హరిన్, మిగుల ధా
ర్మికు, శౌరిని మిన్నఁ జేసి, మేదుర యశులై,
సుకవీశులౌ, గురులు వా
ల్మికి వ్యాసులకున్ నమింతు, శ్రీశ్వర కరుణన్! 2

గర్భిత తేటగీతి:
మిగుల ధార్మికు, శౌరిని మిన్నఁ జేసి,
జన హృదుల్ వెలయంగఁ బ్రశస్తిఁ గన్న,
గురులు వాల్మికి వ్యాసులకున్ నమింతు,
శతక సత్వరతన్ గనఁ, జక్రి! కేశ! 2



స్వస్తి
'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


మంగళవారం, మే 11, 2021

మొదటి పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము! [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము!
[గర్భకవిత్వము]


మొదటి పద్యము:

ఉత్పలమాల:
శ్రీపతి! ప్రాణదా! వరద! చిద్గతిదా! మధువైరి! శౌరి! గ
ర్వాపహరా! హరీ! విమత భంజన! పావన! విశ్వరూప! ధ
ర్మీ! పతితావనా! హితవరీ! నత బ్రహ్మమహేశముఖ్య! నా
గోపశయా! వెసన్ నెనరుఁ గూర్చియుఁ గావుమ, నిత్య! కేశవా! 1

గర్భిత కందము:
పతి! ప్రాణదా! వరద! చి
ద్గతిదా! మధువైరి! శౌరి! గర్వాపహరా!
పతితావనా! హితవరీ!
నత బ్రహ్మమహేశముఖ్య! నాగోపశయా! 1

గర్భిత తేటగీతి:
వరద! చిద్గతిదా! మధువైరి! శౌరి!
విమత భంజన! పావన! విశ్వరూప!
హితవరీ! నత బ్రహ్మమహేశముఖ్య!
నెనరుఁ గూర్చియుఁ గావుమ, నిత్య! కేశ! 1



స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



సోమవారం, మే 10, 2021

శివస్తుతి [గర్భకవిత్వము]

మిత్రులందఱకు నమస్సులు! 

శివస్తుతి

[గర్భకవిత్వము]



ద్రుతవిలంబిత, కంద, గీత, స్వాగత గర్భ చంపకమాల

చంపకమాల:
పురహర! పూజితా! పశువిభూ! సురవంద్య! భవాభవాఖ్య! శూ
ర రణ వరా! జటీ! శశిధరా! పురశాస్త! ప్రశస్తకాఢ్య! క
ర్వరి వర! భ్రాజితా! వృషధవా! స్థిర వేష! పవిత్ర కార్య! చి
త్పురుష! ప్రభూ! జపా! విశద! భూతనృపేంద్ర! పవిత్రపాలకా!

పై చంపకమాలలో దాఁగియున్న యితర పద్యము లీ దిగువ నీయఁబడినవి:

1. ద్రుతవిలంబితము:
పశువిభూ! సురవంద్య! భవాభవా!
శశిధరా! పురశాస్త! ప్రశస్తకా!
వృషధవా! స్థిర వేష! పవిత్రకా!
విశద! భూతనృపేంద్ర! పవిత్రపా!
[న భ భ ర, 1-7లకు యతిమైత్రి]

2. కందము:
హర! పూజితా! పశువిభూ!
సుర వంద్య! భవాభవాఖ్య! శూర రణ వరా!
వర! భ్రాజితా! వృషధవా!
స్థిర వేష! పవిత్ర కార్య! చిత్పురుష! ప్రభూ!

3. తేటగీతి:
పశువిభూ! సురవంద్య! భవాభవాఖ్య!
శశిధరా! పురశాస్త! ప్రశస్తకాఢ్య!
వృషధవా! స్థిర వేష! పవిత్ర కార్య!
విశద! భూతనృపేంద్ర! పవిత్రపాల!

4. స్వాగత వృత్తము:
పూజితా! పశువిభూ! సురవంద్యా!
రాజ! హే! శశిధరా! పురశాస్తా!
భ్రాజితా! వృషధవా! స్థిర వేషా!
భూ జపా! విశద! భూతనృపేంద్రా!
[ర న భ గగ, 1-7లకు యతిమైత్రి]



స్వస్తి

మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



ఆదివారం, మే 09, 2021

కేశవ స్తుతి! [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు!


కేశవ స్తుతి!
[గర్భకవిత్వము]


ద్విపద, కందద్వయ, తేటగీతి, ఉత్పలమాల గర్భ సీసము

సీ.
శ్రీవర! కేశవ! ప్రియవశీకర! శ్రీధృ
        త! ప్రీతి పోషకా! తార్క్ష్యరథుఁడ!
ప్రోవర రక్షకా! పురుష పూజ్య! రసాధి
        ప! ప్రోక్త గీతభాక్! ప్రాణ ప్రదుఁడ!
దేవర! చక్రి! ధీస్థిత! విధీ! హరి! పావ
        న! శ్రేయస వ్యయా! నవ్యపథుఁడ!
కావర మోక్షదా! ఘన సుఖాంతర! హృద్వ
        ర గ్రాహ్యభాషితా! క్రాంతి విదుఁడ!
గీ.
జన విపక్షక! శేషి! శశ్వత్కటాక్ష!
యనయ దక్షక! కేశ! వాబ్జాయతాక్ష!
దనుజ శిక్షక! శార్ఙ్గి! దంతావళాక్ష!
మనుజ రక్షక! వైరి మర్మాంతరీక్ష!

పై సీసములో దాఁగియున్న యితర పద్యము లీ దిగువ నీయఁబడినవి:

1. గర్భిత ఉత్పలమాల:
శ్రీవర! కేశవా! ప్రియవశీకర! శ్రీధృత! ప్రీతి పోషకా!
ప్రోవర రక్షకా! పురుష పూజ్య! రసాధిప! ప్రోక్త గీతభాక్!
దేవర! చక్రి! ధీస్థిత! విధీ! హరి! పావన! శ్రేయస వ్యయా!
కావర! మోక్షదా! ఘన సుఖాంతర! హృద్వర గ్రాహ్యభాషితా!

2. గర్భిత తేటగీతి:
ప్రియవశీకర! శ్రీధృత! ప్రీతి పోష!
పురుష పూజ్య! రసాధిప! ప్రోక్త గీత!
స్థిత విధీ! హరి! పావన శ్రేయ సవ్య!
ఘన సుఖాంతర! హృద్వర గ్రాహ్యభాషి!

3. గర్భిత ప్రథమ కందము:
వర! కేశవ! ప్రియవశీ
కర! శ్రీధృత! ప్రీతి పోషకా! తార్క్ష్యరథా!
వర రక్షకా! పురుష పూ
జ్య! రసాధిప! ప్రోక్త గీతభాక్! ప్రాణ ప్రదా!

4. గర్భిత ద్వితీయ కందము:
వర చక్రి! ధీస్థిత! విధీ!
హరి! పావన! శ్రేయసవ్యయా! నవ్యపథా!
వర మోక్షదా! ఘన సుఖాం
తర! హృద్వర గ్రాహ్యభాషితా! క్రాంతి విదా!

5. గర్భిత ద్విపద:
జన విపక్షక! శేషి! శశ్వత్కటాక్ష!
యనయ దక్షక! కేశ! వాబ్జాయతాక్ష!
దనుజ శిక్షక! శార్ఙ్గి! దంతావళాక్ష!
మనుజ రక్షక! వైరి మర్మాంతరీక్ష!


స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


శనివారం, మే 08, 2021

కరివరద స్తుతి! [గర్భకవిత్వము]

మిత్రులందఱకు నమస్సులు!

కరివరద స్తుతి!
[గర్భకవిత్వము]



కందద్వయ, రుక్మవతీ, కమలవిలసిత గర్భ క్రౌంచపదవృత్తము

క్రౌంచపద వృత్తము:
పావన నామా! భవ్య ప్రభావా! వరద! కమలవర! వరశుభనామా!
ధీవర! రక్షో ధిక్కృత దేవా! స్థిరతర! హరసఖ! స్థిరజ సుకామా!
ప్రావృడభిఖ్యా! రావ విరావా! త్వరిత మద దనుజ ప్రకర విరామా!
కావర, శ్రీశా! కర్తవు కావా! కరివరద! ప్రబల! ఘనతిమిధామా!
[భమసభనననయ గణాలు, 1-11-19 యతిమైత్రి, ప్రాస యుండును]


పై క్రౌంచపద వృత్తమున దాఁగియున్న యితర పద్యములు ఈ దిగువ నీయఁబడినవి:

గర్భిత రుక్మవతీ వృత్తము:
పావన నామా! భవ్య ప్రభావా!
ధీవర! రక్షో ధిక్కృత దేవా!
ప్రావృడభిఖ్యా! రావ విరావా!
కావర, శ్రీశా! కర్తవు కావా!
[భమసగ గణాలు, 1-6 యతిమైత్రి, ప్రాస యుండును]

గర్భిత కమలవిలసిత వృత్తము:
వరద! కమలవర! వరశుభనామా!
స్థిరతర! హరసఖ! స్థిరజ సుకామా!
త్వరిత మద దనుజ ప్రకర విరామా!
కరివరద! ప్రబల! ఘనతిమిధామా!
[ననననగగ గణాలు, 1-9 యతిమైత్రి, ప్రాస యుండును]

గర్భిత ప్రథమ కందము:
పావన నామా! భవ్య ప్ర
భావా! వరద! కమలవర! వరశుభనామా!
ధీవర! రక్షో ధిక్కృత
దేవా! స్థిరతర! హరసఖ! స్థిరజ సుకామా!

గర్భిత ద్వితీయ కందము:
ప్రావృడభిఖ్యా! రావ వి
రావా! త్వరిత మద దనుజ ప్రకర విరామా!
కావర, శ్రీశా! కర్తవు
కావా! కరివరద! ప్రబల! ఘనతిమిధామా!


స్వస్తి

'మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



శుక్రవారం, మే 07, 2021

వాణీ స్తుతి! [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు!


వాణీ స్తుతి!

[గర్భకవిత్వము]


భుజంగప్రయాత స్రగ్విణీ అంతరాక్కర దండక ద్వికంద గర్భ సీసము:

సీసము:
వాగ్విభావా శ్రిత | ప్రాకృతోచ్ఛబ్ద చి
        ద్వర్య క్రమ్యామృతా | ధాత్రి! శాబ్ది!
ప్రాచ్య కావ్యాశ్రిత | వ్యాకరద్వాక్య చి
        ద్భవ్య మానాకృతా | భాషి! తోషి!
విశ్వ దేవాశ్రిత | స్వీకృతోత్పద్య చి
        ద్వేషి గమ్యాగతా | వేద మాత!
బ్రాహ్మి పాదాశ్రితా | పాక సంభావ్య చి
        త్ప్లావ్య నేత్రాకృతీ | ధన్య! వాణి!
తేటగీతి:
సరళ గుణగణ్య విశ్రుత | చరణ వినుత!
కవన జనిత సాంద్ర సుకవి|గా వర మిడి,
చరిత సుకవితా స్వరచిత, | కరుణ నిరతిఁ
గొను స్తవమునుఁ గాంక్షన్ దల్లి! | కూర్తు నతులు!

గర్భిత భుజంగప్రయాతము:
శ్రిత ప్రాకృతోచ్ఛబ్ద | చిద్వర్య క్రమ్యా
శ్రిత వ్యాకరద్వాక్య | చిద్భవ్య మానా
శ్రిత స్వీకృతోత్పద్య | చిద్వేషి గమ్యా
శ్రితా పాక సంభావ్య | చిత్ప్లావ్య నేత్రా!
[య య య య గణాలు, 1 - 8 యతిమైత్రి]

గర్భిత స్రగ్విణి:
ప్రాకృతోచ్ఛబ్ద చి|ద్వర్య క్రమ్యామృతా
వ్యాకరద్వాక్య చి|ద్భవ్య మానాకృతా
స్వీకృతోత్పద్య చి|ద్వేషి గమ్యాగతా
పాక సంభావ్య చి|త్ప్లావ్య నేత్రాకృతీ!
[ర ర ర ర గణాలు, 1 - 7 యతిమైత్రి]

గర్భిత అంతరాక్కర:
ప్రాకృతోచ్ఛబ్ద చిద్వ|ర్య క్రమ్యామృతా
వ్యాకరద్వాక్య చిద్భ|వ్య మానాకృతా
స్వీకృతోత్పద్య చిద్వే|షి గమ్యాగతా
పాక సంభావ్య చిత్ప్లా|వ్య నేత్రాకృతీ!
[1 సూర్య + 2 ఇంద్ర + 1 చంద్ర గణాలు, 1 వ గణం మొదటి అక్షరానికి, 3 వ గణం చివరి అక్షరానికి యతిమైత్రి]

గర్భిత దండకము:
భావా శ్రిత ప్రాకృతోచ్ఛబ్ద చిద్వర్య క్రమ్యామృతా ధాత్రి! కావ్యాశ్రిత వ్యాకరద్వాక్య చిద్భవ్య మానాకృతా భాషి! దేవాశ్రిత స్వీకృతోత్పద్య చిద్వేషి! గమ్యాగతా వేద పాదాశ్రితా! పాక సంభావ్య చిత్ప్లావ్య నేత్రాకృతీ! ధన్య! వాణీ! నమస్తే నమస్తే నమః!
[త గణ దండకము]

గర్భిత ప్రథమ కందము:
సరళ గుణగణ్య విశ్రుత
చరణ వినుత కవన జనిత | సాంద్ర సుకవిగా
చరిత సుకవితా స్వరచిత
కరుణ నిరతిఁ గొను స్తవమునుఁ | గాంక్షన్ దల్లీ!

గర్భిత ద్వితీయ కందము:
సరళ గుణగణ్య విశ్రుత
చరణ వినుత కవన జనిత | సాంద్ర సుకవిగా
వర మిడి, చరిత సుకవితా
స్వరచిత కరుణ నిరతిఁ గొను | స్తవమునుఁ గాంక్షన్!


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


గురువారం, మే 06, 2021

హర స్తుతి! [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు!


హర స్తుతి!
[గర్భకవిత్వము]


కంద, స్వాగతవృత్త, తేటగీతి గర్భ చంపకమాలావృత్తము

చంపకమాల:
పురహర! ప్రోవరా! స్మరరిపూ! సురసేవ్య! వృషధ్వ! జాజ! సు
స్థిర! సుర ధీవరా! వృషపతీ! పరమేశ! విభిన్న! త్ర్యక్ష! శం
కర! వర! కావరా! హరిస! ఖాహిరి తోష! చిరాయువంద్య! యే
లర! ప్రవరా! విధూ! సతము ప్రార్థన సేతు విశాఖ! రమ్మురా!

పై చంపకమాలలో దాఁగియున్న ఇతర పద్యములు ఈ దిగువ నీయఁబడినవి:

గర్భిత కందము:
హర! ప్రోవరా! స్మరరిపూ!
సురసేవ్య! వృషధ్వ! జాజ! సుస్థిర! సుర ధీ
వర! కావరా! హరిస! ఖా
హిరి తోష! చిరాయువంద్య! యేలర! ప్రవరా!

గర్భిత స్వాగత వృత్తము:
ప్రోవరా! స్మరరిపూ!  సురసేవ్యా!
ధీవరా! వృషపతీ! పరమేశా!
కావరా! హరిస! ఖాహిరి తోషా!
రా! విధూ! సతము ప్రార్థన సేతున్!
[ర న భ గగ గణాలు, 1 - 7 యతిమైత్రి]

గర్భిత తేటగీతి:
స్మరరిపూ! సురసేవ్య! వృషధ్వ! జాజ!
వృషపతీ! పరమేశ! విభిన్న! త్ర్యక్ష!
హరిస! ఖాహిరి తోష! చిరాయువంద్య!
సతము ప్రార్థన సేతు విశాఖ! రమ్ము!



స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



బుధవారం, మే 05, 2021

హరి స్తుతి! [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు!


హరి స్తుతి!
[గర్భకవిత్వము]

కంద గర్భ జలధరమాలా వృత్తము

జలధరమాల:
శ్రీ విశ్వాత్మా మముఁ గని శ్రీశా కావన్
దేవా రారా త్వరితగతిన్ వైకుంఠా
నీవే భారమ్మనియెద నిత్యా చక్రీ
భావాతీతా పర మిడవా దైత్యారీ!
[మ భ స మ - గణాలు, 1 - 9 యతి]

పై జలధరమాలలో దాఁగియున్న కందము ఈ దిగువ నీయఁబడినది:

గర్భిత కందము:
శ్రీ విశ్వాత్మా మముఁ గని
దేవా రారా త్వరితగతిన్ వైకుంఠా
నీవే భారమ్మనియెద
భావాతీతా పర మిడవా దైత్యారీ!



స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



మంగళవారం, మే 04, 2021

పార్వతీ స్తుతి! [గర్భకవిత్వము]

మిత్రులందఱకు నమస్సులు!


పార్వతీ స్తుతి!
[గర్భకవిత్వము]


శ్లోక గర్భ తేటగీతి మఱియు శార్దూలవిక్రీడిత గర్భ సీసము:

సీసము:
శివ! గౌరి! భ్రామరి! శీతశైలతనయా!
        కాత్యాయనీ! యంబికా! దశభుజ!
సతి! మారి! త్ర్యక్షవశా! మృడాని! గిరిజా!
        మాహేశ్వరీశీ! యుమా! హిమసుత!
ప్రభ! ధీర ప్రస్తుత! పాటలావతి! కిరా
        తీ! కౌశికీ! పార్వతీ! యచలజ!
స్తుతి! వైరి ప్రేతి! విశుద్ధచేతనపరా!
        బర్హిధ్వజా! సుప్రభా! శకాక్షి!
తేటగీతి:
నీలలోహిత! గాంధర్వి! నీరజాక్షి!
ప్రియ ప్రదా! మాత! ఖచరి! దేవేశి! సింహ
యాన! హర ప్రియా! శాంభవీ! యమున! చండి!
శాంకరీ! మేనకాత్మజా! జయము! జయము!

పై సీసము తేటగీతులలో దాఁగియున్న యితర పద్యములు ఈ దిగువ ఈయఁబడినవి:

గర్భిత శార్దూలవిక్రీడితము:
గౌరి! భ్రామరి! శీతశైలతనయా! కాత్యాయనీ! యంబికా!
మారి! త్ర్యక్షవశా! మృడాని! గిరిజా! మాహేశ్వరీశీ! యుమా!
ధీర ప్రస్తుత! పాటలావతి! కిరాతీ! కౌశికీ! పార్వతీ!
వైరి ప్రేతి! విశుద్ధచేతనపరా! బర్హిధ్వజా! సుప్రభా!

గర్భిత శ్లోకము:
నీలలోహిత! గాంధర్వి!
నీరజాక్షి! ప్రియ ప్రదా!
మాత! ఖచరి! దేవేశి!
సింహయాన! హర ప్రియా!



స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



సోమవారం, మే 03, 2021

లక్ష్మీ స్తుతి! [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు!


లక్ష్మీ స్తుతి!
[గర్భకవిత్వము]



ఆటవెలఁది గర్భ తేటగీతి మఱియు ద్విపద, మత్తకోకిలా గర్భ సీసము

సీసము:
క్షీరసాగరపుత్రి! శ్రీద! విశిష్ట! శ్రీ!
        కమలాసనా! పద్మ! కంజహస్త!
సారసాక్షి! త్రిలోక సన్నుత! సారసా
        నన! పార్థివీ! కరుణామనస్వి!
మారమాత! మనోజ్ఞ! మాధవి! మాన్య! భా
        గ్యవివర్ధినీ! నళినాయతాక్షి!
దూర దైన్య విశేష! దూషితదోష! శౌ
        రి హృదిస్థితా! సురబృంద వంద్య!
తేటగీతి:
ధరణి మనుజులకును వరమరయ నిడుచు,
ననిశ మరసికొనుచు, హర్షమమర నిడుచు,
హరియురస్థితవయి, స్థిరతరగ వెలుఁగు,
జనని! కమల! లక్ష్మి! శరణు శరణు నీకు!

పై సీసపద్యములొ దాఁగియున్న ఇతర పద్యములు ఈ క్రింద జూపఁబడుచున్నవి:

గర్భిత మత్తకోకిల:
క్షీరసాగరపుత్రి! శ్రీద! విశిష్ట! శ్రీ! కమలాసనా!
సారసాక్షి! త్రిలోక సన్నుత! సారసానన! పార్థివీ!
మారమాత! మనోజ్ఞ! మాధవి! మాన్య! భాగ్యవివర్ధినీ!
దూర దైన్య విశేష! దూషితదోష! శౌరి హృదిస్థితా!

గర్భిత ద్విపద:
క్షీరసాగరపుత్రి! శ్రీద! విశిష్ట!
సారసాక్షి! త్రిలోక సన్నుత సార!
మారమాత! మనోజ్ఞ! మాధవి! మాన్య!
దూర దైన్య విశేష! దూషితదోష!

గర్భిత ఆటవెలఁది:
ధరణి మనుజులకును వరమరయ నిడుచు,
ననిశ మరసికొనుచు, హర్షమమర
హరియురస్థితవయి, స్థిరతరగ వెలుఁగు
జనని! కమల! లక్ష్మి! శరణు శరణు!



స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



శ్రీ మహావిష్ణు స్తుతి! [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు!


శ్రీ మహావిష్ణు స్తుతి!

[గర్భకవిత్వము]


ద్విపద గర్భ స్రగ్విణీ వృత్తము


స్రగ్విణి:
శ్రీహరీ! రావయా! చిక్కులం బాపయా!
దేహమందున్ హరీ! తేజమున్ నింపయా!
మోహమున్ గూల్చియున్, మోక్షమందింపయా!
దాహమున్ దీర్చి, సత్త్వమ్ము నందింపయా!

[స్రగ్విణి లక్షణము: ర ర ర ర గణములు, యతిమైత్రి: 1 - 7, ప్రాస: ఉండును]

పై స్రగ్విణీ వృత్తములో దాగియున్న మరో పద్యము ఈ క్రింద ఈయబడినది:

గర్భిత ద్విపద:
శ్రీహరీ! రావయా! చిక్కులం బాప!
దేహమందున్ హరీ! తేజమున్ నింప!
మోహమున్ గూల్చియున్, మోక్షమందింప!
దాహమున్ దీర్చి, సత్త్వమ్ము నందింప!


స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు



ఆదివారం, మే 02, 2021

శ్రీ శివస్తుతి [గర్భకవిత్వము]

 మిత్రులందఱకు నమస్సులు


శ్రీ శివస్తుతి
[గర్భకవిత్వము]

కందగర్భ ప్రమితాక్షర వృత్తము



ప్రమితాక్షరవృత్తము:
పురభిత్! పినాకి! నతభూప! రహిన్
స్థిరమౌ హృదిన్, భపతిశీర్ష! హరా!
విరచించు భక్తిఁ గొని, వే, పరమే
శ్వర! నా శ్రమమ్ముఁ ద్వరఁ బాపఁ గదే!
[ప్రమితాక్షర వృత్తలక్షణము: స జ స స గణములు. యతి: 1 - 9, ప్రాస: ఉండును]

పై ప్రమితాక్షర వృత్తములో దాగివున్న కందపద్యము:

గర్భిత కందము:
పురభిత్! పినాకి! నతభూ
ప! రహిన్ స్థిరమౌ హృదిన్, భపతిశీర్ష! హరా!
విరచించు భక్తిఁ గొని, వే,
పరమేశ్వర! నా శ్రమమ్ముఁ ద్వరఁ బాపఁ గదే!


స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు