మిత్రులందఱకు నమస్సులు!
లక్ష్మీ స్తుతి!
[గర్భకవిత్వము]
ఆటవెలఁది గర్భ తేటగీతి మఱియు ద్విపద, మత్తకోకిలా గర్భ సీసము
సీసము:
క్షీరసాగరపుత్రి! శ్రీద! విశిష్ట! శ్రీ!
కమలాసనా! పద్మ! కంజహస్త!
సారసాక్షి! త్రిలోక సన్నుత! సారసా
నన! పార్థివీ! కరుణామనస్వి!
మారమాత! మనోజ్ఞ! మాధవి! మాన్య! భా
గ్యవివర్ధినీ! నళినాయతాక్షి!
దూర దైన్య విశేష! దూషితదోష! శౌ
రి హృదిస్థితా! సురబృంద వంద్య!
తేటగీతి:
ధరణి మనుజులకును వరమరయ నిడుచు,
ననిశ మరసికొనుచు, హర్షమమర నిడుచు,
హరియురస్థితవయి, స్థిరతరగ వెలుఁగు,
జనని! కమల! లక్ష్మి! శరణు శరణు నీకు!
పై సీసపద్యములొ దాఁగియున్న ఇతర పద్యములు ఈ క్రింద జూపఁబడుచున్నవి:
గర్భిత మత్తకోకిల:
క్షీరసాగరపుత్రి! శ్రీద! విశిష్ట! శ్రీ! కమలాసనా!
సారసాక్షి! త్రిలోక సన్నుత! సారసానన! పార్థివీ!
మారమాత! మనోజ్ఞ! మాధవి! మాన్య! భాగ్యవివర్ధినీ!
దూర దైన్య విశేష! దూషితదోష! శౌరి హృదిస్థితా!
గర్భిత ద్విపద:
క్షీరసాగరపుత్రి! శ్రీద! విశిష్ట!
సారసాక్షి! త్రిలోక సన్నుత సార!
మారమాత! మనోజ్ఞ! మాధవి! మాన్య!
దూర దైన్య విశేష! దూషితదోష!
గర్భిత ఆటవెలఁది:
ధరణి మనుజులకును వరమరయ నిడుచు,
ననిశ మరసికొనుచు, హర్షమమర
హరియురస్థితవయి, స్థిరతరగ వెలుఁగు
జనని! కమల! లక్ష్మి! శరణు శరణు!
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి