మిత్రులందఱకు నమస్సులు!
కేశవ స్తుతి!
[గర్భకవిత్వము]
సీ.
శ్రీవర! కేశవ! ప్రియవశీకర! శ్రీధృ
త! ప్రీతి పోషకా! తార్క్ష్యరథుఁడ!
ప్రోవర రక్షకా! పురుష పూజ్య! రసాధి
ప! ప్రోక్త గీతభాక్! ప్రాణ ప్రదుఁడ!
దేవర! చక్రి! ధీస్థిత! విధీ! హరి! పావ
న! శ్రేయస వ్యయా! నవ్యపథుఁడ!
కావర మోక్షదా! ఘన సుఖాంతర! హృద్వ
ర గ్రాహ్యభాషితా! క్రాంతి విదుఁడ!
గీ.
జన విపక్షక! శేషి! శశ్వత్కటాక్ష!
యనయ దక్షక! కేశ! వాబ్జాయతాక్ష!
దనుజ శిక్షక! శార్ఙ్గి! దంతావళాక్ష!
మనుజ రక్షక! వైరి మర్మాంతరీక్ష!
పై సీసములో దాఁగియున్న యితర పద్యము లీ దిగువ నీయఁబడినవి:
1. గర్భిత ఉత్పలమాల:
శ్రీవర! కేశవా! ప్రియవశీకర! శ్రీధృత! ప్రీతి పోషకా!
ప్రోవర రక్షకా! పురుష పూజ్య! రసాధిప! ప్రోక్త గీతభాక్!
దేవర! చక్రి! ధీస్థిత! విధీ! హరి! పావన! శ్రేయస వ్యయా!
కావర! మోక్షదా! ఘన సుఖాంతర! హృద్వర గ్రాహ్యభాషితా!
2. గర్భిత తేటగీతి:
ప్రియవశీకర! శ్రీధృత! ప్రీతి పోష!
పురుష పూజ్య! రసాధిప! ప్రోక్త గీత!
స్థిత విధీ! హరి! పావన శ్రేయ సవ్య!
ఘన సుఖాంతర! హృద్వర గ్రాహ్యభాషి!
3. గర్భిత ప్రథమ కందము:
వర! కేశవ! ప్రియవశీ
కర! శ్రీధృత! ప్రీతి పోషకా! తార్క్ష్యరథా!
వర రక్షకా! పురుష పూ
జ్య! రసాధిప! ప్రోక్త గీతభాక్! ప్రాణ ప్రదా!
4. గర్భిత ద్వితీయ కందము:
వర చక్రి! ధీస్థిత! విధీ!
హరి! పావన! శ్రేయసవ్యయా! నవ్యపథా!
వర మోక్షదా! ఘన సుఖాం
తర! హృద్వర గ్రాహ్యభాషితా! క్రాంతి విదా!
5. గర్భిత ద్విపద:
జన విపక్షక! శేషి! శశ్వత్కటాక్ష!
యనయ దక్షక! కేశ! వాబ్జాయతాక్ష!
దనుజ శిక్షక! శార్ఙ్గి! దంతావళాక్ష!
మనుజ రక్షక! వైరి మర్మాంతరీక్ష!
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి