Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, మే 01, 2021

శ్రీరామ స్తుతి! (గర్భ కవిత్వము)

 మిత్రులందఱకు నమస్సులు!



శ్రీరామ స్తుతి!
(గర్భ కవిత్వము)

మత్తేభవిక్రీడిత కంద గర్భ సీసము

సీ.
సుజనవంద్యుండ! యశోవిరాజితమనః
     శ్రద్ధాంతరంగుండ!  సాధుగుణుఁడ!
సవనకార్యుండ! లసన్మనోహర ఘనా
     భస్తీర్వియుక్తుండ! పాథికులుఁడ!
సవనరక్షాత్ముఁడ! శాంతరూపుఁడ! శివే
     ష్వాసచ్ఛిదుండా! ప్రజావనుండ!
భువనవిశ్రాణన భూజతుల్యుఁడ! ధను
     ష్పాణి! క్రమోద్యద్యశావహుండ!
గీ.
శిలను వనితగా మార్చిన లలిత పదుఁడ!
కమ్ర వాగ్విలసితుఁడ! రక్షః ఖలబల
ములఁ దునిమిన మాంసల! యిమ్ము బలధనశుభ
యశములను నెపుడున్ సత్వరాగమమున!

పై సీసపద్యంలోనూ మఱియు తేటగీతిలోనూ ఇమిడివున్న ఇతర పద్యాలు ఈ క్రింద చూపబడుతున్నాయి: 

గర్భిత మత్తేభవిక్రీడితము:
జనవంద్యుండ! యశోవిరాజితమనః శ్రద్ధాంతరంగుండ! సా
వన కార్యుండ! లసన్మనోహరఘనాభస్తీర్వియుక్తుండ! పా
వనరక్షాత్ముఁడ! శాంతరూపుఁడ! శివేష్వాసచ్ఛిదుండా! బ్రజా
వనవిశ్రాణన భూజతుల్యుఁడ! ధనుష్పాణి! క్రమోద్యద్యశా!

గర్భిత కందము:
శిలను వనితగా మార్చిన
లలిత పదుఁడ! కమ్ర వాగ్విలసితుఁడ! రక్షః
ఖలబలముల దునిమిన మాం
సల! యిమ్ము బలధనశుభయశములను నెపుడున్!

స్వస్తి

’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు




2 కామెంట్‌లు: