Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జనవరి 12, 2018

మహామహోపాధ్యాయుఁడు - కోలాచల మల్లినాథ సూరి!


image of kolachala mallinatha suri కోసం చిత్ర ఫలితం

కం.

ఘన కాళిదాస కవి మన
సును నెఱిఁగియు వ్యాఖ్య వ్రాసి సుకవి బిరుదుచే
ఘనుఁడౌ కోలాచల మ
ల్లినాథ సూరిన్ నుతింతుఁ బ్రీతిఁ గవితలన్!


తే.గీ.
కాళిదాస భారవి మాఘ కవుల ఘనత
కుద్దియైన శ్రీహర్షునిఁ గూడ తనదు
వ్యాఖ్యచేతను దెలుఁగుల హర్షితులుగఁ
జేసి మల్లినాథుఁడు వెల్గె స్థిరముగాను!


కం.

సఖ్యతఁ దెలుంగు సంస్కృత
ప్రఖ్యాత కవీంద్ర శాస్త్ర పండితుఁడయ్యున్
వ్యాఖ్యాతృ శిరోమణిగా
విఖ్యాతిం గొని వెలింగె విశ్వమునందున్!


తే.గీ.
మహామహోపాధ్యాయ ధీమతుఁ డిలఁ
గాళిదాసాది సుకవుల గరిమఁ దెలుప
మున్ను పంచమహాకావ్యములకుఁ దాను
వ్యాఖ్యలను వ్రాసి ప్రాచుర్యపఱచె భువిని!


తే.గీ.
మెతుకు సీమను వెలసియు బ్రతుకునకును
సార్థకతఁ బెంచు సాహిత్య సంస్కృతు లిడి
పఱఁగ విద్యార్థి లోకమ్ము పఠన సేయ,
వ్యాఖ్య లందించి, చిరజీవియై నిలిచెను!


తే.గీ.
కావ్యసౌందర్యమునకు వికసనము నిడి,
రసము చిప్పిల్ల, శయ్యయు రమ్యతఁ గొన,
శ్లోక పద వాక్య సుగతార్థ లోకనుఁడయి
వ్యాఖ్య విరచించె ధీశక్తి పరిఢవిలఁగ!


కం.

మును పెందఱు వ్యాఖ్యాతలు
ఘనముగ వ్యాఖ్యానములనుఁ గావించిననున్
దన వ్యాఖ్యానముచేతను
జన మన మలరార నిల్చె సంస్కృత జగతిన్!


ఆ.వె.
ప్రాఁత పద్ధతులను వదలి, కొంగ్రొత్తవౌ
పద్ధతులను గొనియు వ్రాసె వ్యాఖ్య!
కావ్య సంస్థిత వరకవి హృదయావిష్కృ
తంపు వ్యాఖ్య నిడియు ధన్యుఁ డాయె!


ఆ.వె.
అన్వయమ్ము తోడ, ననపేక్షిత మమూల
విషయ మిడక, తనదు విద్య వెలుఁగ,
సంస్కృతజ్ఞులంత సంతృప్తి పడునట్లు
వ్యాఖ్య వ్రాసి, తాను వఱలె భువిని!


తే.గీ.
పూర్వ వ్యాఖ్యాతృ పాండితీ పూర్ణములగు
వ్యాఖ్యలను వీడి, తనదైన వ్యాఖ్యఁ గొనియు,
బాలకులు సులభమ్ముగఁ బఠన సేయఁ
గలుగు రీతిని విరచించె ఘనతరముగ!


ఆ.వె.
కాకతీయ రాజ్య ఘనవైభవోపేత
భూషితుఁడయి, రాజ పోషణమునఁ
దళుకు లీనఁగా, శతావధానియు నయ్యు,
తనదు ప్రతిభఁ జాటె ధరణిలోన!


తే.గీ.
మందబుద్ధులకును వ్యాఖ్య మహితముగను
నర్థమగు రీతి వ్రాసియు, నవని కెపుడు
శ్రేయమునుఁ గూర్పఁగాను సంజీవనిగను;
సహృదయోల్లాస మిడఁగ రచనము సేసె!


కం.

ఈ రీతిని వ్యాఖ్యానము
సారించియు బాలకులను సంస్కృతమునఁ దాఁ
గోరియుఁ జదువఁగఁ జేసియు
మీఱిన యా మల్లినాథు మెత్తు మనమునన్!




స్వస్తి


4 కామెంట్‌లు:

  1. ఎనిమిదవ పద్యమునందు కొంగ్రొత్త వౌ సంధి లేదు కదా గురుదేవా 🙏🌹🙏సవరించప్రార్థన🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  2. ఎనిమిదవ పద్యమునందు కొంగ్రొత్త వౌ సంధి లేదు కదా గురుదేవా 🙏🌹🙏సవరించప్రార్థన🙏🌹🙏

    రిప్లయితొలగించండి
  3. క్రొత్తవి + ఔ ఇచట సంధి లేదు అనియా మీ సందేహము?
    ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు అని కదా సూత్రము! ఇది ఆకృతి గణం కాబట్టి క్రొత్తవి + ఔ అనేచోట నేను క్రొత్తవౌ అని సంధి చేశాను. సంధి చేయనిచో... క్రొత్తవియౌ అని మరో రూపం వస్తుంది. పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  4. గురుదేవా ప్రతీ పద్యమూ ఆణిముత్యమే

    రిప్లయితొలగించండి