Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, ఏప్రిల్ 14, 2018

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్




తేటగీతులు:
భరత రాజ్యాంగ నిర్మాత, పండితుండు,
న్యాయవాది, ముఖ్య దళిత నాయకుండు,
బౌద్ధధర్మోద్ధరణకర్త, బౌద్ధుఁడు, తొలి
న్యాయశాఖాసచివుఁడు, మహామనీషి,
వినుత భీమరావ్ రాంజి యంబేడ్కరుండు!

తండ్రి క్రమశిక్షణము నిడ, ధర్మములను,
భరత రామాయణమ్ముల బాల్యమందె
చదివి, జ్ఞానసంపాదనఁ జాలఁగఁ గొని,
తాను విద్వాంసులందు విద్వాంసుఁడాయె!

బాల్యమున, నంటరానట్టివాఁడని తన
తోడి విద్యార్థు లందఱు కోడిగించి,
నీరు త్రాగకుండఁగ వేగ నెట్టివేయ,
నెంతయో పరాభవమంది చింతఁబూనె!

దళితుఁ డన్నట్టివారల దర్పమణచ,
నున్నతపువిద్య నేర్చియు నున్నతుఁడయి,
వారి చేతనే గౌరవింపంగఁబడియు,
మన్ననల నందవలెనని మదినిఁ దలఁచె!

కృషి వహించి యున్నతవిద్యఁ బ్రియముతోడ
నేరిచియు బరోడారాజ నియమితమగు
వేతనముతోడఁ బట్టమ్ము నాతఁడు గొని,
యా బరోడా స్థితాప్త నియామమందె!

నాఁటి కులతత్త్వవాదులందంగఁజేయు
బాధలను గని, తప్తుఁడై, బ్రాహ్మణాది
యగ్రకులజులకన్నను నధికమైన
ధర్మశాస్త్రోక్త సంభూతిఁ దనిసె నతఁడు!

భరత జాతీయ కాంగ్రెసుఁ బఱఁగఁ జేరి,
గాంధి సరసనఁ జేరియు, ఘనతనంద
నా సమాజ సముద్ధరణమ్ముఁ జేయ
నడుము కట్టి ముందుకు సాగె నప్పుడతఁడు!

భరత రాజ్యాంగ నిర్మాతృ వాహకుఁడయి
గొప్ప రాజ్యాంగ మిచ్చియు, గురుతరమగు
స్థానమంది వెలింగెను సన్నుతుఁడయి;
యతని కంజలింతును నేఁడు హర్షమునను!

స్వస్తి


10 కామెంట్‌లు:

  1. అంబేద్కర్ చరిత్రను మహత్తరమైన పద్య ఖండికగా మలిచారు. నిర్మాతృ లాంటి పద ప్రయోగాలు మీకే చెల్లుతాయి. అభినందనలు మధురకవి గారూ!

    రిప్లయితొలగించండి
  2. సుకవి మిత్రులు గుండు మధుసూదన్ గారికి నమస్సులు. పద్యాలు చాలా బాగున్నాయి.

    రిప్లయితొలగించండి