Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మార్చి 12, 2018

వరంగల్ అష్టావధానం (పోతన ఆడిటోరియంలో)

అవధాని శ్రీ ముత్యంపేఁట గౌరీశంకర శర్మ గారు

అవధాని శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

 
అవధానులు, సమన్వయకర్త, పృచ్ఛకులు అవధాన సభలో ఉన్నప్పటి ఛాయాచిత్రం

సమన్వయకర్త శ్రీ గన్నమరాజు గిరిజా మనోహర బాబు గారు అవధానసభను ప్రారంభించినప్పటి ఛాయాచిత్రం

అవధానులను సన్మాన పత్ర పఠనచే సన్మానించినప్పటి ఛాయాచిత్రం


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

వరంగల్ (పట్టణ) జిల్లాలోని 
పోతన విజ్ఞాన పీఠము యొక్క 
31వ వార్షికోత్సవాల సందర్భంగా, 
దివి: 11-03-2018 ఆదివారం సాయంత్రం గం.06-00 లకు 
పోతన ఆడిటోరియంలో జరిగిన 
జంటకవుల అష్టావధానం 
విశేషాలు...

అవధానులు: 
శ్రీ ముత్యంపేట గౌరీశంకర శర్మ గారు
మఱియు
శ్రీ ముదిగొండ అమరనాథ శర్మ గారు

సంచాలకులు:
శ్రీ గన్నమరాజు గిరిజా మనోహరబాబు గారు

అవధానుల దేవతాప్రార్థనాదికాలు పూర్తయిన తర్వాత జరిగిన అవధాన కార్యక్రమం:

1. నిషిద్ధాక్షరి:
శ్రీ కంది శంకరయ్య గారు...
వరంగల్ పట్టణానికే తలమానికమైనవాఁడు, సంస్కృతాంధ్ర పండితుఁడు, సభాసమ్రాట్టు, విశిష్ట అష్టావధాని,  స్వర్గీయ డా. ఇందారపు కిషన్ రావు గారి అవధాన వైభవాన్ని వర్ణించమనగా....

శ్రీ (య) మ (త) య (ను)వే (ద) షా | భూ (ష) తిన్
(మ) కామ | న (వ) ర (హ) ంజి (ల్ల) ంప (న) జే (య)సి క (వ) ల్గి (ప) ంచ (మ) య్యా

గమనిక:-  (...) = నిషేధితాక్షరం, (|) = నిషేధించకుండా వదలడం

రెండు పాదాల వఱకు నిషిద్ధం జరిగినది. దీనికి మరి రెండు పాదాలు చేర్చి...

కం.
శ్రీ మయ వేషా భూతిన్
కామన రంజింపఁ జేసి కల్గించయ్యా
ప్రేమన్ గవితల నిచ్చుచు
మా మనములు నిండ కిషను మాన్యా గోష్ఠిన్!

అని పూర్తి చేశారు.

2. సమస్యాపూరణం:
శ్రీ గుండు మధుసూదన్ గారు...

"శీతమయూఖుఁడే సెగలఁ జిమ్మెను లోకము తల్లడిల్లఁగన్" అనే సమస్యను ఈయగా....

పూరణ:
ఉ.
పూత చరిత్రముం గలిగి, పూర్ణయశస్సునుఁ గాంచినట్టి వి
ద్యాతత సాధుమూర్తి; సుగుణాన్విత దివ్య దిగంత కీర్తి, వి
ఖ్యాతుఁడు రామచంద్రు ప్రియకాంత వియోగ విదగ్ధ వేళలో
శీతమయూఖుఁడే సెగలఁ జిమ్మెను లోకము తల్లడిల్లఁగన్!

అని పూరించారు.

3. వర్ణన (సంస్కృతం):
శ్రీ గోగికార్ ప్రకాశ్ గారు కాకతీయ యుగ ప్రసిద్ధ గ్రంథ/కవి విశేషాలను వర్ణించుమని సంస్కృతంలో అడుగగా...

వసంతతిలకావృత్తం:
శ్రీకాకతీయ వర దివ్య విశేష దేశే
విద్యాధినాథ బహు గ్రంథ విశిష్ట సేవాం|
ప్రాతాపరుద్ర వర కావ్య ప్రశస్త శైలీం
వందామహే ప్రతిదినం చ మహత్త్వయోగాత్||

అని వర్ణించారు.

4. దత్తపది:
శ్రీ చేపూరి శ్రీరామారావు గారు...
చెప్పు - చీపురు - చేట - పేడ ....అనే పదాలనిచ్చి,
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని పెద్దనకు చేసిన సన్మానాన్ని
ఇష్టమైన వృత్తంలో వర్ణించమనగా....

చం.
"సిరులనుఁ గూర్చు కావ్యమును చెప్పుమ పెద్దన! గొప్పగా, శుచీ
పురులకు వందనం బిడుచు, బుద్ధికిఁ దోచిన యూహఁ జేయుచున్,
స్థిరతనుఁ గూర్చు శబ్దముల చేటవకుండఁగ, శాశ్వతమ్ము శ్రీ
కరముగ!" నంచు రాయలు సుఖంబుగఁ బేడలఁ జేసె సత్కృతిన్!

[పేడ = మంజూష, పెద్దపెట్టె] [పేడలన్=పెద్ద పెద్ద పెట్టెల నిండుగా గల రత్న రాశులతో]
అని వర్ణించారు.

5. తెలుగు పద్యానికి సంస్కృత శ్లోకం:
శ్రీ వజ్ఝల రంగాచార్య గారు...

(౧) ఆ.వె.
వ్రేళ్ళు మడచి యొక్క వేలెత్తి చూపఁగా
వేంకటేశ విభుఁడె వేలుపనుచు,
కలియుగమ్మునందు కామందు గోవిందు
చరణ రజముఁ గొలుతు శిరమునందు!

....అనే పద్యాన్ని ఈయగా...

అనుష్టుప్ ఛందము:
బద్ధ్వాఙ్గుళీం ప్రవక్ష్యామి - వేఙ్కటేశస్య వైభవమ్ |
కలౌ యుగేశ గోవిన్దమ్ - వ్రజామి చరణౌ తవ ||

అనీ.....

(౨) ఆ.వె.
ఱెప్పల వల వేసి రేయంత వెదకితి
చిక్కదౌర మీన మొక్కసారి!
అంతరంగ జలధి యందెక్కడో యుండె
మిణుకు మిణుకు మనెడి మీను రూపు!!

....అనే పద్యాన్ని ఈయగా...

అనుష్టుప్ ఛందము:
పక్ష్మజాలం సమాచ్ఛాద్యా - రాత్రౌ సంశోధనం కృతమ్ |
తథాఽపి లభతే నైవ - మీన మేకం తు మానసే ||

అనీ చెప్పారు.

6. ఆశువు:
శ్రీ ఎన్.వీ.ఎన్. చారి గారు...
త్రేతాయుగంలో వానర భోజనంలాగా, ఈనాటి భోజన సమయాల్లో ఏర్పాటు చేసే "బఫే భోజనాన్ని" వర్ణించమనగా....

(౧) ఆ.వె.
ఒకఁడు సెల్లుఁ జూచు నుత్సాహ మొప్పఁగ;
నొకఁడు సొల్లు వాగు నోర్వలేక;
యొకఁడు తినుచు వాని నూరక చూచును;
బహుళ చేష్ట లివియె బఫెల యందు!

అని వర్ణించారు.

మఱల వారే...
అవధాన సభలో స్త్రీలు పురుషులుగానూ, పురుషులు స్త్రీలుగానూ మారఁగా నీ యవధాన సభ యెటులుండునో వర్ణించఁగలరు....అనగా...

(౨) కం.
వీరయినను, వారయినను
వే ఱేమియు లేక కైత పేర్మిన్ గ్రోలన్
చీరలు ఱవికలె యైనను
సార మదొక్కటియె కాదె సాహిత్యరుచిన్!

...అని చెప్పారు.

7. అంత్యాక్షరి:
శ్రీ కుందావజ్ఝల కృష్ణమూర్తి గారు...

(౧)
"అగసుత భావనాబల సమంచితమై, మృదు వాగ్విలాసమై,
నిగమపికాంగనారవవినిర్గత తాళలయావధానమై,
సుగమ ముదాత్త భావనల శోభనమై, రస మండితమ్ముగన్
సొగసుల ’పద్యమై’ త్రిపురసుందరి మాకుఁ బ్రసన్నమయ్యెడిన్"

అనే పద్యాన్ని పఠింపగా, అంత్యాక్షరమైన "నకారం"తో మొదలుపెట్టి...

అనుష్టుప్ ఛందస్సు:
నానా కవి సమాకీర్ణాం - సభాం దృష్ట్వా చ నిత్యశః |
నౌమి సారస్వతాకారాం - కాకతీయపురే శుభే ||

అని చెప్పారు.

(౨)
"అవలీలన్ రసభావముల్ పలుక పద్యమ్మై, మహాకావ్యమై,
వివిధాలంకృత శిల్పశక్తి చయమై, విద్యా ప్రధానంబునై,
చవులూరించు ధ్వనిప్రచోదక మహాశాస్త్రమ్మునై, స్ఫూర్తియై,
కవితారూపిణివౌచు నిల్చితె! వరంగల్ పాలికా! కాళికా!"

అనే పద్యాన్ని పఠింపగా, అంత్యాక్షరమైన "క కారం" తో మొదలుపెట్టి...

అనుష్టుప్ ఛందస్సు:
కార్యార్థదాయినీం వన్దే - కాళికాం పుర పాలికాం |
శత్రు సంహారిణీం నిత్యం - రససిద్ధి ప్రదాయినీమ్ ||

అని చెప్పారు.

8. అప్రస్తుత ప్రసంగం:
శ్రీ నాగిళ్ళ రామశాస్త్రి గారు వివిధములైన అప్రస్తుత ప్రసంగములు చేయగా, అవధానులు చమత్కారంగా సమాధానాలిచ్చి సభను రంజింపజేశారు.

చివరకు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ నమిలికొండ బాలకిషన్ రావు గారు జంట అవధానులను సన్మానించడంతో ఈ నాటి కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

స్వస్తి
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

1 కామెంట్‌: