సురనర్తకీ/తరంగక వృత్తము(షట్పాది):
ఇందిరా రమణ సోదరీ! హిమజ! ♦ హిండి! చండి! ఖల శోషిణీ!
నందయంతి! గిరిజా! మదోత్కట! మ♦నస్వినీ! దనుజ నాశినీ!
నందితాఖిల సురేంద్ర ముఖ్య! కరు♦ణాంతరంగ! వరదాయినీ!
కందుకాభ పరిపంథి శీర్ష కర ♦ ఖండితోగ్ర! మృగవాహినీ!
వందితోరుతర భూజనాళి నత ♦ భక్తిమస్త! నగనందినీ!
మందయాన! పరమార్థ దాయిని! న♦మః సతీ! మహిష మర్దినీ!
సీ. ఓంకార రూపిణీ! ♦ యోగీశ తోషిణీ! - దివిజ సంస్తుత గాత్రి! ♦ త్రిపుర హంత్రి!
ఐంకార రూపిణీ! ♦ ఆనంద పోషణీ! - షడ్భుజాయుధ ధాత్రి! ♦ శైల పుత్రి!
హ్రీంకార రూపిణీ! ♦ త్రిపథ సంచారిణీ! - సర్వార్థ దాత్రి! ప్ర♦శస్త గాత్రి!
శ్రీంకార రూపిణీ! ♦ శ్రితజన కళ్యాణి! - దనుజ నాశన కర్త్రి! ♦ తరళ నేత్రి!
గీ. సర్వ మంత్రాత్మికా! కృపా ♦ శరధి! మాత! - సర్వ యంత్రాత్మికా! సర్వ ♦ శక్తిదాత!
సర్వ తంత్రాత్మికా! మహై♦శ్వర్య మహిత! - సర్వ లోకేశ్వరీ! తల్లి! ♦ సన్నుతు లివె!!
లక్ష్మీస్తుతి
మేఘవిస్ఫూర్జిత వృత్తము:
రమా! లక్ష్మీ! క్షీరాబ్ధ్యధిపతిసుతా! ♦ రమ్య! సంస్తుత్య వంద్యా!
నమో దేవీ! సంపత్ప్రద! సుచరితా! ♦ నన్ గటాక్షించు మాతా!
సమీక్షింతున్ పద్మాసన! సువదనా! ♦ సత్యమౌ నాదు భక్తిన్!
క్రమమ్మీవున్ సంపత్కరివి యవుటన్ ♦ గాంక్షితమ్మీవె తల్లీ!!
సరస్వతీ స్తుతి
కం. విద్యాధినేత్రి! మాతా! - సద్యః స్ఫురణ ప్రదాత్రి! ♦ శారద! వాణీ!
మద్యోగ్య పద్య ధాత్రీ! - మాద్య న్మంగళ సుగాత్రి! ♦ మాన్య!నమస్తే!
తే.గీ. సకల విద్యాప్రదాత్రి! వి♦శాలనేత్రి! - భ్రమరనీలవేణి స్వచ్ఛ♦వర్ణధాత్రి!
బ్రహ్మమానస సత్పుత్రి! ♦ స్వర సుగాత్రి! - బ్రాహ్మి! భగవతి! వరద! భా♦రతి నమోఽస్తు!
త్రిమాతృ స్తుతి
శా. చేతన్ వీణ ధరించి, విద్యలొసఁగన్ ♦ శ్రీ వాణివై నిల్చి, స
చ్చేతోమోద విశేష సంపద లిడన్ ♦ శ్రీ లక్ష్మివై నిల్చి, యా
చేతోఽoశుల్ మొఱ వెట్ట; శక్తి నిడఁగన్ ♦ శ్రీ గౌరివై నిల్చి, స
చ్చైతన్య మ్మిడి, యో త్రిదేవి! యిట వి♦శ్వమ్మున్ దగన్ బ్రోవుమా!!
కం. వాణీ! వీణా పాణీ! - పాణి స్థిత సకల విభవ ♦ భాస్వ ల్లక్ష్మీ
ప్రాణేశార్ధాజిర శ-ర్వాణీ! ధీ బల ధనాఢ్య! ♦ వరదాయి! భజే!!
ఉ. అమ్మ! మనమ్మునందు నిను ♦ నండగ నమ్మితి! నమ్ము మమ్మ! మో
హమ్ముఁ బెకల్చి, సన్మనము ♦ నందఁగ నిచ్చి, హృదంతరమ్ము శాం
తమ్మున నోలలార్చి, సత♦తమ్ము దయారస మిమ్ముఁ గూర్చి, నా
కిమ్మహి జన్మ దున్మి, యిఁకఁ ♦ గేవల సద్గతి నిమ్మ! యమ్మరో!!
స్వస్తి
నా యితర బ్లాగులను వీక్షించడానికి క్లిక్ చేయండి:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి