బ్లాగు మిత్రులకు, సుకవి మిత్రులకు, వీక్షకులకు
శ్రీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు!!
ఆ.వె.
సకల దేవతాళి సంస్తుతించుచునుండఁ
జేరి పార్వతియును, జిఱునగవుల
శివుఁడు తనదు భస్మసింహాసనమ్మునఁ
గొలువు దీఱఁ, బతినిఁ గోరెనిట్లు! (1)
ఆ.వె.
“స్వామి! స్త్రీలు సకల సౌఖ్యసౌభాగ్యముల్,
పుత్రపౌత్రవృద్ధిఁ బొందునట్టి
వ్రత మొకండుఁ దెలిపి, వ్రతవిధానమ్మును
జెప్పుమయ్య నాకుఁ జిత్త మలర!” (2)
కం.
సతి కోరఁగ విని, శివుఁడును
హిత మిత వాక్యముల ననియె, “హే పార్వతి! నీ
వతి వినయమునను గోరితి;
కుతూహల మ్మెసఁగ వినుము కోరిక తీఱన్! (3)
తే.గీ.
మగధదేశానఁ గుండిన మనెడి పట్ట
ణమున నొక ద్విజ, ‘చారుమతి’, మతి దధిజ,
పద్మ పదపద్మ సక్త సద్భక్తి హృదయ,
ఘన పతివ్రత, సద్వంద్య కలదు; వినుము! (4)
కం.
ఒకనాఁడు స్వప్నమందున
సకల ధనము లొసఁగు తల్లి, సాక్షా ద్రమయే
ప్రకటిత మాయెను సరగున
వికసిత కరుణా హృదబ్జ విలసితమణియై! (5)
తే.గీ.
“చారుమతి! నన్నుఁ బూజింపు, శ్రావణమునఁ
బౌర్ణమికి ముందునన్ శుక్రవారమందు!
సకల సౌభాగ్య సంతాన సౌఖ్యతతులఁ
గూర్చుదానను నమ్ముమో గుణవిశాల!” (6)
ఆ.వె.
అనుచుఁ బలికి మాయమాయె నా మాతయ;
చారుమతియు లేచి, సంతసించి,
“వరము లొసఁగు తల్లి! వరలక్ష్మి! కరుణించి,
మమ్ముఁ బ్రోవు మమ్మ! నెమ్మి నిమ్మ! (7)
కం.
హే మాతా! సంపత్కరి!
శ్రీ! మా! నారాయ ణీంది! సింధుజ! లక్ష్మీ!
నేమమున నిన్నుఁ గొలుతును;
నీ మనమున మమ్ముఁ గరుణ నెసఁగఁగ గనుమా!” (8)
తే.గీ.
అనుచుఁ బరిపరి విధముల వినుతి సేసి,
పతికి, నత్తమామలకును నతివ తెలుప;
సంతసమ్మున విని, వారు సమ్మతించి,
“వ్రతము సలుపంగ వలె” నని పలికి రపుడు! (9)
కం.
ఇది విన్న యూరి సుదతులు
ముదమున మది మెచ్చి యంతఁ బున్నమి మున్నై
యెదురుపడు శుక్రవారము
గదురన్ శ్రావణమునందు ఘనమగు వేడ్కన్! (10)
తే.గీ.
“పద్మకరి! సర్వలోకైకవంద్య! లక్ష్మి!
దేవి! నారాయణప్రి యాబ్ధిజ నమామి”
యనుచు వారలు చారుమతిని గలసియుఁ
జేరి వరలక్ష్మి పూజను జేసి రపుడు. (11)
తే.గీ.
తొలి ప్రదక్షిణచే నందియలును మ్రోగె;
మలి ప్రదక్షిణఁ గంకణములు మెఱసెను;
కడ ప్రదక్షిణ సర్వాంగ ఘటిత భూష
ణ యుతలైరి! సంపదలె యందఱి గృహాల!! (12)
తే.గీ.
పఱఁగ వరలక్ష్మి కరుణించి పడతులకును
సంపదలు ధాన్య సౌఖ్య సత్సంతతులను,
నాయురారోగ్య భోగ్య సన్మాన్యములను
దగఁ బ్రసాదించె! వ్రత ఫలితమ్ము దక్కె!! (13)
కం.
సతి వింటివె యీ కథ! నే
సతి పతు లిది విన్న మఱియుఁ జదివిన, లక్ష్మీ
సతి, తా నొసఁగును సకలము,
లతి శుభముల నిచ్చుఁ గాత మనవరతమ్మున్! (14)
(ఇది శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ)
-:o:శుభం భూయాత్:o:-
మిత్రులారా! "శ్రీ వరలక్ష్మీ వ్రత మాహాత్మ్య కథ"ను
రిప్లయితొలగించండి"ఆంధ్రామృతం"లో శ్రీ చింతా రామకృష్ణారావుగారు ప్రచురించినారు. వారికి నా ధన్యవాదములు...నమస్సులు!
"శంకరాభరణం"లో శ్రీ కంది శంకరయ్యగారు ప్రచురించినారు. వారికి నా ధన్యవాదములు...నమస్సులు!
శంకరాభరణంలో స్పందించి వ్యాఖ్య పెట్టిన మాన్యులకు ధన్యవాదములు. ఆ వ్యాఖ్యలు ఇవి:
డా. విష్ణు నందన్ అన్నారు...
శ్రీ గుండు మధుసూదన్ గారు, వరలక్ష్మీ వ్రత కథ శ్రవణపేయంగా శుభప్రదంగా ఉన్నది, అభినందనలు .
పదునొకండవ పద్యంలో " దేవి! నారాయణప్రి యాబ్ధితనయ! నమ”మనుచు " అన్న చోట ' నమామి - నమస్కరిస్తున్నాను అనే అర్థం రావడం లేదు కదా ( కొండొకచో ' అగ్నయేదం న మమ ' అన్న స్వాహాకారం స్ఫురిస్తున్నది ) కనుక దాన్ని మార్చి దేవి ! నారాయణ ప్రియాబ్ధిజ నమామి! / యనుచు ... అంటే బావుంటుందేమో ఆలోచింపగలరు .
*** *** ***
శ్రీపతిశాస్త్రిగారు అన్నారు...
శ్రీగురుభ్యోనమ:
వరలక్ష్మీ వ్రత మహిమను
సరళముగా వ్రాసినారు సత్కవివర్యా
మురిపించెను మీ కైతలు
మరిమరి నే చదువుచుంటి మధుసూధనునిన్
*** *** ***
డా. విష్ణు నందన్ గారు అన్నారు...
మధుసూదన కృతమీ మృదు
మధురాంధ్ర కవిత్వమౌర ! మాన్యతమమ్మై
బుధ సంస్తుతి పాత్రమ్మై
సుధలొల్కుచుఁ జెల్వు మీరె శోభామయమై !
*** *** ***
కంది శంకరయ్యగారు అన్నారు...
డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు. గుండు మధుసూదన్ గారి అంగీకారంతో మీరు సూచించిన విధంగా సవరించాను.
గుండు వారిని ప్రశంసిస్తూ మీరు వ్రాసిన పద్యం మనోహరంగా ఉంది. మరొక్కమారు ధన్యవాదాలు.
*****
కంది శంకరయ్యగారు అన్నారు...
శ్రీపతి శాస్త్రి గారూ,
ధన్యవాదాలు.
*** *** ***
subbarao గారు అన్నారు...
చందో బధ్ధపు వ్రతకధ
నందముగా వ్రాసితీవు యార్యా! గుండూ!
వందనములునే సేతును
నందుకొ మరి నీవు సామి! యానందముగాన్
(క్షమించండి, ఇంటిపేరుతో సంభోధించినందులకు)
*** *** ***
గుండు మధుసూదన్ అన్నారు...
విద్వత్కవిమిత్రులు డా. విష్ణునందన్ గారూ! నా పద్యములు మీవంటి కవి పండితుల మెప్పుల నందినందుల కెంతయుఁ గృతజ్ఞుఁడను. పద్యమందలి దొసఁగును జూపి సవరణ మందించినందులకు ధన్యవాదములు! దానిని "...’దేవి! నారాయణ ప్రియాబ్ధితనయ! నతి’యనుచు..."నని సవరింప వీలున్నను...తమరి సవరణ మమోఘముగ నున్నందున శ్రీ శంకరయ్యగారికి మీ సవరణమునే సూచింతితిని. ధన్యోఽస్మి!
హృద్యమ్మగు పద్యమ్మున
సద్యశ మిడినట్టి మాన్య! సత్కవి! వైశా
రద్య! ఘన! విష్ణునందన!
మాద్యన్మైత్రీప్రయుక్త! మహనీయ! నతుల్!
*** *** ***
గుండు మధుసూదన్ అన్నారు...
సుకవి మిత్రులు శ్రీపతిశాస్త్రిగారూ! ధన్యవాదములు.
శ్రీపతిశాస్త్రి మహోదయ!
నా పద్యకవిత్వము నిట నచ్చితి ననుచున్
నాపైఁ బద్యము వ్రాసితి
రాపాత మధురము గాఁగఁ! బ్రవచింతు నతుల్!!
*** *** ***
గుండు మధుసూదన్ అన్నారు...
సుకవి మిత్రులు శ్రీ పోచిరాజు సుబ్బారావు గారూ! ధన్యవాదములు.
నా పద్యకవిత మెచ్చియు
నాపైఁ బద్యమ్ము వ్రాసి నను ధన్యునిగన్
దీపింపఁ జేసి ప్రేమను
జూపితిరయ సుబ్బరాయ సుకవీశ నతుల్!
*** *** ***
గుండు మధుసూదన్ అన్నారు...
సుకవి మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారూ! మీ యాదరణము చేతనే నేనీ మెప్పులం బడయఁగల్గితిని. మీకు నా నమోవాకములు...ధన్యవాదములు!
నా కైతఁ బ్రచుర పఱచియు
నాకీ యాదరణ సిద్ధి నందించితి రా
ర్యా! కంది శంకరార్యా!
మీకై నతు లందఁజేతు! మిముఁ గీర్తింతున్!
స్వస్తి.
రాజేశ్వరి నేదునూరి గారు అన్నారు...
రిప్లయితొలగించండినమస్కారములు
సోదరులు శ్రీ గుండు మధుసూధన్ గారు వరలక్ష్మీ వ్రతకధను చక్కగా వివరించి నందులకు ధన్య వాదములు . మాకందించిన గురువులు శ్రీ శంకరయ్యగారికి కృతజ్ఞతలు
sailaja గారు అన్నారు...
రిప్లయితొలగించండిశ్రీ గుండు మధుసూధన్ గారికి నమస్కారములు...వరలక్ష్మీ వ్రతకధను మనోజ్ఞమైన పద్యములుగా వ్రాసారు.. చాలాచాలా బాగున్నాయి ...మీకు, గురువుగారికి కృతజ్ఞతలు...
మంద పీతాంబర్ అన్నారు...
రిప్లయితొలగించండిశ్రీ గుండు మధుసూదన్ గారు నమస్కారము మీరచన ప్రశస్తంగా ఉంది .
వరలక్ష్మీ వ్రత కథనము
సరళ గతిన వ్రాసితీవు చదివిన వినినన్
వరలక్ష్మి వ్రతము చేసిన
పరికించసిరులు కవివర ప్రాప్తించుసుమీ !!!
రిప్లయితొలగించండికవయిత్రి సోదరి రాజేశ్వరి గారికి ధన్యవాదములు!
*** *** ***
కవయిత్రి శైలజ గారికి ధన్యవాదములు!
*** *** ***
కవిమిత్రులు మంద పీతాంబర్ గారూ! ధన్యవాదములు!!
మాత వరలక్ష్మి వ్రతకథన్ మాన్య చరిత!
నా పురాకృత సుకృత సంచయ విశేష
భాగ్యమున వ్రాయఁ గల్గితి భక్తి గరిమఁ
దల్లి దయచేత నంతియే! దండములయ!
స్వస్తి.
MURTHY YSAN గారు అన్నారు...
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారూ! మీ వరలక్ష్మీవ్రత మహత్మ్యం కథకు పద్యరూపం చాలా క్లుప్తంగా, అద్భుతమైన శైలితో ఉంది. ఇకనుంచీ వ్రతాంతంలో వనితామణులు దీనిని హాయిగా చదువుకోవచ్చు.
ధన్యవాదాలు మూర్తిగారూ!
రిప్లయితొలగించండి