తేది: జులై 10, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము
త్యక్తోద్భక్తి విగాహా
శక్తత దుర్వ్యసన భార సక్త సరుగ్ణో
ద్వ్యక్తాయత దుర్జీవ
న్ముక్తికి మార్గమ్ము మద్యమునుఁ గ్రోలుటయే!
ప్రతిపదార్థ తాత్పర్యములు ఇస్తేనే కాని
త్యక్తోద్భక్తి విగాహా
శక్తత దుర్వ్యసన భార సక్త సరుగ్ణో
ద్వ్యక్తాయత దుర్జీవ
న్ముక్తికి మార్గమ్ము మద్యమునుఁ గ్రోలుటయే!
ప్రతిపదార్థ తాత్పర్యములు ఇస్తేనే కాని
అర్థం కానట్టి ప్రౌఢపద్యాన్ని
పూరణగా ఇచ్చారని
శ్రీ కంది శంకరయ్యగారు తెలిపినందున,
నేను పాఠకుల, వీక్షకుల కోసం
పై పద్యానికి ఈ క్రింది విధంగా
ప్రతిపదార్థ తాత్పర్యాల్ని ఇస్తున్నాను:
దుర్వ్యసన=చెడు అలవాట్లు అనెడి
భార=బరువును
సక్త=తగిలించుకొనుట ద్వారా,
ఉత్+భక్తి=గొప్పభక్తిచేత
త్యక్త=విడువబడి (భక్తికి, పూజలకు దూరమై అనుట),
విగాహ=చక్కఁగా స్నానము చేయుటకును
అశక్తత=శక్తి లేక (స్నానం కూడా చేయలేక అనుట)
సరుగ్ణ=(శరీరము) రోగగ్రస్థమైనట్లుగా
ఉత్+వ్యక్త+ఆయత=బాగుగా తెలియబడుటయను వార్తావ్యాప్తి కలిగి (అనగా జనులందరికీ బాగా తెలియబడి అనుట)
దుర్జీవత్+ముక్తికిన్=దుఃఖకరమైనట్టి జీవముయొక్క విడుదలకు (అనగా దుఃఖకరమైన అకాలమరణమునకు అనుట)
మార్గమ్ము=దారితీయునది (అనగా కారణమగునది)
మద్యమునున్=మద్యమును
క్రోలుటయే=సేవించుటయే కదా!
భావం: దుర్వ్యసనాలకు బానిసను చేయడం ద్వారా...భక్తికీ, పూజాదికాలకూ దూరం చేసి, కనీసం స్నానం కూడా చేయడానికి కూడా శక్తిలేకుండా చేసి, రోగగ్రస్థుని చేసి, అందరిచేతా చీదరించుకోబడడం అనే దుఃఖాలను కలిగించి, చివరకు అకాల మరణానికి గురిచేసే...మహమ్మారి..."మద్యపానమే" కదా! అని భావం.
అద్భుతమైన పూరణ... చక్కని వివరణ... ఇప్పుడు మీ పద్యార్థం సుగమమైంది. బాల్యంలోనే నేర్చిన మీ సంస్కృతభాషా జ్ఞానం మీకు ఒక అలంకారం. అభినందనలు, ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ! నా పూరణము మీ ఆమోదాన్ని పొందగలిగినందుకు నేను ధన్యుడనైనాను. మీ మెప్పు నాకు ఒక గొప్ప వరం. ఇది నాకు చాలా సంతోషాన్నిచ్చింది శంకరయ్యగారూ! కృతజ్ఞతలు!!
రిప్లయితొలగించండి