Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, ఆగస్టు 30, 2015

సమస్య: సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!

తేది: జులై 15, 2015 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు





నా మొదటి పూరణము:
పోరునఁ ద్రిపురాసుర సం
హారమునకు విశ్వకర్మ హర్షోత్సుకుఁడై
తేరు గుణి శిఖుల నిడ, మన
సారా గొనె శివుఁడు లోక సంరక్షణకై!!


***        ***        ***        ***        ***


నా రెండవ పూరణము:


(త్రిపురాసురసంహారమున నుపయుక్తమగు బీజాక్షరమ్ముం గొనుమని విశ్వకర్మ యనఁగా శివుఁడు "రం" బీజాక్షరమును స్వీకరించిన సందర్భము)



"కోరుమయా బీజాక్షర
మేరీతిని యుక్తము మఱి హితకర" మనఁగన్
గోరి మనః కర్మణ వచ
సా "రా" గొనె శివుఁడు లోక సంరక్షణకై!



2 కామెంట్‌లు:

  1. మిత్రులు గుండువారు,

    మీ రెండు పూరణలూ‌ బాగున్నాయి.

    మొదటిపూరణలో పాదాదిని ఉన్న'సారా' అన్నపదాన్ని 'మనసారా' అని మార్చటం అందరికీ‌ సులభంగా స్ఫురించేదే అన్న ఆలోచనతో విభిన్నంగా అలోచించి మీరు రెండవపూరణను కూదా వెలువరించటం ప్రశంశనీయం.

    ఐతే మనసారా అన్న ప్రయోగం అంతగా గ్రంథోచితం అనుకోను. అలాగని పూర్వకవుల్లో ధూర్జటి వంటివారు కూడా క్వచిత్తుగా 'అంతామిధ్య' వంటి ప్రయోగాలు చేసారనుకోండి. కాని అటువంటివి ఒరవడిగా గ్రహించలేము కాని సమస్యల్లో కొన్ని కొన్ని రకాల స్వాతంత్ర్యాలు తీసుకొనక తప్పదు. అసంఖ్యాకంగా ఉన్న చాటువులూ సమస్యాపూరణాల్లో ఇలాంటివి కొల్లలు కూడా. అందుచే మీ 'మనసారా' అన్న ప్రయోగాన్ని ఎవ్వరూ అక్షేపించవలసినది లేదు.

    రెండవ పూరణంలో శివుడు 'రం' బీజాన్ని స్వీకరించటాన్ని చక్కగా ప్రస్తావించారు. బాగుంది. ఐతే నిజానికి మనసా 'రం' గొనియె అని వచ్చి ఉండేందుకు వీలుగా సమస్య లేకపోవటం మీ దోషం కాదు కదా. ఇక్కడా ఏమంత పేచీ లేదు.

    ప్రశస్తమైన పూరణలు.

    రిప్లయితొలగించండి
  2. సుకవి మిత్రులు శ్యామల రావు గారూ! మీరు చక్కఁగా విశ్లేషించినారు. ధన్యవాదములు!

    అలాగే, మనసారా...అనునది వ్యావహారికము గదా! దీనికి గ్రాంథిక రూపము ’మనసారన్’ అవుతుంది. ఈ పదాన్ని ’కొనె’నను పదంతో కలిపితే..."మనసా’రం’ గొనె"నను రూపమేర్పడుతుం దనే విషయం మీకు తెలియనిది కాదు గదా! "రం" అనే బీజాక్షరం ’ర’కారంతో మొదలవుతుంది కాబట్టి నేను... ’రా’ గొనె...నని రాశాను. ఇది మీకు సమ్మతమైనందులకు కృతజ్ఞుఁడను.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి