శ్రీకరి! శార్వరీ! వినుతి సేయుదు మో కమలాలయా! భువిన్
సోఁకి కరోనసూక్ష్మకృమి, సొచ్చియు మానవ దేహమందునన్,
భీకరరుగ్మతార్తతలఁ బెంపొనరించి గ్రసించి చంపుచు
న్మాకిట రౌరవాది యమ నారక లోకముఁ జూపుచుండె! నీ
వే కరుణాప్తదృక్ప్రకరవీక్షణచే మముఁ జూచి, కావ, న
స్తోకపరాక్రమాంచిత త్రిశూలముచేఁ గృమిఁ జీల్చి, కాల్చి, భ
స్మీకృతఁ జేసి, మమ్ముఁ దగఁ జేసి యరోగ విశిష్ట యుక్తుల,
న్మా కిల క్షేమ సౌఖ్య శుభ నవ్యగుణాది వివేక మిచ్చి, సు
శ్లోకులుగా నొనర్చియు, సుశోభిత ధాన్యధనాదిసంపదల్
సేకొన నిచ్చి, హర్షమును జేర్చుచు మా యెదలందు నెప్పుడున్,
మా కిల శాంతిఁ బెంచుచును, మౌఢ్య విదూరులఁ జేసి, మా కృతుల్
మేకొని తాల్చి, చల్లఁగను మేదినిఁ గాంచుము మమ్ము శార్వరీ!
స్వస్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి