Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 22, 2016

బాలల నీతి పద్య కథలు: అందం కన్న...ఉపయోగం మిన్న...




ఒక్క యడవిని నొక దుప్పి చక్కనైన
లేఁత బంగరు జిగిఁ గల్గి, లేఁ జిగురులు
మేయుచును, జీవనమ్మునుఁ జేయుచుండె;
నదియ యొకనాఁడు సరసికిం దప్పికఁ జనె! 1

నీరు కడుపు నిండుగఁ ద్రావు కారణమున,
సరసిలోఁ జూచుచున్నట్టి తరుణమందుఁ,
దనదు ప్రతిబింబ మగపడఁ, దనివితీరఁ
జూచుకొనుచునుఁ, గొమ్ములఁ జూచుకొనియె! 2

"ఎంత యందమ్ముగా నుండె నివియ నాకు!
నింత చక్కని శృంగము లెవని కేనిఁ
గలవె?" యనుకొని, యటుపైనఁ గాళ్ళఁ దిట్టె,
"సన్నమైనట్టి కాళ్ళు నిస్సార" మనుచు! 3

తిట్టుచుండగ, నింతలో దిట్టమైన
నాద మెద్దియో వినఁబడ, నా దిశకునుఁ
జూడ, భయముఁ గొల్పుచుఁ, బెద్ద జూలు తోడ,
సింహ మొక్కటి రా సాఁగె జింక దెసకు! 4

సింహముం గనఁగానె యా జింక, వేగ
ముగ నరణ్యాన నుఱుకుఁ బరుగుల నిడుచుఁ
బాఱిపోసాఁగె నెన్నొ తుప్పలను దాఁటి,
యడ్డదిడ్డమ్ముగాఁ జనె నట్టి తఱిని! 5

ముందు వెనుకలఁ జూడక, ముందు కేఁగ,
గుబురుగా నున్నవౌ చెట్ల కొమ్మలకును,
నందముగ నున్న వనుకొన్నయట్టి కొమ్ము
లంతటం జిక్కి, రాకున్నఁ జింత పొడమె! 6

"ఎంత తెలివి తక్కువగ నే నిట్టి కొమ్ము
లందముగ నున్నవి యటంచు నాదరించి,
నన్నుఁ గాఁచిన కాళ్ళను, సన్నము లని
తెగడితిని! నాకు నిజముగాఁ దెలివి గలదె?" 7

అనుచు శాఖఁ దవిలిన కొమ్మునుఁ బెఱుకఁగ
నెంత పెనుఁగు లాడినఁ గాని సుంతయేని
సడల కుండంగ, "దైవమా! చావు నన్ను
వెదకుచును వచ్చెఁ; గావుమా, వేగ నన్ను!" 8

అనుచుఁ బ్రార్థించి, విశ్వాస మునిచి, మఱలఁ
గొమ్ములనుఁ బెఱుకంగ యత్నమ్ముఁ జేయు
చుం, దనదు కాళ్ళ నుంచియుఁ గ్రింద, భువినిఁ
దట్టుచును నెగిరిన యంతఁ, దగులము విడె! 9

డగ్గఱించెడి సింహము బిగ్గఱఁగను
గర్జనము సేయ, దుప్పియె కాళ్ళ కపుడు
బుద్ధి సెప్పియు, మృతికిని సిద్ధపడక,
వేగ బరువెత్తి ప్రాణ మా విధినిఁ గాచె! 10

’ఏవి తన కంద మిడెనని హెచ్చు నిడెనొ,
నట్టి కొమ్ము లాపద నిడె! నటులె, యేవి
యంద హీనము, సన్నము లనెనొ, నట్టి
కాళులే రక్షణము నిడె ఘనము గాను!’ 11

అనుకొనుచు జింక యా దైవమునకు మ్రొక్కెఁ;
దనకు నిడెను పునర్జన్మ మనుచు! వెడలి,
తోడి జింకల మందతోఁ గూడె నంత!
నందమున కన్న, నుపయోగ మంద మిడదె? 12


స్వస్తి




గమనిక:
మిత్రులారా! ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే. నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి, మరిన్ని పద్య కథలు రాయడానికి పురికొల్పుతాయి. కావున ఈ దిగువన గల డబ్బాలో వ్యాఖ్యను పోస్టు చేయగలరని మనవి.

4 కామెంట్‌లు:



  1. కొమ్ముల అందము గాంచెను
    రొమ్ములు విరిచెను జిలేబి రూపము జూడన్ !
    దమ్ములు బోయెను హరినా
    దమ్మును వినగన్ పరుగిడి దబ్బున చిక్కెన్ !

    రిప్లయితొలగించండి
  2. సావేజిత జిలేబీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు!

    ఇమ్ముగ వ్రాసిన పద్దెము
    నెమ్మిని నా మనము నందు నిక్కముగ నిడెన్;
    నమ్ముఁడు నిజము జిలేబీ!
    సమ్ముదమున ధన్యవాద సత్కృతు లిడెదన్!!

    రిప్లయితొలగించండి