Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, ఆగస్టు 15, 2013

పద్యరచనలు: 1. పిడికిట సూర్యుడు 2. స్వాతంత్ర్యపు జండా

పద్యరచన:(16-08-2013)

కం.
పరుచూరి వంశిగారిని
సరసుం డొకఁ డనె, "పిడికిట సవితృని బంధిం
తురె?" ; దానికి వంశియుఁ జి
త్తరు వీ రీతిగను జూపెఁ దత్సరసునకున్!

కవి పండితులకు, వీక్షకులకు అందరికీ
 స్వాతంత్ర్యదినోత్సవశుభాకాంక్షలు!!


ఉ.
ఎత్తఁగదోయి భారతికి స్వేచ్ఛనుఁ గూర్చిన కేతనమ్మునే;
యెత్తఁగదోయి స్వీయగళ మీ తరుణమ్మున నింగిఁ దాఁకఁగా;
నెత్తఁగదోయి భారత మహీతల పూత చరిత్ర గణ్యమే;
యెత్తఁగదోయి నీ పిడికి, లెత్తియు శత్రులఁ బాఱఁ ద్రోలుమా!(1)

శా.
కేలున్ శీర్శములుం గదల్చుచును సుక్షేత్రాంశులౌ వీరు లీ
నేలన్ నెత్తురు పంట నీన్ మన జయంతిశ్రేష్ఠమే రోదసిన్
లీలన్ వెల్గుచుఁ గ్రొత్తవాఁడి వడ లీ రీతిం దగ న్నిండఁగన్,
వ్రాలంజేసి విరోధులన్, గొనుఁడు తద్భ్రాజత్పతాకమ్మునే!(2)

మత్త.
అర్థమత్తు లహంకృతు ల్మఱి యంధబుద్ధులు పేదలున్
వ్యర్థభాగ్యులును న్నియంతలు భారతమ్మున లేనిచో,
స్వార్థ బుద్ధికి స్థానముండదు; శాంతి సౌఖ్య సుభిక్ష మ
న్వర్థనామము నీయ నెత్తుము భారతీయ పతాకమున్!(3)

మ.
కులముం దాటి, మతమ్ము దాటి,కొలఁదుల్ గొప్పల్ విచారింపకే,
కల భాగ్యమ్ములు భోగముల్ సమము సంస్కారమ్ములు న్నాఁటఁగన్,
వెలుఁగున్ శాంతులు, కాంతు లీ యెడను దీపింపంగ, నీ భారతిన్
విలువల్ వెంచఁగ నెత్తు మన్న భరతోర్వీ కేతనమ్మున్ దివిన్!(4)

*శుభం భూయాత్*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి