సురుచిరమగు జొంపమ్ముల
నురు గతితోఁ దినుచు, మఱల నుఱుకుచుఁ, దమితోఁ
దిరిగి, వెనుఁజూచుఁ జుఱుకునఁ,
జిఱు మోడుపుఁ గనులఁ బసిఁడి జింకను గాంచన్. (1)
తే.గీ.
సీత మనమునఁ బ్రేమయుఁ జివురు లెత్త;
"నాథ!బంగారు జింకయ నాకు వలయుఁ
బెంచుకో మనసాయెను బ్రియము తోడఁ
దెచ్చి యీయుఁడు మన ప్రేమ తిరము గాఁగ!" (2)
ఆ.వె.
అనిన సీత పల్కు లాలించి సౌమిత్రి
"వద్దు వదిన, యీ సువర్ణ హరిణ!
మిట్టి వింతఁ గంటె, యీరేడు లోకాల?
నిది ప్రమాదకరము! హితము గాదు!!" (3)
తే.గీ.
అన్న లక్ష్మణు మాటల నాలకించి,
రాముఁ డనెఁ "దమ్ముఁడా! నన్ను రమణి సీత
కోరు తొలి కోర్కి తప్పక తీర్చ వలయుఁ;
బోయి వైళమ దెచ్చెద మాయ లేడి! (4)
కం.
మా యయినఁ బటాపంచలు
సేయుదు; లేకున్న దాని సీతకు నిత్తున్!
వేయును మాట లిఁకేలా?
పోయియు నేఁ దెత్తు" నంచుఁ బోయెఁ ద్వరగతిన్. (5)
ఆ.వె.
సీత సంతసించె శ్రీరాముఁ డా జింకఁ
బట్టి తెచ్చు నంచుఁ బరవశించి!
లక్ష్మణుండు కన్నులందున సంశయ
మొలుక, ధీరుఁ డౌట నులుక కుండె!! (6)
తే.గీ.
అంత "హా సీత!హా లక్ష్మణా!" యటంచు
నొక్క పెనుఁ గేక వినఁ బడ, "నక్కట! యది
రాముఁ డాపద నుండెనో యేమొ? నీవు
సత్వరమ్ముగఁ బొమ్ము లక్ష్మణ!యటకు" (7)
కం.
అని సీత వల్క లక్ష్మణుఁ
డనెఁ "దల్లీ! రాముఁ డెట్టి యాపద కెఱగాఁ,
డనితర సాధ్యుఁడు, వీరుఁడు,
విను, కారణ జన్ముఁ డతఁడు; భీతిల్లకుమీ!" (8)
ఆ.వె.
మఱది మాట వినిన మానిని సీత తా
నెంతొ వగచి యతని నింద సేయ;
హృదయ శల్యుఁ డయ్యు, హ్రీ మనస్కుండయి,
"గీఁత దాఁటకు"మని, గీఁచి, వెడలె! (9)
తే.గీ.
రావణుఁడు యోగి వేషాన రమణి సీత
కడకు నేతెంచి, భిక్షను నడిగి, రేఖ
దాఁట రాకున్కి, సీతయె దాఁటి రాఁగ,
నపహరించెను హతవిధీ, యా రమణిని! (10)
(ఇది సీతాపహరణ ఘట్టము. స్వస్తి.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి