Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, నవంబర్ 05, 2013

పద్య రచన: మత్స్యావతారం...


తేది: ఆగస్టు 15, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన మత్స్యావతారం చిత్రానికి నేను రాసిన పద్యాలు...


ప్రథమ కథ (భాగవత పురాణాంతర్గతము):

తే.గీ.
సోమకాసురుఁ డనెడి యసురుఁ డొకండు
నాల్గు వేదమ్ములను దాచె నబ్ధి లోన!
హరియ మత్స్యావతారుఁడై యసురుఁ జంపి,
కాచె వేదమ్ములను; నిల్పె ఘనత భువిని!

ద్వితీయ కథ (మత్స్య పురాణాంతర్గతము):

కం.
వైవస్వత మనువొక దిన
మా విశ్వేశ్వరున కపుడు నర్ఘ్యం బిడఁగన్;
ఠీవిగను మత్స్య మొక్కటి
"కావుమ న"న్నంచుదుమికె కమికిలి లోనన్!(1)

తే.
కరుణతో రాజు దానిని కలశమందు
విడిచె; మఱునాఁడు చేపయుఁ బెరిఁగిపోయి,
"నన్ను రక్షింపు"మని కోర నపుడు నొక్క
నూఁతిలోఁ జేర్చె రాజు సంతోషముగను!(2)

ఆ.వె.
మఱు దినాన మీన మా నూఁతి లోపలఁ
దిరుగ రాక యున్నఁ దిరిగి ప్రభుని
వేడె "మఱల నన్ను వేఱొక్క చోటున
విడువ వలయు"నంచుఁ బ్రేమ తోడ!(3)

కం.
రాజటులె దానిఁ జెఱువున
రాజిలఁగా విడువ,మఱలఁ గ్రక్కునఁ బెరిఁగెన్!
సాజముగ రాజపు డా
యోజన విస్తీర్ణ మత్స్య ముదధిని జేర్చెన్!(4)

ఆ.వె.
చేర్చి యిటులఁ బలికె, "శ్రేష్ఠమౌ మీనమా!
నీవు రాక్షసుఁడవొ, యీశ్వరుఁడవొ
యెఱుఁగఁ జాలఁ జెపుమ, యెవఁడ వీ"వనవుడుఁ
దా జనార్దనుఁడ నటంచుఁ బలికి;(5)

తే.గీ.
"రాజ! నూఱేండ్ల పిదపఁ బ్రళయము వచ్చు;
నట్టిచో సర్వ సత్త్వమ్ము లటులె నాల్గు
వేదములనొక్క నావలోఁ బ్రోది సేసి,
నాదు శృంగానఁ గట్టు మో యనఘ చరిత!"(6)

కం.
అనుచు నదృశ్య మ్మాయెను;
మనువును దానటులె సక్రమమ్ముగఁ జేయన్
ఘనముగను జీవతతి పుడ
మిని వర్ధిలెను; మనువునకు మేనుప్పొంగెన్!(7)

           - :శుభం భూయాత్ :-

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి