తేది: జూన్ 10, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన
కన్నడ బ్లాగు ‘పద్యపాన’ సౌజన్యంతో...
(ಅಬ್ಧಿಯೊಳು ಮುಳುಗಿದನು ಭಾಸ್ಕರನುರಿವಬಿಸಿಲಿನೊಳ)
ఇచ్చిన సమస్యకు నా పూరణము
తనదు వరపుత్రకుండును దానగుణుఁడు
స్నేహశీలుండు, కర్ణుండు నాహవమున
నర్జునుని చేత హతమొందినపుడు శోక
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ!
సూర్యుణ్ణి శోకవార్ధిలో ముంచిన మీ పూరణ విద్వజ్జనరంజకంగా ఉంది. అభినందనలు.
రిప్లయితొలగించండిధన్యవాదాలు శంకరయ్యగారూ!
తొలగించండిఏల్చూరి మురళీధరరావు చెప్పారు...
తొలగించండిశ్రీయుత కంది శంకరయ్య గారికి,
శ్రీ గురుదేవులకు ప్రణామపురస్సరంగా -
ఈనాటి సమస్యను కన్నడ "పద్యపాన" నుంచి గ్రహించటం ఔచితీభరితంగా ఉన్నది. ఎందుకంటే - అది కన్నడంలో పంప మహాకవి రచనకు రూపాంతరితమే కాబట్టి !
"కం. పెఱ"యిగె మడుగి రథమం
నెఱ"వన నెసగల్కె సుతశోకద పొం
పుఱి"యోళ్ మియ్యఱియదె నీ
రఱి"దంతె దోలిఱి"ద నపరజళధిగె దినపం.
అని కన్నడ విక్రమార్జున విజయం (12-220).
అంతే కాదు. తిక్కన గారు ఈ సన్నివేశంలో మూలాన్ని అతిక్రమించి, పంప కవిని అనువదించి, ఈ విధంగా వ్రాశారు:
క. నిడుఁగేలున్ బలు తొడలు
న్వెడద యురమునై రణావనిం గర్ణు నొడల్
పడియున్నఁ గని విషాదం
బడరి తొలఁగు మాడ్కిఁ గ్రుంకె నర్కుం డంతన్.
గీ. నిర్గతప్రాణు రాధేయు నిజకరములఁ
గరుణ పెంపున నంటుట కారణముగఁ
బావనస్నాన మొనరింపఁ బోవునట్టు
లపరజలనిధిలోనికి నరిగెనినుఁడు."
అని కర్ణపర్వం (3 - 368,369). కన్నడాంధ్ర పరిశోధకులు గుర్తింపవలసిన విశేషం కాబట్టి, ఉభయ భాషా తులనాత్మకపరిశీలన కావించే అబిమానులకు ఆసక్తికరంగా ఉంటుందని - వివరంగా వ్రాశాను.
శ్రీ గురుదేవుల పూరణ ఈ మార్గానుగామియై అలరారటం ఎంతో సొగసుగా ఉన్నది!
నా అనుసరణం:
గీ. తన వరంబునఁ బుట్టిన తనయుఁ గర్ణుఁ
బొలికలను నందుఁ గూలుటఁ బొలయఁ గాంచి,
శోకమూర్తియై జగములఁ జూడలేక
వార్ధిలో మున్గె భానుఁడు పగటివేళ.
విధేయుఁడు,
ఏల్చూరి మురళీధరరావు
(శ్రీకంది శంకరయ్య మరియు శ్రీఏల్చూరి మురళీధరరావుగార్లకు కృతజ్ఞతా పూర్వక నమస్కారములు!
-గుండు మధుసూదన్)