Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 02, 2014

సమస్య: హరి హరికిన్ హరినిఁ జూపి హరియింపుమనెన్

తేది: అక్టోబర్ 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా నాలుగు పూరణములు:


(1)
హరి మురహరియను చోరులు
హరియింపఁగ నొకరియింట నడుగిడ, నచటన్
హరివర్ణపు నగఁ గని, ముర
హరి హరికిన్ హరినిఁ జూపి "హరియింపు" మనెన్!
(హరినిన్ = హరివర్ణ (పచ్చని రంగుగల) ఆభరణమును)

(2)
హరియింతు నను కశిపునకు
హరి నా ప్రహ్లాదుఁ డపుడు "హరి హరి"యనుచున్
బరగంగఁ బిలిచి మదమో
హరి హరికిన్ హరినిఁ జూపి "హరియింపు" మనెన్!
(మదమోహరి హరికిన్ = మదమును, మోహమునుం గలవాఁడును, దివిజపురాపహారియునగు హిరణ్యకశిపునకు)

(3)
హరి హరి! సర్పము కప్పను
హరియింప వెనుఁ దవులఁ గని "హా హా"యనఁగన్
"బరగ నిది తిండియౌ"నని
హరి, హరికిన్ హరినిఁ జూపి, "హరియింపు" మనెన్!
(హరి = విష్ణువు, హరికిన్ = సర్పమునకు, హరినిన్ = కప్పను)

(4)
హరిణాక్షి వెంట రాఁగా,
హరి హరిపురి కరుగుఁదెంచ, హరితవనమునన్
విరి తావిఁ గొని హరిమనో
హరి, హరికిన్ హరినిఁ జూపి, "హరియింపు" మనెన్!
(హరినిన్+చూపి=హరితవనమున విరి తావినిం బ్రసరింపఁజేసెడు పారిజాతమనియెడు దేవతావృక్షమునుం జూపించి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి