తేది: ఆగస్టు 29, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
పార్వతి శాపవృత్తాంతము:
చవితి దినమున నవ్వంగఁ జందమామ,
కొడుకు గణనాథు నుదరమ్ము క్రుమ్మరించె
లోని కుడుముల, నుండ్రాళ్ళ; వానిఁ జూచి,
క్రోధమున శపించెను గౌరి బాధతోడ!
"చవితి దినమున నేవారు చంద్రుని ముఖ
దర్శనము సేతురో వారు తత్క్షణమ్మె
తగని నీలాపనిందల నెగడుదురయ!"
యనఁగ, దేవతల్ ప్రార్థింప వినిచె నిట్లు;
"నాదు తనయునిఁ బూజించి, నాఁడు నక్ష
తలఁ దలపయిఁ జల్లుకొన నిందలు తొలఁగి, శు
భమ్ము లొనఁగూడు" ననుచు శాపావధి నిడ,
నంద ఱానందమందిరి, వందనమిడి!
శ్రీకృష్ణుని చంద్రదర్శనము:
అల వినాయక చవితి సాయంత్రమందుఁ
గృష్ణుఁ డొంటిగఁ దోఁట కేగియు నచటనె
కూర్చొనఁగ రుక్మిణీసతి కూర్మిమీఱ
దుగ్ధపాత్ర నొసఁగఁగ నందునను నతఁడు
చంద్రుఁ బొడఁగాంచినంత సాక్షాత్కరించె
నింద; సత్రాజితుని దమ్మునిం దునిమి, య
తని శమంతకమణిఁ గొనె ననుచు వేగ!
దైవమైననుఁ దలవ్రాఁతఁ దాఁటఁ గలఁడె?
(అది, ప్రసేనుండు ధరియించి యడవి కేగ,
సింగ మొక్కం డతనిఁ జంపి, చెలఁగి కొనఁగ,
జాంబవంతుండు సింహముం జంపి, దానిఁ
దనదు కొమరిత మెడలోనఁ దనర వైచె! )
దానఁ గృష్ణుండు వనికేగి, తఱచి వెదుక,
నొక్కచో జాంబవంతునియొక్క తనయ
జాంబవతి కంఠమందున సౌరభమిడు
నా శమంతకమణిఁ జూచి, యతనితోడ
యుద్ధముం జేసి, యోడించి, యుక్తముగను
జాంబవతితోడి మణిఁగొని, సరగునఁ జని,
యచట సాత్రాజితిం బొంది, యందగించె
విఘ్నపతి చల్లఁగాఁ జూడ వెన్నుఁడంత!
శుభం భూయాత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి