తేది: సెప్టెంబర్ 25, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
కం.
గౌరముఖాశ్రమ పరిసర
ఘోరాటవిఁ జొచ్చి వేఁటకున్ దుర్జయుఁడన్
రారాజు డస్సి, తన పరి
వార సహితుఁడయ్యు, మునికిఁ బ్రాగార్ణకుఁడై; (1)
తే.గీ.
పోవఁగను గౌరముఖుఁడు సంపూర్ణ మతిని
సంతసమ్మంది, యాతిథ్య సత్క్రియలను
జేయ, విష్ణుని వేడఁగ, శ్రీహరి యొక
మణిని నిచ్చె, నా మణి మహిమాతిశయత; (2)
తే.గీ.
ఒక్క నగరము నిర్మించి, మిక్కుటముగ
షోడశోపచారమ్ములు శుద్ధమతినిఁ
జేయఁ, దుష్టుఁడై యా రాజు చిత్తమందు
మణిని సంగ్రహింపఁగ నెంచి, మునినిఁ గోరె! (3)
ఆ.వె.
ముని నిరాకరింప; మునితోడ యుద్ధమ్ముఁ
జేసియైన, మణియ చిక్కు కొఱకు
మదినిఁ గోర్కి గాఢమై యంపె సైన్యమున్
మునినిఁజంపి, పిదప మణినిఁ గొనఁగ! (4)
కం.
వర సైన్యమ్మునుఁ బంపిన
తఱి నా ముని గంగఁ జేరి, తరణికి నర్ఘ్యో
త్కరమిడుచునుండె; భటు లిటఁ
దరవారులఁ జేఁతఁ బూని, దందడి సేయన్; (5)
కం.
మణినుండి శూరతతియుం
జనియించియు సైన్యతతినిఁ జండించుచు వే
రణమునుఁ జేయుచు నుండఁగ
ముని యటకును నేఁగుదెంచి, మురరిపుఁ బిలిచెన్! (6)
ఆ.వె.
విష్ణుమూర్తి యపుడు వేగమ్ముగా వచ్చి,
మునికి భయముఁ దీర్పఁ బూని యపుడు,
నిమిషమందు సేన నిర్మూలనము సేసి,
మాయమాయెఁ దాను మఱు నిముసమె! (7)
తే.గీ.
ఎచట నిమిషమునందున నెదిరిఁ జంపె;
నట్టి యారణ్యమునకును నైమిశాఖ్య
కల్గి, "నైమిశారణ్యము" ఘనతనుఁ గని,
సకల మునులకునది నివాసార్హమాయె! (8)
(సమాప్తము)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి