తేది: జూలై 02, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నేను రాసిన రెండు పూరణములు
(కురుసభలో సుయోధన దుశ్శాసనాదులు శ్రీకృష్ణుని బంధింప యత్నించు సందర్భము)
తే.గీ.
"దూతను వధించు టెంతయు నీతి యగును
నిపుడు శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివె" న
నుచు సుయోధన దుశ్శాసనాదు లకట
పట్టఁజన, హరి విశ్వరూపమ్ముఁ జూపె!!
*** *** *** *** *** *** ***
(ప్రహస్తుడు రావణునితో హనుమంతునిగూర్చి పలికిన మాటలు)
కం.
సీత చెర మాన్ప వచ్చిన
యాతండు నశోకవనిని నసురులఁ గూల్చెన్!
దూతను వధించు టెంతయు
నీతి యగును రాక్షసేంద్ర! నిజ మిది వినుమా!!
గుండువారు,
రిప్లయితొలగించండి"నీతి యగును నిపుడు" అనటం సరికాదండీ, అగును + ఇపుడు అనేది అగునిపుడు అని నిత్యంగా సంధి కార్యం వలన ఏర్పడుతుంది.
అలాగే 'నశోకవనిని నసురులఁ' అన్నది కూడా సరికాదు. వనిన్ + అసురుల అన్నదానికి వనినసురుల అనే రూపం మాత్రమే ఏర్పడుతుంది.
అంతే కాదు, 'ఆతండు నశోకవనిని' అన్నదీ విచార్యమే. ఆతండు + అశోకవనిని => అతండశోకవనిని అనే కదా సంధికార్యం?
గమనించగలరు.
మీ ఆక్షేపణలకు నా సమాధానములు:
తొలగించండి1. "నీతియగును నిపుడు" అనుచోట..."నీతియగును"తో వాక్యము ముగియు చున్నది. "ఇపుడు"తో రెండవ వాక్యము మొదలగుచున్నది. "ఇ"తో వ్రాయక, ద్రుతముతో గూడిన "ని"తో వాసితిని. ఇచ్చట చిన్నయసూరిగారి "వాక్యావసానంబున సంధిలేమి దోషంబుగాదని యార్యులండ్రు" అను సూత్రము ప్రకారము విసంధితో వ్రాయవచ్చునని గ్రహింపగలరు.
2. "పాహి యని యశోకవనిని శోకించెను సీత" అనే పాటను మీరు వినియే యుందురు. దాని ప్రకారము "అశోకవనినిన్ + అసురుల = అశోకవనిని నసురుల" అను ప్రయోగము తప్పుకాదుకదా!
3. "ఆతండును + అశోకవనిని" అనుచోట నేను అప్యర్థమున వ్రాసితిని. ప్రథమాంతమో, ద్వితీయాంతమో కాదు. కాబట్టి ఇదియు తప్పుకాదు.
>ఇకపోతే...తమరు నా మొదటి పద్యములోని మూడవపాదమున యతి తప్పిన విషయమును గమనింపనేలేదు.
దానిని:
"దూతను వధించు టెంతయు నీతి యగును!
ఇపుడు శ్రీకృష్ణుఁ డహితమ్ము నిట నుడివెను!"
అని సుయోధన దుశ్శాసనాదు లకట,
పట్టఁజన, హరి విశ్వరూపమ్ముఁ జూపె!!
అని సవరించుకొనుచున్నాను. గమనింపగలరు. స్వస్తి.
శ్రీ కంది శంకరయ్యగారు సూచించిన సవరణము:
తొలగించండిమధుసూదన్ గారూ,
‘దూతయు వధించు ...’ సమస్యకు మీ పూరణ పద్యానికి నా సవరణ...
"దూతను వధించు టెంతయు నీతి యగున
టంచు కృష్ణుఁడు హితదూరుఁ డయి నుడివె న
నుచు సుయోధన దుశ్శాసనులు చెలంగి
పట్టఁ జన, హరి విశ్వరూపమ్ముఁ జూపె!!
ధన్యవాదాలతో..
మీ
కంది శంకరయ్య
“శంకరాభరణం”
http://kandishankaraiah.blogspot.in
శంకరయ్యగారూ, తమరు సూచించిన సవరణ చాలా బాగున్నది. ధన్యవాదాలు.
తొలగించండి