Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శనివారం, జనవరి 11, 2014

సమస్య: రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్

తేది: జూన్ 27, 2012 నాటి శంకరాభరణంలోని
సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు
నా రెండు పూరణములు
(1)
ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, ష
డ్గుణముల డుల్చి, సన్మతినిఁ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతా
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్!

(పై పద్యములోని మొదటి పాదము చివరన షడ్గుణములకు బదులుగా, దుర్గుణముల అని చదువుకొనగలరు) 


(2)
గణపతి, విఘ్నహారియు, నగాత్మజకుం దొలి పుత్రకుండు, స
ద్గుణములఁ బెంచు వేలుపునుఁ, గుంజరశీర్షుఁడు, వక్రతుండుఁ డీ
ప్రణతుల స్వీకరింపఁగను బ్రార్థన సేసిన నన్ను దేర్చు కా 
రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్! 

8 కామెంట్‌లు:

  1. గుండువారు,
    మీ‌ మొదటి పద్యంలో‌ గణపతి స్తుతిచేస్తూ "షడ్గుణముల డుల్చి" అన్నారు. శక్తి, జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజము అనే ఆరింటినీ‌ షడ్గుణములని అంటారు. ఇకపోతే డుల్చు అనే క్రియకు అర్థం కూలగొట్టటం లేదా వదిలించటం అని. అందుచేత "షడ్గుణముల డుల్చి" అన్నది దురర్థాన్ని ప్రదిపాదిస్తోంది. మీరు సత్వ రజ స్తమో గుణాలనే త్రిగుణాలను షడ్గుణాలుగా పొరబడ్డారు. త్రిగుణాలు అవశ్యం వదిలించదగినవే. షడ్గుణాలు కావు.
    అలాగే "వేగ ననుఁ బాలన సేసెడి " అన్నప్పుడు సరిగ్గా అన్వయం కావటం‌లేదు, పరిశీలించండి. మీరు ఈ‌ ప్రయోగం మార్చి, "వేగ ననుఁ బాలన సేయగ" అంటే అన్వయం కొంచెం బాగుపడుతుంది. కొంచెమే అనటం‌ ఎందుకంటే, ఇకా "కారణ మది.."‌అన్నదాంట్లో అది అన్నది అన్వయంలోకి రావటం లేదు కాబట్టి. అందుచేత మరెలా అంటే బాగుంటుందో కొంచెం చూడండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాడిగడపవారూ!
      నేను ఈ పద్యములను గత సంవత్సరం సెల్ ఫోన్‍లో లిఖించి, శ్రీ కంది శంకరయ్యగారికి పంపడం ద్వారా, శంకరాభరణంలో ప్రచురింపజేయడం జరిగింది. అలా లిఖించే సమయంలో...తొందరలో, అరిషడ్వర్గమును మనస్సులో ఉంచుకొని, లిఖించడం జరిగింది. కాని, "షడ్గుణములు" గా పడినది. నేను పొరపాటును గ్రహించకయే, దానిని శ్రీ శంకరయ్యగారికి పంపుట జరిగినది. నిజానికి నేను దానికి త్రిగుణాలైన సత్త్వరజస్తమోగుణాలను లక్షించలేదు. "త్రిగుణములు అవశ్యం వదిలింపదగినవే" అని మీరన్నారు. రజస్తమో గుణాలు వదిలింపదగినవే కాని, సత్త్వగుణం కాదు గదా! మీరును తొందరలో పొరపాటునే సూచించారు.

      అయితే, ఇక్కడ "షడ్గుణముల" అనే పదమును, "దుర్గుణముల" గా మార్చిన సరిపోవును.

      ఇక "వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతారణము+అది" అనుచోట అన్వయము చక్కగనే కుదురుచున్నది. ఆ విఘ్నపతి వేగముగా జేసెడునట్టి పాలనము అను నా జన్మతారణము అనునది, శాంతి సౌఖ్యముల గూర్చునని అన్వయించుకొనవలయును. మీరు సూచించిన "సేయఁగ"యే అన్వయదూరమగును. కావున ఇదియు ప్రమాదమే.

      తమరు సవరణము సూచించుచు "తారణ మది" కి బదులుగ, రెండవ పద్యములోని "కారణ మది" అని పొరపాటున సూచించి, అన్వయంలోకి రావటం లేదన్నారు.. మరల ప్రమాదమే ఏర్పడినది. పొరపాటులు మానవ సహజములు...నాకైనను, మీకైనను...! "ప్రమాదో ధీమతామపి" అన్నరు కదా పెద్దలు!

      నా సవరించిన మొదటి పద్యము:

      ప్రణతు లొనర్చి విఘ్నపతిఁ బ్రార్థన సేయఁగ విద్య లిచ్చి, దు
      ర్గుణముల డుల్చి, సన్మతినిఁ గూర్చి, ముదమ్ములఁ బేర్చి, స
      త్ఫణితి నొనర్చి, వేగ ననుఁ బాలన సేసెడి నాదు జన్మతా
      రణమది శాంతిసౌఖ్యముల రాజిలఁ జేయుచుఁ గూర్చు శ్రేయముల్!

      ఏదేమైనను నా పద్యముల నామూలాగ్రము పరామర్శించి, తమ అభిప్రాయమును తెలిపి, సవరణములు సూచించినందులకు కృతజ్ఞతలు. స్వస్తి.

      తొలగించండి
  2. నేను ఇద్దరి వాదనలను లోతుగా పరిశీలించలేదు కాని, ఇటువంటి చర్చలు ఆహ్వానించదగినవే. వీటి వలన శబ్దప్రయోగాల గుణదోషాలు అందరికీ అవగతం అవుతాయి. గుండు వారికి, తాడిగడప వారికి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  3. గుండువారు, మీ సమాధానం బాగుంది. ఐతే, చిన్న విషయం ఒకటి చెప్పాలి. ""త్రిగుణములు అవశ్యం వదిలింపదగినవే" అని మీరన్నారు. రజస్తమో గుణాలు వదిలింపదగినవే కాని, సత్త్వగుణం కాదు గదా! మీరును తొందరలో పొరపాటునే సూచించారు.". సత్వగుణం మిగిలిన రెండు గుణాలకన్నా మిక్కిలి చక్కనిది, అవశ్యం సత్వగుణోపేతుడు గావలసినదే సాధకుడు. ఐతే, ముక్షువులు క్రమంగా సత్వగుణాన్ని సహితం‌ పరిత్యజించాలని వేదాంతశాస్త్రం చెబుతున్నది. అంటే త్రిగుణములకు అతీతమైన స్థితిని సాధించాలని దీని ఉద్దేశం. సత్వగుణం ఉన్నప్పటికీ అది 'నేను' అనే భావనను జీవుని యందు నిలుపుతూ బంధకారణమే అవుతున్నది కాబట్టి దానినీ విసర్జించే స్థాయికి సాధకుడు రావలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తాడిగడపవారూ! మీరనేది ఏ బంధమూ లేని స్థితి ఐన నిర్గుణత్వమే కదా! అది కేవలం దైవానికి మాత్రమే సాధ్యమౌతుంది. ఎందుకంటే సాధకుడు దేన్ని కోరి సాధన చేస్తున్నాడు? మోక్షాన్ని గురించే కదా! అంటే, అతడు నిష్కాముడు కాడనేగా. మనస్సులో ఏ కోరికా లేకుండడం బంధానికి కారణమవుతుంది. "మన ఏవ మనుష్యాణాం కారణం బన్ధ మోక్షయోః" అనిగదా వేదాన్తశాస్త్రం ఘోషిస్తోంది! మనస్సులో ఏ కోరికా లేకుండా దేన్ని కోరి సాధకుడు సాధనచేస్తున్నాడు? అనేది ప్రశ్న. కాబట్టి అతడు నిర్గుణుడు ఎప్పటికీ కాలేడు, కాడు కూడా. అది సాధ్యము కానిపని. కేవలం చెప్పుకోవడానికి, ఆత్మ వంచన చేసుకోవడానికి తప్ప, నిజంగా ఆచరణ సాధ్యము కానిదానిని సాధించుట అసాధ్యము. కాబట్టి తేలేదేమంటే నేను అనే భావన నశించనిది. "నేను లేను. భగవంతుడున్నాడు." అనడం కూడా అహం తొలగలేదు అనడానికి సాక్ష్యం. కాబట్టి సాత్త్వికత విడువదగనిది. సాత్త్వికత అహాన్ని పెరుగకుండా కాపాడుతుంది. మనిషిని అదుపులో పెడుతుంది. అహం నశించనిది. బంధమూ పూర్తిగా నశించనిది. సాత్త్వికత విడువగూడనిది.
      ఇంత వైరాగ్యం ఉంటే ఈ దైవప్రార్థనలెందుకు? కోరడం ఎందుకు? నేను ఇంత వైరాగ్యభావనతో ఈ పద్యమును రాయలేదు. వేదాంతమును గూర్చి తెలియజేసినందుకు కృతజ్ఞతలతో...

      తొలగించండి
    2. ఏ కోరికా లేకుండడం బంధానికి కారణమవుతుంది. "మన ఏవ మనుష్యాణాం కారణం బన్ధ మోక్షయోః" అనిగదా వేదాన్తశాస్త్రం ఘోషిస్తోంది!
      పొరబడుతున్నారు. ఈ‌ విషయంలో చాలా వివరణ అవసరం అవుతున్నది

      సాత్త్వికత విడువగూడనిది.
      ఇది కొంచెం‌ పొరబాటు అభిప్రాయం. సాధకులు సాత్వికత విడువరాదు నిజమే. తత్పరం పురుషఖ్యాతేర్గుణ వైతృష్ణ్యమ్‌ అని పరవైరాగ్యసిథ్థి కలిగిన యోగారూఢులవిషయం వేరు. వారు త్రిగుణాలనుండి విముక్తులు. ఈ మాటతో వారిని సత్వగుణాన్నికూడా అధిగమించిన వారుగా తెలుసుకోవాలి.

      ఈ విషయమై నేను పూర్తి వివరణ విడిగా వ్రాస్తాను. వ్యాఖ్యగా వ్రాయటం సాధ్యపడదు, బాగుండదు కూడా. మీ ఆలోచనాధోరణి, ప్రశ్నలు బాగున్నాయి. ఇటువంటి సందేహాలు చాలా మందికే ఉంటాయి.

      తొలగించండి
    3. తాడిగడపవారూ! నేను పైన పేర్కొన్న వాక్యం..."మనస్సులో ఏ కోరికా లేకుండడం మోక్షానికి కారణమవుతుంది" అని లిఖించుటకు బదులుగా..."...బంధానికి..." అని లిఖించితిని. తాము తమ వ్యాఖ్యను సవరించుకొనగలరు.

      త్రిగుణాతీతులకు ఏ గుణం ఉంటుంది? నిర్గుణుడని దైవము కాక ఎవరనబడుతారు? సాత్త్వికత లేకుండా మోక్షము సిద్ధించునా? ఇవి నా ప్రశ్నలే కాక అనాదినుండి ఉన్న ప్రశ్నలే. సమాధానాలు పలువురు పలురకాలుగా చెపుతారు. ముఖ్యముగా భగవద్గీతలో "గుణత్రయవిభాగయోగము"నందు విపులముగా తెలుపబడియున్నది. కాని, సాధ్యాసాధ్యములు మనస్సును విశ్వసింపనీయకున్నవి. ఈ మాటలు యోగశాస్త్రమువరకే పరిమితమవుతున్నవి తప్ప, అనుభవైకవేద్యములు కావటము లేదు. పరవైరాగ్యసిద్ధికలిగిన పురుషులెవరో తెలుపగలరా? వారు నిజముగా పరవైరాగ్యసిద్ధి పొందిన వారని నిశ్చయముగా మనము ఎలా గుర్తించగలము? వారి మనస్సుకు తప్ప, ఇతరుల మనస్సుకు ఆ పరవైరాగ్యభావన ఎలా తెలుస్తుంది? ఇవి అన్నీ ప్రశ్నలే...సమాధానాలు వారి వారి లౌక్యాన్ని ఆశ్రయించివుంటాయి

      తొలగించండి