కవి పండిత మిత్ర పాఠక వీక్షకులందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
తేది: జూలై 04,2012 నాటి శంకరాభరణంలో్ని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు
వంశమ్మేది, మతమ్మునేది, ఘనసంపద్యోగ్యవిద్యాది మా
నాంశమ్మును విడనాడి, వీరయువకుం, డంతర్విచారుండు, ద్వా
వింశత్యబ్దసుశోభితుండు నెటులీ శ్వేతాభిపాలుండ్రఁ బూ
ర్ణాంశార్తిం బడఁజేసి, తాను వెసఁ బాఱంద్రోలఁగాఁ బూనెనో?
ఆ.వె.
పూవు పుట్టఁగానె పొందును పరిమళం
బనెడి మాట నిజము! భగత సింహుఁ
డింటఁ జిన్ననాఁట నెంతలేసి పనులు
చేసినాఁడొ ప్రజల స్వేచ్ఛ కొఱకు!
తే.గీ.
తాత గధరు విప్లవసంస్థకై తమిఁ గొన,
మేనమామయుఁ జేరంగఁ, దానుఁ జేరి,
తెల్లదొరలును వణకుచుఁ దల్లడిల్ల,
నుల్లసిల్లెను నుల్లమ్ము పల్లవింప!
కం.
కంపితులై శ్వేతముఖులు
తెంపరియౌ మాతులు నురి దీయంగను, రో
దింపక, నుగ్రుండయి కనుఁ
గెంపులు నిప్పుకలు రాల్పఁ గెరలె యముండై!
సీ.
అగ్గింప నెగసిన యగ్నికీలను బోలి
శుక్లాననులఁ జేసె విక్లబులుగ;
సితవక్త్రులు వణంక సింహనాదముఁ జేసె
భూనభోంతరములు బొబ్బరిలఁగ;
ధరియించి శస్త్రముల్ ధవళాస్యులకు గర్వ
భంగమ్ముఁ జేసె విభ్రాంతి సెలఁగ;
పాండురవదనులఁ బాఱిపోవఁగఁ జేసె
వీరత్వమును జూపి భీతిలంగ;
గీ.
రకరకమ్ముల విలసిల్లి రంగు మీఱి
భగతసింహుని శౌర్యమ్ము వఱలుచుండఁ,
గినుకఁ బూని యాంగ్లేయులు గనలుచుండి
రగ్గిపై వేయ నెగసెడి గుగ్గిల మయి!
ఆ.వె.
భారతీయులపయి ఘోరకృత్యము సల్పి
పగను దీర్చుకొనిరి పాలకు లటు;
లంత భగత సింగుఁ డాగ్రహోదగ్రుఁడై
బాంబు విసరి తుదకుఁ బట్టుబడెను!
కం.
ఉరిశిక్ష వేసినంతనె,
స్థిరమగు నానంద మెలమి ధీరత నిడఁగన్,
వరయుతుఁ డగు నా వీరుఁడు
"భరతాంబకు జే" యటంచుఁ బాసె నసువులన్!
రకరకమ్ముల విలసిల్లి రంగు మీఱి
భగతసింహుని శౌర్యమ్ము వఱలుచుండఁ,
గినుకఁ బూని యాంగ్లేయులు గనలుచుండి
రగ్గిపై వేయ నెగసెడి గుగ్గిల మయి!
ఆ.వె.
భారతీయులపయి ఘోరకృత్యము సల్పి
పగను దీర్చుకొనిరి పాలకు లటు;
లంత భగత సింగుఁ డాగ్రహోదగ్రుఁడై
బాంబు విసరి తుదకుఁ బట్టుబడెను!
కం.
ఉరిశిక్ష వేసినంతనె,
స్థిరమగు నానంద మెలమి ధీరత నిడఁగన్,
వరయుతుఁ డగు నా వీరుఁడు
"భరతాంబకు జే" యటంచుఁ బాసె నసువులన్!
తే.గీ.
అమరుఁడైనట్టి యా వీరు నాత్మలోన
నేఁటి దినమున స్మరియించి, నిశ్చలమగు
దేశభక్తియె మనమున దీప్తు లెసఁగ,
నతనిఁ గొనియాఁడుఁడీ భారతాంబ మ్రోల!
జై హింద్!
జై హింద్!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి