ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదియెనిమిదవ పద్యము:
చంపకమాల:
చని, గురుబంధులన్ జనుల సంగరమందునఁ జంప జంకఁ, గ
ఱ్ఱినిఁ గనియున్, వెసన్ విరజ! కృష్ణ! మధుద్విష! ప్రేమతోడ న
ర్జును, గురు రూపముం గృపనుఁ జూపి, రమేశ్వర! గీత విన్చి, విం
త నెఱపితే! హరీ! ఘన కృతమ్ము వహింపఁగఁ గాతె! కేశవా! 48
గర్భిత కందము:
గురుబంధులన్ జనుల సం
గర మందునఁ జంప జంకఁ, గఱ్ఱినిఁ గనియున్,
గురు రూపముం గృపనుఁ జూ
పి, రమేశ్వర! గీత విన్చి, వింత నెఱపితే! 48
గర్భిత తేటగీతి:
జనులఁ దద్దురమందునఁ జంప జంక,
విరజ! కృష్ణ! మధుద్విష! ప్రేమతోడఁ,
గృపనుఁ దాల్చి, రమేశ్వర! గీత విన్చి,
ఘన కృతమ్ము వహింపఁగఁ గాతె! కేశ! 48
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి