ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదినాలుఁగవ పద్యము:
చంపకమాల:
స్థితమతి! చేకొనన్ నిను వశీకృతి, సత్యను నెగ్గనీక, కే
రితె తులలో! నిధుల్ తొలుక ఋక్థము వేసిన తూఁగవైతి వో
ద్రుతకృత! భక్తిచేఁ దులసితో సతి రుక్మిణి తూఁచె నిన్ను! శౌ
రి! తనరితే! కడున్ నతులు శ్రీశ! మనోజ్ఞ మనస్క! కేశవా! 44
గర్భిత కందము:
మతి చేకొనన్ నిను వశీ
కృతి, సత్యను నెగ్గనీక కేరితె తులలో!
కృత భక్తిచేఁ దులసితో
సతి రుక్మిణి తూఁచె నిన్ను! శౌరి! తనరితే! 44
గర్భిత తేటగీతి:
నిను వశీకృతి, సత్యయె నెగ్గనీక,
తొలుక ఋక్థము వేసిన తూఁగవైతి!
తులసితో సతి రుక్మిణి తూఁచె నిన్ను!
నతులు శ్రీశ! మనోజ్ఞ మనస్క! కేశ! 44
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి