ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]
నలుఁబదిమూఁడవ పద్యము:
చంపకమాల:
హిత ఘన! రాఘవా! భృగుకులేశుని చేతఁ బరీక్షనంద, స్తో
త్రిత నృవరా! కడున్ వెసను, ధీరవరాఢ్య! పవిత్రగాత్ర! స
న్నుత! మనుజాధిపా! హరిధనుస్సును నెత్తియు, నల్లెఁ బూన్చి, శూ
ర! తనరితే! భువిం బ్రణతు లందితె! శ్రీరఘురామ! కేశవా! 43
గర్భిత కందము:
ఘన! రాఘవా! భృగుకులే
శుని చేతఁ బరీక్షనంద, స్తోత్రిత నృవరా!
మనుజాధిపా! హరిధను
స్సును నెత్తియు, నల్లెఁ బూన్చి, శూర! తనరితే! 43
గర్భిత తేటగీతి:
భృగుకులేశునిచేతఁ బరీక్షనంద,
వెసను ధీరవరాఢ్య! పవిత్రగాత్ర!
హరిధనుస్సును నెత్తియు, నల్లెఁ బూన్చి,
ప్రణతు లందితె! శ్రీరఘురామ! కేశ! 43
స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి