తేది: సెప్టెంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
ద్విత్వ, సంయుక్తాక్షరాలను ఉపయోగించకుండా
సత్య హరిశ్చంద్రుని గుఱించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన సీసపద్యము
||సీ||
ఇరుమూఁడు పుడమి కా ♦ పరులందు మొదటి వాఁ
డయి, నిజమరియైన ♦ ధవళితయశుఁ;
డాడిన మాటకై ♦ యడలక యడరెడు
నాడిక విడనాడు ♦ నయవిదుండు;
తనను వెంటాడెడు ♦ ధరణీసురుని ఘన
ఋణముఁ దీరుపఁ జను ♦ ఋజుగమనుఁడు;
తన సతీసుతుల నా ♦ దరమునఁ గొనఁగాను
విపణివీథిని వేడు ♦ వినయధనుఁడు;
తన వెలనిడఁగాను ♦ తానె చండాలు సే
వకుఁడైన కాటికా ♦ పరి యతండు;
||గీ||
ఉరగ దంశనమునఁ దన ♦ యుండుఁ జావఁ
గాటి సుంకముం గోరిన ♦ కారయితుఁడు;
సతిని నేరాభియోగానఁ ♦ జంపుమనెడి
రాజునానతిఁ దలనిడు ♦ రతన మతఁడు!!















.jpg)


.jpg)

