Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, జులై 02, 2021

ఏఁబదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదియేడవ పద్యము:

చంపకమాల:
తొలిఁ, దపియించుచుం జిదవధూత పణం బిడ, శ్రీనివాస! దా
పులఁ బిలువన్, వెసన్ వెడలి, భూషణ మొక్కటి వీడి, తప్డు గా
సిలి నృపుఁ డాతనిం జెఱనుఁ జేరుప, దంతిగఁ జేరి, తింటె, లో
పలి చెఱకున్! హరీ! తబిసి వాంఛనుఁ దీర్చితె! తార్క్ష్య! కేశవా! 57

గర్భిత కందము:
తపియించుచుం జిదవధూ
త పణం బిడ, శ్రీనివాస! దాపులఁ బిలువన్,
నృపుఁ డాతనిం జెఱనుఁ జే
రుప, దంతిగఁ జేరి, తింటె, లోపలి చెఱకున్! 57

గర్భిత తేటగీతి:
చిదవధూత పణం బిడ, శ్రీనివాస!
వెడలి, భూషణ మొక్కటి వీడి, తప్డు
చెఱనుఁ జేరుప, దంతిగఁ జేరి, తింటె!
తబిసి వాంఛనుఁ దీర్చితె! తార్క్ష్య! కేశ! 57



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఏఁబదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదియాఱవ పద్యము:

చంపకమాల:
అనుచరియై వెసం గుతిని నాసుర, తాఁ జని, కోరి నిన్ను, శూ
ర్పణఖ యటం ద్వరన్ మనుజ భామిని రూపున, మైక మొప్ప, నిన్
గని, సురతం బిడం బనవఁ, గ్రమ్మఱ లక్ష్మణు పాలి కంపి, మా
య నడఁపితే! హరీ! యసుర కందము వాపితె! యయ్య! కేశవా! 56

గర్భిత కందము:
చరియై వెసం గుతిని నా
సుర, తాఁ జని, కోరి నిన్ను, శూర్పణఖ యటన్
సురతం బిడం బనవఁ, గ్ర
మ్మఱ లక్ష్మణు పాలి కంపి, మాయ నడఁపితే! 56

గర్భిత తేటగీతి:
కుతిని నాసుర, తాఁ జని, కోరి నిన్ను,
మనుజ భామిని రూపున, మైక మొప్పఁ
బనవఁ, గ్రమ్మఱ లక్ష్మణు పాలి కంపి,
యసుర కందము వాపితె! యయ్య! కేశ! 56



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

గురువారం, జులై 01, 2021

ఏఁబదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదియైదవ పద్యము:

చంపకమాల:
నెఱి నిల నీ స్థితి న్నెఱుఁగ, ని న్నల దేవమునీంద్రుఁ డంత, నం
దఱఁ గనఁ, దాఁ జన, న్నచట దారల, నెంచఁ బదాఱువేల నం
దఱ, నల వల్లభల్ ప్రముదితల్ గల నిన్ గనఁ, బ్రస్తుతింతె క్ర
మ్మఱ నగుచున్! హరీ! యెసఁగ మానిత సత్కృతు లిత్తె! కేశవా! 55

గర్భిత కందము:
ఇల నీ స్థితి న్నెఱుఁగ, ని
న్నల దేవమునీంద్రుఁడంత, నందఱఁ గనఁ, దా
నల వల్లభల్ ప్రముదితల్
గల నిన్ గనఁ, బ్రస్తుతింతె క్రమ్మఱ నగుచున్! 55

గర్భిత తేటగీతి:
ఎఱుఁగ, ని న్నల దేవమునీంద్రుఁడంత,
నచట దారల, నెంచఁ బదాఱువేల
ప్రముదితల్ గల నిన్ గనఁ, బ్రస్తుతింతె!
యెసఁగ మానిత సత్కృతు లిత్తె! కేశ! 55



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఏఁబదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
భువి జన సంస్తుతా! పితయె పొమ్మనఁ గానకు, వేగఁ జేరి, య
ర్కవరకులా! హరీ! సతియు, గాదిలి తమ్ముఁడు సంతసింప, శ్రీ
ధవ! ఘన వర్తనా!  బరఁగ దానినె స్వర్గము పాటిదంచు, ని
ల్చి, వఱలితే! విధిన్ బ్రచుర ప్రీతినిఁ దాల్చితె! రామ! కేశవా! 54

గర్భిత కందము:
జన సంస్తుతా! పితయె పొ
మ్మనఁ గానకు, వేగఁ జేరి, యర్కవరకులా!
ఘన వర్తనా!  బరఁగ దా
నినె స్వర్గము పాటిదంచు, నిల్చి, వఱలితే! 54

గర్భిత తేటగీతి:
పితయె పొమ్మనఁ గానకు, వేగఁ జేరి,
సతియు, గాదిలి తమ్ముఁడు సంతసింపఁ,
బరఁగ దానినె స్వర్గము పాటిదంచుఁ,
బ్రచుర ప్రీతినిఁ దాల్చితె! రామ! కేశ! 54



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఏఁబదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదిమూఁడవ పద్యము:

చంపకమాల:
సిరి వర! నీ యరిన్ నరకు, శ్రేష్ఠ రణమ్మున నష్టపుచ్చ, స
త్య రమణమై వెసన్ సకియ తానె యెదుర్కొనఁ, జక్రి! నీవె, సు
స్థిర! వెరఁగంద నా నరకుఁ జెచ్చెరఁ జంపితె నల్లనయ్య! చి
త్పరమిడితే! త్వరన్ భువికిఁ బంచితె మోదముఁ బూజ్య! కేశవా! 53

గర్భిత కందము:
వర! నీ యరిన్ నరకు శ్రే
ష్ఠ రణమ్మున నష్టపుచ్చ, సత్య రమణమై
వెరఁగంద, నా నరకుఁ జె
చ్చెరఁ జంపితె నల్లనయ్య! చిత్పరమిడితే! 53

గర్భిత తేటగీతి:
నరకు శ్రేష్ఠ రణమ్మున నష్టపుచ్చ,
సకియ తానె యెదుర్కొనఁ, జక్రి! నీవె,
నరకుఁ జెచ్చెరఁ జంపితె నల్లనయ్య!
భువికిఁ బంచితె మోదముఁ బూజ్య! కేశ! 53


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

బుధవారం, జూన్ 30, 2021

ఏఁబదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదిరెండవ పద్యము:

చంపకమాల:
ధర సుమనోహరా! మరణ తర్కము కాళియు మల్లరమ్ముగా
నెఱిఁగియు, నో హరీ! మడుఁగు నీఁగియు, నచ్చట మారుతాశితో
దుర మమలోత్తరా! యఱిమి, దుష్టమునౌ మదమార్పి, నృత్యస
ద్వరమిడితే! వెసం బటిమ వర్ధిలఁ దేర్చితె! వ్యక్త! కేశవా! 52

గర్భిత కందము:
సుమనోహరా! మరణ త
ర్కము కాళియు మల్లరమ్ముగా నెఱిఁగియు, నో
యమలోత్తరా! యఱిమి, దు
ష్టమునౌ మదమార్పి, నృత్యసద్వరమిడితే! 52

గర్భిత తేటగీతి:
మరణ తర్కము కాళియు మల్లరమ్ము;
మడుఁగు నీఁగియు, నచ్చట మారుతాశి
నఱిమి, దుష్టమునౌ మదమార్పి, నృత్య
పటిమ వర్ధిలఁ దేర్చితె! వ్యక్త! కేశ! 52


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఏఁబదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]

ఏఁబదియొకటవ పద్యము:

చంపకమాల:
హిత ఘన! రాఘవా! భరతుఁడే నిను రాజుగఁ బ్రాప్తిఁ గోర, నీ
హితమడుగన్ వెసన్ నృప మహేంద్ర! కనీయుఁ దృణీకరించి, త్రి
వ్రత! జనపూజితా! పరమ పాద నిషేవిత పాదుకాళి ధ
న్యత నిడితే! హరీ! వర వినమ్రున కిత్తె శుభమ్ముఁ గేశవా! 51

గర్భిత కందము:
ఘన! రాఘవా! భరతుఁడే
నిను రాజుగఁ బ్రాప్తిఁ గోర, నీ హితమడుగన్,
జనపూజితా! పరమ పా
ద నిషేవిత పాదుకాళి ధన్యత నిడితే! 51

గర్భిత తేటగీతి:
భరతుఁడే నిను రాజుగఁ బ్రాప్తిఁ గోర,
నృప మహేంద్ర! కనీయుఁ దృణీకరించి,
పరమ పాద నిషేవిత పాదుకాళి
వర వినమ్రున కిత్తె శుభమ్ముఁ గేశ! 51


స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, జూన్ 29, 2021

ఏఁబదియవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ఏఁబదియవ పద్యము:

చంపకమాల:
వర! కువలేశయా! తుదినిఁ బాండవు లోడఁగ ద్యూతమందునన్,
సరవి ఖలుల్ మద మ్మెసఁగి, సాధ్విని ద్రౌపది నీడ్చి, తెచ్చి, క్ర
మ్మఱ, భవనాశకా! యుఱికి, మానవతిన్ వలు వూడ్చ, నిత్తె నా
గర వసనాల్! హరీ! హిత ప్రకాశక భాగ్యము నీశ! కేశవా! 50

గర్భిత కందము:
కువలేశయా! తుదినిఁ బాం
డవు లోడఁగ ద్యూతమందునన్, సరవి ఖలుల్
భవనాశకా! యుఱికి, మా
నవతిన్ వలు వూడ్చ, నిత్తె నాగర వసనాల్! 50

గర్భిత తేటగీతి:
తుదినిఁ బాండవు లోడఁగ ద్యూతమందు,
నెసఁగి, సాధ్విని ద్రౌపది నీడ్చి, తెచ్చి,
యుఱికి, మానవతిన్ వలు వూడ్చ, నిత్తె
హిత ప్రకాశక భాగ్యము నీశ! కేశ! 50



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నలుఁబదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
మన, రయ మత్తఱి న్నిలను మానియు యాదవు లింద్రపూజ నే
ర్పున, లలి నా దెసం బరఁగ మ్రొక్కిరి గోఽభయ పర్వతమ్ముఁ! గ్రు
మ్మను, హయుఁ డప్డిడన్ జడిని, మాయ యణంగఁగ, శైల మెత్తి, యా
ర్తి నడఁపితే! హరీ! జనులఁ దేర్చితె తుష్టినిఁ జక్రి! కేశవా! 49

గర్భిత కందము:
రయ మత్తఱి న్నిలను మా
నియు యాదవు లింద్రపూజ నేర్పున, లలి నా
హయుఁ డప్డిడన్ జడిని, మా
య యణంగఁగ, శైల మెత్తి, యార్తి నడఁపితే! 49

గర్భిత తేటగీతి:
ఇలను మానియు యాదవు లింద్రపూజఁ,
బరఁగ మ్రొక్కిరి గోఽభయ పర్వతమ్ము!
జడిని మాయ యణంగఁగ, శైల మెత్తి,
జనులఁ దేర్చితె తుష్టినిఁ జక్రి! కేశ! 49



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్

సోమవారం, జూన్ 28, 2021

నలుఁబదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ



శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
చని, గురుబంధులన్ జనుల సంగరమందునఁ జంప జంకఁ, గ
ఱ్ఱినిఁ గనియున్, వెసన్ విరజ! కృష్ణ! మధుద్విష! ప్రేమతోడ న
ర్జును, గురు రూపముం గృపనుఁ జూపి, రమేశ్వర! గీత విన్చి, విం
త నెఱపితే! హరీ! ఘన కృతమ్ము వహింపఁగఁ గాతె! కేశవా! 48

గర్భిత కందము:
గురుబంధులన్ జనుల సం
గర మందునఁ జంప జంకఁ, గఱ్ఱినిఁ గనియున్,
గురు రూపముం గృపనుఁ జూ
పి, రమేశ్వర! గీత విన్చి, వింత నెఱపితే! 48

గర్భిత తేటగీతి:
జనులఁ దద్దురమందునఁ జంప జంక,
విరజ! కృష్ణ! మధుద్విష! ప్రేమతోడఁ,
గృపనుఁ దాల్చి, రమేశ్వర! గీత విన్చి,
ఘన కృతమ్ము వహింపఁగఁ గాతె! కేశ! 48



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

ఆదివారం, జూన్ 27, 2021

నలుఁబదియేడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదియేడవ పద్యము:

చంపకమాల:
హరి! చెవులందునన్ జననమంది, వరోద్ధతి, శక్తిఁ జూపి, ధీ
వర! చెలఁగ, న్మఱిం దఱుమ బ్రహ్మను, ని న్వడిఁ దానుఁ జేర, శ్రీ
వర! భవదూరువన్ క్షమకుఁ బంపు వహి, న్మధుకైటభాంత్యమున్
జరపితివే! శుభ మ్మొసఁగి, సాఁగితివే! పురుహూతి! కేశవా! 47

గర్భిత కందము:
చెవులందునన్ జననమం
ది, వరోద్ధతి, శక్తిఁ జూపి, ధీవర! చెలఁగన్,
భవదూరువన్ క్షమకుఁ బం
పు వహి, న్మధుకైటభాంత్యమున్ జరపితివే! 47

గర్భిత తేటగీతి:
జననమంది, వరోద్ధతి, శక్తిఁ జూపి,
తఱుమ బ్రహ్మను, ని న్వడిఁ దానుఁ జేర,
క్షమకుఁ బంపు వహి, న్మధుకైటభాంత్య
మొసఁగి, సాఁగితివే! పురుహూతి! కేశ! 47



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నలుఁబదియాఱవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదియాఱవ పద్యము:

చంపకమాల:
హరి! సడి వించు, నిన్ గనియు, "నల్లుఁడ ర" మ్మనఁ గంసుఁడప్డు క్రూ
ర రవమునన్ నినున్, వెసను మ్రక్కిడి మల్లుర, విక్రమించి, డ
గ్గఱి, నడి కొల్వునన్ జనులుఁ గన్నిడ, మామనుఁ జంపినావె, నీ
వరి సరివై! యిదే ప్రణతి! పావనరూప! వరాంగ! కేశవా! 46

గర్భిత కందము:
సడి వించు, నిన్ గనియు, "న
ల్లుఁడ ర" మ్మనఁ, గంసుఁడప్డు క్రూర రవమునన్,
నడి కొల్వునన్ జనులుఁ గ
న్నిడ మామనుఁ జంపినావె నీ వరి సరివై! 46

గర్భిత తేటగీతి:
కనియు, "నల్లుఁడ ర" మ్మనఁ గంసుఁడప్డు,
వెసను మ్రక్కిడి మల్లుర, విక్రమించి,
జనులుఁ గన్నిడ, మామనుఁ జంపినావె!
ప్రణతి! పావనరూప! వరాంగ! కేశ! 46



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శనివారం, జూన్ 26, 2021

నలుఁబదియైదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదియైదవ పద్యము:

చంపకమాల:
హరవినుతోద్గుణా! యతివయైనను, తాటక నంపఁజంపినన్,
సరసగుణా! ధ్రువా! యసుర జాతు, విభీషణు నాదరించినన్,
హరి! దనుజద్విషా! పసరమైనను, మారుతి భక్తి మెచ్చినన్,
స్థిరకృపయే కదా! జన వశీకర! వెల్గితె చక్రి! కేశవా! 45

గర్భిత కందము:
వినుతోద్గుణా! యతివయై
నను, తాటక నంపఁజంపినన్, సరసగుణా!
దనుజద్విషా! పసరమై
నను, మారుతి భక్తి మెచ్చినన్, స్థిరకృపయే! 45

గర్భిత తేటగీతి:
యతివయైనను, తాటక నంపఁజంపి,
యసుర జాతు, విభీషణు నాదరించి,
పసరమైనను, మారుతి భక్తి మెచ్చి,
జన వశీకర! వెల్గితె చక్రి! కేశ! 45



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నలుఁబదినాలుఁగవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదినాలుఁగవ పద్యము:

చంపకమాల:
స్థితమతి! చేకొనన్ నిను వశీకృతి, సత్యను నెగ్గనీక, కే
రితె తులలో! నిధుల్ తొలుక ఋక్థము వేసిన తూఁగవైతి వో
ద్రుతకృత! భక్తిచేఁ దులసితో సతి రుక్మిణి తూఁచె నిన్ను! శౌ
రి! తనరితే! కడున్ నతులు శ్రీశ! మనోజ్ఞ మనస్క! కేశవా! 44

గర్భిత కందము:
మతి చేకొనన్ నిను వశీ
కృతి, సత్యను నెగ్గనీక కేరితె తులలో!
కృత భక్తిచేఁ దులసితో
సతి రుక్మిణి తూఁచె నిన్ను! శౌరి! తనరితే! 44

గర్భిత తేటగీతి:
నిను వశీకృతి, సత్యయె నెగ్గనీక,
తొలుక ఋక్థము వేసిన తూఁగవైతి!
తులసితో సతి రుక్మిణి తూఁచె నిన్ను!
నతులు శ్రీశ! మనోజ్ఞ మనస్క! కేశ! 44



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

శుక్రవారం, జూన్ 25, 2021

నలుఁబదిమూఁడవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదిమూఁడవ పద్యము:

చంపకమాల:
హిత ఘన! రాఘవా! భృగుకులేశుని చేతఁ బరీక్షనంద, స్తో
త్రిత నృవరా! కడున్ వెసను, ధీరవరాఢ్య! పవిత్రగాత్ర! స
న్నుత! మనుజాధిపా! హరిధనుస్సును నెత్తియు, నల్లెఁ బూన్చి, శూ
ర! తనరితే! భువిం బ్రణతు లందితె! శ్రీరఘురామ! కేశవా! 43

గర్భిత కందము:
ఘన! రాఘవా! భృగుకులే
శుని చేతఁ బరీక్షనంద, స్తోత్రిత నృవరా!
మనుజాధిపా! హరిధను
స్సును నెత్తియు, నల్లెఁ బూన్చి, శూర! తనరితే! 43

గర్భిత తేటగీతి:
భృగుకులేశునిచేతఁ బరీక్షనంద,
వెసను ధీరవరాఢ్య! పవిత్రగాత్ర!
హరిధనుస్సును నెత్తియు, నల్లెఁ బూన్చి,
ప్రణతు లందితె! శ్రీరఘురామ! కేశ! 
43



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

నలుఁబదిరెండవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదిరెండవ పద్యము:

చంపకమాల:
చెలి కిడఁ బుష్పమున్, సఖియ సెప్పెడు కొండెము సత్య పూని, పే
రలుక మెయిం గడున్ వెగడ, నచ్యుత! యొప్పియు, వేల్పుఁజెట్టు నీ
విల వడి నెమ్మితో నడుగ, నింద్రుఁ డసమ్మతి, నాజి నోడి, దో
యిలి నిడెగా! హరీ! యగము నిచ్చెఁగదా! యవనారి! కేశవా! 42

గర్భిత కందము:
ఇడఁ బుష్పమున్, సఖియ సె
ప్పెడు కొండెము సత్య పూని, పేరలుక మెయిన్
వడి నెమ్మితో, నడుగ, నిం
ద్రుఁ డసమ్మతి, నాజి నోడి, దోయిలి నిడెగా! 42

గర్భిత తేటగీతి:
సఖియ సెప్పెడు కొండెము సత్య పూని,
వెగడ, నచ్యుత! యొప్పియు, వేల్పుఁజెట్టు
నడుగ, నింద్రుఁ డసమ్మతి, నాజి నోడి,
యగము నిచ్చెఁగదా! యవనారి! కేశ! 42



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు


గురువారం, జూన్ 24, 2021

నలుఁబదియొకటవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదియొకటవ పద్యము:

చంపకమాల:
హిత మలరార నా శబరి యెంగిలి పండ్లనుఁ జక్క నీయ, గీ
ము తళుకిడన్, వెసం గొనియు, మోదమునం దిని, కూర్మిఁ జూచి, స
న్మతిఁ బులకింతలుం బ్రబల, మంగళరూప! పరమ్మునిత్తె కాం
క్షిత మొదవన్! హరీ! ప్రణతి సేసెద శ్రీరఘురామ! కేశవా! 41

గర్భిత కందము:
అలరార నా శబరి యెం
గిలి పండ్లనుఁ జక్క నీయ, గీము తళుకిడం,
బులకింతలుం బ్రబల, మం
గళరూప! పరమ్మునిత్తె కాంక్షిత మొదవన్! 41

గర్భిత తేటగీతి:
శబరి యెంగిలి పండ్లనుఁ జక్క నీయఁ,
గొనియు, మోదమునం దిని, కూర్మిఁ జూచి,
ప్రబల! మంగళరూప! పరమ్మునిత్తె!
ప్రణతి సేసెద శ్రీరఘురామ! కేశ! 41



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

బుధవారం, జూన్ 23, 2021

నలుఁబదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


నలుఁబదవ పద్యము:

చంపకమాల:
స్మరగురు! ధీమతా! యిడితె సద్గురుదక్షిణ! నేఁగ బిద్దెకున్,
నరకపతిం గనం, బలికె నైతలసద్ముఁడు స్వాగతమ్ములన్,
నెఱిఁ బరికింపఁ, దా నెఱిఁగి నిన్ను, రహింపఁగ నీయ బిడ్డనున్
స్థిరమతియై! వెసం బొసఁగఁ జేసితివే గురుపూజఁ! గేశవా! 40

గర్భిత కందము:
గురు ధీమతా! యిడితె స
ద్గురుదక్షిణ! నేఁగ బిద్దెకున్, నరకపతిన్
బరికింపఁ, దా నెఱిఁగి ని
న్ను, రహింపఁగ నీయ బిడ్డఁనున్ స్థిరమతియై. 40

గర్భిత తేటగీతి:
ఇడితె సద్గురుదక్షిణ! నేఁగ బిద్దెఁ,
బలికె నైతలసద్ముఁడు స్వాగతమ్ము!
నెఱిఁగి నిన్ను, రహింపఁగ నీయ బిడ్డఁ!
బొసఁగఁ జేసితివే గురుపూజఁ! గేశ! 40



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

మంగళవారం, జూన్ 22, 2021

ముప్పదితొమ్మిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదితొమ్మిదవ పద్యము:

చంపకమాల:
శని వడి మూర్ఖుఁడై శపథి సాల్వుఁడు, సౌభక సంస్థితుండు మో
దను గినుకన్, వెసం జెలఁగి ద్వారక ముట్టడి సేయ, పోర; రేఁ
గిన వడి, దుష్టుపై స్వక శిఖిన్ విడి, నీ ఘన చక్ర మేసి, వే
దునిమితివే! హరీ! తుదకుఁ దూర్ణమె గూర్చితె తుష్టిఁ గేశవా! 39

గర్భిత కందము:
వడి మూర్ఖుఁడై శపథి సా
ల్వుఁడు, సౌభక సంస్థితుండు మోదను గినుకన్,
వడి, దుష్టుపై స్వక శిఖిన్
విడి, నీ ఘన చక్ర మేసి, వే దునిమితివే! 39

గర్భిత తేటగీతి:
శపథి సాల్వుఁడు, సౌభక సంస్థితుండు
చెలఁగి ద్వారక ముట్టడి సేయ, పోర;
స్వక శిఖిన్ విడి, నీ ఘన చక్ర మేసి,
తుదకుఁ దూర్ణమె గూర్చితె తుష్టిఁ గేశ! 39




స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు

సోమవారం, జూన్ 21, 2021

ముప్పదియెనిమిదవ పద్యము: శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము [గర్భకవిత్వము]

ఓం నమో భగవతే వాసుదేవాయ


శ్రీ కేశవ కంద గీత గర్భ చంపకోత్పల శతకము
[గర్భకవిత్వము]


ముప్పదియెనిమిదవ పద్యము:

చంపకమాల:
అనువరభూతిఁ దా నల గజాసురు గర్భమునందునుండఁ, జు
వ్వన వెలికిం గొనం బ్రమథ వర్గము, శార్ఙ్గధరా! నుతించి, భ
ర్గునిఁ దరలింప నిన్ బరఁగఁ గోర, రయమ్మునఁ బన్ని మాయఁ, ద్ర్య
క్షు నెడపితే! వెసన్ వెడలఁ జోద్య మొనర్చితె! విష్ణు! కేశవా! 38

గర్భిత కందము:
వరభూతిఁ దా నల గజా
సురు గర్భమునందునుండఁ, జువ్వన వెలికిం
దరలింప నిన్ బరఁగఁ గో
ర, రయమ్మునఁ బన్ని మాయఁ, ద్ర్యక్షు నెడపితే! 38

గర్భిత తేటగీతి:
అల గజాసురు గర్భమునందునుండఁ,
బ్రమథ వర్గము, శార్ఙ్గధరా! నుతించి,
పరఁగఁ గోర, రయమ్మునఁ బన్ని మాయ,
వెడలఁ జోద్య మొనర్చితె! విష్ణు! కేశ! 38



స్వస్తి
’మధురకవి’ గుండు మధుసూదన్, శేషాద్రిహిల్స్, ఓరుగల్లు