Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

గురువారం, అక్టోబర్ 02, 2014

పద్య రచన: సద్దుల బతుకమ్మ...

కవి పండిత మిత్రులకు, వీక్షకపాఠకులకు
సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు!!

తేది: అక్టోబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు:



||సీ||
తంగేడు పూవులఁ ♦ దాంబాలమునఁ గుండ్ర
    ముగ నందముగఁ బేర్చి, 
♦ మురువు సూపు
వివిధమ్ములగు రంగు 
♦ లవి గునుగులఁ జేర్చి,
    మందార, కట్ల, చే 
♦ మంతుల నిడి,
బంతిపూవులు పోక 
♦ బంతిపూవులు వింత
    సొబగుల నీనఁగాఁ 
♦ జూపరులకుఁ
బ్రకృతి సోయగమంతఁ 
♦ బండువు సేయంగ
    బ్రతుకమ్మ నడుమ గౌ 
♦ రమ్మనుంచి,

||గీ||
ధగధగలతోడి పట్టుపీ ♦ తాంబరములఁ
గట్టుకొనియును మెఱయుచు 
♦ ఘనముగాను
కనకదుర్గకు లక్ష్మికిఁ 
♦ గడు ముదమున
వందనము సేసి, యర్చింత్రు 
♦ పడతులంత!

||కం||
బ్రతుకమ్మఁ బట్టుకొనియు వ
నితలందఱు నూరిచివర ♦ నిక్కపు భక్త్యు
న్నతిఁ బాడి పాట, లాడియు,
నతులయి నీటను నిమజ్జ 
♦ నము సేతురయా!

||ఆ.వె.||
ముత్తయిదువు లపుడు ♦ పూతురు పసుపును
పుస్తెలకును గౌరి 
♦ పూజసేసి!
సన్నిహితులు హితులు 
♦ సఖులంత కష్టసు
ఖములఁ జెప్పికొనఁగఁ 
♦ గలిసెద రట!

||తే.గీ.||
ఇంటినుండియుఁ దెచ్చిన ♦ హితకరమగు
తీపివస్తువులనుఁ బంచి, 
♦ తినియు, మఱల
సద్దులను మూటగట్టియు 
♦ సంబరమున
నిండ్లకుం జేరఁ బోదురా 
♦ యింతులంత!

మంగళవారం, సెప్టెంబర్ 30, 2014

సమస్య: గుడికేగుట మేలు కల్లుఁ గొని భక్తులకున్

తేది: సెప్టెంబర్ 19, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు:


(1)
ఒడిదొడుకు లిడక వరముల
నిడు పోచమతల్లిఁ గొలుచు♦ నేమముతోడన్
విడువక సాకనుఁ బోయఁగ
గుడికేగుట మేలు కల్లుఁ ♦ గొని భక్తులకున్!!

(2)
జడదారిఁ గొలువ భక్తుఁడు
గుడి కేగుట మేలు! కల్లుఁ ♦ గొని భక్తులకున్,
మృడున కపచార మిడకయ
వడిగా నిలు సేర మేలు ♦ పాయికి మిగులన్!!


(3)
మడితో నెట కేగుట మేల్?
వెడ శుక్రుం డేమి గొనియుఁ ♦ బ్రీతుం డగునో?
వడి వేల్పెవరికి వరమిడు?
గుడి కేగుట మేలు; కల్లుఁ ♦ గొని; భక్తులకున్!!

సోమవారం, సెప్టెంబర్ 29, 2014

దత్తపది: అల-కల-తల-వల...రావణుని చెరలో సీత మనోగతం...స్వేచ్ఛాచ్ఛందము...

తేది: సెప్టెంబర్ 18, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
అల-కల-తల-వల పదములనుపయోగించి
రావణుని చెరలో సీత మనోగతాన్ని తెలుపుతూ
స్వేచ్ఛాచ్ఛందమున పద్యం రాయమనగా
నేను రాసిన సీసపద్యము


(అశోకవనమున రాక్షసస్త్రీల నడుమఁ జెఱలోనుండి శ్రీరామునిఁ దలఁచుకొనుచు సీత విలపించు సందర్భము)

॥సీ॥
అలరారు నడలతో ♦ నలరు బంగరు జింకఁ 
గోరఁగ, నీ వేగ, ♦ నలవికాని
సకల మాయలఁ గ్రమ్మి, ♦ సరగున నిఁక లంక
కునుఁ దెచ్చి, కలఁగించెఁ ♦ గూటవృత్తుఁ
డగు పదితలల దుం ♦ డగుఁడు, దుశ్చింతల
వంతల నిడె నాకు ♦ బలిమితోడఁ;
జావవలచియుంటి ♦ సత్వర మ్మీవిట
నడుగిడకున్న, దా ♦ నవల వలన!

॥గీ॥
నలవి కానట్టి చెఱను నే ♦ ననుభవించు
చుంటి; వికలమాయెను హృది; ♦ శోభ తలఁగెఁ;
దలఁపులో నిన్ను నిలిపితి; ♦ దనుజుఁ జంపి,
త్వరగ ననుఁ జెఱనుండి యీ ♦ వలకుఁ దెమ్ము!!

ఆదివారం, సెప్టెంబర్ 28, 2014

సమస్య: వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె

తేది: సెప్టెంబర్ 17, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(పింగళి సూరన కళాపూర్ణోదయకథలో బ్రహ్మసరస్వతుల సరస సంభాషణ నిచ్చట ననుసంధానించుకొనునది)

రెండు జన్మాల కథల విరించి చెప్ప;
వాణి తమదు ప్రణయకథా వర్ణనమనె!
వాణికిఁ దెలివి లేదని బ్రహ్మ పలికె;
బ్రహ్మ వివరణమును విని వాణి నవ్వె!!

శుక్రవారం, సెప్టెంబర్ 26, 2014

న్యస్తాక్షరి: నగర జీవనము...కందపద్యము...1వ పాదంలో 1వ అక్షరం-న, 2పా. 2అ.-గ, 3పా. 3అ.-ర, 4పా. 4అ.-ము...

తేది: సెప్టెంబర్ 16, 2014 నాటి శంకరాభరణంలో
న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం - నగర జీవనము
ఛందస్సు - కందము
మొదటిపాదం, మొదటి అక్షరం ‘న’,
రెండవపాదం, రెండవ అక్షరం ‘గ’,
మూడవ పాదం, మూడవ అక్షరం ‘ర’,
నాల్గవ పాదం, నాల్గవ అక్షరం ‘ము’


నగరమునఁ గృత్రిమత్వ
మ్మ
గపడు నెటఁజూడఁ జనవు మానవబంధా
లొగి
రవరవలం గనఁ జా
టుగఁ గు
ములుచు బయటికిఁ బొగడుదురయ మిగులన్!!


బుధవారం, సెప్టెంబర్ 24, 2014

నిషిద్ధాక్షరి: ద్విత్వ, సంయుక్తాక్షర నిషేధం...సత్యహరిశ్చంద్ర వర్ణన...స్వేచ్ఛాఛందం...

తేది: సెప్టెంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
ద్విత్వ, సంయుక్తాక్షరాలను ఉపయోగించకుండా
సత్య హరిశ్చంద్రుని గుఱించి
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయమనగా
నేను వ్రాసిన సీసపద్యము


||సీ||
ఇరుమూఁడు పుడమి కా ♦ పరులందు మొదటి వాఁ
డయి, నిజమరియైన ♦ ధవళితయశుఁ;
డాడిన మాటకై ♦ యడలక యడరెడు
నాడిక విడనాడు ♦ నయవిదుండు;
తనను వెంటాడెడు ♦ ధరణీసురుని ఘన
ఋణముఁ దీరుపఁ జను ♦ ఋజుగమనుఁడు;
తన సతీసుతుల నా ♦ దరమునఁ గొనఁగాను
విపణివీథిని వేడు ♦ వినయధనుఁడు;
తన వెలనిడఁగాను ♦ తానె చండాలు సే
వకుఁడైన కాటికా ♦ పరి యతండు;

||గీ||
ఉరగ దంశనమునఁ దన ♦ యుండుఁ జావఁ
గాటి సుంకముం గోరిన ♦ కారయితుఁడు;
సతిని నేరాభియోగానఁ ♦ జంపుమనెడి
రాజునానతిఁ దలనిడు ♦ రతన మతఁడు!!

మంగళవారం, సెప్టెంబర్ 23, 2014

పద్యరచన: మాయూరు...ఓరుఁగల్లు

తేది: సెప్టెంబర్ 14, 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన "మా యూరు"ను గూర్చి నేను రాసిన సీసపద్యము


మా యూరి నోరుఁగంటినిఁ దలఁచినకొలఁది మది పులకించును

||సీ||
కాకతీయుల యోరుఁ ♦ గల్లున గతవైభ
వపుఁ జిహ్నములు నిల్పు ♦ భావనలను;
నట స్వయంభూదేవు ♦ నాలయమందున
దీపించు శివలింగ ♦ దీధితులను;
దొడరి వేస్తంభాల ♦ గుడిలోన వెలసిన
పరమేశ్వరకృపా ప్ర ♦ భాతములను;
గుట్టపైఁ బద్మాక్షి ♦ గురుతరాశీఃప్రద
వీక్షణమ్ములొసంగు ♦ ప్రేరణలను;
||గీ||
భద్రకాళియొసఁగు ♦ పావనాశీఃపూత
మౌ సరోవరజల ♦ మాధురులను;
పరమ పదముఁ జేర్చు ♦ వరద గోవిందుని
యభయముద్ర యిచ్చి ♦ యాదరించు!!
 

శుక్రవారం, సెప్టెంబర్ 19, 2014

సమస్య: స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై

తేది: సెప్టెంబర్ 13, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



స్త్రీలనుఁ బూవులవలెఁ జిర
కాలము కాపాడు తఱిని ♦ ఖలపురుషుల దౌ
ష్ట్యాలకు గుఱికాకుంటకు
స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ ♦ జెల్లదు ధరపై!!


గురువారం, సెప్టెంబర్ 18, 2014

దత్తపది: చింత-నిమ్మ-మామిడి-వెలగ...ద్రౌపది కీచకుని అధిక్షేపించడం...నచ్చిన ఛందం...

తేది: సెప్టెంబర్ 12, 2014 నాటి శంకరాభరణంలోని దత్తపది శీర్షికన ఈయబడిన
చింత-నిమ్మ-మామిడి-వెలగ పదాలను ఉపయోగిస్తూ
ద్రౌపది కీచకుని అధిక్షేపించడాన్ని
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన సీసపద్యము

(ద్రౌపది కీచకునితో పలికిన పలుకులు)

||సీ||
"అన్యకాంతలఁ గోరు ♦ టధమ కృత్యము గాన,
      ననుఁ గోరునట్టి చిం ♦ త నిఁక మాని,
నా కడ్డముగ రాక, ♦ నన్నుఁ బో
నిమ్మన,
      నడ్డుపడక వీడు ♦ మయ్య వేగ;
వేదించకయ నీవు ♦ విడువు
మా మిడిమిడి
      జ్ఞానమ్ము నిప్పుడు ♦ సభ్యతఁ గని,
ది
వ్వెలగమి వెల్గు ♦ దీపించు నట్టుల
      సచ్చరితుండవై ♦ శాంతిఁ గనుము!
||గీ||
లేనిచో నిన్ను నా పతు ♦ లే నిహతునిఁ
జేసి, నీ తృష్ణ నడుగంటఁ ♦ గోసి, మఱల
నే యధముఁడిట్లు దుశ్చేష్టఁ ♦ జేయకుండఁ
దగు సమాధాన మిత్తురు ♦ తగ విదియని!!"

బుధవారం, సెప్టెంబర్ 17, 2014

సమస్య: పార్వతి తనయుండు పుష్పబాణునిఁ జంపెన్

తేది: సెప్టెంబర్ 11, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



శర్వాణియనఁగ నెవ్వరు?
శర్వునకేమగునయా గజాస్యుండెలమిన్?
శర్వుండెవ్వనిఁ జంపెన్?
బార్వతి, తనయుండు, పుష్పబాణునిఁ జంపెన్!!

మంగళవారం, సెప్టెంబర్ 16, 2014

న్యస్తాక్షరి: ప్రతి పాదాద్యక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు...తేటగీతిలో...ప్రవరుడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుటను వర్ణించాలి

తేది: సెప్టెంబర్ 10, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన 
అంశం- ప్రవరుఁడు పాదలేపము కొఱకు సిద్ధుని వేడుకొనుట
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా ప్ర-వ-రు-డు ఉండాలనగా
నేను రాసిన పద్యము



ప్రవరుఁ డిటు వేడె సిద్ధునిఁ "బరమపురుష!
వరయుతౌషధసిద్ధ! సత్పథగ! ఘన! క
రుణనుఁ బాదలేపమ్మునుం ద్రుతము నొసఁగుఁ
డు! ననుఁ దీర్థయాత్రాచరుఁ డుగనుఁ గనుఁడు!"

సోమవారం, సెప్టెంబర్ 15, 2014

సమస్య: దోమపై నెక్కి యూరేగె సామజమ్ము

తేది: సెప్టెంబర్ 09, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



అల్పశకటాన ఘనవినాయకునిఁ బెట్టు
కొని నిమజ్జనమునుఁ జేయఁగోరి వెడలి
రిదియ కనుమోయి కవివర్య, యేమనందు?
దోమపై నెక్కి యూరేగె సామజమ్ము!

ఆదివారం, సెప్టెంబర్ 14, 2014

నిషిద్ధాక్షరి: కవర్గాక్షర నిషేధంతో...కైకేయి వ్యక్తిత్వ వివరణ...స్వేచ్ఛాఛందం...

తేది: సెప్టెంబర్ 08, 2014 నాటి
శంకరాభరణంలోని నిషిద్ధాక్షరి శీర్షికన
కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వివరిస్తూ
స్వేచ్ఛాఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన సీసపద్యము


||సీ||
శంబరాసురునితో ◊ సమరమ్ముఁ జేయుచోఁ
బతితోడఁ జని, సాయ ◊ పడిన పడతి;
భర్త వరములీయ, ◊ "వలయుచో వేడెద"
నంచు వారించిన ◊ యట్టి సాధ్వి;
పుత్రేష్టి పాయస ◊ మ్మునఁ బాలుపంచియు,
సవతిని మన్నించు ◊ సమరసవతి;
మంథరాబోధిత ◊ మాయాప్రచోదయౌ
పతిమృతిపూర్వ స ◊ త్స్వార్థవనిత;

||గీ||
రాముఁ డారామమునఁ దన ◊ రామతోడ,
సోదరునితోడ నివసింప ◊ నాదరమున
మఱలి, పరిపాలనము సేయు ◊ మనుచు వేడు
దశరథుని పత్ని, భరతుని ◊ తల్లి యామె!!



శనివారం, సెప్టెంబర్ 13, 2014

సమస్య: గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్

తేది: సెప్టెంబర్ 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(ప్రహ్లాదకుమారునకుం గల హరిభక్తిని మాన్పించుటకు నిరంతరము యత్నించుచున్న గురులపైఁ దిరస్కారభావముతో నతని స్నేహితులు చేసిన దుడుకు చేష్ట యంగీకృతమేయని సమర్థించు సందర్భము)


గురువులు చండమర్కులకుఁ గూరిమి విష్ణుని నామమెన్నఁగన్ని
రసనయుంట నోర్చకయ నేర్పున శిష్యులు పంగనామముల్
హరిని స్మరించి దిద్దిరి!! యహమ్మును గల్గినయట్టి మూర్ఖుఁడౌ
గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్!!


శుక్రవారం, సెప్టెంబర్ 12, 2014

న్యస్తాక్షరి: ప్రతిపాదాద్యక్షరం వరుసగా జ-టా-యు-వు...ఛందస్సు:తేటగీతి...అంశం: జటాయు వృత్తాంతము

తేది: సెప్టెంబర్ 04, 2014 నాటి శంకరాభరణంలోని న్యస్తాక్షరి శీర్షికన ఈయబడిన
అంశం- జటాయువు వృత్తాంతముఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాలలో మొదటి అక్షరాలు వరుసగా జ-టా-యు-వు ఉండాలని కోరగా
నేను రాసిన పద్యము:




జనక నంద నాపహరణ సమయమున జ
టాయు వడ్డంగ దశకంఠుఁ డమిత రోష
యుతుఁడుగా నయ్యు "నో జటాయు! గత పక్ష
వుగ నగు" మటంచుఁ బంతమ్ముఁ బూని నఱకె!


బుధవారం, సెప్టెంబర్ 10, 2014

నిషిద్ధాక్షరి: గుర్వక్షరనిషేధంతో...ఆటవెలదిపద్యంలో...గణపతి స్తుతి...

తేది: సెప్టెంబర్ 02, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన
గుర్వక్షర నిషేధంతో
గణపతిని స్తుతిస్తూ ఆటవెలదిలో
సర్వలఘు పద్యం వ్రాయమనగా
నేను రాసిన పద్యము



ప్రమథగణ యుత! గణపతి! గజముఖ! శివ
తనయ! సుముఖ! వరద! ధవళ వపుష!
ఖనక రథిక! పరశుకర! హరిహయ! ఘన!
కలుము లిడుచు జనులఁ గరుణఁ గనుమ!



మంగళవారం, సెప్టెంబర్ 09, 2014

సమస్య: చెడుకాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్

తేది: సెప్టెంబర్ 01, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా మూడు పూరణములు

(౧)
"గడచిన ప్రభుత్వ మిట్టిది
నడచిరి దుష్టంపుఁ ద్రోవ" నని తిట్టుచునున్
గడపక నవజీవిక ని
చ్చెడుకాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్!
(౨)
కడునిడుములు ముసిరి ముసిరి
తొడరి యుసురు తఱిగి తఱిగి తొలఁగఁగ నున్నన్
దడయక పరమాత్ముని గొ
ల్చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్!
(౩)
మిడిమిడి జ్ఞానముఁ జూపక,
మిడుకక, శత్రులకు బన్న మెన్నఁ డిడక, తా
నొడఁబడి పరహిత మునుఁ గూ
ర్చెడు కాలమె, జనుల కెపుడు సేమముఁ గూర్చున్!

సోమవారం, సెప్టెంబర్ 08, 2014

నిషిద్ధాక్షరి: నిరోష్ఠ్యంగా...మద్యపానాన్ని మానుమంటూ...నచ్చిన ఛందస్సులో...

తేది: ఆగస్టు 27, 2014 నాటి శంకరాభరణంలోని
నిషిద్ధాక్షరి శీర్షికన ఈయబడిన
ఓష్ఠ్యాక్షర (ప, ఫ, బ, భ, మ) నిషేధముతో
మద్యపానాన్ని మానుమని హితబోధ చేస్తూ

నచ్చిన ఛందంలో పద్యం వ్రాయమనగా
నేను రాసిన రెండు కందపద్యాలు.




(౧)
సుర సేవించుట హానియ
నరులకు నద్దాని విడువనౌ వేగముగన్
ద్వరిత విదూర రహితుఁడగు
సురాసువును మెచ్చఁ డెవఁడు క్షోణితలానన్!

(౨)
శీధు గ్రహణ వ్యసనుఁడు
సాధువగునె? దుర్జన సృతి సంచారియగున్!
శోధనతో విడువ వలయు
శీధువు సేవించుటెల్ల శీఘ్రగతినిఁ దా!

(దంత్యోష్ఠ్యమగు "వ"కారము నిషేధింపమి నిందు స్వేచ్ఛగఁ బ్రయోగింపఁబడినది)


శనివారం, సెప్టెంబర్ 06, 2014

దత్తపది: సుయోధనుఁడు-దుశ్శాసనుఁడు-కర్ణుఁడు-శకుని...రామాయణార్థంలో...సీసపద్యం

తేది: సెప్టెంబర్ 06, 2014 నాటి శంకరాభరణంలోని


దత్తపది శీర్షికన ఈయబడిన
సుయోధనుఁడు-దుశ్శాసనుఁడు-కర్ణుఁడు-శకుని
పదముల నుపయోగించి
రామాయణార్థంలో
సీసపద్యం రాయమనగా
నేను రాసిన సీసపద్యము


(విభీషణుఁడు రామునకు రావణుని తెఱం గెఱింగించు సందర్భము)

||సీ||
అష్టదిక్పతుల ననాయాసముగ గెల్చి
స్వఃసుయోధనుఁడుగ సన్నుతిఁ గని,

యెల్లరుఁ దనయాజ్ఞ లెల్లఁ బాలింపంగ
దుశ్శాసనుఁడునయి దోర్బలమున,
దర్పోద్ధతినిఁ బూని తన తమ్ముఁడగు కుంభ
కర్ణుఁడు శ్రేయమ్ముఁ గనుచు నుండ,
మేఘనాదుఁడు సతమ్మింద్రజిన్నాముఁడై
శత్రునాశకునిగ జగతికెక్క,


||గీ||
లంకఁ బాలించుచుండె సల్లక్షణుఁడని
దనుజ బృందమ్ము వొగడంగ దానవేంద్రుఁ
డసుర గణ సేవితుఁడు విదగ్ధ బల వి

రాజితుఁడు శివభక్తుఁడౌ రావణుండు!!


శుక్రవారం, సెప్టెంబర్ 05, 2014

సమస్య: కామదాసులైనఁ గలుగు ముక్తి

తేది: ఆగస్టు 26, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము.



కామితమ్ముఁ దీర్పఁ గష్టాలఁ బడవలెఁ
జేయఁ దగని పనులు సేయవలయుఁ
గాన, లోకమందుఁ గడు ముదమున "దగ్ధ
కామ" దాసులైనఁ గలుగు ముక్తి!