Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

సోమవారం, మే 16, 2016

బాలల నీతి పద్య కథలు: గొప్పలు తెచ్చిన కీడు...




ఒక్క యూరి చెఱువులోన ♦ నుండు కప్ప
చాలఁ బెద్దది యౌటచేఁ, ♦ జాల గర్వ
మున ’ఘనుఁడ’ నంచునుం గప్ప♦లనుఁ గదిసియు,
"నన్ను మించు జీవి జగాన ♦ నున్నదె?" యనె! 1


పిల్ల కప్పలు మదిలోన ♦ నుల్లసిలుచు,
’నిజమె కాఁబోలు’ నంచును ♦ నెయ్యముఁ గొని,
దానిఁ దమ రాజుగాఁ, దాము ♦ దాసులుగను
సేవఁ జేయఁ దొడఁగినవి ♦ స్థిరముగాను! 2


ఒక్కనాఁ డొక్క యెద్దు, పే♦రుక్కు గలది,
మందనుం దప్పి, దప్పిక ♦ నంది, చెఱువు
చెంతకునుఁ జేరఁ, గప్పలుఁ ♦ జిత్రముగనుఁ
జూడ మొదలిడినవి మున్నుఁ ♦ జూడకునికి! 3


పిల్ల కప్పలు వెంటనే ♦ పెద్ద కప్పఁ
జేరి, యిట్టుల నడిగెను ♦ శీఘ్రముగను;
"రాజ! నాఁడు ’నా కన్న వ♦ర్ణమ్మునందు,
దేహమందు గొప్పదియగు ♦ దేహి లేదు; 4


నన్ను మించు వారు జగము♦నను గలారె?’
యనుచుఁ జెప్పితిరయ మీరు! ♦ వినుఁడు, నేఁడు
మేము నీకన్న పెద్దదౌ, ♦ మేఘము వలె
నివ్వటిల్లు జంతువునుఁ గం♦టిమి తటమున!" 5


అనుచుఁ బలుకుచుండిన కప్ప♦లను గనుచును,
బెద్ద కప్పయు నెంతయో ♦ విస్మిత యయి,
"శీఘ్రమే నన్నుఁ గొనిపొండు! ♦ చేరఁ జనియు,
దాని వీక్షింతు నేనిప్పు" ♦ డనుచుఁ బలికె! 6


పిల్ల కప్పలు సనుచుండ, ♦ వేగముగను
వెంబడించియుఁ, దీరాన ♦ పెద్ద దైన
జంతువగు నెద్దునుం జూచి, ♦ సంభ్రమమునఁ,
దననుఁ బిల్ల కప్పలు నమ్మఁ♦గ, నిటు పలికె! 7


"దానిఁ జూచి యాశ్చర్యప♦డంగ వలదు!
దాని ’నె’ ద్దని యందురు! ♦ వీను లలర
వినుఁడు! చిన్నదౌ చెఱువు నో♦పెడునె యనుచు,
నేను పెరుగంగ లేదోయి ♦ నిక్కముగను! 8


నిజముగా నాదు రూపమ్ము ♦ నిపుడు పెంచి,
నాదు గొప్పనుఁ జూపింతు" ♦ ననుచుఁ బలుకఁ
జప్పటులఁ గప్ప లన్నియుఁ ♦ జఱచుచుండ;
వెంటనే పెద్ద కప్ప తాఁ ♦ బెరుఁగఁ దివిరె! 9


ఊపిరిని బిగఁబట్టియు, ♦ నొప్పునటులు
గాలిఁ బీల్చఁగఁ, గడుపుబ్బెఁ! ♦ గప్పలన్ని
చేరి, ’యె ద్దంతఁ గ’ మ్మనఁ, ♦ జేయునదియు
లేక, యింకను గాలిఁ బీ♦ల్చెను రయమున! 10


ఘనతఁ జాటంగ నెంచియుఁ ♦ గరము గాలిఁ
బీల్చు కొలఁదియు జఠరమ్ము ♦ పెరిఁగి పెరిఁగి,
ప్రేలి, మరణించె, బింకంపు ♦ పెంపు కతన!
గొప్పలకుఁ బోయి యాపదం ♦ గూల వలదు!! 11



స్వస్తి


గమనిక: మిత్రులారా ఈ దిగువ మీరు పెట్టే ప్రోత్సాహక వ్యాఖ్యలే నన్ను ద్విగుణీకృత ఉత్సాహవంతుణ్ణి చేసి మరిన్ని కథలు రాయడానికి పురికొల్పుతాయి. ఈ దిగువ వ్యాఖ్య రాయడం మరువ వలదు అని మనవి.

5 కామెంట్‌లు:

  1. బాగుంది కధ ఇంకా వ్రాయండి. బొమ్మ కూడా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. పద్య కథా కథనం చాలా బాగుంది...యీ బాలకథా పద్యమాలికలన్నీ జేర్చి యొక పుస్తకం ప్రచురించండి...పిల్లలకు బాగా ఉపయోగపడతాయి...

    రిప్లయితొలగించండి
  3. పద్య కథా కథనం చాలా బాగుంది...యీ బాలకథా పద్యమాలికలన్నీ జేర్చి యొక పుస్తకం ప్రచురించండి...పిల్లలకు బాగా ఉపయోగపడతాయి...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు శిష్ట్లావారికి నమస్సులు! తప్పకుండా పుస్తక ప్రచురణకై యత్నిస్తాను. ఆశ్రయం దొరకుట లేదు. నిరాశ్రయా న శోభన్తే పణ్డితా వనితా లతా...అని కదా ఆర్యోక్తి! స్పందించినందులకు ధన్యవాదములు!

      తొలగించండి