Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

శుక్రవారం, ఆగస్టు 08, 2014

వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!



ధరలోనఁ జల్లఁగా మముఁ
గరుణనుఁ గనుమమ్మ! వెతలు కలుగక యుండన్
సరగునఁ గాపాడుచు నో
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

నరులను సురలనుఁ బ్రోచుచుఁ
దరుణముఁ గని రాక పోకఁ దనరించుచు వే
గిరముగఁ గటాక్ష మిడు నో
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

సిరులకు నిక్కయి, సతతము
పరమార్థ మ్మిడుచు, జనుల ప్రార్థనములనున్
గరుణనుఁ జేకొని, ప్రోచెడు
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

చిరయశము గలుగవలెనని
స్థిరముగ మేమంత నిన్నుఁ జేరి కొలువ
త్వరముగ దరిఁజేర్చియు నిఁక
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!

వరదాయి! విష్ణువల్లభ!
కరుణామయి! సింధుకన్య! కమలాలయ! సుం
దర దరహాస కటాక్షిణి!
వరలక్ష్మీమాత! మాకు వరముల నిమ్మా!


-oO: శుభం భూయాత్ :Oo-

గురువారం, ఆగస్టు 07, 2014

గురుదేవులు పండిత నేమాని రామజోగి సన్యాసిరావుగారికి నివాళులు...



దివి: ఆగస్టు 07, 2014 నాడు  పూజ్యులు, గురుమూర్తులు, తెలుగు ఆధ్యాత్మరామాయణ కర్త, ప్రముఖ అష్టావధాని, సత్కవి, పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి యాకస్మిక మరణమునకు విస్మిత వదనుండనై, దుఃఖిత మనస్కుఁడనై , కడసారి వారి పాదపద్మ సంపూజనమునకై యర్పించుకొను పద్యకుసుమము...

సీ.
శంకరాభరణ సత్సాహితీ కవిగణ
    స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
    జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
    తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
    దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
తే.గీ.
ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
స్వర్గమేగిన నేమాని పండితార్య!
మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత!

          -oO: "స్వస్తి" :Oo-

ఆదివారం, ఆగస్టు 03, 2014

సమస్య: కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల

తేది: జులై 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మద్యపానమందు మదినిఁ జిక్కఁగనీఁక,
పాలుఁ ద్రావఁగాను మేలు కలుగు!
పాలు కొనఁగలేనివారు గంజియు నుప్పు
కల్లుఁ ద్రాగుమనెను గాంధి జనుల!

గురువారం, జులై 31, 2014

సమస్య: చవట కదా నిన్నుఁ దలఁప శంకర పత్నీ

తేది: జులై 24, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


ప్రవిమల భక్తినిఁ గొని, హై
మవతీ! పార్వతి! భవాని! మాహేశ్వరి! శాం
భవి! గౌరీ! దోసము లెం
చవట కదా, నిన్నుఁ దలఁప శంకర పత్నీ!

మంగళవారం, జులై 29, 2014

సమస్య: తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల

తేది: జులై 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

జనుల మోసగించు, జగడమ్ములాడును,
మద్యపానమందు మమతఁజూపు,
"సాధు జనుఁడ"ననును! సకలదుర్వ్యసనుఁ డా
తత్త్వదర్శి చెప్పుఁ దప్పులెల్ల!

ఆదివారం, జులై 27, 2014

సమస్య: వేయికనులవాఁడు వినతకొడుకు

తేది: జూలై 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మాతృదాస్యమపుడు మాన్పఁగా నమృతమ్ముఁ
గాద్రవేయుల కిడఁగా, హరించె
వేయికనులవాఁడు! వినతకొడుకు తల్లి
చెఱను డుల్చి, వెలిఁగె స్థిరముగాను!

గురువారం, జులై 24, 2014

సమస్య: రావణుఁ డా సీతమగఁడు రక్షించు మిమున్

తేది: జులై 19, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



దేవుఁడని యెఱుఁగకయె యా
దేవుని యాలినిఁ జెఱఁగొని తిప్పలనిడ నా
దేవుని చేతనె మడిసెను
రావణుఁ! డా సీతమగఁడు రక్షించు మిమున్!


మంగళవారం, జులై 22, 2014

సమస్య: వరము వైషమ్యములఁ దెచ్చెఁ బ్రజలలోన

తేది: జులై 18, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


అఱువదేఁడుల కల నిజమైన వేళఁ,
బాలకులు గిరిజనుల వివక్షఁ జూపి,
యాజ్యమునుఁ బోసి రగిలింప, నకట, పోల
వరము వైషమ్యములఁ దెచ్చెఁ బ్రజలలోన!


సోమవారం, జులై 21, 2014

సమస్య: పుట్టినవాఁ డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై

తేది: జులై 17, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

తుట్టతుద వరకు సుఖముగ
నెట్టి విధమునైన బ్రదుక నెంచియు, నడుమన్,
"బిట్టుగ బ్రదికెడు యోచన
పుట్టినవాఁ" డెవఁడు గిట్టఁబోఁ డీ ధరపై!
(వృద్ధుఁడై మరణించువరకు సుఖజీవనము గడపఁదలఁచినవాఁడు, నడుమనే మరణించవలెనని యనుకోఁబోఁడని యాశయము)

ఆదివారం, జులై 20, 2014

సమస్య: దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె

తేది: జులై 14, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(పంచపాది)
శాపమే లేనిచో, రామ సహిత రామ
లక్ష్మణుల వనవాసాన రావణుండు
జానకినిఁ జెఱ నిడ, వానిఁ జంపి, జనుల
కష్టములఁ బాపు టెట్టులఁ గలుగుఁ? గాన,
దశరథుని శబ్దభేది మోదమ్ముఁ గూర్చె! (౧)

శాపవశమున రాముఁడు జనన మంది,
జానకీపతియై, వనిఁ జని, యసురపు
వైరమునఁ బోరి, చంపఁగఁ బ్రజల కపుడు
"దశరథుని శబ్దభేది" మోదమ్ముఁ గూర్చె! (౨)

బుధవారం, జులై 16, 2014

సమస్య: పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు

తేది: జులై 13, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



ఉవిద ముఖపద్మమునను నీలోత్పలములు
సూర్యచంద్రులు లేకయే చోద్యముగను
వికసనమునందెఁ గవులార వేగిరముగఁ
బూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు!

శనివారం, జులై 12, 2014

సమస్య: జనకునిఁ బెండ్లాడు మనుచు జానకి కోరెన్

తేది: జూలై 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(శివధనుర్భంగము గావించిన శ్రీరాముని పుష్పమాలాలంకృతుని జేయుచు సీత పలికిన సందర్భము)

త్రినయన ధనుభి ద్యోధుని,
దనుజాంతకు, సవనరక్షిఁ, ద్వరితోద్య న్నూ
తన వరరాగ మనస్సం
జనకునిఁ బెండ్లాడు మనుచు జానకి కోరెన్!

గురువారం, జులై 10, 2014

సమస్య: రాముని భార్యలకు నింద రానేవచ్చెన్

తేది: జూలై 08, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు


(1)
(చవితి చంద్రుని దర్శించిన దోషముచే మునిపత్నులు అగ్నివలన నిందలు మోయవలసివచ్చిన సందర్భము)

కామించియు ముని పత్నులఁ
బ్రేమనుఁ బొందంగలేని విశ్వపు సతి యా
భామల రూపెత్తఁగ నౌ
రా! మునిభార్యలకు నింద రానేవచ్చెన్!

(2)
(లక్ష్మీపద్మావతుల మూలముననే వేంకటేశుఁడు ఱాయైనాఁడని యొక వదంతి పుట్టెననుట...)

రామల నడుమను వేఁగుచు
నేమియుఁ బలుకకయె వేంకటేశుఁడు ఱాయై
భామల విడ, మా హృదయాఽ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్!


సోమవారం, జులై 07, 2014

సమస్య: వానలు రైతులకు దుఃఖభాజనము లగున్

తేది: జూలై 07, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

చేనికి నవసర మగు తఱి
నైనను గుఱియకయె మిగుల నార్తినిఁ ద్రోయున్,
జేనినిఁ బడవలదనఁ, బడి,
"వానలు" రైతులకు దుఃఖభాజనము లగున్!

ఆదివారం, జులై 06, 2014

సమస్య: కొక్కొరొకో కొక్కొరొ యని కోకిల కూసెన్

తేది: జూలై 06, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



(కోకిల యను పేరుగల బాలిక పక్షుల కూఁతలు సాధన జేయు సందర్భము...)

చక్కని బాలిక కావునఁ
జిక్కని యనుకరణఁ జూప శీఘ్రమె వేడ్కన్
జొక్కఁపుఁ గూఁతలఁ గూయుచుఁ
"గొక్కొరొకో కొక్కొరొ"యని కోకిల కూసెన్!

శనివారం, జులై 05, 2014

సమస్య: మంచి విద్యల నేర్చుట మానవలెను

తేది: జూలై 05, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(దుష్టవిద్యలవలని నష్టములఁగూర్చి ముచ్చటించుచుఁ గట్టమంచివారితో నతని మిత్రుఁడు పలికిన సందర్భము)

జనులఁ గికురువొడిచి, వారి ధనము నపహ
రించు విద్యలు నేఁడు విశృంఖలముగఁ
జెలఁగెఁ! ద్వరిత గతినిఁ జెడు తొలఁగఁ, గట్ట
మంచి! విద్యల నేర్చుట మానవలెను.

గురువారం, జులై 03, 2014

సమస్య: సవతి లేని యింట సౌఖ్యమేది?

తేది: జూలై 03, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


లోని కడుగిడఁగను వీనుల విందైన
మాటలాడి, తోషమందుఁ దేల్చి,
మగని గారవించఁగను బ్రియోక్తి సుధార
సవతి లేని యింట సౌఖ్యమేది?

ఆదివారం, జూన్ 29, 2014

సమస్య: ఱవిక విప్పి డాసె రమణి యతిని

తేది: జూన్ 25, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



స్వర్గలోకమందు సవ్యసాచినిఁ గని,
యూర్వశి మరులు గొనె! నోపలేక,
ఱవిక విప్పి, డాసె, రమణి "యతి నిరీక్ష
ణమ్ము వలవదోయి! రమ్మ"టంచు!

సోమవారం, జూన్ 23, 2014

సమస్య: మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్

తేది: జూన్ 22, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

దారుణ పరరాజ్యార్జక
మారణహోమమ్ము కూర్చు మహిలో శాంతిన్!
గోరి కళింగుల భువికై
పోరి, యశోకుండు శాంతిఁ బొందెఁ గదయ్యా!

శనివారం, జూన్ 21, 2014

సమస్య: పాలు త్యజించి నీరమునుఁ బాన మొనర్చును హంస లెప్పుడున్

తేది: జూన్ 21, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


వేలుపు గొప్ప యిద్దె! సుకవీశుల కిద్దియె సద్విశిష్టమౌ
కీలకమైన యంశమయ కేవల నీరము శేషమౌనటుల్
గ్రోలఁగ నెంచుచుంట! సుమ కోమల చంచువుచేతఁ ద్రావఁగన్
బాలు, త్యజించి నీరమునుఁ, బాన మొనర్చును హంస లెప్పుడున్!


శుక్రవారం, జూన్ 20, 2014

సమస్య: కాకి కాకి కాక కేకి యగునె?

తేది: జూన్ 20, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా రెండు పూరణములు


కేకి నాట్య మాడి క్రేంకారమునుఁ జేయు
జ్ఞాని, యోగ విద్య గలుగు పక్షి!
కాన, యోగ్య రహిత కాకముం బోల్పఁగాఁ
గాకి కాకి కాక కేకి యగునె? (1)


జగతి యోగ్యపక్షి షట్చక్ర కుండలీ
జ్ఞాని కేకిఁ బోల్పఁ గాకి కెట్టి
గుణము లేవి లేవు! గుఱుతు సేసియుఁ జూడఁ
గాకి కాకి కాక కేకి యగునె? (2)

బుధవారం, జూన్ 18, 2014

సమస్య: అక్కా రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్

ఒకనాటి ఉపాధ్యాయ వృత్త్యంతర శిక్షణా కార్యక్రమంలో ఒక ఉపాధ్యాయ మిత్రుడు ఇచ్చిన సమస్యకు నా పూరణము

(వేసవిలో నీళ్ళ కష్టా లనుభవిస్తున్న సమ్మక్క అనే గృహిణి...కొళాయి వద్దకు వెళ్ళి నీళ్ళు తేబోగా...ఆమె భర్త...పెద్ద లైనులో చాలా సేపు అవుతుందేమో నని తలచి, వాళ్ళకు ఏదో విధంగా నచ్చజెప్పి  తొందరగా రమ్మని నర్మగర్భంగా పలుకుతున్న సందర్భము)

చుక్కయు నీరము లేకయుఁ
జక్కంగఁ గొళాయిఁ జేరి జలముం దేఁ బోన్
"జుక్కలు మొలువకమును స
మ్మక్కా ర"మ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!

మంగళవారం, జూన్ 17, 2014

సమస్య: రాముఁడు రావణుని మెచ్చి రాజ్య మ్మొసఁగెన్

తేది: జూన్ 17, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


నీమమునఁ దపముఁ జేయఁగ
సోమాభరణుం డజుండు శుద్ధమనోజ్ఞుం
డౌ మైనాకీ హృదయా
రాముఁడు రావణుని మెచ్చి రాజ్యమ్మొసఁగెన్!

సోమవారం, జూన్ 16, 2014

సమస్య: కర్ణుఁ డెద్దు నెక్కి కంసుఁ జంపె

తేది: జూన్ 16, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము




దండి సహజ కవచ కుండలుం డెవఁడోయి?
హరుఁడు దేనినెక్కి తిరుగునోయి?
కృష్ణుఁ డెవనిఁ జంపి కెరలి రాజిలెనోయి?
కర్ణుఁ, డెద్దు నెక్కి, కంసుఁ జంపె!


శనివారం, జూన్ 14, 2014

సమస్య: నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ

దివి: జూన్ 14,2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణంలో ఈయబడిన సమస్యకు నా పూరణము


తోరమ్ముగ దానములను
గోరిన రీతిగ నిడి, వెసఁ గూరిమిఁ బంచన్
గోరెడి గుణియై, యొక పిసి
నారినిఁ బెండ్లాడువాఁడు నవ్వులపాలౌ!



బుధవారం, జూన్ 11, 2014

సమస్య: సాహితీసంపదకు విభజనము గలదె?

తేది: జూన్ 02, 2014 నాటి శంకరాభరణములోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


ధనము భూములు వస్తువుల్ పెనఁగి పెనఁగి
విభజనము సేయవచ్చును వేగిరముగ!
మనమునందున నిబిడమై తనరునట్టి
సాహితీసంపదకు విభజనము గలదె?

మంగళవారం, జూన్ 10, 2014

సమస్య: తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మమగును

తేది: జూన్ 01, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


సంఘమునఁ జీడపురువై విషమ్ముఁ గ్రక్కు
దుష్ట దుర్మార్గవర్తను, నష్టకరుని
యాగడమ్ముల సరిచేయనట్టి యతని
తల్లిదండ్రులఁ దిట్టుటే ధర్మమగును!

సోమవారం, జూన్ 09, 2014

సమస్య: తమిళకవి యల్లసాని పెద్దనకు నతులు

తేది: మే 12, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

ఆంధ్రకవితాపితామహుఁ డల్లసాని
పెద్దనకవీంధ్రుఁ డొసఁగిన విద్దెలున్న
మనుచరిత్రమ్ముఁ జదివి, చేసెనఁట యొక్క
తమిళకవి, యల్లసాని పెద్దనకు నతులు!

గురువారం, జూన్ 05, 2014

సమస్య: పండు మంచిది తినఁ బనికి రాదు

తేది: మే 11, 2014 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


లక్కబొమ్మలందు నొక్క మామిడిపండు
బొమ్మఁ గాంచి యొక్కఁ డిమ్ముగఁ గొనె!
దీని నతని సుతుఁడుఁ దినఁ బోవ, ననెఁ దండ్రి
"పండు మంచిది; తినఁ బనికి రాదు!"

బుధవారం, జూన్ 04, 2014

పద్య రచన: జోలపాట (శ్రీరామస్తుతి)

తేది: మే 11. 2014 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్శ్జికన ఈయబడిన "జోలపాట" అంశమునకు నేను రాసిన పద్యము



జోజో సూర్య కుల ప్రదీప విభవా! జోజో ఘనాభాజిరా!
జోజో కౌశిక యజ్ఞ రక్షణ పరా! జోజో హరేష్వాసభిత్!
జోజో రావణ కుంభకర్ణ హననా! జోజో నిలింపావనా!
జోజో రామమహీశ! చంద్రవదనా! జోజో మహీజాపతీ!

(భావం: సూర్యవంశమునకు దీప్తిని, వైభవమునుఁ గలిగించినవాఁడా; మేఘమునుబోలు శరీకాంతిగలవాఁడా; కౌశికుని యజ్ఞమును గాఁచినవాఁడా; [హర+ఇష్వాస-భిత్] శివధనువును  ద్రుంచినవాఁడా; రావణకుంభకర్ణాదులను హతమార్చినవాఁడా; దేవతలను గాఁచినవాఁడా; రామభూపాలా; చంద్రునివంటి ముఖముగలవాఁడా; భూపుత్రి సీతకుఁ బతియైనవాఁడా నీకు జోలలు!)

సోమవారం, జూన్ 02, 2014

సమస్య: రామునకు సీతసోదరి (ఛందోగోపనము)

తేది: అక్టోబర్ 25, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణము శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(ఇచ్చిన సమస్య ఛందోగోపనము...అనఁగా ఏ పద్యమో తెలుపకుండా ఈయఁబడినది...దీనిని నేను కందపద్యమున నిమిడ్చి పూరణము సేసితిని)


వనవాసానంతరము సీతారామలక్ష్మణుల పునరాగమనమునకై వేచియుండిన మాండవీభరతులు మాతృసమేతముగా ఎదురేఁగి స్వాగతించుచున్న సందర్భము...

కం.
రామాంకిత రాజ్యమ్మును
రామయ్యనె యేలుమంచు బ్రతిమాలుచు నా
రామునకు సీతసోదరి
యౌ మాండవి భరతసహితయై ప్రణతులిడెన్!

ఆదివారం, జూన్ 01, 2014

సమస్య: పండుగ లివి వచ్చు దండుగలకు

తేది: అక్టోబర్ 24, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(సమస్యగా ఈయబడిన ఆటవెలది పద్యపాదమును తేటగీతి పద్యములో నిమిడించనైనది)

తే.గీ.
ధనము వ్యయమైన నేమాయె? దక్కు సుఖము!
దండి పండుగ లివి వచ్చు దండుగల క
నుటయ తప్పు! సంస్కృతిని ప్రస్ఫుటముఁ జేయు
సకల సంతోషదమ్ము లుత్సవములు గద!!

శనివారం, మే 31, 2014

సమస్య: అష్టమి శ్రేష్ఠమ్ము పనుల నారంభింపన్

తేది: అక్టోబర్ 23, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



శిష్టుల రక్షింపంగన్,
దుష్టుల శిక్షించి, కీడుఁ దొలఁగఁగఁ జేయన్
స్పష్టత నిడు శుభకర దు
ర్గాష్టమి "శ్రేష్ఠమ్ము" పనుల నారంభింపన్!

శుక్రవారం, మే 30, 2014

సమస్య: దయ్యమె దైవమును జంపి ధరపై వెలసెన్

తేది: అక్టోబర్ 21, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

అయ్యియుఁ బ్రకృతియె వికృతిగ,
నెయ్యము పామరులతోడ నెఱపుచుఁ బ్రకృతిన్
గయ్యాన విడువ నిటు, లా
దయ్యమె దైవమును జంపి, ధరపై వెలసెన్!


గురువారం, మే 29, 2014

సమస్య: కీచకుఁడు పెండ్లియాడె లంకిణిని మెచ్చి

తేది: అక్టోబర్ 22, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము


(ఈ పూరణను క్రమాలంకారపద్ధతిన సరిచూచుకొనునది)

సాధ్వి సైరంధ్రి మోహించి చచ్చెనెవఁడు?              (=కీచకుఁడు)
రామ దమయంతినిన్ నలుం డేమి సేసె?          (=పెండ్లియాడె)
రావణుఁడు దేని మెచ్చి చేరంగఁ జనియె?          (=లంకిణిని మెచ్చి)
కీచకుఁడు, పెండ్లియాడె, లంకిణిని మెచ్చి!

మంగళవారం, మే 27, 2014

సమస్య: అవధానముఁ జేయువార లల్పులుగాదే

తేది: అక్టోబర్ 20, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



సవనమ్మౌ యవధానపు
కవన మ్మత్యంత రమ్య గతి నడుపంగన్
సవిధాన రీతి నెఱుఁగక

యవధానముఁ జేయువార లల్పులుగాదే?


సోమవారం, మే 26, 2014

సమస్య: దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్

తేది: అక్టోబర్ 19, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మోహము తొలఁగఁగఁ, బరు దా
సోఽహమ్మని, స్మరణలోనఁ ౙొక్కుౘు, మదిలోన్
గోఽహమను పృచ్ఛ ౘన, సం
దేహము లేనట్టివాఁడె తేజముఁ బొందున్!

ఆదివారం, మే 25, 2014

సమస్య: పతిని బాధపెట్టు వనిత సాధ్వి

తేది: అక్టోబర్ 19, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



మూఁడు లోకములను ముప్పతిప్పలు పెట్టి,
సంతసమునఁ దేలు, సుంతయేని
మమత లేనియట్టి మహిషాసురు, దనుజ
పతిని, బాధపెట్టు వనిత, సాధ్వి!

శనివారం, మే 24, 2014

పద్య రచన: తిక్కన భారతావిష్కరణం!

తేది: అక్టోబర్ 08, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యము.

సీ.
కాకతీయుల యోరుఁగల్లున గణపతి
        దేవుని సన్నిధిఁ దిక్కయజ్వ
తన రచనను భారతమ్మును బఠియించి,
        మెప్పులు వడసియు, మేలి వరము
నందియుఁ దన స్వామి నల మన్మసిద్ధిని,
        ఘనుఁ, బునా రాజ్యార్హుఁ గానుఁ జేసి,
స్వామి కార్యమ్మును, స్వక కావ్య వికసన
        మ్ములను మంత్రాంగానఁ బొంది, మఱియుఁ
గీ.
దెలుఁగు వారల నాల్కలఁ దిరముగాను
నిలిచి వెలిఁగియుఁ జిర యశమ్ములును బొందె;
ఘనత నందె కవిబ్రహ్మగాను! మఱియు
నుభయ కవిమిత్రుఁడయ్యుఁ దా నుర్వి వఱలె!

శుక్రవారం, మే 23, 2014

సమస్య: వక్త్రంబుల్ పది గలిగినవానికి జే జే

కవి పండిత మిత్రులకు, వీక్షకులకు,
శ్రీమద్ హనుమజ్జయంతి పర్వదిన
శుభాకాంక్షలు!

తేది: అక్టోబర్ 06, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము

(వక్త్రమనఁగా నోరు, మొగము అని రెండర్థా లుండుటచే పంచముఖాంజనేయుఁడు పది వక్త్రములున్నవాఁడని చమత్కరింపఁ బడుచున్నాఁడు)

వక్త్రాననములు గలసియు
దిక్త్రారాతి శిర సమము! తిరమ, హనుమకున్!
వాక్త్రాసం బెది లేదిట!
వక్త్రంబుల్ పది గలిగిన 'వానికి' జేజే!

సమస్య: రమణీ రమ్మనెను సీత రామునిఁ గనుచున్


తేది: అక్టోబర్ 05, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము.



"విమల శ్యామల వర గా
త్ర మణీ! కోదండ పాణి! దనుజోత్క్రమణీ!
ద్యుమణీ కుల నరవర ముకు
ర మణీ! ర"మ్మనెను సీత, రామునిఁ గనుచున్!

గురువారం, మే 22, 2014

పద్య రచన: శ్రీకృష్ణ స్తుతి!

తేది: అక్టోబర్ 06, 2012 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నేను రాసిన పద్యములు



యదు కులాంభోధి చంద్ర! ఘనాభ దేహ!
రాసకేళీ విలోల! సువ్రజ కిశోర!
కృష్ణ! గిరిధర! నరసఖ! కేశవ! హరి!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!

పార్థసారథి! మురహంత! వాసుదేవ!
శ్యామ సుందర! శకటారి! చక్రి! వృష్ణి!
వేణుధర! శౌరి! బకవైరి! విశ్వరూప!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!

నరక హంతక! వృషనాశ! నంద తనయ!
ద్రౌపదీ మాన రక్షక! తాత తాత!
మానినీ వస్త్ర చోర! పద్మాక్ష! దేవ!
కంస ఘస్మర! దీనులఁ గావుమయ్య!

సమస్య: తిరుమలేశుఁ డైనఁ దిరిపె మెత్తు

తేది: అక్టోబర్ 03, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.


ధనము చేతనున్నఁ దనకన్న మిన్నయే
లేఁడటంచు వ్యయము లెన్నొ మిగులఁ
జేయుచుండఁగాను జివరికి నేమౌను?
తిరుమలేశుఁ డైనఁ దిరిపె మెత్తు!

మంగళవారం, మే 20, 2014

విశేష వృత్తములు: విష్ణుస్తుతి!

తేది: అక్టోబర్ 03, 2012 నాటి శంకరాభరణంలోని విశేష వృత్తములు శీర్షికన ఇచ్చిన ఛందస్సులో నేను రాసిన శిఖరిణీ వృత్తము.



శిఖరిణీ వృత్తము:
పరేశా! పర్జన్య! ప్రణవ!ఫణితల్ప! ప్రభు! హరీ!
ధరాధుర్య! శ్రీశా! ధర! నృహరి! దైత్యారి! కపిలా!
మురారి! ప్రాగ్వంశా! పురుషవర! సంపూజ్య! దివిజా!
వరాహ! శ్రీవత్సా! పరమపురుష! ప్రాణద నమ:!


సోమవారం, మే 19, 2014

సమస్య: హింస కలుగఁ జేయు హితము భువికి

తేది: అక్టోబర్ 02, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణములు.


(మహాత్ముని యహింసా పద్ధతిలో సహాయ నిరాకరణముఁ జేసిన, భరత భూమికి హితము కలుగఁ గలదని యాశయము)


(1)
తెల్ల దొరలకన్న, నల్ల దొరలు దేశ
భక్షకులయి రిల్లు వల్లకాడె!
త్యాగ శాంతి సత్య ధర్మాలకన్న న
హింస కలుగఁ జేయు హితము భువికి!


(2)
హింస కలుగఁ జేయు హితము, భువికి నేమి
యున్నదయ్య? దానఁ గలుగు నష్ట
మింత యనియుఁ జెప్ప నేరికి సాధ్య? మ
హింసయే గెలుచును! హితముఁ గనును!!

ఆదివారం, మే 18, 2014

అమరమూర్తి జాతిపిత మహాత్మా గాంధీ!

తేది: అక్టోబర్ 02, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఈయబడిన చిత్రమునకు నా పద్యము.



సీ.

తెల్లవారల మత్తు దించంగ సమకట్టి
        సత్యాగ్రహముఁ జేయు సాధుమూర్తి!
వర్ణభేదము లింక వలదంచు దళితుల
        హరిజనులని పిల్చు హవనమూర్తి!
పేదలకే వస్త్ర మేది? నా కేలంచు
        నంగీల విడిచిన త్యాగమూర్తి!
దేశమంతయుఁ గోరు దేశనాయకుఁ డయ్యుఁ
        బదవిఁ గోరనియట్టి భవ్యమూర్తి!
గీ.
జాతిపితయై చెలంగిన సత్యమూర్తి!
బాలలకు గాంధితాతయౌ భద్రమూర్తి!
స్వార్థ మించుకయును లేని నఘమూర్తి!
యంజలింతు మహాత్ముఁడా! యమరమూర్తి!


స్వస్తి


శనివారం, మే 17, 2014

అనుమానించు పతిఁ బొంది యతివ సుఖపడెన్

తేది: అక్టోబర్ 01, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఈయబడిన సమస్యకు నా పూరణము



కనులా, మీనములా? యా
ననమా, పద్మమ? సువీక్ష, నన తూపుల? దం
శనముల, మల్లియల? యనుచు
ననుమానించు పతిఁ బొంది యతివ సుఖపడెన్!

పద్య రచన: తల్లి మనసు...

తేది: సెప్టెంబర్ 30, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యము.


తల్లి యొడిలోన పసిపిల్ల తల్లడిల్ల,
తల్లి యుల్ల మదెంతయో తల్లడిల్లు!
తల్లి యొడిలోన పసిపిల్ల యుల్లసిల్ల,
తల్లి యుల్ల మదెంతయో యుల్లసిల్లు!

గురువారం, మే 15, 2014

సమస్య: ద్రోణుఁ డొక్కఁడు దుష్ట చతుష్టయమున

తేది: సెప్టెంబర్ 27, 2012 నాటి శంకరాభరణంలోని సమస్యాపూరణం శీర్షికన ఇచ్చిన సమస్యకు నా పూరణము.


(ద్రోణునిఁ గూర్చి పౌరులు సంభాషించుకొనుచున్న సందర్భము)




ద్రోణుఁ డొక్కఁడు పాండవ తుష్టిఁ బెంచు,
సభ్యతనుఁ గని, వెలుఁ గొందు సరణి నేర్పు!

ద్రోణుఁ డొక్కఁడు దుష్ట చతుష్టయమున
వక్రతలఁ గని, నడతల సరణి మార్చు!

బుధవారం, మే 14, 2014

పద్య రచన: కంసుని దౌష్ట్యము


తేది: సెప్టెంబర్ 26, 2012 నాటి శంకరాభరణంలోని పద్య రచన శీర్షికన ఇచ్చిన చిత్రమునకు నేను రాసిన పద్యములు

 

(దేవకీగర్భగతాష్టమశిశువు చేఁత మరణమున్నదని కంసున కాకాశవాణి తెలుపుట)

తే.గీ.
కూర్మి వసుదేవకుం డంత కోరి రమణి
దేవకిని బెండ్లియాడి యేతెంచు సమయ
మునను "రథము నే నడుపుదు" ననుచుఁ గంసుఁ
డుత్సుకతతోడ నడుపంగ నొక్కసారి;(1)

కం.
ఫెళఫెళమను ఘోషముతోఁ
బలికెను నాకాశవాణి "భళి, యో కంసా!
చెలియలి గర్భస్థాష్టముఁ
డొలియించును నీదు ప్రాణ మోయీ వినుమా!"(2)

ఆ.వె.
అనఁగ కుపితుఁ డయ్యె నా కంసుఁ డంతటఁ
గత్తి దూసి చంపఁగాను బోవ,
"బావ! యాగు" మనుచు వసుదేవుఁ డాపియు
నష్ట బాలకులను నతని కిడుదు;(3)

తే.గీ.
అనఁగఁ గంసుండు శాంతించి, "యట్టులె" యని
మాట పుచ్చియు విడిచెను మఱది, చెల్లి!
ప్రాణ సమమైన చెల్లెలు, బావ యనియుఁ
జూడ రయ్యయో దుష్టులు సుంతయైన!(4)