దివి: ఆగస్టు 07, 2014 నాడు పూజ్యులు, గురుమూర్తులు, తెలుగు ఆధ్యాత్మరామాయణ కర్త, ప్రముఖ అష్టావధాని, సత్కవి, పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి యాకస్మిక మరణమునకు విస్మిత వదనుండనై, దుఃఖిత మనస్కుఁడనై , కడసారి వారి పాదపద్మ సంపూజనమునకై యర్పించుకొను పద్యకుసుమము...
సీ.
శంకరాభరణ సత్సాహితీ కవిగణ
స్ఖాలిత్య సవరణఁ జేసినావు;
స్వయముగా నెన్నియో సత్పూరణమ్ములఁ
జేసి, కీర్తినిఁ బ్రతిష్ఠించినావు;
తపసివై యష్టావధానమ్ములనుఁ జేసి,
తెలుఁగు కవుల లోటుఁ దీర్చినావు;
రమణమై యధ్యాత్మ రామాయణమ్మునుఁ
దెలుఁగు భాషనుఁ దీర్చిదిద్దినావు;
తే.గీ.
ఇట్టి వైశిష్ట్య గురుమూర్తి వీవు మమ్ము
నేఁడు విడనాడి, కైవల్య నిధినిఁ గోరి,
స్వర్గమేగిన నేమాని పండితార్య!
మృడుఁడు మీ యాత్మకిల శాంతి నిడునుఁ గాత!
-oO: "స్వస్తి" :Oo-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి