Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

ఆదివారం, మే 17, 2015

పద్యకథ: అధికులతో స్పర్థ అనర్థదాయకం (పద్యకథ)

తేది: మే 16, 2015 నాటి శంకరాభరణంలోని పద్యరచన శీర్షికన ఈ దిగువ నీయబడిన చిత్రమునకు నేను వ్రాసిన "పద్యకథ"




కం.
అనఁగనఁగ నొక సరస్సునఁ
గన నగుఁ బలు హంస లెపుడు కలకల నగుచున్
వనరుహ కాండములఁ దినుచు
దినమంతయుఁ గడపుచుండు దివ్యగతులతోన్!

ఆ.వె.
ఆ సరస్సు ప్రాంతమందలి కుజముల
పై వసించుచుండెఁ పలు ద్వికములు!
దినదినమ్ము నవియు దివి విహారులునైన
హంసగమనములను నఱయుచుండు!

తే.గీ.
వాని తెల్లందనమ్ములు వాని పలుకు
లెంత హృదయంగమములంచు వింతఁ గనునొ,
దమ కురూపముల్ కూఁత లంతగను రోఁతఁ
బుట్టఁ జేయునని విసుగు పుట్టఁ దెగడు!

కం.
హంసల గర్వము నణచఁగ
హింసనుఁ బూనియును నైన హేయమొనర్పన్
గంసారి నలుపు గల యా
హంసారులుఁ దలఁచుచుండె నవగుణ కుమతుల్!

తే.గీ.
ఒక్క దినమున నొక యంచ తెక్కరముగ
నడచి వచ్చుట నా పిశునములు గాంచి,
“యేమి మీగొప్ప? మావలె నెగురఁ గలరె?
పందెమునుఁ గాచి, గెలుపొంద వలయు”ననియె!

తే.గీ.
“నాకు నీతోడఁ బందెమా?” నగుచు నంచ
యనఁగ, “భయపడుచుంటివా?” యంచుఁ గాకి
వంకరగ, టింకరగఁ దాను పల్టికొట్టి,
“నన్ను గెలుతువే?”యన హంస నగి యొడఁబడె! 

తే.గీ.
కాకి ముందుగా నాకాశ గమన యయ్యు
వెనుక వచ్చెడి యంచను వెక్కిరించె!
హంస మేఘమండలమును నందుకొనఁగఁ
జనుచు నుండఁగఁ గాకియుఁ జనెను పైకి!

ఆ.వె.
హంసవేగమపుడు నందుకొనంగను
వాయసమ్ము విఫలమాయె, నటులె
కనులు బైర్లు గ్రమ్మెఁ, గనుమూసితెఱచిన
యంతలోనఁ గ్రింద నబ్ధిఁ గూలె!

కం.
సాగరమందునఁ గూలియు
“వాగితి నే బుద్ధిలేక వక్రపుఁగూఁతల్,
నా గర్వము ఖర్వమయెన్
వేగముగా శరధినుండి విడిపింపు”మనన్.

తే.గీ.
జాలిపడి హంస కాకిని సంద్రము వెడ
లింపఁ జేసి, వీపున మోసి, కొంపఁ జేర్చె!
కాకి “గొప్పవారలతోడ కయ్యము వల
దంచుఁ దెలిసెను! నన్నుమన్నించు”మనియె!!

***     ***     ***     ***

(ఇది ’యధికులతో స్పర్థించుట యనర్థదాయకమను కథ” సమాప్తము)




5 కామెంట్‌లు:

  1. పద్య వ్యాప్తి కోసం నీతి కథలను ఎంచుకోవడం ద్వారా రెండు విధాలుగా బ్లాగు ప్రపంచానికి మేలు చేయదలచితరన్నమాట. గుండు వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు శ్రీ పల్లా కొండలరావుగారూ,

    తెలుఁగు పద్యకవిత్వ ప్రచారమే ఏకైక లక్ష్యముగా గల నా బ్లాగును వీక్షించినందులకు మఱియు స్పందించి వ్యాఖ్య పెట్టినందులకు మనఃపూర్వక కృతజ్ఞతలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. ‘పద్య వ్యాప్తి కోసం నీతి కథలను ఎంచుకోవడం’ అన్నమాటను మీరు సూచనగా గ్రహిస్తే బాగుంటుందేమో! శంకరాభరణంలోని మీ పోస్టునే మళ్ళీ ఇక్కడ ప్రకటిస్తూ ఉండడం వల్ల మీ బ్లాగుకు వీక్షకులు, వ్యాఖ్యలు ఎక్కువగా ఉండడం లేదేమో? అలా కాకుండా ఏదైనా ఒక విషయం మీద ఖండికలు వ్రాసి ప్రకటించడం మంచిదని నా సలహా.

    రిప్లయితొలగించండి
  4. ‘పద్య వ్యాప్తి కోసం నీతి కథలను ఎంచుకోవడం’ అన్నమాటను మీరు సూచనగా గ్రహిస్తే బాగుంటుందేమో! శంకరాభరణంలోని మీ పోస్టునే మళ్ళీ ఇక్కడ ప్రకటిస్తూ ఉండడం వల్ల మీ బ్లాగుకు వీక్షకులు, వ్యాఖ్యలు ఎక్కువగా ఉండడం లేదేమో? అలా కాకుండా ఏదైనా ఒక విషయం మీద ఖండికలు వ్రాసి ప్రకటించడం మంచిదని నా సలహా.

    రిప్లయితొలగించండి
  5. తప్పకుండా శంకరయ్యగారూ! మీ సలహా పాటించి వివిధ విషయాలపై పద్యములను, ఖండికలను వ్రాయడానికి ప్రయత్నిస్తాను. మీరు నా బ్లాగును వీక్షించి, తగిన సూచనను అందించినందుకు కృతజ్ఞతలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి